Online Puja Services

ఆసనాలు వేయడమే యోగమా ?

18.117.111.245

ఆసనాలు వేయడమే యోగమా ?
-సేకరణ: లక్ష్మి రమణ 

ఆసనాలు వేయడమే యోగం అనే ప్రచారం వుంది. హట యోగంలో ఆసనాలకు ప్రాముఖ్యత ఎక్కువ. వాటికి తోడు ప్రాణాయామం చేర్చి ముద్రలు, బంధాలు కలిసి ఆ మొత్తాన్ని యోగంగా చెలామణి చేస్తున్నారు. పెద్ద పెద్ద ఆశ్రమాలలోను అదే తంతు. అసలైన ధ్యానం, తపస్సు కొద్ది మంది మాత్రమే చేస్తుంటారు. అష్టాంగ యోగం అని కొన్ని సూత్రాలు పట్టుకుంటారు. చివరకు ఫలితం వున్నా లేకపోయినా వాటికి అలవాటుపడి, అదే యోగం అనే అభిప్రాయానికి వస్తారు.

ధ్యానమే యోగం.

ధ్యానం ఒక్కటే యోగం.

తపస్సు ధ్యానానికి అవతలి తీరం. ధ్యానం చేస్తున్నప్పుడు కుండలినీ చైతన్యం కలుగుతుంది. అలా కలిగినప్పుడు శరీరంలో అనేక స్పందనలు, చలనాలు ఏర్పడతాయి. అప్రయత్నంగా ముద్రలు, స్పందనలు కలుగుతాయి. అవి సహజంగా, అసంకల్పితంగా ఏర్పడితే కుండలినీ చైతన్యం కలిగినట్లు. అలా కుండలినీ చైతన్యం కలగటం యోగక్రియ. అందరికీ అలా ఏర్పడదు.

కుండలినీ చైతన్యం పొందేటట్లు ధ్యానం చేయడం ఎలా?

ధ్యానం చేయనిదే కుండలినీ మేల్కొనదు. కుండలినీ మేల్కుంటే తప్ప యోగక్రియ ప్రారంభం కాదు. ఆసనాలు, ముద్రలు, స్పందనలు లాంటివి ఏవీ రావు. ఇక్కడ మనం శాస్త్రీయంగా పరిశీలన జరపడానికి వీలుంది.

ప్రతి మనిషికి మనస్సును బట్టి ప్రవర్తన మారుతుంది. మనః స్థితిని బట్టి ముద్రలు, భంగిమలు మారుతుంటాయి. ప్రతి క్షణం దీన్ని మనం గమనించవచ్చు. నిద్రపోయేటప్పుడు పడుకున్న తీరును బట్టి మనస్సును తెలుసుకోవచ్చు. అంటే ఏమిటి?

మన శరీరంలో ముద్రలు ఏర్పడడానికి మనఃస్థితి కారణం. ముందు మనస్సు, తర్వాత శరీరం. పతంజలి కూడా మనస్సును అదుపు చేయడమే యోగం అన్నాడు. మనస్సు నిశ్చలమైతే శరీరం నిశ్చలమవుతుంది. అంటే పైన కనిపించే ముద్రలు, ఆసనాలు, స్పందనలు, చలనాలు ఏవైనా మనస్సుకు ప్రతిబింబాలు, ప్రతిక్రియలు. కుండలినీ క్రియలకు ఇవి ప్రతిక్రియలు. కుండలినీ చైతన్యం కలగకపోతే ఇవేవి సహజంగా ఏర్పడే అవకాశం లేదు. ఆ తర్వాత మనస్సు నిశ్చలం కావడం, కుండలినీ శక్తి పైకి ప్రసరించడం సున్నితంగా జేరిగే పని. అంటే ఏమిటి? ధ్యాన క్రియలో మనం ముందుగా కుండలినిని జాగృత పరచాలి. దానికి చైతన్యం కలిగించాలి. ఆ పైన సహజంగా ముద్రలు, ఆసనాలు ఏర్పడతాయి. ప్రాణాయామ క్రియ కూడా అందులో ఒక భాగమే. వెన్నెముక్క ముందుకు, వెనక్కు వాగడం వల్ల కుండలినీ శక్తి పైకి ప్రవాహం పైకి పోతున్నట్లు. ఒక రబ్బరు గొట్టంలో  లో నీరు వేగంగా పోతున్నప్పుడు , ఆ గొట్టం అటు ఇటు ఊగుతుంది. గుండ్రంగా తిరుగుతుంది. ఒక్కొక్కసారి నేలకు తాకుతుంది. ఎన్నడూ తనకు అలవాటు లేని ముద్రలు, ఆసనాలు సాధకుడు అప్రయత్నంగా వేయడమూ జరుగుతుంది. మనం నిద్రపోయేటప్పుడు మన ప్రయత్నం లేకుండానే ఎన్నో ముద్రలు వేస్తాం గమనిచండి. అది యోగా క్రియకు చిహ్నం.

