Online Puja Services

నాగలోకానికి వెళ్ళొస్తారా !

3.16.29.209

నాగలోకానికి వెళ్ళొస్తారా !
-కూర్పు లక్ష్మీరమణ 

నాగులకీ మనిషికీ ఉన్న అనుబంధం ఈనాటిదికాదు . అవును ఇది బంధమే . ఒకవైపు ఆధ్యాత్మిక ప్రశస్తి మరో వైపు పౌరాణిక ఆసక్తి రెండింటినీ పెంచే , పంచే  విషయం ఇది. ఇది గులేబకావళి కధకాదు, ఉలూచీ - అర్జనుల ప్రణయకథ కాదు. కానీ, ఇలాంటి నాగకన్యలు, నాగరాజులు, నాగలోకం మనకి పురాణాలలో చాలా సార్లు తారసపడుతూనే ఉంటుంది . వీరిని గురించిన ఏ చిన్న విషయం తెలిసినా అది అమితమైన ఆసక్తిదాయకంగా మారిపోతుంది . అసలు ఆ నాగలోకానికి మార్గమే ఈ భూమిపైనా ఉందని తెలిస్తే, అవి కూడా ఐదు చోట్ల! అద్భుతం అనిపించదూ ! రండి మరీ ఆ విశేషాలు చదువుకుందాం .  

కాశీలోని బావి నుంచి నాగలోకానికి మార్గం.

ధర్మనగరి- కాశీలోని నవపుర ప్రాంతంలో ఓ బావి ఉంది. ఇది నాగ లోకానికి వెళ్తుందని చెబుతారు. కర్కోటక నాగ తీర్థంగా పిలిచే ఈ ప్రదేశాన్ని సంవత్సరంలో ఒకరోజు మాత్రమే సందర్శిస్తారు. అది కూడా నాగులు పంచమి రోజు మాత్రమే వీక్షించే అవకాశముంది. ఈ బావిని చూడటం వల్ల పాము కాటు భయం నుంచి ఉపశమనం లభిస్తుందని, జాతకంలో ఉండే సర్పదోషం తొలుగుతుందని శాస్త్రాల్లో ప్రస్తావించారు. ఈ బావిలోతు గురించి కచ్చితమైన సమాచారం ఈ రోజు వరకు కనుగొనబడలేదు. ఈ ప్రదేశంలో ఆదిశేషుని అవతారమైన మహర్షి పతంజలి, వ్యాకరణవేత్త అయిన పాణిని ‘ అష్టాధ్యాయి’కి  - మహాభాష్యాన్ని రచించారు. అంతేకాకుండా శివలింగాన్ని ప్రతిష్ఠాపించారు.

సాత్పురా అడవుల్లో నాగద్వారీ యాత్ర.

మధ్యప్రదేశ్ లో సాత్పురలోని దట్టమైన అడువుల గుండా ఓ రహస్య మార్గం ఉంది. ఈ మార్గం నాగలోకానికి దారితీస్తుందని అంటారు. ఇక్కడకు చేరుకోవడానికి అనేక ప్రమాదకరమైన పర్వతాలను అధిరోహించాలి. అంతేకాకుండా దట్టమైన అడవుల గుండా ప్రయాణించాలి.  ఈ విధంగా నాగద్వారానికి చేరుకోవచ్చు. టైగర్ రిజర్వ్ కావడంతో ఈ ప్రాంతం సంవత్సరంలో ఒకటి లేదా రెండ్రోజుల మాత్రమే తెరుస్తారు. 

ఈ ద్వారాన్ని సందర్శించడం  మాత్రం చేత అన్ని కోరికలు నెరవేరుతాయని, నాగద్వారీ యాత్రను ఒక్కసారి పూర్తిచేయడం ద్వారా కాలసర్ప దోషం తొలుగుతుందని నమ్ముతారు. నాగద్వారికి వెళ్లే మార్గంలో నాగమణి ఆలయం కూడా ఉంది. ఇక్కడకు వచ్చిన భక్తులకి అనేక పాములు కనిపిస్తాయి. కానీ ఒక్కటి కూడా ఏ భక్తుడికి హాని కలిగించదు. ఇక్కడి నాగదేవత స్వయంగా తన భక్తులను రక్షిస్తాడని నమ్ముతారు.

​ 3.ఛత్తీస్‌గఢ్‌లోని తప్కర గుహ :

ఛత్తీస్‌గఢ్‌లోని జష్‌పూర్ ప్రాంతంలో కూడా నాగలోక మార్గం గురించి ఉంది. ఈ స్థలాన్ని తప్కర అని కూడా అంటారు. ఈ ప్రదేశంలో చాలా జాతులు పాములు కనిపిస్తాయని చెబుతారు. తప్కర ప్రాంతం చాలా మర్మమైందని పరిగణిస్తారు. అంతేకాకుండా కోటెబిరా కపట లేదా పాటల్ ద్వారం అని పిలిచే పర్వతంపై ఓ గుహ ఉందని చెప్పబడింది. ఈ గుహకు వెళ్లిన ఎవరైనా ఈ రోజు వరకు తిరిగి రాలేదు. కాబట్టి ఈ గుహ పెద్ద రాతి సహాయంతో మూసివేయబడింది. తప్కర ప్రాంతంలో శివుడి ఆలయం కూడా ఉంది. ఈ ఆలయాన్ని రావణుడి సోదరి శూర్పణఖ పూజించారని, వనవాసం సమయంలో సీతా, రాములు ఈ ఆలయాన్ని సందర్శించారని నమ్ముతారు . ఈ గుహకు మహాభారత కాలంతోనూ సంబంధం ఉంది. దుర్యోధనుడు, భీమునికి విషపూరితమైన పాయాసాన్ని తినిపిస్తాడు. అనంతరం భీముడు చనిపోయే స్థితిలో ఇవ నదికి వచ్చాడని, అక్కడ నాగకన్యల దృష్టి భీమునిపై పడిందని చెబుతారు. నాగ కన్యలు ఈ మార్గం ద్వారా భీముడిని నాగ లోకానికి తీసుకెళ్లి అక్కడ ఆయనకు చికిత్స చేసి తిరిగి పంపించారు. 

