Online Puja Services

‘జపం’ మహత్తు తెలిగలేరా !

3.137.174.44

‘జపం’ మహత్తు తెలిగలేరా !
-లక్ష్మీ రమణ 

రామా నీ నామమే అమృతం . నీ నామ జపమే నాకు మధురసపానం అంటారో భక్తుడు. ఇక హనుమన్న సంగతి ఏమి చెప్పేది ? నిరంతరం రామనామమే ఆయనకి సర్వస్వం . ఎక్కడ రామనామం , రామగానం ఉంటాయో అక్కడ వాలిపోవడం ఆయన నైజం. ఆయనకి దాసానుదాసుడు తులసీదాసు “హరిని చేరడానికి నీనామము జపించడమే మార్గమని” అంజనీ సుతుని ప్రార్థించాడు . ఇక, తానీషాకి రామ దర్శనం చేయించిన రామదాసు, కీర్తనలతో రామజపం చేస్తూ, తారకనామము కోరిన దొరికెను ధన్యుడనైతిని ఓరామా ! అంటాడు . 

ఇటీవల ఆలయాలలో అంతగా వినిపించడం లేదుగానీ , సాయంత్రమైతే , ఆ ప్రాంతంలోని పెద్దలందరూ చేరి చక్కగా నామ సంకీర్తనలు చేసేవారు .  నగర నాగరికత అని మనం గొప్పగా భావించే అధునాతన సంస్కృతీ , మన ప్రాచీనమైన ఈ సంప్రదాయానికి కాలడ్డి ఉండవచ్చు. సరే కానీ, అసలీ నామ జపాలు చేస్తే వచ్చేదేమిటిట? అని వెదికలెక్కి ఊదరగొట్టే ఒక మైకు వీరుడి ప్రశ్న ! నిజమే సుమీ ! అదేదో తెలుసుకోవాల్సిందే అనుకోని మొదలుపెడితే, అబ్బో చాలా విషయమే బయటపడింది.   

ఒక మంత్రము యొక్క ఆవృత్తి నే జపం అంటారు . అంటే, ఒక మంత్రాన్ని , లేదా నామాన్ని విడువక స్మరించడమే జపం అన్నమాట . నారదుడు , ‘రామ’ అని కూడా పలుకలేని నాలిక గల ఒక కిరాతకుడైన ఆటవికుడుకి ‘మరా’  అనే రెండక్షరాలని ఉపదేశించాడు. అదే మహా మంత్రంగా పరిణమించి, ఆ నామ జపం ఆయనని మహర్షిని చేసింది.  ఆ రెండక్షరాలు జపించి , ఆ రెండక్షరాల జపంలో తపించి , చుట్టూ వల్మీకములు (పుట్టలు) పెరిగినా సరే, తెల్సుకోలేనంత తన్మయంతో ఆ జపంలో వసించి , ఆ పరంధాముని పొందిన ఆయన వాల్మీకి మహర్షి అయ్యారు .  అనంతమైన జ్ఞానసంపదని అందించారు .  దీన్ని బట్టే, జపం యెంత అద్భుతమైనదో అర్థమవుతోంది కదా ! మరింత వివరంగా జప మహత్యాన్ని గురించి చెప్పుకుందాం . 

“జ కారో జన్మవిచ్ఛేదః 
పకారః పాపనాశకః 
తస్మాజ్జప ఇతి ప్రోక్తో 
జన్మపాప వినాశకః “

అని శాస్త్రం . అంటే, జప శబ్దములోని జ కారానికి జన్మ నాశనమని - అంటే జన్మ రాహిత్యము , మోక్షప్రదము అని అర్థం . పకారానికి పాపాన్ని పోగొట్టేది అని అర్థం . అంటే, పాపాన్ని నశింపజేసి, జన్మ రాహిత్యము అనుగ్రహించేదే జపము .  

జపాన్ని చేసేప్పుడు ఏ వైపుకి తిరిగి కూర్చోవాలి అనేది కూడా సంకల్పం ప్రకారంగా నిర్ణయం చేశారు మన పెద్దలు . 

“తూర్పార్యాభిముఖం వశ్యం 
దక్షిణం చాభి చారికం 
పశ్చిమం దనడం విద్యాత్ 
ఉత్తరం శాన్తికం భవేత్ || “

అని శాస్త్రం . తూర్పువైపుకి తిరిగి కూర్చొని జపం చేస్తే, వశీకరణము , దక్షిణం దిక్కుకి తిరిగి జపం చేస్తే , శత్రునాశనం లేదా శత్రు పలాయనం , పడమర ముఖంగా చేస్తే, శాంతి లభిస్తాయని పై శ్లోకానికి అర్థం . 

