Online Puja Services

హైందవ మతములందు ఏకత్వము

3.147.75.203
హైందవ మతములందు ఏకత్వము
 
మతాభిమాన ప్రయుక్తాలైన యుద్థాలు కొన్ని జరుగుతూ వచ్చినమాట నిజమేకాని. దేశాభిమానం ప్రాంతాభిమానం, జాత్యహంకారం వీటివల్ల నయిన ఘోరయుద్ధాలతో జరిగే సర్వనాశనంతో పోల్చిచూస్తే అవి యొక లెక్కలోనివి కావు. అదికారలోభం, రాజ్యలోభం- ఇవే సామాన్యంగా యుద్ధాలకు ప్రధాన కారణాలు. మానవలోకానికి మతంవల్ల చాల బాధకలిగిందని కొందరంటూ వుంటారే. ఆ కారణాన మతం పనికిమాలిన దందామా? మరి దేశభక్తి, ప్రజా స్వామ్యానురక్తి, లోకమంతా ఒకటికావలెననే ఆశయమూ వీటివల్లకూడా లోకపీడకలుగుతున్నదే! ఆ కారణాన దేశభక్తి మున్నగునవికూడా పనికిమాలినవే అనవలసివస్తుందని వారు మరచిపోతారు.
 
తమలక్ష్యసిద్ధికోసం ప్రాణాలకైనా తెగించి పోరాడడం వీరకృత్యంగా ఎంచుకొనేవారు, మతభక్తినొక్కదాన్నే ఎందుకు తెగనాడుతారో? దేశభక్తికోసంసాహసించి కొందరు ప్రాణార్పణం చేస్తున్నట్లే ఈశ్వరభక్తి ప్రేరితుడై మరికొందరు దేహత్యాగం చేయవచ్చు. లోకమందలి ప్రధాన మతాలన్నిటికీ అపారమైన జీవశక్తివుంది. ఒకానొక పరమార్ధ సిద్దికోసం పుట్టినవి కనుకనే అవి నేటికీ సజీవంగా వున్నవి.
 
తిరువెంబావై, తిరుప్పావై అనే గ్రంథాలు మన మతమందు నిహితమైవున్న ఏకేశ్వరభావమును, ఏకపూజా విధానమును పునరుద్ధరించి ధర్మానురక్తిని పెంచటంకోసం పుట్టినవి. ఏకత్వం మంచిదేకాని ఎవరి ఆర్చావిధానంపై వారికుండే శ్రధ్ధకు లోపం రానివ్వగూడదు. అందరినీ ఒక్క త్రాటిపై నిలిపి ఒక్కటేపూజ చేయించవలె ననుకోవటం తెలివయినపనికాదు. ఎవరేవిధంగా అర్చించినా ఈయర్చనలన్నిటిని పొందే ఈశ్వరుడొక్కడే అనే మూలమంత్రంపై ప్రజల దృష్టిని ప్రసరింపజేయుటే మనం చేయవలసింది.
 
నానాత్వమున ఏకత్వమునుదర్శించుటొక్కటే మతానికి జీవితానికి పరమార్ధం. ఎవరేసత్యాన్ని దర్శించినా అవియన్నీ ఈశ్వరదర్శనములేకానీ అన్యంకావు. మనం సాధింపగలిగినదీ. సయుక్తికమయినదీ ఈ యేకత్వమొక్కటే. ఏకమతంకోసమని నేటి మతాలన్నిటినీ మనం రూపుమాపకుందుముగాక! ఎవరి ఇష్టదేవతపై వారికి భక్తిని పెంపొందిచుటే - అంతకంటే మంచిపని. తన దేవునిపై గాఢప్రేమ కుదిరితే ఇరుగుపొరుగు దేవుళ్ళను చిన్నచూపుచూడడమంటూవుండదు. మతములకు, ధర్మమునకు ఉదారబుద్ధి తోడుపడినచో వాటివల్ల ఇతోధిక మైన మేలు సమకూరుతుంది. భిన్న మతస్థులు పరస్పరం సౌదర్యంతో, గౌరవాదరాలతో, సహృదయత్వంతో, మెలగడం నేర్చుకుంటే తమ మతాలన్నింటికీ మూలమొక్కటే నని వారికే తెలిసివస్తుంది.
 
హైందవశాఖలందీ సమ్మేళనము సాధించుటకే తిరుప్పావై, తిరువెంబావై ఉద్యమాలు పూనుకొన్నవి. శైవ, వైష్ణవ శాక్తాది మతములన్నీ ఏకత్వభావమునుండియే బయల్వెడలినవి. లోకమంతటికీ ఏకమతంకావలెనని ప్రచారమారం భించేముందు మన మతమందలి ఈ భిన్న శాఖలకు సమ్మేళనం సంపాదించడం మేలు. ఈ విధంగా పునరుజ్జీవితమైన హిందూ మతం లోకమతైక్యమునకు చక్కని దోహదం చేయగలుగుతుంది.
 
