Online Puja Services

ఈ రత్నం అత్యంత అపురూపం.

3.144.161.116

క్షీరసాగరమధనంలో పుట్టిన ఈ రత్నం అత్యంత అపురూపం. 

భారతదేశ హిందూ సంస్కృతిలో 'శంఖం'నకు ప్రత్యేక స్థానం ఉంది. క్షీరసాగర మధన సమయంలో దేవతలకు వచ్చిన సంపదలలో శంఖం ఒక్కటిగా మన పురాణాలు చెబుతున్నాయి. ఆసమయంలో సముద్రంలో నుంచి వచ్చిన 14 రత్నాలలో శంఖం ఒకటి.

శంఖం అనేది రెండు సంస్కృత పదాల కలయిక. శం అంటే మంచి అని, ఖం అనగా జలం అనే అర్థం. జాలం నుండీ పుటిన మంచి రత్నమే శంఖం అన్నమాట . అందుకే , క్షీరసాగర మధన సమయంలో ఉద్భవించిన శ్రీలక్ష్మీదేవికి, శంఖం సహోదరుడని విష్ణు పురాణం చెబుతుంది . 

శంఖంలో వివిధభాగాలను దేవతలు అధిష్టించి ఉంటారని శృతివచనం . శంఖం యొక్క పీఠభాగంలో వరుణుడు, చంద్రుడు, సూర్యుడు ;ఉపరితలం మీద ప్రజాపతి; ముందు భాగంలో గంగా, సరస్వతులు అధిష్టించి ఉంటారు. శంఖాలలో ఎన్నో రకాలున్నాయి . వీటి ఆకారాన్ని బట్టి , రకరకాల పేర్లతో వీటిని పిలుస్తుంటారు నిపుణులు . వాటిలో కొన్ని దక్షిణావర్త శంఖం, మధ్యమావర్త శంఖంగా చెప్తారు. వీటిలోనూ లక్ష్మీ శంఖం, గోముఖ శంఖం, కామధేను శంఖం, దేవ శంఖం, సుఘోష శంఖం, గరుడ శంఖం, మణిపుష్పక శంఖం, రాక్షస శంఖం, శని శంఖం, రహు శంఖం, కేతు శంఖం, కూర్మ శంఖాలు ఉన్నాయి. 

శత్రు వర్గంతో యుద్ధానికి తలపడేటప్పుడు శంఖాన్ని పూరించడమన్నది యుద్ధ నియమాలలో ఒకటి. విజయ సూచికంగా కూడా శంఖాన్ని పూరించడమన్నది ఓ ఆచారం. యుద్ధసన్నాహాలలో భాగంగానే విష్ణుమూర్తి తన చతుర్భుజాలలో ఒక చేత శంఖాన్ని ధరించి ఉంటారు . మహాభారత యుద్ధ ఘట్టాన్ని చూస్తే , శ్రీకృష్ణుడు పాంచజన్య శంఖాన్ని, ధర్మరాజు అనంత విజయ శంఖాన్ని, భీముడు పౌండ్ర శంఖాన్ని, అర్జునుడు దేవదత్తాన్ని, నకుల సహదేవులు వరుసగా సుఘోష ,మణిపుష్పక శంఖాలను, విరాటుడు సాత్విక శంఖాన్ని పూరించినట్లు తెలుస్తుంది . 

శంఖాన్ని పవిత్రకు చిహ్నాంగా భావిస్తారు. అలాగే, జలాన్ని ఉంచే మంచి కలశంగాను భావిస్తారు. ఇందులో ఉంచిన నీటిని పవిత్ర తీర్ధంగా ఉపయోగిస్తారు. శంఖంలో పోస్తేగానీ తీర్ధం కాదు అనే నానుడి మనకు తెలిసినదే. ఫూజా, ఆరాధన, యఙ్ఞాలు, తాంత్రిక క్రియలలో శంఖాన్ని ఉపయోగిస్తారు. శంఖ ధ్వని విజయానికి, సమృద్ధికి, సుఖానికి, కీర్తి ప్రతిష్టలకు, లక్ష్మీ ఆగమనానికి ప్రతీక.  ధార్మిక ఉత్సవాలు, యఙ్ఞాలు, శివరాత్రి పర్వదినాలలో శంఖాన్ని స్థాపించి పూజ చేస్తారు. శంఖాన్ని పూజించడంతో పాటు శంఖంతో పూజాది కార్యక్రమాలు నిర్వహిస్తారు. అభిషేకం చేస్తారు. 

సిరి సంపదలు చేకూరాలంటే పూజా మందిరంలో దక్షిణావర్త శంఖం ఉంచాలని శాస్త్రాలు చెబుతున్నాయి. అంటే కుడివైపు నుంచి తెరచుకుని ఉండే శంఖమన్నమాట. దీన్ని లక్ష్మీదేవి నివాసంగా చెబుతుంటారు. ఈ శంఖం ఉన్న చోట శ్రీమహాలక్ష్మి కొలువై ఉంటుందని శాస్త్రం చెబుతోంది. అందుకే పూజగదిలో దీనిని ఉంచి, అనునిత్యం పూజించాలని చెబుతారు. ఫలితంగా దారిద్య్రం వదిలిపోతుంది. అదే విధంగా శంఖంలో పోసిన తీర్థాన్ని స్వీకరించడం వల్ల వ్యాధి బాధలు కూడా నశిస్తాయి.

శంఖాన్ని పూరించడం వలన ప్రాణాయామం చేసినంత వ్యాయామం శరీరానికి కలుగుతుంది. శంఖాన్ని ఊదితే గుండె ఆరోగ్యం బాగుంటుంది. మెదడుకు చురుకుతనం వృద్ధి చెందుతుంది. ఊపిరితిత్తుల పనితీరు, శ్వాసక్రియ బాగుంటుంది. శంఖం ఊదడం వల్ల గృహ ఆవరణలోని దుష్టశక్తులు దూరంగా పారిపోతాయి. క్రిమి, కీటనాలు నశిస్తాయి దీనిని పూరించేటప్పుడు వెలువడే కంపనాలతో వాతావరణంలో ఉండే రోగకారకాలైన క్రిములు నశిస్తాయి. శంఖారావం వల్ల మనిషిలో తమో, రజో గుణాలు నశించి సత్వగుణం పెరుగుతుందంటారు. అందువలనే శంఖాన్ని పూరించడం వల్ల గాని, ఆ ధ్వనిని వినడంవలన గాని ఆరు నెలల పురాణ శ్రవణం విన్న ఫలం, వేదఘోష విన్న ఫలం దక్కుతుందని పెద్దలు చెబుతుంటారు .

- లక్ష్మి రమణ 

Quote of the day

We should not fret for what is past, nor should we be anxious about the future; men of discernment deal only with the present moment.…

__________Chanakya