Online Puja Services

నవగ్రహాలకు ఎలా ప్రదక్షిణాలు చేయాలి?

3.22.51.241
నవగ్రహాలు- ప్రదక్షిణలు

నవగ్రహాలు చాలా శక్తివంతమైనవి.. పద్ధతి ప్రకారం నవగ్రహాలకు ప్రదక్షిణలు చేస్తే విశేషమైన ఫలితం ఉంటుంది. ఎలా చేయాలి ? ఎన్నిసార్లు చేయాలి ?

నవగ్రహాలు చాలా శక్తివంతమైనవి. కానీ వాటిని పూజించడానికి ప్రజలు జంకుతుంటారు. కారణం ఎప్పుడు, ఎలా ప్రదక్షిణలు చేయాలో తెలియదు. ఎన్ని ప్రదక్షిణలు చేయాలో తెలియదు. నవ గ్రహాలకు ప్రదక్షిణ చేసేటప్పుడు ఏ నియమాలు పాటించాలో తెలియదు. అయితే నవగ్రహ ప్రదక్షిణలకు ఒక పద్ధతి ఉంది. పద్ధతి ప్రకారం ప్రదక్షిణలు చేస్తే మంచి ఫలితాలుంటాయి. మానవ జీవం, మానసిక పరిస్థితి ప్రధానంగా వారి వారి గ్రహాల స్థితిపై ఆధారపడి వుంటుందని జ్యోతిష్క శాస్త్రం చెబుతోంది.

గ్రహస్థితిలో మార్పులు వల్లనే ఎవరి జీవితంలో అయినా ఒడిదుడుకులు ఎదురవ్వడం గానీ, లాభాలు, సంతోషాలు కలిసిరావడం గానీ వస్తుంటాయి. నవగ్రహ ప్రదక్షిణ మనిషి కష్టనష్టాల్లో ఉన్నప్పుడు ఆదుకుంటుంది. నవగ్రహ ప్రదక్షిణలకు ఒక నిర్దిష్టమైన పద్ధతి వుంది. ఆ పద్ధతి ప్రకారం ప్రదక్షిణలు చేస్తే విశేషమైన ఫలితం ఉంటుంది.

కొంతమంది ప్రదక్షిణలు చేస్తున్నప్పుడు నవగ్రహాలను తాకుతూ ప్రదక్షిణ చేస్తుంటారు. సాధ్యమైనంత వరకూ ఇలా తాకకుండానే ప్రదక్షిణలు చేయాలి.

నవగ్రహ ప్రదక్షిణ చేయడానికి మంటపంలోకి వెళ్ళే ముందు, సూర్యుడిని చూస్తూ లోపలికి ప్రవేశించి  (చంద్రుని వైపు నుంచి) కుడివైపునకు తొమ్మిది ప్రదక్షిణలు చేయడం ఉత్తమం.

ప్రదక్షిణలు పూర్తయ్యాక  ఎడమవైపు (బుధుడి వైపు నుంచి) రాహువు, కేతువులను స్మరిస్తూ రెండు ప్రదక్షిణలు చేయవచ్చు. చివరగా నవగ్రహాల్లో ఒక్కొక్క గ్రహం పేరు స్మరించుకుంటూ ఒక ప్రదక్షిణ చేసి, నవగ్రహాలకు వీపు చూపకుండా వెనుకకు రావాలి. ఇలా చేయడం వల్ల కొంత ఫలితం ఉంటుంది.

ఎప్పుడుపడితే అప్పుడు నవగ్రహాల చుట్టూ ప్రదక్షిణలు చేయకూడదు. శుచిగా స్నానం చేసి పరిశుభ్రమైన దుస్తులు ధరించినప్పుడు మాత్రమే నవగ్రహ ప్రదక్షిణలు చేయాలి.
 
శివాలయాల్లో నవగ్రహాలుకు ప్రత్యేకమైన సన్నిధి వుంటుంది. మూలవిరాట్టును దర్శించుకుని బయటికి వచ్చాక నవగ్రహాలను దర్శించుకోవాలి.
 
“ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ చ గురు శుక్ర శనిభ్యశ్చ రాహవే కేతవే నమ:” 
 
అంటూ తొమ్మిది ప్రదక్షిణలు చేయాలి. ప్రదక్షిణాలు చేస్తున్నంత సేపూ నవగ్రహ స్తోత్రాలు చదవాలి. 9 గ్రహాలకూ స్తుతిస్తూ శ్లోకాలు చదివి 9 ప్రదక్షిణలు పూర్తి చేసిన తర్వాత ప్రత్యేకంగా రాహు, కేతువులకు మరో రెండు ప్రదక్షిణలు (అంటే మొత్తం 11) చేస్తే చాలా మంచిదంటారు. అసురులైన రాహుకేతువులను ఈ విధంగా సంతృప్తిపర్చడం వల్ల వారి కారణంగా ఆటంకాలు వుండవని నమ్మకం.
 
మొదటి ప్రదక్షిణలో జపాకుసుమాల వర్ణం గలవాడా, కాశ్యపగోత్రుడా, నవగ్రహమండలనాయకుడా, శ్రీసూర్యభగవానుడా, సదా శుభాన్ని అనుగ్రహింతువు గాక!
 
రెండో ప్రదక్షిణలో కటకరాశికి అధిపతి అయిన ఓ చంద్రుడా, పెరుగు, శంఖాల వంటి ధవళవర్ణం గలవాడా, ఆత్రేయగోత్రోద్భవుడా, శ్రీచంద్రభఘవానుడా, మమ్మల్ని కరుణించు!
 
మూడో ప్రదక్షిణలో బంగారు రంగుతో మెరిసిపోయేవాడా, వృశ్చిక మేషరాసులకు అధిపతి అయినవాడా, భరద్వాజగోత్రుడా, శ్రీ అంగారకుడా మాకు మంగళాలను ప్రసాదించు అని స్మరించుకోవాలి.
 
నాలుగో ప్రదక్షిణలో నల్లని వర్ణం గలవాడా, కన్యా మిథునరాసులకు అధిపతి అయినవాడా, ఉత్తరదిశలో బాణరూపమండలంలో వసించేవాడా, శ్రీబుధరాజా మాకు మేలు కలిగింతువు గాక!
 
ఐదో ప్రదక్షిణలో అంగీరసగోత్రుడా, ధనుస్సు, మీనరాసులకు అధిపుడా, దేవగురువైన బృహస్పతీ, శ్రీగురుభగవానుడా, మాపై కరుణను వర్షించు!
 
ఆరో ప్రదక్షిణలో భార్గవగోత్రం గలవాడా, దైత్యగురువైన శుక్రాచార్యుడా, స్త్రీభోగాలను ప్రసాదించేవాడా, మా పైన కరుణావృష్టిని కురిపించు అని స్మరించుకోవాలి.
 
ఏడో ప్రదక్షిణలో కాశ్యపగోత్రుడూ, కుంభ మృగశీర్షాలకు అధిపతి అయినవాడూ, దీర్ఘాయువును ప్రసాదించేవాడూ అయిన శ్రీశనైశ్చరుడా, మాకు మంగళాలు కలిగేలా చూడు!
 
ఎనిమిదో ప్రదక్షిణలో సింహికాగర్భసంభూతుడా, దక్షిణాన దక్షిణముఖంగా నక్షత్రమండలంలో వుండేవాడా, శ్రీరాహుభగవానుడా మాకు సదా మంగళాలు కలిగిచు!
 
తొమ్మిదో ప్రదక్షిణలో జైమినిగోత్రికుడా, గంగాయాత్రను సంప్రాప్తింపజేసేవాడా, రౌద్రస్వరూపంతో వుంటూ, రుద్రాత్మకుడుగా పేరు పడినవాడా, శ్రీకేతుభగవానుడా మాకు మేలు కలుగజేయి!అంటూ ప్రార్థించుకుంటూ ప్రదక్షిణలు చేయాలి.
 
- ఉమామహేశ్వరయ్య సుంకర

Quote of the day

You can't cross the sea merely by standing and staring at the water.…

__________Rabindranath Tagore