Online Puja Services

ఒడిబియ్యం పొయ్యడానికీ, సప్తచక్రాలకీ సంబంధముందా ?

3.134.78.106

ఒడిబియ్యం పొయ్యడానికీ, సప్తచక్రాలకీ సంబంధముందా ?
-లక్ష్మీ రమణ 

ఒడిబియ్యం పొయ్యడం అనే ఆచారం మనకి తెలంగాణా ప్రాంతంలో ఎక్కువగా కనిపిస్తుంది . పెళ్ళిచేసుకుని వెళ్ళిపోయిన, తమ ఇంటి మహాలక్ష్మిని గౌరవించి , కన్నవారు , తోడబుట్టినవారూ ఆదరించడమే ఇందులోని అంతరార్థం అని చాలా మంది అనుకుంటారు. కానీ ఈ అద్భుతమైన ఆచారానికి, శరీరంలోని శక్తి చక్రాలకీ సంబంధం ఉందంటున్నారు పండితులు . 

వివాహబంధం ఏర్పడ్డాక , అప్పటివరకూ పుట్టిపెరిగిన పుట్టింటిని, తల్లిదండ్రులని, బంధాలనే వదిలి, ఆడపడుచులు భర్తవెంట మెట్టినింటికి వెళ్లడం భారతీయుల సంప్రదాయం. ఇక , అక్కడి కొత్త బంధాలని కలుపుకొని, అనుబంధాల్ని ముడివేసుకుని కొత్త బాధ్యల నిర్వాహణలో క్షణం తీరికలేని జీవితాన్ని గడుపుతుంటుంది కొత్తకోడలు .   ఈ ఎడబాటు పుట్టింటివారికి , ఆ పెళ్ళిపడుచుకీ బాధాకరమే ! ఆ దూరాన్ని, భారాన్నీ  తగ్గించే ప్రయత్నమే ఒడిబియ్యం కార్యక్రమం. 

 ఒడిబియ్యం కార్యక్రమం ద్వారా మళ్ళీ మళ్ళీ ఆడపిల్లను పుట్టింటికి పిలిపించవచ్చు. ఆమెను మనసారా ఆశీర్వదించి ఆమెకు ఇష్టమైన దుస్తువులు, పసుపు కుంకుమ పెట్టి ఆశీర్వదించవచ్చు. ఆ అవకాశాన్ని సంప్రదాయంగా కల్పించడమే ఒడిబియ్యం కార్యక్రమం. కానీ ఈ కార్యక్రమాలో యోగసంబంధమైన రహస్యమొకటి దాగుందంటున్నారు పండితులు. 

ప్రతి మనిషిలో ఇళ , పింగళ , సుషుమ్న , తదితర 72 వేల నాడులు వుంటాయి. ఈ నాడులు కలిసే ప్రతి దగ్గర వెన్నుముకని అనుసరించి ఊర్ధ్వగాములై ,ఒక చక్రం వుంటుంది. మూలాధార , స్వాధిష్ఠాన , మణిపూరక , అనాహత, విశుద్ధ , ఆజ్ఞ , సహస్రార చక్రాలనే  7 చక్రాలు వుంటాయి. అందులో మణిపూర చక్రం నాభి దగ్గర వుంటుంది. ఈ మణిపూర చక్రంలో మధ్యబాగంలో “ఒడ్డియాన పీఠం” వుంటుంది. మన అమ్మాయిలు నడుముకు పెట్టుకునే ఆభరణాన్ని కూడా “ఒడ్డియాణం” వాడుకలో “వడ్యాణం” అని పిలవడం వెనుకున్న రహస్యం ఇదే ! 

ఈ ఏడు చక్రాలలో శక్తి (గౌరీదేవి) ఏడు రూపాలలో నిక్షిప్తమవుతుందనేది సిద్దాంతం. ఒడి బియ్యం అంటే అమ్మాయి ఒడ్యాణపీఠంలో వున్న శక్తికి బియ్యం సమర్పించడం అన్నమాట ! ఒడ్డియాణపీఠంలో వుండే శక్తి స్వరూపిణిని మహాలక్ష్మిగా భావించిఆ ఇంటి ఆడపిల్లని ఆమె స్వరూపంగా ధ్యానించి , ఆదరించి ఒడిబియ్యం ప్యాలి .  అలాగే పక్కనున్న భర్తను మహావిష్ణువులా భావించి సత్కారం చేయాలి. 

ఆ మహాలక్ష్మి , తమ ఇంటి ఆడపడుచు వెంట వెళ్లిపోకుండా , తల్లిదండ్రులు పోసిన ఒడిబియ్యము నుండీ 5 పిడికిళ్లు బియ్యం అమ్మాయి తల్లిగారికి తిరిగి ఇస్తుంది . తన తల్లిగారి ఇల్లు అష్టైశ్వర్యాలతో తులతూగాలని కోరుకుంటుంది .  ఆ దేవిని ప్రార్ధించి మహాధ్వారానికి పసుపు కుంకుమ బొట్లు పెట్టి అత్తారింటికి వెళుతుంది. అక్కడ ముత్తైదువలని  పేరంటానికి పిలిచి అమ్మగారిచ్చిన సారెను (ఐశ్వర్యాన్ని) ఊరంతా పంచుతుంది. ఇది మెట్టింటివారుకూడా తమ కోడళ్ళకి చేసే ఆచారం ఉంటుంది . 

ఒడి అంటేనే అమ్మారక్షణ కదా ! ఆ విధంగా ఆ శక్తి స్వరూపిణి యొక్క రక్షణ పుట్టింటికి , మెట్టింటికీ పంచి , తమ ప్రాంతమంతా ఆ మహాలక్షినికి పాత్రులవ్వాలని ఆడపడుచులు కోరుకునే  అరుదైన , అద్భుతమైన సంప్రదాయం . దీన్ని పాటించే తెలుగులోగిళ్ళకు నమస్కరిస్తూ , సర్వేజనా సుఖినోభవంతు !! 

Quote of the day

Anger and intolerance are the enemies of correct understanding.…

__________Mahatma Gandhi