Online Puja Services

ఆ బ్రిటీష్ దొరగారికోసం తానే నడిచి వచ్చిన అమ్మ !

3.147.65.65

ఆ బ్రిటీష్ దొరగారికోసం తానే నడిచి వచ్చిన అమ్మ ! 
-సేకరణ 

మూగవాడైన మూక శంకరుల నోట ఆశువుగా శతకాన్ని పలికించిన మాత కామాక్షి. మహామూర్గుడైన వ్యక్తిని ఆశీర్వదించి కాళిదాసుని చేసిన తల్లి కాళిక. అన్నమొ రామచంద్రా అని ఆకలితో ఏకాదశినాడు వీధులబట్టి అర్థించిన గణపతి మునిని ఆహ్వానించి స్వయంగా వండి వడ్డించిన మాతృరూపిణి అన్నపూర్ణమ్మ . ఇలా ఎంతని ఆ అమ్మ కరుణని వర్ణించడం . అమ్మ అమ్మే అంతే ! ఆమెకి ఈ జగంలోని ప్రతిప్రాణీ బిడ్డే కదా ! ఆర్తిగా అమ్మా అని పిలవాలేగానీ , ఏరూపంలో అనుకుంటే ఆరూపంలోనే సాక్షాత్కరిస్తుంది. అలా మే కరుణకి ఈ భువిపైన పాత్రులైనవారిలో బ్రిటీషు దొరగారు ఉన్నారు !
  
ఇది కధ కాదు. బ్రిటిష్ కాలంలో మధురై డిస్ట్రిక్ట్ కి పీటర్ అనే వ్యక్తి కలెక్టర్ గా ఉండేవారు. ఆయన ఆఫీస్ కి ఇంటికి మధ్యలోనే మీనాక్షి అమ్మవారి గుడి ఉండేది . పీటర్ ప్రతిదినం తన కార్యాలయానికి అమ్మవారి దేవాలయం ముందరనుండి తన గుర్రంమీద వెళ్లేవారు. అలా వెడుతున్న సమయంలో పీటర్ తన కాళ్లకున్న చెప్పులు తీసి గుర్రం దిగి నడచి వెళ్లేవారు భక్తిగా. ఒకసారి రాత్రి ఉరుములు మెరుపులతో పెద్ద గాలితో వర్షం కురుస్తోంది. పీటర్ తన ఇంట్లో పడుకుని ఉండగా పెద్ద శబ్దం వినిపించింది . ఉలిక్కిపడి లేచి చూశారు . 

అలా ఆయన లేవగానే, ఎదురుగా ఒక స్త్రీ వంటినిండా బంగారు ఆభరణాలతో నిలుచుని ఉంది. పీటర్, ఎవరమ్మా నువ్వు అని అడుగుతుండగానే, ఆ స్త్రీ బయటకు వెళ్ళిపోతూ, రా రా అని పీటర్ ను బయటకు పిలిచి, కనీసం కాళ్లకు పాదరక్షలు కూడా లేకుండా ఆ జోరు వర్షంలోనే వడి వడిగా నడుస్తూ కొంతదూరంలో అదృశ్యమయ్యారు .  ఇంటి నుంచి బయటకు వచ్చిన పీటర్ అది గమనించి వెనుతిరిగిన మరుక్షణంలోనే, అతని నివాసం ఒక్కసారిగా కుప్పకూలిపోయింది. 

నిర్ఘాంత పోయిన పీటర్ దొర కొద్దిసేపటికి తేరుకుని, ఆ అర్ధరాత్రి వచ్చి తనను బయటకు పిలిచి ఈ ఘోరాపద నుండి కాపాడినది, సాక్షాత్తు ఆ మధుర మీనాక్షి అమ్మవారే అని గ్రహించి చేతులెత్తి నమస్కరించిన కలెక్టర్ పీటర్ ఆ మరునాడు భక్తితో ఆలయానికి వెళ్లి అర్చకులను సంప్రదించి, రాత్రి జరిగిన ఆ ఉదంతాన్ని వారికి తెలియజేశారు . ఇంకా ‘ అయ్యా రాత్రి నాకు దర్శనమిచ్చిన మీనాక్షి అమ్మవారి కాళ్లకు పాదరక్షలు లేవని గమనించాను. నేను అమ్మవారికి బంగారు పాదరక్షలు బహుమతిగా ఇవ్వదలిచాను. మీరు అంగీకరించి నాకు ఈ అవకాశాన్ని ఇవ్వగలరు’ అని అర్థించారు .  వారి అంగీకారంతో 412 రూబీస్, 72 ఎమిరాల్డ్స్, 80 డైమండ్స్ తోవజ్ర వైడూర్య సహితమైన అత్యంత విలువైన స్వర్ణ పాదుకలను ఆ మధుర మీనాక్షి తల్లికి సమర్పించారు కలెక్టర్ పీటర్. 

"పీటర్ పాదుకలుగా" పిలువబడే ఆ పాదుకలను ఇప్పటికీ అమ్మవారి ఆలయంలో ప్రతి ఏటా జరిగే "చిత్ర ఫెస్టివల్" సందర్భాన అమ్మవారి ఉత్సవ మూర్తి పాదాలకు అలంకరించి ఊరేగింపు నిర్వహిస్తారు. ఆనాడు సత్య తార్కాణంగా జరిగిన ఈ సన్నివేశం, అన్య మతస్థుడైనా, భగవంతునిపై ఆయనకున్న భక్తి విశ్వాసాలకు ప్రతీకగా నిలిచిపోయింది. 

Quote of the day

Anger and intolerance are the enemies of correct understanding.…

__________Mahatma Gandhi