దిక్కులని సూచించడమే కాదు , ఏ ఆసనం మీద కూర్చొని జపం చేయాలనే సందేహాన్ని కూడా నివృత్తి చేస్తూ, ఏవిధమైన ఆసనాన్ని వేసుకోవడంవల్ల ఫలితం ఏమిటి అనేది విశదీకరిస్తూ, ఇలా చెప్పారు :

కృష్ణాజినే జ్ఞానసిద్ధి:
మోక్షశ్రీ:వ్యాఘ్ర చర్మణీ   
కుశాసనే మంత్రసిద్ధి :
నాత్ర కార్యావిచారణా || 

దీని ప్రకారం , జింకచర్మం మీద కూర్చొని జపం చేస్తే జ్ఞానము , పులిచర్మం మీద కూర్చొని చేస్తే మోక్షము , దర్భాసనం మీద కూర్చొని చేస్తే మంత్రం సిద్ధి కలుగుతాయని అర్థమవుతోంది . 

అయితే, పెళ్ళికీ , పిడుగుకీ ఒకే మంత్రం ఉండనట్టు , అన్ని మంత్రాలకూ ఒకే ఆసనం , ఒకే దిక్కూ పనికిరాదు. జపించాల్సిన మంత్రాన్ని , సంకల్పాన్ని అనుసరించి వీటి విషయంలో నిర్ణయం తీసుకోవడం ఉత్తమం . కానీ, నామాన్ని పలికినంతమాత్రాన , ఆజపం చేసినంత మాత్రాన ఫలితం లభిస్తుందా అని సందేహం ఏమాత్రమో మిగిలేవుంటుంది మన అంతరాంతరాలలో . దానిని కూడా నివృత్తి చేస్తూ ఇలా చెప్పారు , 

 యక్షరక్ష:పిశాచాశ్చ 
గ్రహః సర్వేచ భీషణాః | 
జాపినం నొప సర్పంతి 
భయభీతాః సమంతతః || 

అన్ని దిశలలో ఉండే భూత, ప్రేత , పిశాచాలు, భయంకరమైన గ్రహాలూ రోజూజపం చేసే వారి చెంతకి రావడానికి భయపడతాయట . ఆంటే కాదు జన్మ జన్మల నుండీ చేసినటువంటి పాపారాసి దగ్దమై పోతుంది . అనంతమైన భోగభాగ్యాలు కలుగుతాయి . అకాల మృత్యువు దరిచేరదు. ఇంకా అణిమాదిసిద్ధులు కూడా లభిస్తాయి. చివరకు మోక్షం సైతం సిద్ధిస్తుందంటూ చెప్పిన ఈ శ్లోకాన్ని పరికించండి . 

జవేన పాపం శమయే పేదశేషం
యత్తత్కృతం జన్మపరంపరాసు 
జాపేన భోగాన్ జయతే చ మృత్యుమ్ 
జపేనసిద్ధిం లభతే చముక్తిమ్ || 

ఇన్ని ప్రయోజనాలున్న జపాన్ని కనీసం రోజుకో ఒక పదినిమిషాలైనా చేస్తే , యెంత బాగుంటుందో కదా ! కానీ ఇక్కడ మరో ముఖ్యమైన విషయం కూడా గుర్తుంచుకోవాలి . చేతిలో జపమాల తిప్పుతూ , పెదవులు కదిపి దాన్ని జపం అంటే ప్రయోజనం లేదు .  చిట్టా వృత్తులన్నీ కూడా ఆ నామం మీద కేంద్రీకృతమైతేనే , అది ఫలితాన్నిస్తుంది. నామం భగవంతుడిది , భక్తి ప్రసాదానిది అన్నట్టు , మనిషొకచోట , మనసు మరోచోట పరిభ్రమించకూడదు . ఆ పదినిమిషాలయినా, చిత్తం స్వామికి దాసోహమవ్వాలి . నామాన్ని నాలికతో పాటు మనసూ స్మరించాలి . ఆత్మ ఆ పరమాత్మ కోసం తపించాలి . జపంతో చేసే ఇలాంటి తపం తప్పక ఫలితాన్నిస్తుంది .

శుభం .

Quote of the day

God can be realized through all paths. All religions are true. The important thing is to reach the roof. You can reach it by stone stairs or by wooden stairs or by bamboo steps or by a rope. You can also climb up by a bamboo pole.…

__________Ramakrishna