Online Puja Services

భూమితల్లికి ఉర్వీ అనే పేరెలావచ్చింది ?

18.225.255.134

భూమితల్లికి ఉర్వీ అనే పేరెలావచ్చింది ?
- లక్ష్మి రమణ 

భూమికి ఉర్వి అని పేరు. ఊరువులు అంటే తొడలని అర్థం . భూమాతకి ఈ పేరు రావడం వెనుక కశ్యపమహర్షి ఉన్నారు. ఋచీక మహాశి భూమిక ఉంది .  మహా వీరుడైన కార్తవీర్యార్జనుని గర్వభంగముంది. మహావీరుడైన మహర్షి  పరశురాముని వృత్తాంతం ఉంది . భారతంలోని అద్భుతమైన ఆ  కథని ఇక్కడ చెప్పుకుందాం . 

పరశురాముడి చరిత్ర చాలా చిత్రమైంది.  పరుశురాముడి తాత  ఋచీకుడు అనే ఋషి.  ఆయన గాదిరాజు దగ్గరికి వెళ్లి, ఆయన కూతురైన సత్యవతిని తనకిచ్చి పెళ్లి చేయమని కోరాడు.  తాపసికి పిల్లనివ్వడం ఆ రాజుకి ఇష్టం లేదు .  అందుకని  నల్లటి చెవులు ఉన్న తెల్లటి గుర్రాలని ఒక వెయ్యి తీసుకొచ్చి  కానుకగా ఇస్తే, తన కూతుర్నిచ్చి పెళ్లి చేస్తానని షరతు పెట్టాడు. ఋచీకుడు మహా తపస్సంపన్నుడు.  ఇంద్రుని ప్రసన్నం చేసుకుని అశ్వ సహస్రాన్ని సాధించి తెచ్చి సత్యవతిని పెళ్లి చేసుకున్నాడు.  

తరువాత ఒకసారి గాదిరాజు దంపతులు పుత్ర సంతానం కోసం  ఋచీకుడ్ని అర్థించారు.  అప్పుడు ఆయన రెండు రకాల హోమ ద్రవ్యాలు తయారు చేశాడు. వాటిని భార్యకి చూపిస్తూ , ‘ఇదిగో చూడు ఈ హవ్యం తింటే క్షత్రియ నాశకుడు అజేయుడు అయిన క్షత్రియ కుమారుడు పుడతాడు.  ఇది మీ అమ్మకి ఇవ్వు. ఇలా చూడు, ఈ హవ్యం నీకోసం ప్రత్యేకంగా తయారు చేశాను.  ఇది తింటే తపస్సంపన్నమై, శమదమాలు కలిగిన  ఉత్తమ ద్విజుడు పుడతాడు.  అని భార్యతో చెప్పి, ఋచీకుడు స్నానానికి వెళ్ళాడు.  అతను వెళ్ళిన కాసేపటికి అత్తమామలు రానే వచ్చారు. సత్యవతి,  తల్లికి భర్త చేసిన హవ్యాలు చూపించింది.  వాటి ప్రభావాన్ని వర్ణించింది.  ఆమె సంతోషించి, శుచిగా  స్నానం చేసి వచ్చి, పొరపాటున తాను సేవించవలసిన హవ్యం కూతురికిచ్చి, కూతురి వంతు హవ్యం తాను తిన్నది.  ఋచీకుడు ఆశ్రమానికి వచ్చి దివ్య దృష్టితో జరిగిందంతా తెలుసుకున్నాడు.  ‘నీ పొరపాటు వల్ల నీ తల్లికి బ్రహ్మతేజం గల కుమారుడు, నీకు పరమ క్రూరడైన కొడుకు పుడతారని’ భార్యతో చెప్పాడు.  సత్యవతి బాధపడింది.  ఋచీకుడు జాలిపడి, ఆ కౌర్యం తన మనవడికి వచ్చేటట్టు అనుగ్రహించాడు.  

ఋచీకుని  హోమద్రవ్య ఫలితంగా, గాదిరాజుకు జన్మించిన విశ్వామిత్రుడు బ్రహ్మర్షి అయ్యాడు. ఋచీకుని కొడుకు జమదగ్ని మహర్షి.  అతనికి పరశురాముడు పుట్టి, క్రూరత్వానికి మారుపేరై సంహారకాండ కావించాడు. 

ఒకప్పుడు పరుశురాముడి తల్లి రేణుకాదేవి చిత్రరధుడనే గంధర్వుడ్ని చూసి లిప్త కాలం మొహపడింది. అందుకు జమదగ్ని ఆగ్రహించి, భార్యను చంపవలసిందిగా అక్కడ ఉన్న కుమారులని ఆదేశించారు.  వాళ్ళు ఆ పని చేయలేమన్నారు.  అంతలో పరుశురాముడు అక్కడికి వచ్చాడు. కోపంతో ఊగిపోతున్న తండ్రిని సంగతేమిటని అడిగాడు.  తండ్రి ఆజ్ఞ ప్రకారం తల్లిని, సోదరులని తన పరుశువుతో నరికి చంపాడు.  ఆ తరువాత శాంతించి, వరాన్ని కోరుకోమన్న తండ్రిని,  వారందరినీ తిరిగి బ్రతికించమని ప్రార్ధించాడు . ఆయన అనుగ్రహంతో మళ్ళీ వారందరినీ బ్రతికించుకున్నాడు. 

