Online Puja Services

ఏది ఉగ్రరూపం ఏది శాంత రూపం

18.118.45.162

ఏది ఉగ్రరూపం ఏది శాంత రూపం

దేవతా రూపాలన్ని ఒక్కటే అక్కడ ఉగ్రంగా ,శాంతంగా చేసే పూజలు వల్ల ఫలితాన్ని పొందుతూ పరిణామాన్ని అనుభవిస్తున్నాము , ఉగ్ర దేవతలను పూజ చేయవద్దు అని ఎవరైనా అంటే ఎవరు ఆ ఉగ్ర దేవతలు అని ప్రశ్నించండి ఫలానా అని అంటే  వారికి తెలిసింది అంతే అని అర్థం చేసుకోండి , ఎవరూ మేధావులు కారు ఎవరూ అన్ని తెలిసిన పండితులు లేరు ఎంత తెలిసినా సంతాన ధర్మంలో అది ఆవగింజ అంతే. 

ఉగ్ర రూపంలో పూజించకండి అని చెప్పవచ్చు.  ఎందుకంటే గృహస్థులు ఉగ్ర రూపాలను ప్రసన్నం చేసుకునే అంత ఉపాసన చేయలేరు.  దానికి తగిన నియమాలు పాటించలేరు.  ఆ సమయపాలన చేయలేరు.  ఆహారం ఎలా ఇవ్వాలో తెలుసుకోలేరు.  దానికి తగ్గట్టుగా కొన్ని ఇంటి ఆవరణలో ఇంట్లో చేయకూడదు.  ఒక వేళ చేసే ప్రయత్నం చేస్తే,  తిరిగి శాంత పరచే శక్తి అంతటి జపనియమ తంత్ర యంత్ర విధానాలు ఏమి తెలియక ఆ పరిణామం అనుభవించాల్సి వస్తుంది.  కరెంట్  వైర్ నీటి తొట్టిలో వదులుకుని అందులో చెయ్యి పెట్టడమే అవుతుంది . అయితే ఎవరు ఈ ఉగ్ర స్వరూపాలు అంటే... 

ఉగ్ర దేవతలు అని ప్రత్యేకంగా ఎవరూ లేరు.  అందరికి ఉగ్ర రూపం ఉంటుంది..  సౌమ్య రూపం ఉంటుంది.  కాళీ ని ఉగ్ర దేవతగా అంటారు.  ఆమె చల్లని తల్లి.  రామకృష్ణ పరమహంస ఆమెని తల్లిగా బిడ్డగా భావించి  పూజిస్తే అదే రూపంలో ఆమె అనుగ్రహించింది.   చిన్న పిల్లగా పూజించే బాల తల్లి అతి భయంకరమైన బండాసుర సంహారం చేసింది.  బాల ఉపాసనలో ప్రచండ చండ విధానాలు కూడా ఉన్నాయి.  మహా శక్తివంతమైన సాధన అతి భయంకరమైన సాధన , సౌమ్య మైన సాధన.  బాల స్వరూపం ఆమె రూపం అలా ఉన్నా,  ఆమె ఉపాసనలో శాంతి పరచడం అంత కఠినమైన పరీక్షలు ఉంటాయి కానీ ఆమె అనుగ్రహిస్తే మీ చేతిలో పసిపాపై ఆడుకుంటుంది.  అంత కోపం కాళికి కూడా ఉండదు, బాల అంటే బ్రహ్మాండాలతో పసిపాపై ఆటలాడునది అని అర్థం, ఉగ్ర నరసింహ మూర్తి రూపంలో ఆయన్ని శాంతపరచడం కష్టం.  అదే లక్ష్మి నరసింహ ,యోగ నరసింహగా ఆరాధించండి మీకు ఎన్నో కష్టాలు నుండి గట్టుక్కుతారు.  ప్రాణ గండం నుండి అతి త్వరగా రక్షించే స్వరూపాలు నరసింహ ,దుర్గా, స్వరూపాలు.  

లక్ష్మీ సహస్త్ర నామాన్ని అర్థం చేసుకోండి.  అర్థం తెలుసుకోండి.  ఆమె ఎంతటి ఉగ్ర దేవతో మీకు తెలుస్తుంది.   సుదర్శన ఉపాసనా ఎంతటి తీవ్రమైన ప్రయోగాలను కూడా  తిప్పికొట్టే శక్తి కలది.  ప్రత్యేకంగా సుదర్శనంలో తాంత్రికం ఉండదు.  సుదర్శన ఆరాధనే తాంత్రికం అంత శక్తివంతమైన ఉపాసన,  

హనుమంతుడి కి యక్ష భైరవుడి గా అతి భయంకరమైన ఉపాసన ఉంది, ఆయన నవసిద్ధులకు నాయకుడు, అలా కాకుండా రామ భజనతో స్వామి ని చాలా శీఘ్రoగా అనుగ్రహం పొందవచ్చు, గణపతి కి సంబంధించిన ఎన్నో తాంత్రిక ఉగ్ర ప్రయోగాలు ఉన్నాయి, శివయ్య ఆరాధనలో దత్తాత్రేయులు వారు ఇచ్చిన ఎన్నో తాంత్రిక ప్రయోగాలు ఉన్నాయి.  ఆ రూపాలలో శివుడు అతి భయాంకరుడు, ఎంతో సౌమ్యంగా ఉండే రాముడు కొన్ని లక్షల రాక్షసులను సంహారం చేసిన వీరుడు, ప్రతి దేవతకు ఉగ్ర రూపం ఉంటుంది.  అమ్మను కోపం గా చూసి నప్పుడు పిల్లలు భయపడతారు ఇది అంతే.  అలా కాకుండా ఏ దేవతా రూపాన్ని అయినా ప్రసన్నంగా పూజించి అనుగ్రహం పొందవచ్చు, 