శక్తి మేల్కున్నప్పుడు ఏర్పడే చలనాలు, స్పందనలు, ఆసనాలు, ముద్రలు, చివరకు శ్వాస క్రియ అన్నీ యోగాభివ్రుద్ధికి నిదర్శనాలు. అవి అప్రయత్నంగా ధ్యాన స్థితిలో కలగాలి తప్ప, వాటిని కస్టపడి నేర్చుకుని, గడియారం దగ్గర పెట్టుకుని రెండేసి నిమిషాలు సాధన చేసి, పదేసి ప్రాణాయామ క్రియల్ని చేసి ‘యోగం’ అంటే కుదరదు. అది యోగం కాదు.

యోగం చేస్తున్నవారిలో కొందరికి పారవశ్యంలో అలాంటి స్పందనలు, చలనాలు, ముద్రలు వచ్చినప్పుడు వారి ఆరోగ్యం చక్కబడడం, ఉత్సాహం పొందడం జరుగుతుంది. యోగా క్రియ శరీరంలోని లోపాలను చక్కదిద్దుతుంది. మనస్సును ప్రశాంత పరుస్తుంది సహజంగానే.

అలా సహజ యోగక్రియలు పొందలేని వారు పొందిన వారిని చూచి అనుకరిస్తూ, అలా తామూ ఆసనాలు, ముద్రలు పట్టి యోగం చేసామని త్రుప్తి పడుతుంటారు. సహజంగా చెట్టు పెరిగి, పుష్పించి కాయలు కాసినప్పుడు వున్న అందం ఏవో పూలు కాయలు తెచ్చి ఒక చెట్టును తయారు చేస్తే వస్తుందా? అది కృత్రిమం. అది అసహజం. యోగ ముద్రలు సహజంగా ఏర్పడినప్పుడు మంచి ఫలితం ఉంటుంది.

మన శరీరానికి అవసరంలేని ఆసనాలు ఆచరించే ప్రయత్నం చేయడం వల్ల ఉన్న ఆరోగ్యం చెడిపోయే అవకాశం వుంది. కనుక ఆసనాలు వల్ల ఆరోగ్యం బాగుపడనూ వచ్చు... కొంతవరకు చేడిపోనూ వచ్చు. సాధకునికి అవసరం లేని క్రియల వల్ల నష్టమే గాని లాభం ఉండదు. కానట్టి , అనుభవజ్ఞుడైన గురువు తోడుంటే, ఈ ప్రక్రియ సులువుగా, దుషఫలితాలు పొందకుండా చేయగలిగే వీలుంటుంది . 
 
సాధకుడు ధ్యానస్థితిలో తన్మయావస్తలో పొందిన ముద్రలు, ఆసనాలు, శ్వాస క్రియలు ఏవైనా గొప్ప అనుభూతి నిస్తాయి. వేల సంవత్సరాలుగా జనం ఆసనాలు గట్రా వేస్తూనే ఉన్నారు. ప్రాతః సమయాన ప్రాణాయామం చేస్తూనే ఉన్నారు. యోగం మాత్రం చేయడం లేదు. అవి మాత్రమే యోగం కాదు. వాటి ద్వారా యోగక్రియ పొందడం సాధ్యం కాదు. ధ్యానం ద్వారా యోగం పొంధవలసిందే. లోపల ఏ మాత్రం స్పందన కలిగినా యోగ క్రియ ఆరంభమైనట్లు. స్పందన కారణంగా ఏర్పడే యోగక్రియల్ని నిరోధించకూడదు.

యోగం ఏ ఆసనంలో వేయాలి? కూర్చిని పద్మాసనం వేసి చేయాలా! సుఖాసనం సరిపోతుందా! శవాసనం మంచిదేనా? ఇలా అనేక అనుమానాలు ఆరంభంలో. 

