Online Puja Services

మారిన దొంగ

18.224.63.87
నేటి చిట్టికథ  

ఒక శివరాత్రి పండుగ రోజున  శివుడిని దర్శించుకునేందుకు కాశీ విశ్వేశ్వరుని ఆలయం దగ్గర  బారులు తీరిన జనాల్ని చూసి, పార్వతి శివుడితో "స్వామీ! కాశీకి వెళ్ళిన వాళ్ళంతా కైలాసానికి వస్తారంటారే, మరి నిజంగా అంతమంది  కైలాసానికి వస్తారా ..అని అడిగింది.

శివుడు నవ్వి, " కాదు దేవీ వీళ్ళలో  ఏ ఒకళ్లిద్దరు ఉంటారేమో, కైలాసవాసానికి అర్హత ఉన్నవాళ్ళు!" అన్నాడు.

"ఎలాంటి వాళ్ళు?" అడిగింది పార్వతి.

"చూద్దాం, రా!" అని శివుడు పార్వతిని వెంట బెట్టుకొని బయలుదేరాడు.

శివపార్వతులు ఇద్దరూ ముసలివాళ్ళుగా మారి విశ్వేశ్వరాలయ సింహద్వారం చేరారు. అక్కడ ముసలమ్మ గా   తన భర్త తలను ఒళ్ళో పెట్టుకొని కూర్చున్నది. దేవాలయంలోకి వెళ్ళే వాళ్లందరినీ

అయ్యా, భక్తులెవరైనా దయ తలచండి! నా భర్త దాహం తీరేందుకు కొంచెం గంగా జలం పోయండి! నేను వెళ్ళి గంగా జలం తీసుకు రావటం సాధ్యం కాదు. నా భర్త ప్రాణాపాయ స్థితిలో ఉన్నాడు- ఏ క్షణంలోనైనా ప్రాణం పోవచ్చు. ఈ స్థితిలో నేను ఆయన్ని విడిచి వెళ్ళలేను. మీరెవరైనా కొంచెం సాయం చేయండి" అని వేడుకుంటున్నది.


గుడిలోకి వెళ్ళే భక్తులంతా అప్పటికే గంగానదిలో స్నానం చేసి, తడి బట్టలతో, చేతిలో ఉన్న పాత్రల్లో గంగా జలం నింపుకొని వస్తున్నారు. ఆ గంగ నీటితో విశ్వేశ్వరుణ్ని అభిషేకిస్తారు వాళ్ళు.

"ఇదేమిటి, విశ్వేశ్వరుని దర్శనానికి వస్తే ఈ దరిద్ర దేవత ఎదురైంది?" అని కొందరు ముసలమ్మను తప్పించుకొని వెళ్ళారు. మరికొందరు "ఉండమ్మా, మేం ఇంకా దేవుడిని దర్శించుకోనే లేదు; అభిషేకం అయిన తర్వాత వచ్చి నీ భర్త సంగతి చూస్తాము" అని చెబుతూ లోనికి వెళ్లిపోయారు.

ఆ సమయంలో ఒక దొంగ  "దేవాలయ సింహద్వారం దగ్గర‌ భక్తులు క్రిక్కిరిసి ఉన్నారు. 'జేబులు కొట్టవచ్చు; అలాగే ఆడవారి మెడలలోని నగలు అపహరించవచ్చు" అనుకుంటూ వచ్చాడు. అందరినీ అడిగినట్లే ముసలమ్మ ఆ దొంగను కూడా అడిగింది-"అయ్యా! మేం విశ్వేశ్వరుడిని దర్శించేందుకు వచ్చాం. కానీ వయసు పైబడిన నా భర్త అలసిపోయి, ఇక్కడే కూలబడ్డాడు. ఎవరైనా పుణ్య ప్రభువులు, ఇంత గంగా జలం తెచ్చి ఆయ నోట్లో పోస్తే సేదతీరుతాడేమో. అందరినీ అడుగుతున్నాను నాయనా, నువ్వైనా దయచూడు" అని.

దొంగ చేతిలో ఒక సొరకాయ బుర్రనిండా గంగ నీళ్ళు ఉన్నాయి. అతను "దానిదేముంది అవ్వా, ఇప్పుడే తెచ్చుకున్నాను గంగ నీళ్ళు- ఇవిగో!" అని ఆ నీళ్ళను ముసలాయన నోట్లో పోసేందుకని మోకాళ్ళపైన కూర్చున్నాడు.

అవ్వ అన్నది- "కాస్త ఆగు నాయనా! ఆయన నోట్లో నీళ్ళు పోసేముందు, నువ్వు చేసిన పుణ్యకార్యాల్లో ఏదో ఒకటి చెప్పి, ఆ పైన నీళ్ళు పొయ్యి బాబూ! నీ పుణ్యంవల్లనైనా ముసలాయన మంచి లోకాలకు పోతాడు" అని.

దొంగకు ఏం చేయాలో తోచలేదు. గుర్తు ఎరిగిన నాటి నుండీ 'తను చేసిన మంచి పని' అంటూ ఒక్కటీ లేదు! ఇలా తన పుణ్యాన్ని లెక్కించుకునే అవసరమూ ఏనాడూ ఎదురవ్వలేదు! అతను సిగ్గు పడుతూ అన్నాడు ముసలమ్మతో-

"అమ్మా, నేనొక దొంగను. ఇంతవరకూ నేను ఒక్క పుణ్యకార్యం కూడా చేయలేదు. ఇదిగో, ఇప్పుడు, ఈయన నోట్లో గంగాజలం పోద్దామనుకున్నానే, ఇదొక్కటే కావొచ్చు, నేను చేస్తున్న మంచి పని" అని చెప్పి, ముసలాయన నోటిలో నీరు పోశాడు అతను.


మరుక్షణం శివ పార్వతులు ఆ దొంగకు నిజరూపాలతో దర్శనం ఇచ్చారు: "నాయనా, నిజం చెప్పటం ద్వారా నువ్వు ఈనాడు గొప్ప పుణ్యం సంపాదించుకున్నావు. సత్యాన్ని మించిన ధర్మం లేదు. నువ్వు చేసిన ఈ ఒక్క మంచి పని వల్ల, ఇంతకాలంగా చేసిన పాపాలన్నీ‌ పటాపంచలయ్యాయి. ఇకపైన చెడు పనులు చేయకు. పవిత్రంగా బ్రతుకు. మానవ సేవే పరమార్థంగా భావించిన నువ్వు, జన్మాంతంలో‌ కైలాసానికి చేరుకుంటావు" అని, వాళ్లు అంతర్థానమయ్యారు. 

ఆ పైన దొంగ పూర్తిగా మారిపోయాడు. జీవితాంతం మంచిపనులు చేస్తూ గడిపాడు.

"చూశావా! ఇలాంటి ఏ కొందరో వస్తారు, కైలాసానికి. పరోపకారాన్ని మించిన ప్రార్థన లేదు" అన్నాడు శివుడు, పార్వతితో. "అవును" అన్నది పార్వతి, అంగీకరిస్తూ.

SM చక్రపాణి 

Quote of the day

What matters is to live in the present, live now, for every moment is now. It is your thoughts and acts of the moment that create your future. The outline of your future path already exists, for you created its pattern by your past.…

__________Sai Baba