Online Puja Services

అరణ్యమే అమ్మ అయితే ఆమె పేరు అరణ్యని!!

3.145.156.250

అరణ్యమే అమ్మ అయితే ఆమె పేరు అరణ్యని!! 
(బుగ్వేదంలోని రహస్యమైన అటవీ దేవత) 
- లక్ష్మి రమణ 

పచ్చని చీర కట్టుకొని, సూర్యుని బొట్టుగా పెట్టుకొని, కారుమబ్బులే కురులై,  పారే నదులే  ఆభరణాలుగా అలంకరించుకున్న అమ్మ ప్రకృతి. ఆమె భూమికే కాదు విశ్వానికే మాత. పరమ ప్రకృతి. ఆమెని మించిన సౌందర్యం, ఆమెని మించిన శౌర్యం సృష్టిలోనే లేవంటే అతిశయోక్తికాదు. అటువంటి ఆదిశక్తి స్వరూపం పేరు అరణ్యని. అడవుల దేవత.  ఈమె గురించి తెలుసుకోవడమే ఒక సౌభాగ్యం .  

అడవి అమ్మలాంటిది . అది ఆదివాసులకే కాదు, మానవులందరికీ ! అడవి ఒక రక్షణ కవచం లాంటిది భూమి కంతటికీ ! రక్షణ అరణ్యమే ! ఆహారం అరణ్యమే! స్వచ్ఛమైన గాలి, నీరు అరణ్యమే ! దావాగ్నికి నిలయమూ అరణ్యమే ! ఆకాశ నిర్మలత్వమూ అరణ్యమే! ఆ మాట కొస్తే, ఈ సృష్టే ఒక అంతుపట్టని అరణ్యం . ఆ అరణ్యానికి అధిదేవత ఆమె .  మన సంతోషాలకీ, సుఖజీవనానికి కారణం ఆ తల్లి చల్లని చూపే ! 

 అరణ్యాల సంరక్షక దేవతగా ఆమె ఆరాధన విశిష్టమైనది.  సనాతన సంప్రదాయంలో ప్రక్రుతి ఆరాధనకి అత్యంత ప్రాధాన్యత ఉంది .  గాలి, నీరు , ఆకాశం , అగ్ని , భూమి మనకి దేవతలు. సూర్యుడు, చంద్రుడు,  గ్రహాలూ, నక్షత్రాలు ఇలా విశ్వంలో , విశ్వాంతరాళంలో కనిపించే, కనిపించని ప్రకృతిని మన ఋషులు దర్శించి, ఆరాధించే సంప్రదాయాన్ని మనకిచ్చారు . వాటిని తెలుసుకోగలిగేలా  సైన్స్ ఇంకా ఏంటో అభివృద్ధి చెందాల్సి ఉందీ అంటే, భారతీయ దార్శనికులు, శాస్త్రవేత్తలు అయినా ఋషుల ప్రతిభ ఎలాంటిది అనేది ఇక్కడ మనం అర్థం చేసుకోవాలి . 

అటువంటి ప్రక్రుతి ఆరాధనలో అరణ్యం మహా శక్తి సంపన్నమైన ఆదిశక్తి స్వరూపమైన అరణ్యనిగా వర్ణిస్తుంది బుగ్వేదం. జీవి ఈ భూమీద పుట్టింది. మానవ పరిణామ క్రమం మొదలయింది.  ఈ క్రమమంతా అరణ్యాలలోనే కదా జరిగింది. ప్రకృతి ఒడిలోనే కదా జరిగింది . ఆ శక్తిని ఒక స్త్రీగా ఊహిస్తే ఆమె అరణ్యని. అడవులు స్త్రీ శక్తి దేవతలకి నిలయాలు . అందుకే అరణ్య ప్రాంతాలలోనే దైవీ శక్తులు స్వయంభువులుగా వెలసి ఉండడాన్ని ఈ సందర్భంగా మనం గుర్తు చేసుకోవాలి.  శ్రీశైలం , తిరుమల తదితర పుణ్యక్షేత్రాలు అటవీ ప్రాంతంలోనే కదా ఉన్నాయి . ఈ అటవీ ప్రాంతాలలో మనకి ఏ పుస్తకాల్లోనూ లభ్యం కాని, ఎవ్వరూ చెప్పలేని గొప్ప దేవతా శక్తులు ఉంటాయి . వారిని దేవతలుగా అటవీ ప్రాంతాలవారు కొందరు ఆరాధన చేస్తుంటారు. కాగా , ఉపాసకులు, యోగులు వారి దర్శనం చేయగలుగుతారు.  
 
అమ్మ అరణ్యని కూడా అటువంటి మహనీయమయిన ఒక అమ్మవారి స్వరూపం . ఈ అమ్మ పశు పక్ష్యాదులకీ, మనుషులతో సహా జీవులన్నింటికీ ఆహారాన్ని అందిస్తుంది . పోషిస్తుంది . అరణ్యం పోషించేది మాత్రమే కాదు , భయపెట్టేది కూడా ! అమ్మ స్వభావమే అంత కదా ! ప్రేమగా ఉండే అమ్మ , తన బిడ్డల జోలికి ఆపద వచ్చినా, తన బిడ్డలే తప్పు త్రోవ పట్టినా సహిస్తుందా? శిక్షిస్తుంది.  శిక్షించయినా దారిలో పెట్టాలనుకుంటుంది . అమ్మ జగత్ జనని అయినా, కన్న తల్లయినా ఆమె మనసు అదే ! 

బుగ్వేదంలో 10వ మండంలో 146వ సూక్తంగా అరణ్యని వర్ణన  కనబడుతుంది. దీన్ని వాడుకలో "అరణ్యని సూక్తం" (అరణ్య అడవి) అంటారు.  అరణ్యం స్వచ్ఛమైన జీవశక్తి..అరణ్యదేవి అడవి రూపంలో అరణ్యదేవి.ఆమె అడవిగా,మొత్తం గ్రహాన్ని పోషిస్తుంది. అరణ్య దేవి ఆవరణ వ్యవస్థను అడవిని నిలబెట్టే ఘనమైన జీవశక్తి రూపమే.
 
అడవి ఒక సజీవ చైతన్యం ఆమె అన్ని జీవ రూపాలను పోషిస్తుంది దేవి తన నివాసంగా లోతైన అడవులను కలిగి ఉన్న దేవతగా వర్ణించబడింది. ఆమె మానవులు నివసించే ప్రాంతాలకి, నాగరికతకు దూరంగా ఉంటుంది . 

ఆమె ఎప్పుడు అడవుల్లో మనోహరంగా నృత్యం చేస్తుంటుంది. దుష్టఉదేశ్యాలతో ఆమె ని సమీపిస్తే, శిక్షిస్తుంది . ప్రేమగా ఆమెని చేరితే, అమ్మగా లాలిస్తుంది . పచ్చగా అనుగ్రహిస్తుంది . తరిగిపోతున్న అడవులని కాపాడుకుందాం ! అమ్మ అరణ్యని ప్రేమని, అనుగ్రహాన్ని ఆస్వాదిద్దాం . అరణ్యని అనుగ్రహం అందరికీ ఉండాలని కోరుకుంటూ , శుభం !! 

#aranyani #rugvedam

Tags: forest, aranyani, rugvedam, rugveda, 

Quote of the day

Anger and intolerance are the enemies of correct understanding.…

__________Mahatma Gandhi