పద్మాసనంలో, యోగశనంలో కూర్చున్నత మాత్రాన యోగా స్థితి కలగదు. శరీరంలో ఎలాంటి వత్తిడి లేకుండా free గా కూర్చోవాలి. మనస్సును స్థిమిత పరచడం ముఖ్యం.

కుండలినీ స్పందన కలిగిన మరుక్షణంలో వెన్ను నిటారుగా నిలుస్తుంది. వంగి కూర్చున్న వ్యక్తి కూడా తిన్నగా కూర్చుంటాడు. శరీరం ఒక చక్కని ముద్రలోకి వెడుతుంది. మానసికంగా సిద్దమైనప్పుడు స్పందన కలుగుతుంది. స్పందన వెంట చైతన్యం ఏర్పడుతుంది. చైతన్యంతో యోగక్రియ ప్రారంభమవుతుంది. యోగక్రియతో ఈ ఆసనాలు, ముద్రలు ఏర్పడతాయి. మరికొంత సేపటికి శ్వాసక్రియలో మార్పు వస్తుంది. ఈ మొత్తం పనులన్నీ కుండలినీ శక్తి పైకి పోతూ తన ఇష్టం వచ్చినట్లు శరీరానికి అవసరమైన రీతిని చేయిస్తుంది.

పడుకుని యోగం చేస్తే నష్టం లేదు. అయితే ఆ యోగం నిద్రలోకి జారిపోకూడదు. నిద్ర యోగం క్రిందికి రాదు.ఎంతసేపు ధ్యానంలో వున్నా ఎరుక వుండాలి. ఎరుక వుంటే చైతన్యం కలుగుతుంది. స్పందన కలుగుతుంది. ఎరుక పోయిన క్షణంలో ‘గురుక’ పెడతారు., నిద్రపోతారు. ఆ నిద్ర రాకుండా వుండడానికి కూర్చుని యోగం చేయడం మంచిది. నిటారుగా కూర్చుని చేసినంతకాలం మగత రాదు, మత్తు కలగదు. అనుక్షణం చైతన్యం కలుగుతూ ఉంటుంది. నిటారుగా, వెన్ను బాగా నిలిపి ధ్యానం చేసినప్పుడు శరీరంలోకి కుండలినీ శక్తి నిరాటంకంగా ప్రసరించి తొందరగా స్పందన, చలనాలు, క్రియలు ఏర్పడడానికి అవకాశం వుంది. కూర్చుని యోగం చేసినప్పుడు కలిగినాన్ని ముద్రలు, ఆసనాలు, పడుకుని శవాసనంలో చేసినా కలగవు. కూర్చుని చేసినప్పుడు సగం శరీరమే కదులుతుంది.

నిలబడి చేయడం మంచిదే కాని, అన్ని ఆసన క్రియలకు నిలబడి చేయడం కుదరదు.

సిద్దాసనం, పద్మాసనం, సుఖాసనం, వీరాసనం కూడా సహజంగా ఏర్పడతాయి. మనం కస్టపడి వేయనవసరం లేదు. ఏదైనా మనకు సుఖంగా ఉండే పద్ధతి మంచిది.

కుండలినీ శక్తి ప్రసారం నిరోధించబడకూడదు. కాళ్ళు తిమ్మిరవడం లాంటివి జరుగుతుంది. అలాంటప్పుడు కూర్చున్న స్థితిని మార్చుకోవచ్చు. ‘ స్థిరం , సుఖం ఆసనం ‘ అని పతంజలి చెప్పిన మాటని ఇక్కడ మనం గుర్తు చేసుకోవాలి . 

పాతపద్ధతుల వల్ల సాధ్యం కాని పని మన యోగంలో ఇట్టే సులభ సాధ్యమవుతుంది. యోగం ఒక్క జన్మలోనే సిద్దించాలి. ఒక యోగా పద్ధతి మనకు అనుకూలంగా లేకపోతే వదిలివేయవచ్చు. కానీ స్పందన కలిగించాలి – అదీ యోగం అంటే.

Quote of the day

God can be realized through all paths. All religions are true. The important thing is to reach the roof. You can reach it by stone stairs or by wooden stairs or by bamboo steps or by a rope. You can also climb up by a bamboo pole.…

__________Ramakrishna