Online Puja Services

కలిసంతరణ మహామంత్రం

18.223.124.244
హరేకృష్ణ హరేకృష్ణ కృష్ణకృష్ణ హరేహరే |
హరేరామ హరేరామ రామరామ హరే హరే ||
 
చాలామంది అనుకొంటారు. ఇస్కాన్ వాళ్ళే ఈ మంత్రాన్ని పఠిస్తారని. కాదు, ఈమంత్రం కలిసంతరణ ఉపనిషత్తులో తెలుపబడింది. గౌడీయసంప్రదాయ గురువులు శ్రీ ప్రభుపాదులవారు కలిసంతరణ మహామంత్రాన్నే ప్రచారం చేయడాన్ని యజ్ఞంగా పూనుకొని వారి జీవితాన్ని అంకితం చేసారు. ఈ మంత్రాన్ని కలిసంతరణ మహామంత్రంగా పిలువబడి కలియుగంలోని కలిబాధలనుంచి సర్వజనులకూ ముక్తి కల్పిస్తుందని సాక్షాత్ బ్రహ్మదేవుడే నారదుడికి తెలియజేసాడు. ఎలాగంటే కలియుగం ప్రారంభానికి ముందు నారదులవారు భవిష్యత్ దర్శనం కావించి బ్రహ్మదేవునిదగ్గరకు వెళ్ళి తండ్రీ, రానున్న కలియుగంలో జనులందరూ విపరీతంగా సమయం లేనివాళ్ళౌతున్నారు. వేదాలు పఠించడం అటుంచి పురాణాలూ ధర్మశాస్త్రాలూ కూడా వదిలేస్తున్నారు. ఇలాంటివాళ్ళకి కలిప్రభావంతో పాపాలు, బాధలూ కలుగకుండా ఉపాయమేమైనా ఉందా అన్నప్పుడు బ్రహ్మదేవుడు.

నాయనా నారదా, నాత: పరతరోపాయ: సర్వవేదేషు దృశ్యతే అంటే ఇంతకంటే మంచిఉపాయము ఏ వేదమునందును లేదు అని, చెప్పబోయే 16నామాల బీజాక్షరాలులేని మంత్రాన్ని దశదిశలా వ్యాప్తిచేయమని చెప్పి ఉపదేశించాడు బహ్మ. అదే కలిసంతరణమంత్రం లేదా మహామంత్రంగా చెప్పబడే

హరేకృష్ణ హరేకృష్ణ కృష్ణకృష్ణ హరేహరే |
హరేరామ హరేరామ రామరామ హరే హరే ||

ఇందులో బీజాక్షరాలు ఉండవు. బీజాక్షరాలున్న మంత్రాలతో అద్భుతమైన ఫలితాలు వస్తాయి కానీ గురువుగారి శుస్రూషలుచేసుకొని నేర్చుకొని కఠిన నియమాలు పాటిస్తూ జపించాలి. లేదంటే లాచిపెట్టి లెంపకాయలుకొడతాయ్ బీజాక్షరాలున్న మంత్రాలు. ఆలాంటివాటితో ఏం, మేము చదువుతాం ఏమౌతుంది అని పంతాలుపట్టి చదివేవాళ్ళని విమర్శించేందుకు హక్కులేదు కానీ, నియమాలుతెలీకుండా ఆయుధాలు ఉపయోగించడం ప్రమాదకరం అని మాత్రం తెలియచేయడం మన ధర్మం. ఇవన్నీ తెలిసే బ్రహ్మ సర్వజనులకూ సర్వావస్థలో చదువగలిగే అత్యంత శక్తివంతమైన మంత్రాన్ని అందజేసాడు.