​ 4. ఝార్ఖండ్ లో ఉన్న నాగ దేవతల గుహ, పహరి బాబా ఆలయం.

ఝార్ఖండ్ రాజధాని రాంచీలో ఓ పర్వత మందిరం ఉంది. ఈ పర్వత మందిరంపై నాగ దేవతల గుహ కనిపిస్తుంది. వందల సంవత్సరాల నాటి ఈ గుహలో నాగరాజు-నాగిని అదృష్టవంతులైన ఆధ్యాత్మికావలంబకులకి ప్రత్యక్ష దర్శనానాన్ని అనుగ్రహిస్తారని నమ్మకం . 500 సంవత్సరాలుగా నాగరాజు, నాగిని గుహ ఇక్కడ ప్రసిద్ధి చెందింది. అంతేకాకుండా నాగదేవత ఎల్లప్పుడూ ఇక్కడే నివసించేవారని చెబుతారు. 

ఇక్కడి పహరి బాబా ఆలయం నాగదేవతల కథలకు ప్రసిద్ధి. నాగలోకానికి చేరుకోవడానికి మార్గం ఇక్కడ ఉందని ధార్మిక శాస్త్రాల్లో చెప్పబడింది. ఈ పర్వతంపై ఉన్న దేవాలయంలో నాగదేవుని ఎప్పటి నుంచో పూజిస్తున్నారు. నాగుల పంచమి రోజున చాలా మంది భక్తులు ఇక్కడకు వచ్చి పాలు సమర్పిస్తారు.

5. ముజాఫర్ నగర్లోని శుక్రతల్:

ముజాఫర్ నగర్ లో నాగలోకానికి మార్గం సరస్సు గుండా వెళ్తుంది.
ముజాఫర్ నగర్లోని శుక్రతల్ కూడా నాగ లోకానికి సంబంధించిందిగా నమ్ముతారు. పరిక్షీత్తు ఓ రోజు, అడవిలో ధ్యానం చేస్తున్న మెడలో చనిపోయిన పామును ఉంచాడని చెబుతారు. అప్పుడు మహర్షి మహా సర్పమైన తక్షకుడు, ఏడు రోజుల్లో పరీక్షిత్తు మహారాజును కాటేస్తాడని శపించాడు. అప్పుడు పరిక్షిత్తు మహరాజు శుక్రతల్లో శుకమహర్షి చెప్పగా శ్రీమద్భాగవత కథను విన్నాడు. ఈ కథ పూర్తయిన తర్వాత పాము రాజును కాటేసింది. 

ముజాఫర్ నగర్లో మోతీ జీల్ అనే సరస్సు ఉంది. ఈ సరస్సు ఎప్పటికీ ఎండిపోదు. ఇప్పటి వరకు ఈ సరస్సు యెంత లోతుందనేది  ఎవరూ గుర్తించలేకపోయారు. ఈ సరస్సు నాగలోకానికి దారితీస్తుందని చెబుతారు.  మహాభారతంలో దుర్యోధనుడు, భీముడికి విషాహారం పెట్టి , ఆ  తర్వాత ఈ సరస్సులోని పడేశాడని చెబుతారు .  అప్పుడు భీముడు ఈ సరస్సు నీటి గుండా నదిలోకి వెళ్లి, అక్కడ నుంచి అమృత నాగలోకం చేరుకొని అమృత పానం చేశాడని , అందువల్ల అతనికి పదివేల ఏనుగుల బలం వచ్చిందని ఇక్కడి భక్తుల విశ్వాసం . 

ఈ నాగలోక గుహలు, నదులు, నీటి తావులన్ని కూడా  ప్రకృతి సిద్దంగా నిర్మించబడ్డాయి. కొన్ని చోట్ల సంవత్సరాలపాటు  ఒకేచోట నిరంతరం నీళ్ళు ప్రవహించడం వల్ల ఏర్పడ్డ రూపాలు మనకి మన ఆరాధ్య దేవతా మూర్తులుగా కనబడతాయి. అందులో శివుని జటాఝూటం , వేయి పడగల శేషుడు, ఐరావతం, కల్పవృక్షం , కామధేనువు ,బ్రహ్మ , విష్ణు , మహేశ్వరులు తో పాటు 33 కోట్ల దేవి,దేవతల ఆకారాలు కూడా కననడతాయి. 

ఈ ప్రదేశాల నుండీ నాగలోకానికి మార్గముందన్న నమ్మకాల మాటెలా ఉన్నా , నగర నాగరికతకు దూరంగా , అద్భుతమైన ప్రక్రుతి సౌందర్యం నడుమ కొలువైన ఈ ఆధ్యాత్మిక క్షేత్రాలని వీలయితే ఒకసారి దర్శించిరండి మరి .

శుభం .

Quote of the day

Anger and intolerance are the enemies of correct understanding.…

__________Mahatma Gandhi