మాహిష్మతీ రాజ్యానికి రాజు  హైహైయ వంశీయుడైన   కార్తవీర్యార్జునుడు. మహా బలవంతుడు. అతనికి దత్తాత్రేయుని అనుగ్రహంతో పొందిన  1000 చేతులు ఉన్నాయి.  అగ్నిదేవుడు ఆకలంటే,  గిరులు, అరణ్యాలు,  కొండల కింది గ్రామాలు ఆహారంగా ఇచ్చాడు.  అగ్నిదేవుడు యథేచ్ఛగా అవన్నీ దహిస్తూ ఒకనాడు వశిష్టుని ఆశ్రమం ఉన్న అరణ్యాన్ని దహించసాగాడు.  ఆ అగ్నిని రక్షిస్తూ కాపలా కాస్తున్నాడు కార్తవీర్యార్జునుడు.  వశిష్ఠుడు ‘ఇతర వనాలతో సమానంగా భావించి నా తపోవనాన్ని దహింప చేశావు.  నీ సహస్ర బాహువులు పరశురాముడు చేత నరకబడుకాక’ అని శపించాడు.  

ఒకనాడు పరుశురాముడు లేని సమయంలో కార్తవీర్యార్జునుడు జమదగ్ని ఆశ్రమానికి వచ్చాడు.  తన వద్ద ఉన్న కామధేనువు దయతో రాచపరివారానికి షడ్రసోపేతంగా విందు చేశాడు మహర్షి.  రాజు ఆ గోవును తనకిమ్మన్నాడు.  మహర్షి కాదనేసరికి బల ప్రయోగంతో కార్తవీర్యార్జునుడు ధేనువును మాహిష్మతి పురానికి తీసుకు వెళ్ళాడు. పరశురాముడికి ఈ సంగతి తెలిసింది. కోపోద్రిక్తుడై  అతని వెయ్యి చేతులు ఖండించి వేశాడు.  అందుకు ఆగ్రహోదగ్రులైన కార్తవీర్యుడి కొడుకులు 10,000 మంది పరుశురాముడు లేనప్పుడు దండెత్తి వచ్చి జమదగ్నిని చంపి పగ తీర్చుకున్నారు.  

పరశురాముడు రాగానే జరిగిందంతా చెప్పి బోరున ఏడ్చింది తల్లి రేణుకాదేవి.  పరశురాముడు మాట్లాడలేదు గొడ్డలి చేత పట్టుకున్నాడు ఆమడ దూరానికో అడుగు వేస్తూ కదిలి వెళ్లాడు. మాహిష్మతి పురం ఒక్కటే కాకుండా మారుమూల ఉన్న పల్లెలతో సహా వెతికి, గర్భాలలో ఉన్న పిండాలతో సహా క్షత్రియుడనేవాడు లేకుండా అందరినీ నాశనం చేశాడు.  తరువాత అశ్వమేధ యాగం చేసి భూమినంతటిని కశ్యప మహర్షికి దక్షిణగా ఇచ్చాడు.  అప్పటినుంచి భూమికి కాశ్యపి అనే పేరు వచ్చింది. 

‘భూమిని నాకిచ్చేసావు. నీకింక దీనిమీద హక్కు లేదు. నువ్వు  దక్షిణ సముద్ర తీరానికి వెళ్ళు’ మని ఆదేశించాడు కశ్యపుడు.   పొరపాటున తప్పించుకున్న రాజవంశపు మొలకలు ఏమైనా మిగిలితే వాటిని రక్షించవచ్చు అన్న ఉద్దేశంతో ఆయనలా ఆదేశించాడు. సరేనన్నాడు పరుశురాముడు.  అతనికి భయపడి దక్షిణ సముద్రం చీలి చాటంత ప్రదేశాన్ని ఆయనకు సమర్పించింది.  

క్షత్రియులు లేకపోవడం వల్ల మిగిలిన జాతులు అవధులు దాటి ప్రవర్తించసాగాయి. అరాచకత్వ దోషంతో ధర్మ కాంతి క్షీణించింది.  అధర్మాన్ని సహించలేక భూమి పాతాళానికి కృంగిపోతుంటే, కశ్యపుడు తన తొడ ఆధారంగా చేసి భూమిని నిలబెట్టాడు.  ఆయన ఊరులతో ఎత్తబడినందున భూమికి  ఉర్వి అని పేరొచ్చింది .  

‘మహాత్మా! పరుశురాముని బారి నుంచి కొందరు రాజకుమారులని రక్షించి నాలో దాచుకున్నాను. వాళ్ళందరూ ఉత్తమ జాతి క్షత్రియులే! వాళ్ళను పిలిపించి, నాకు అధిపతులను చేస్తే, నేను సుఖంగా ఉంటాను’ అంది భూదేవి.  కశ్యపుడు  వాళ్ళందరినీ పిలిపించి ఆమె చెప్పినట్లే అభిషేక్తుల్ని చేశాడు . అప్పుడు భారంతగ్గి సంతోషించింది భూదేవి .  అధీకథ . 

#urvi #prudhvi #kashyapi #parasurama

Tags: Urvi, Prudhvi, Kashyapi, Parasurama, bhumi, bhoomi, earth, 

Quote of the day

You can't cross the sea merely by standing and staring at the water.…

__________Rabindranath Tagore