ఇక ఈ మంత్రంలో రామ, కృష్ణ నామాలు తెలుగులోనైనా సంస్కృతంలోనైనా ఒకటే ఐనా, చాలామంది హరే అన్నపదానికి తెలుగులో అర్ధం తీసుకొని హరియే రాముడు, హరియే కృష్ణుడు అని అనుకొంటారు. ఇక్కడ హరే శబ్దానికి సంస్కృతార్ధం తీసుకొంటే హరే అంటే రాధ అని అర్ధం. ఎలా ఐతే శివునికి శక్తి అమ్మవారో అలాగే కృష్ణుడికి శక్తి రాధ. కృష్ణునికి ఆ చైతంత్యశక్తే ద్వాపరంలో రాధమ్మగా అవతరించింది, త్రేతాయుగంలో సీతమ్మలాగ అవతరించింది, ఎన్నడూ మహావిష్ణువుని వీడని లక్ష్మీదేవిలా ఉంటుంది. ఆ హరే అనే రాధామాయిని దక్షిణాదిలో అంత ఎక్కువగా కొలవము కానీ ఉత్తరాదిలో రాధమ్మను రాధేరాణిగా అత్యంత భక్తిశ్రద్ధలతో కొలుస్తారు, నేపాల్ వరకూ కూడా రాధారాణి ఆలయాలుంటాయి. కనుక వైష్ణవ గౌడీయ సంప్రదాయం ప్రకారం హరే అనే రాధమ్మ శ్రీకృష్ణునికే శక్తి, ఆయన్ని చైతన్యపరిచే శక్తి, సీతమ్మగా అవతరించి రామునివెంట నడిచిన శక్తి. కృష్ణుడే తాను స్వయంగా భువిపైకి వచ్చి తానే సకలసృష్టికీ కారణభూతుడని భగవద్గీతద్వారా ప్రకటించాడు కూడా. ఇక ప్రభుపాదులవారిగురించి టూకీగా చెప్పుకొందాం.

శ్రీల భక్తిసిద్ధాంత సరస్వతీ గోస్వామి వారివద్ద వైదికజ్ఞానాన్ని పొంది, వారి ఆజ్ఞతో వైదిక ప్రచారానికై జీవితాన్ని అంకితం చేసారు ఎ.సి. భక్తివేదాంత స్వామి ప్రభుపాదులవారు. 69వ ఏట ప్రాశ్చాత్యదేశాల్లో ధర్మప్రచారానికి పూనుకొని కేవలం 7డాలర్స్ చేతిలో పెట్టుకొని, ట్రంకుపెట్టెలనిండా భగవద్గీతలు పెట్టుకొని ఒక షిప్ ఓనర్ ఇచ్చిన ఫ్రీ టికెట్ తో న్యూయార్క్ చేరుకున్నారు ఒంటరిగా. శిష్యులెవరూ లేరు, తెలిసున్నవారెవరూ లేరు. పైగా ఆ ప్రాంతంలోని ప్రాశ్చాత్యులు మద్యం, మాంసం, విచ్చలవిడితనం, మాదకద్రవ్యాలూ వగైరా దుర్వ్యసనాలతో క్రూరులుగా ఉన్నారు. ప్రభుపాదులవారు తెచ్చుకున్న 7 డాలర్లు ఇట్టే ఐపోయాయి. ఆకలిని సహిస్తూ అక్కడ ఓ చెట్టుక్రింద కూర్చొని గీతాపారాయణం చేసాగారు. క్రమ క్రమంగా ఒకరూ ఇద్దరూ వచ్చి అర్ధమైనది అర్ధం చేసుకొని వారింటికి తీసుకువెళ్ళి భోహనాది సత్కారాలు చేయబోగా వారికి శాకాహార భోజనంతోపాటుగా వైదిక నియమాలనూ, కృష్ణభక్తినీ, భగవద్గీత రామాయణ భాగవతాలను బోధిస్తూ వారిని వారిమిత్రులనూ సన్మార్గంలోకి నడిపి క్రమేణా అమెరికాలోనే కాకుండా దేశవిఏశాల్లో ఇస్కాన్ కేంద్రాలనూ, వైదిక గురుకులాలనూ స్థాపించారు.

వారి జ్ఞానబోధద్వారా ఎన్నో లక్షలమంది సనాతన ధర్మం స్వీకరించి మద్యమాంసాదులను వదిలివేసి భారతీయ సంప్రదాయాలను పాటిస్తూ మహా మంత్రన్ని జపిస్తూ తన్మయత్వంలో మునిగితేలడం మనందరికీ తెలిసిందే.

అందరం కలిసి ఒకసారి జపిద్దామా ?

హరేకృష్ణ హరేకృష్ణ కృష్ణకృష్ణ హరేహరే |
హరేరామ హరేరామ రామరామ హరే హరే ||

(సేకరణ)
- శ్రీ రాధా లక్ష్మి

Quote of the day

What matters is to live in the present, live now, for every moment is now. It is your thoughts and acts of the moment that create your future. The outline of your future path already exists, for you created its pattern by your past.…

__________Sai Baba