Online Puja Services

భోజన మహాత్మ్యం

3.137.192.3
మీరు మీ తాతయ్య తరంవారిని వారి కాలంలో బంధుత్వాలు, మనుషుల మధ్య అనుబంధాలు ఎలా ఉండేవో ఒకసారి అడిగి చూడండి.  మా చిన్నతనంలో ఎవరైనా బంధువులు ఇంటికి వస్తే కనీసం రెండు మూడు రోజులు ఉండేవారు.  వంటలు కూడా రోజూ ఎలా ఉండేవో అలాగే ఉండేవి.  ప్రత్యేకించి ఏమీ వండేవారు కారు.  ఆరుబయట నులక మంచాలు వేసుకుని పడుకోవడం...కబుర్లు చెప్పుకుని పడుకోవడం...మూడు పూటలా అన్నమే తినడం...మూడో రోజు వారు తిరిగి ప్రయాణం అయ్యే సమయానికి వారి చెప్పులు కనిపించేవి కావు.  ఇల్లంతా వెతికినా కనిపించవు.  అంతలో వాళ్ళు ఎక్కాల్సిన బస్సు వచ్చి వెళ్ళిపోతుంది.  అప్పట్లో రోజుకు ఒకటో రెండో బస్సు సర్వీసులు.   కొన్ని ఊళ్ళకైతే అవి కూడా ఉండేవి కావు.  ఆ బస్సు వెళ్ళగానే చెప్పులు ప్రత్యక్షం అయ్యేవి.  బంధువులు మరొక రోజైనా ఉండాలనే కోరికతో ఇంటివాళ్లే చెప్పులను దాచిపెట్టేవారు.  
 
రానురాను మనం ఆధునికత సంతరించుకున్న తరువాత బంధుత్వాల బలిమి సన్నగిల్లిపోయింది.  ఇక గత రెండు మూడు దశాబ్దాలుగా బంధుత్వాలు మొక్కుబడిగా మారిపోయాయి.  ఒకే పట్నంలో ఉంటున్నా కూడా ఏడాదికో రెండేళ్లకో ఒకసారి కలుసుకోవడం జరుగుతున్నది.  ఉమ్మడి కుటుంబాలు విడిపోయాక అన్నదమ్ములు, అక్కాచెల్లెళ్లలో ఆర్ధికంగా బలవంతులైన వారు తమ సొంత కుటుంబంలోని బలహీనులను దూరంగా పెట్టే జాడ్యం ప్రారంభం అయింది.  డబ్బున్న బంధువులకు ఒకరకమైన మర్యాదలు, డబ్బులేని బంధువులకు మరొకరకమైన మర్యాదలు జరిపే ఆచారం మొదలైంది.  ఒకే ఇంట్లో పుట్టినప్పటికీ,  అంతస్తుల మధ్య తేడా పెరిగాక సొంతవాళ్ళం అన్న మమకారం నశించి మనం మనం బంధువులం అని చెప్పుకోవడం మొదలు పెట్టారు.   డబ్బులేని బంధువులు మన ఇంటికి వస్తున్నారంటే వారు మనలను అప్పు అడగడానికి వస్తున్నారు అని తప్పుడు అంచనాలు వేసుకుంటున్నారు. 
 
ఇక సొంత అన్నదమ్ములైనా, అక్కాచెల్లెళ్ళే అయినా, ఏవైనా ఫంక్షన్స్ ఉంటె తప్ప కలుసుకోవడం లేదు.  మామూలుగా వెళ్లి చూడటం, పలకరించడం అనేది తగ్గిపోయింది.  ఆ ఫంక్షన్స్ కు కూడా భోజనాలకు గంట ముందుగా వెళ్లడం, భోజనాలు అయ్యాక వెంటనే "పనులు ఉన్నాయి" అని వంక చెప్పి వెళ్లిపోవడమే చాలా గృహాల్లో చూస్తున్నాము.  మనుషుల మధ్య  ఆత్మీయత అనేది చాలా అరుదుగా కనిపిస్తున్నది.  
 
సంవత్సరానికి కనీసం పన్నెండు సార్లైనా ఒకరినొకరు కలుసుకుని ఒకరి ఇళ్లలో మరొకరు భోజనాలు చేసుకుని కాసేపు కబుర్లు చెప్పుకుని వీలయితే ఆ రాత్రికి అక్కడే ఉండే పద్ధతులు పాటించే కుటుంబాల్లో కాస్తో కూస్తో బంధాలు అనేవి కనిపిస్తున్నాయి.  అలా కాకుండా ఏవైనా ప్రత్యేక ఫంక్షన్స్ లో మాత్రమే కలుసుకుని, కేటరింగ్ భోజనాలు చేసేసి వెళ్లిపోయే కుటుంబాల్లో బంధాలు గట్టిగా ఉండవు.   వందలమంది అతిధులు హాజరయ్యే వేడుకల్లో ప్రత్యేకించి ఏ ఒక్క దగ్గరి బంధువునొ, తోబుట్టువులనో ప్రత్యేకంగా మర్యాద చెయ్యడం, వారితోనే కూర్చుని ముచ్చట్లు చెప్పడం అనేది జరిగే పని కాదు.  
 
అందుకే ఎలాంటి వేడుకలు లేకపోయినా, కనీసం నెలకొక్కసారైనా ఒకరితో ఒకరు కలుసుకుని సాదాసీదా ఆత్మీయ భోజనం చేసి ఆనందంగా వెళ్లిపోవడం బంధాలను బలంగా ఉంచుతాయి.  చాలామంది మాకు టైం లేదు అని సాకులు చెబుతుంటారు. ఏడాదికి వందరోజులు సెలవులు ఉన్నాయి మనకు. లేనిదల్లా ఆత్మీయతలు...బంధాలను పటిష్టంగా ఉంచుకోవాలి అనే కోరికలు!  అన్నం అనేది మనమధ్య మానసిక బంధాలను సుదృఢంగా నిలిపి అజరామరం గావించే  అమృతం లాంటిది.
 
 
కొందరికి తల్లితండ్రులను పలకరించే తీరికలేని సంపాదనలో ఉన్నారు.

Quote of the day

The Vedanta recognizes no sin it only recognizes error. And the greatest error, says the Vedanta is to say that you are weak, that you are a sinner, a miserable creature, and that you have no power and you cannot do this and that.…

__________Swamy Vivekananda