లోకాన్ని ఏకమతం దెసకు నడిపించుటకు హిందూమతం చక్కనిబాట వేయగలదు మతాలెన్నివున్నా, అవిఅన్నీ సనాతనమైన ఏకధర్మానికిభిన్నముఖాలనీ, వాటికి పరస్పర వైరుధ్యంలేదనీ ఈశ్వరుడొక్కడేనని - హిందూమతము మూలమందుండే విశ్వాసం మరి ఏమతానికీ లేదనిచెప్పవచ్చు. ఈ విశ్వాసమే హైందవమతానికి మూలబంధం. హిందువులకిది వట్టి పూర్వపక్షముగాని, మీమాంసమాత్రముగాని కాదు. మన యోగులు, ద్రష్టలు భక్తియోగ కర్మయోగములచే ఆ యేకత్వమును పొందుటకై తపస్సులు ధారపోశారు. కనుకనే శైవులుశివకీర్తనంచేస్తూ మధ్యలో హరిభక్త్యావేశంతో హరస్మరణంకూడా చేస్తారు. అలాగే వైష్ణవులు - ముఖ్యంగా పూర్వాళ్వారులు - హరికీర్తనంచేస్తూ హరస్మరణం కూడా చేస్తూవుంటారు. శివనారాయణరూపకల్పనమే మన ఏకేశ్వర భక్తికి ప్రబలప్రమాణం. అద్వయమై నామరూపరహితమైన పరబ్రహ్మతత్త్వమే భక్తానుగ్రహార్థం. అనేక నామరూపములచే వ్యక్తమవుతూ వుంటుంది. ఆ అద్వయతత్త్వమునే మన యోగులు, భక్తులు ఉపాసింతురు.
 
ఈశ్వరుడొక్కడనే జ్ఞానాన్నిపొందుటకు ఇష్ఠదేవతారాధనం చక్కని సోపానమవుతుంది. శిశువులుత్రోపుడుబండితో నడక నేర్చినట్లు భక్తులు ఇష్టదేవతారాధనచే ఆత్మజ్ఞానాన్ని పొందగలుగుతారు. హిందూమతమందు ఐక్య భావంవున్నదనే మాట మన పూర్వు లెన్నడూ మరచినవారుకారు. హిందువులలో పండితులు, పామరులుగూడా సార్వజనీనములగు రథోత్సవాదులందు పాల్గొనుచు భక్తిప్రపత్తులం దోలలాడుదురు. హిందువులలో అన్ని తెగలవారినిఅలాఒక్కచోటచేర్చి, కూడ గట్టే ఉత్సవాదులను మనమిప్పు డనాదరిస్తున్నాము.
మహోన్నతములు, అత్యుదారములు అయిన మన దేవాలయ విమాన గోపురాదులు పూర్వరాజన్యుల దైవ భక్తికి మాత్రమే చిహ్నములుకావు. థర్మాభిరతిచే మనవారి కలపడిన సమిష్టి నిర్మాణశక్తికికూడా ఈ ధర్మప్రతిష్ఠాపనలు సాక్ష్యమిస్తున్నవి. నేటి కమ్యూనిజము వర్గ ద్వేషములు, కలహాలనుండి తలయెత్తితే మన దేవాలయములనుండి ఆధ్యాత్మికమైన కమ్యూనిజము జనించి, సమస్తప్రజను ప్రేమబంధమున పెనవైచినది. సనాతనమైన మన ఏకధర్మాన్ని ఉజ్జీవింపజేసి, శైవవైష్ణవులను, వేదపండితులను, ద్రావిడ విద్వాంసులను ఒక్కచో జేర్చుటకోసమే తిరుప్పావై, తిరవెంబావై సదస్సులు దేశం నాల్గుమూలల నేడు సమావేశమవుతున్నవి. మనమతంలో ప్రధానంగా కనిపించే శైవ వైష్ణవశాఖల సార సంగ్రహమే ఈ తిరుప్పావై, తిరువెంబావై ఉద్యమం. ఈ రెండు మహాకావ్యముల ఉపదేశమే పునాదిగా మనం ఐక్య సౌధనిర్మాణం చేయవలసివుంది.
 
మతమొక్కటే ప్రజాసమూహాన్ని, దేశాన్ని కూడగట్ట గలదు. ఏకాత్మభావము, ఏకధర్మము - వీనినుండి శాశ్వతమైన ఐక్యంపుట్టి వర్థిల్లుతుంది. మానవలోకానికి ప్రగాఢమైనభక్తి ప్రేమలు మతమువల్లనే తొల్లిటినాళ్ళలో జనించినవి. లోకానికి మహోదారములైన, సూక్తులను ధర్మస్వరూపులైన మహనీయులే ఇచ్చిపోయిరి. మానవేతిహాసాన్ని పరిశీలిస్తే మతముకంటె అధికమైన సంఘటనశక్తి మరియొకటిలేదని తెలిసి వస్తుంది.
 
అతీంద్రియ రహస్యాలను ధ్వనింపజేసే మన ధర్మ గ్రంథాల దివ్యగానమునకు చెవియొగ్గి హిందూమతమందలి భిన్న శాఖలు ఏకశ్రుతియందు మేళవించుటను గుర్తించి, మన తర తమ భావాలను పరహరించుకొందుముగాక! థర్మాభిరతిని పెంచుకొందుముగాక! అపుడు లోకానికి ఏకధర్మ ప్రతిష్ట నుపదేశించే శక్తి మనకు లభిస్తుంది. అట్టి దివ్యసంకల్పశుద్ధికి తగిన అంతస్సారం నేడు మన మతానికి ఉన్నదా అని అడుగుతున్నాము. అటువంటి ఆత్మశక్తిని ఆర్జించుకొని మన సనాతన ధర్మప్రసవమైన నూతనాదర్శాన్ని ఉత్పాదించి పడుచువాండ్రకు ఉత్సాహశక్తిని, వృద్ధులకు పరమభక్తిని సమకూర్చే భారం వహించవలసివుంది.
 
--- “జగద్గురు బోధలు” నుండి
 
అపార కరుణాసింధుం జ్ఞానదం శాంతరూపిణం
శ్రీ చంద్రశేఖర గురుం ప్రణమామి ముదావహం ।।
 
#KanchiParamacharyaVaibhavam #కంచిపరమాచార్యవైభవం

Quote of the day

From the solemn gloom of the temple children run out to sit in the dust, God watches them play and forgets the priest.…

__________Rabindranath Tagore