మూడు ప్రశ్నలు

::రోజూ భగవంతునికి పూజ చేసే వారు కూడా::

భగవంతుడు అంటే ఏమిటి? 
అంటే.....
ఎంతోమంది సరైన సమాధానం చెప్పలేరు. 

కాబట్టి ఓపిక చేసుకుని... 
ఈ చిన్న కథను చదవండి

ఓ దేశాన్ని పాలించే రాజు మనసులో... ముఖ్యంగా మూడు అర్దంకాని ప్రశ్నలు మెదడును తోలుస్తూ ఉన్నాయి. 
అవి... 

1.దేవుడు ఏ వైపు చూస్తుఉంటాడు? 
2.దేవుడు ఎక్కడ ఉంటాడు? 
3.దేవుడు ఏం చేస్తాడు? 

ఆ ప్రశ్నలకు ఎన్నోమార్లు ఎంత యోచించినా సరైన సమాధానం దొరకలేదు.

తన ఆస్థానంలో ఓ రోజు సమావేశమై... పండితులను, 
శాస్త్రకారులను, 
మేధావులను ఆహ్వానించాడు.
తాను మూడు ప్రశ్నలు వేస్తానని, 
వాటికి జవాబులు చెప్పడానికి ముందుకు వచ్చి సరైన సమాధానం చెప్పిన వారికి గొప్ప బహుమతి లభిస్తుందని చెప్పాడు. 
సరైన సమాధానం చెప్పకపోతే కారాగారం పాలు చేస్తానని చెప్పాడు. 
దాంతో భయపడి ఎవరూ ముందుకు రాలేదు. ఈ విషయం దేశమంతా చాటింపబడింది.

ఓ కుగ్రామం నుండి పశువుల కాపరి ఒకాయన ముందుకు వచ్చాడు.
రాజాస్థానం చేరుకొన్నాడు. 
రాజు సభలో ఎందరో మేధావులు శాస్త్ర పండితులు కూర్చొన్నారు.

పశువుల కాపరి, రాజుగారి మొదటి ప్రశ్నకు సమాధానం చెప్పబోయే ముందు.... రాజుకో విషయం నిర్దేశం చేసాడు.
‘చెప్పేవాడు గురువు, వినేవాడు శిష్యుడు. 
గురువు పైన ఉండాలి,శిష్యుడు క్రింద ఉండాలి’ 
అని కండీషన్ పెట్టాడు . 

దానికి రాజు అంగీకరించి సింహాసనం నుండి క్రిందికి దిగాడు. 
పశువుల కాపరి సింహాసనం అధిష్ఠించాడు. 

‘మహారాజా ఇప్పుడు అడగండి మూడు ప్రశ్నలు’’ అన్నాడు పశువుల కాపరి. 

మొదటి ప్రశ్న
దేవుడు ఏ వైపు చూస్తుఉంటాడు? 
దీనికి జవాబు చెప్పండి అన్నాడు రాజు.

వెంటనే ఒక దీపాన్ని తెప్పించమన్నాడు గురువు స్థానంలో వున్న పశువుల కాపరి. దీపం తెచ్చి సభ మధ్యలో పెట్టారు.

మహారాజా! ఈ దీపం ఎక్కడ చూస్తుంది? నావైపా? నీవైపా? తూర్పువైపా? పశ్చిమానికా? పైనకా? క్రిందకా? ఎక్కడ చూస్తుందో చెప్పండి? అని ప్రశ్నించాడు.
‘అన్నివైపులకు చూస్తుంది’ అని జవాబిచ్చాడు రాజు.

ఇంత చిన్న జ్యోతి అన్నివైపులా చూడగలిగినపుడు.... పరంజ్యోతి స్వరూపమైన భగవంతుడు అన్నివైపులా చూడలేడా? సమస్త జీవుల కళ్ళల్లో వెలుగుగా వున్న పరంజ్యోతి పరమాత్మే.

మరి ఇక రెండవ ప్రశ్న.... 

దేవుడు ఎక్కడ ఉంటాడు? 
అన్నాడు రాజు.

‘సరే! ఓ చిన్న పాత్రలో పాలు తెప్పించండి’ అన్నాడు పశువుల కాపరి. 
పాలు తెచ్చారు.
‘మహారాజా ! ఈ పాలల్లో నెయ్యి ఎక్కడ ఉందో చెప్పగలవా?’ అని అడిగాడు.

‘పాలను బాగా మరుగబెట్టాలి. 
వాటిని తోడు (మజ్జిగ) కలిపి కొన్ని గంటలు కదలకుండా ఉంచాలి. 
పెరుగు సిద్ధం అవుతుంది. 
దాన్ని కవ్వంతో చిలికితే వెన్న వస్తుంది. తర్వాత తయారైన వెన్నను కాస్తే నెయ్యి తయారవుతుంది’ అన్నాడు రాజు.

‘సరిగ్గా చెప్పారు మహారాజా! 
అలాగే హృదయం అనే పాలను గురువు అనే నిప్పులపై బాగా మరిగించి, 
మనస్సు అనే తోడు వేసి, 
స్థిరంగా ఉంచితే వచ్చే సత్యం అనే పెరుగును, 
సాధన అనే కవ్వంతో చిలికితే 
జ్ఞానం అనే వెన్న వస్తుంది.
ఆ సాధన ‘అంతర్ముఖం’ అనే నిప్పులపై బాగా కాచినట్లయితే పరమాత్మ అనే నెయ్యి వస్తుంది’అన్నాడు కాపరి.
సభలో హర్షధ్వానాలు మిన్నుముట్టాయి.

ఇక చివరి ప్రశ్న. 
దేవుడు ఏం చేస్తాడు? అని.

నేను పశువుల కాపరిని, మీరు మహారాజు.
క్రింద వున్న నన్ను సింహాసనం పైన కూర్చోబెట్టారు. 
పైన వున్న మిమ్మల్ని క్రిందికి దించేశారు. ఇదే పరమాత్మ లీల.
సత్కర్మలు చేసే జీవులను పై జన్మల్లో ఉత్తమ జన్మగా మార్చడం, 
దుష్కర్మలు చేసే వాళ్ళను మరుజన్మలో క్రింది స్థాయికి పంచడమే పరమాత్మ పని’ అన్నాడు.

సభలో గంభీర వాతావరణం నెలకొంది. రాజు పశువుల కాపరి ముందు పాదాక్రాంతుడయ్యాడు. 
పశువుల కాపరి రూపంలో ఉన్న పరమాత్మ తాను వచ్చిన దిక్కుగా తిరుగు ప్రయాణం అయ్యాడు. 

*మంచిని ఎక్కడ ఉన్న గ్రహిద్దాము..*
*మంచిని నేర్చుకుందాము.. *
*మంచిని ఆచరించుదాము... *
*మంచిని అందరికి పంచుదాము... *
*మంచి పేరుతో మరణిద్దాము...*

శుభం భూయాత్!

Quote of the day

Look out into the universe and contemplate the glory of God. Observe the stars, millions of them, twinkling in the night sky, all with a message of unity, part of the very nature of God.…

__________Sai Baba