ప్రత్యంగిరా ఉపాసనా రెండు వైపులా పదును ఉన్న అస్త్రం , ఆ ఉపాసనా మంచికి చెడుకి రెండింటికి వాడుతారు ఎలా అయితే నిప్పుతో  దీపం పెట్టవచ్చు అలాగే ఇంటికి పెట్టవచ్చు, ఎలా వాడుతారు అనేదాన్ని బట్టి మంచి చెడు ఉంటుంది,

మాంసం పెట్టి మొక్కితేనే త్వరగా ప్రసన్నం అవుతారు, పరమాన్నమ్ పెడితే త్వరగా ప్రసన్నం అవుతారు ఇలా ఆలోచిస్తూ ఒక దేవతకు వివిధ రూపాలను అలంకారం పేర్లు నివేదనలు సృష్టిస్తున్నారు కానీ నిజానికి దేవత ప్రసన్నం ఐయ్యేది,  మనసు అర్పించి ఆర్తితో అంకిత భావంతో చేసే సాధన వల్ల మాత్రమే.  ఎంత సాత్వికంగా సాధన సాగిస్తే,  వారు వారి కుటుంబం అంత సత్ప్రవర్తన తో దేవతా అనుగ్రహంతో ఆ పరంపరని కొనసాగిస్తూ ఉన్నత స్థితి గతులు పొందుతారు..భయానక భీకరమైన సాధన ఆలోచనని అలవాట్లను మారుస్తుంది తర్వాత తరాన్ని తప్పు దోవ పట్టిస్తుంది.  మీకే హాని కలిగిస్తుంది అతి అన్నిటా అనర్ధమే.. 

మనసు, బుద్ది, ఆలోచన మంత్రాధిష్ఠదేవత పైన ఉండాలి.  మనో దృష్టి ఆమెను దర్శిస్తూ ఉండాలి.  దేహం ఆమె సాధనకు ఒక పవిత్రమైన దేవాలయంగా సాధన మందిరంగా భావించాలి.  ఈ ఆలోచన మనసులో నింపుకోవాలి.  అంతే కాని ఉగ్ర రూపాలు ఇవి, శాంతి రూపాలు ఇవి, అని ఒక ప్రవచనం విని మన సమూహంలో సభ్యులు అడిగిన సందేహానికి సమాధానంగా మాత్రమే ఈ వివరణ ఇస్తున్నాను..

మీరు చేసే సాధన చేస్తూ ఉంటే చాలు.  మీపట్ల చెడు ఆలోచన చేసిన, అది వారికే తిప్పి కొడుతుంది..

నేను అందరికి ఒక విషయం చాలా కాలంగా చెప్తున్నాను ఎవరైనా అకారణంగా నన్ను ద్వేషించినా, దూషించిన, నిందించిన, బాధించిన వారు ఇప్పటి వరకు చేసిన అన్ని పుణ్య కార్యాలు ఉపాసనలు సాధనలు అన్ని నా ఖాతాలోకి వచ్చేసి అన్న వాళ్ళు జీరో అయిపోతారు.  తర్వాత వాళ్లకు శిక్ష అవసరమా?  అవసరం లేదు.  వాళ్ళు పడే పాట్లు చూస్తూ ఉండాలి.  అంతే.   మీకు అదే చెప్తున్నాను.  మీరు చేసే నిత్య ఆరాధన మీ సాధన మీరు ప్రశాంతంగా చేస్తూ ఆ సాధనలో సిద్ది పొందే ప్రయత్నం చేయండి చాలు.  మీపట్ల ఎవరి చెడు దృష్టి కానీ హాని కానీ కలుగదు ఆ తల్లి ఎదో రూపంలో ఆదుకుంటూనే ఉంటుంది.  మీకు నిదర్శనం కనిపిస్తూనే ఉంటుంది, అంతే కాని మీకు తెలియని ఉగ్ర సాధనలు పుస్తకాలు చూసి మొదలు పెట్టకండి.  శత్రువు చేసే హాని కన్నా మీకు మీరే ఎక్కువ హాని చేసుకుంటారు.  వారాహి అమ్మవారిని ప్రసన్నంగా ఉపాసనా చేయడం మన సమూహంలో ఎందరికో నేర్పించాను దానివల్ల ఎంతో మంచి ఫలితాన్ని పొంది సంతోషంగా ఉన్నారు.  భక్తిగా నమ్మకంతో సాధన చేయండి చాలు ప్రత్యేకంగా కొత్తవి అవసరం లేదు.  ఒక వేళ చేసిన భక్తితో చేయాలి కానీ పగతో కాదు ..

ప్రవచనాల్లో ఉగ్ర రూపాలు అని సంభోదించిన రూపాలు అన్ని శాంత స్వరూపాలే..

- భానుమతి అక్కిశెట్టి  

Quote of the day

We should not fret for what is past, nor should we be anxious about the future; men of discernment deal only with the present moment.…

__________Chanakya