Online Puja Services

చెప్పుడు మాటలు వినకురా, చెడేవు!

3.128.198.60

చెప్పుడు మాటలు వినకురా, చెడేవు!
-లక్ష్మీ రమణ 

చెప్పుడు మాటలు వినకురా, చెడేవు! అని చెవిని ఇల్లుకట్టుకుని పోరినా కొంతమంది బుద్ధి మార్చుకోరు . నిత్యం వార్తా పత్రికల్లో మనం ఇలాంటి వార్తలు చూస్తూనే ఉంటాం . ప్రత్యేకించి భార్యాభర్తల అనుబంధం మూడో వ్యక్తికీ చోటులేనిది. పరమ పవిత్రమైనది .  అగ్ని సాక్షిగా ముడిపడిన జన్మజన్మల అనుబంధమది . అటువంటి అనుబంధం బీటలువారడం, కోర్టుల సాక్షిగా , నవీన సమాజంలో విడాకులు తీసుకోవడం చూస్తూనే ఉన్నాం .  ఇది నేటి మాటకాదు ఇటువంటి ఉదంతాలు గడిచిన మన చరిత్రలో , పురాణ ఇతిహాసాలలోనూ ఇటువంటి దృష్టాంతారాలు ఉన్నాయి . 
   
తిమ్మరుసు  కృష్ణదేవరాయలు రాజవ్వడానికి కారకుడయ్యాడు . పట్టాభిషేకం నాడు చెంపదెబ్బ కొట్టి , చెడుమార్గం పట్టొద్దని చెప్పాడు . అటువంటి తిమ్మరుసును గురించి  చెప్పుడు మాటలు విని, తండ్రి సమానుడు , మహామేధావి అయిన ఆ మహామంత్రి కళ్ళు పీకించాడు శ్రీ కృష్ణ దేవరాయలు. సుస్థిరమైన విజయనగర సామ్రాజ్య పతనానికి తన చేతులతో బీజాలు నాటాడు .  

 తల్లి గర్భం లో చనిపోబోయే బిందుసారుడి ని తన ఉపాయం తో బతికిస్తే చివరికి చెప్పుడు మాటలు విని బిందుసారుడే చాణక్యుడి మరణానికి కారణం అయ్యాడు. 

శకుని కురువంశం చేసిన ద్రోహానికి ప్రతీకారం తీర్చుకోవాలనుకున్నాడు. అందుకోసమే , పగని ఆహారంగా చేసుకొని బ్రతికాడు . దుర్యోధనుణ్ణి చేరదీసి , చెప్పకూడని  మాటలు , చెప్పాల్సిన రీతిలో చెప్పి అతనికి పాండవుల మీదున్న ద్వేషాన్ని శత్రుత్వంగా మార్చగలిగాడు . తద్వారా దాయాదులమధ్య చిచ్చురగిల్చి, కురుక్షేత్ర సంగ్రామానికి కారకుడయ్యాడు .  పాండవులపై యుద్ధం చేసి సర్వం కోల్పోయారు కౌరవులు. 

 సూర్ఫణఖ చెప్పుడు మాటలు విని రావణ బ్రహ్మ అంతటి మాహాజ్ఞాని  సీతమ్మతల్లిని అపహరించి రాముడితో యుద్ధానికిదిగి, చరిత్రహీనుడయ్యాడు . చివరకు మరణించాడు. 

ఇలా, చెప్పుడు మాటలు విని చెడిపోయినవారు చరిత్రలో చాలా మందే ఉన్నారు . స్నేహాన్ని కోల్పోయిన వారు, సంసారాలని నాశనం చేసుకున్నవారు , అధికారాన్ని కోల్పోయిన వారు ఇలా వీరి జాబితా పెద్దదే మరి .  అందుకే చెప్పేది మంచి మాట చెప్పినప్పుడు , అది మనకి విహితమైనది అనిపిస్తే , స్వీకరించండి .  అంతే కానీ, వాళ్ళిలా , వీళ్ళలా అంటూ చెబితే, మొహమాటంలేకుండా ఆమాటలు మీ దగ్గర చెప్పొద్దని చెప్పండి . షిరిడీ సాయి బాబా ఒకమాట చెబుతారు. చెప్పుడు మాటలు చెప్పే వారు ఎవరి గురించయితే చెబుతున్నారో వారి అశుద్ధాన్ని స్వయంగా నాలికతో నాకుతున్నట్టు అని. ఈ మాటలు చెప్పుడు మాటలు చెప్పేవారు సదా గుర్తుంచుకోవాలి.   

 అయినా ఒకరి గురించి నీకు చెబుతున్నాడు అంటే ... నీ గురించి మరొకరికి చెప్పడా ? ఇది ఆలోచించడం మన విజ్ఞత.

Quote of the day

God can be realized through all paths. All religions are true. The important thing is to reach the roof. You can reach it by stone stairs or by wooden stairs or by bamboo steps or by a rope. You can also climb up by a bamboo pole.…

__________Ramakrishna