Online Puja Services

ఒక్కోసారి దేవుడు ఇంగ్లాండు నుండీ కూడా వస్తాడు

18.188.72.75
ఒక్కోసారి దేవుడు ఇంగ్లాండు నుండీ కూడా వస్తాడు ! 
 
కొన్నేళ్ళ క్రితం మన దేశంలో [ ఉత్తరభారతం] ఒక ఆయుర్వేదవైద్యుడు వుండేవారు. పేద డాక్టరు .  భగవద్గీత లో శ్రీకృష్ణుడు మనిషిని ఎలా జీవించమని చెప్పాడో కచ్చితంగా అలానే జీవిస్తూవుండేవాడు. 
 
ఒకరోజుకు తన భార్య , కూతురు , తనకు ఎంత డబ్బు అవసరం అవుతుందో అంతే సంపాదించేవాడు. [ నన్ను నమ్మి ,  అహంకారం వదలి , నాకు శరణాగతి చేసుకొన్న వారి బాగోగులు నేనే చూసుకొంటాను - అనన్యాశ్చింతయోమా  ...యోగక్షేమం వహామ్యహం - 9 వ అధ్యాయం , 22 వ శ్లోకం] ] ఉదాహరణకు రోజుకు 80 రూ. కావాలి. ఎనిమిదిమంది పేషెంట్లు వచ్చారు , 80 రూ. వచ్చింది. అంతే . తొమ్మిదవ పేషెంటు దగ్గర డబ్బు తీసుకోడు. ఉచితం. ఎప్పుడూ దైవ చింతనలో వుండేవాడు.ప్రతి ఉదయం ఆయన భార్య ఆయనకు ఒక కాగితం మీద ఇంటికి ఏమి కావాల్నో వ్రాసి ఇస్తుంది. దాన్ని తీసుకొని ఆస్పత్రికి వెళతాడు. ఆ వస్తువులకు ఎంత డబ్బు ఖర్చు అవుతుందో అంత డబ్బు  [ ఫీజు రూపంలో ] రాగానే ఇక ఫీజు తీసుకోడు. రేపు ఎలా ? అనే ఆలోచన లేదు. ఈరోజు ఇచ్చిన పరమాత్మ రేపు పిసినారి అవుతాడా ? వాసుదేవమితి సర్వం .      
 
ఒక రోజు ఆసుపత్రి [ చిన్న గది] ముందు ఒక కారు వచ్చి ఆగింది. అందులోంచి ఒక వ్యక్తి , డాక్టరు దగ్గరికొచ్చి ' నన్ను గుర్తుపట్టారా ? '' అని అడిగాడు. 
 
'' క్షమించాలి , లేదు , '' అన్నాడు డాక్టరు. 
 
అపుడు ఆయన ఇలా చెప్పాడు : '' 15 ఏళ్ళ క్రితం ఒక రాత్రి ఈ వూరిగుండా వెళుతున్న నేను , ఇక్కడ కారు ఆగిపోతే కాసేపు ఆగాను. నా డ్రైవర్ కారు రిపేరు చేస్తున్నాడు. అపుడు మీరు వచ్చి ' లోపలికి రండి ' అన్నారు. గదిలోకొచ్చి కూర్చొన్న నన్ను చూసి ' మీరు ఏదో దిగులు పడుతున్నారు , ఆరోగ్యం సరిగాలేదా ? ' అన్నారు. అపుడు మీ టేబిల్ దగ్గర సుమారుగా ఆరేళ్ళు వుండే ఒక చిన్న పాప మిమ్మల్ని ' నాన్నా , ఇక ఇంటికి వెళదాం , రండి ' అని పిలిచింది. ' కాసేపు ఆగమ్మా , కారు వెళ్ళాక మనం ఇంటికివెళదాం ,' అన్నారు. ఆ చక్కటి పాపను చూస్తూ ఇలా అన్నాను ' , నేను ఇంగ్లాండులో వుంటాను. మాకు సంతానం లేదు. మా ఇంట్లో ఆడపాప వుండాలని మాకు ఎంతో కోరిక , కానీ తీరలేదు. ఇపుడు ఈ పాపను చూస్తే , నా బాధ  గుర్తుకొచ్చింది ,'' అన్నాను. 
 
మీరు రెండు పొట్లాల ఔషధం తయారుచేసి ' మీరు , మీ భార్య దీన్ని 60 రోజుల పాటు ఒక్కో గుళిక చొప్పున  తీసుకోండి 'అన్నారు.  నేను వీటికి డబ్బు ఎంత చెల్లించాలి ?  అని అడుగుతుంటే అపుడు మరో పేషెంటు వచ్చి తన జబ్బు చెప్పి మీదగ్గర మందు తీసుకొని వెళ్ళిపోతూ , నాదగ్గరకొచ్చి ' ఈరోజు కుటుంబం గడవడానికి ఎంత అవసరమో , ఆ డబ్బు అందాక వారు ఇక డబ్బు తీసుకోరు ' అని అంటూ  వెళ్ళిపోయాడు. కారు రిపేరు అయ్యింది. నేను మీకు ధన్యవాదాలు చెప్పి వెళ్ళిపోయాను. దిల్లీ వెళ్ళి అక్కడినుండి ఇంగ్లాండు వెళ్ళాం. ఇంగ్లాండు డాక్టర్లు మాకు సంతానం ఇక కలగదు అని చెప్పిన తరువాత కూడా , మీరంటే నాకు కలిగిన అపారమైన గౌరవం ,వృత్తిపట్ల మీ అంకిత భావం , మీ వ్యక్తిత్వం చూసాక నమ్మకం కలిగి నేను , రాధిక ఔషధం తీసుకొన్నాం. ఇపుడు మాకు ఇద్దరు ఆడపిల్లలు. పుత్తడిబొమ్మల్లావుంటారు. మీరు మాకు దేవుడితో సమానం. 
 
అప్పటినుండీ మీ ఋణం ఎలా తీర్చుకోవాలా అని ఇద్దరం ఆలోచిస్తున్నాం. నాకు ఇక్కడ భారత్ లో ఒక అక్కగారు వున్నారు . దురదృష్టం కొద్దీ ఆమె భర్త రోడ్డుప్రమాదం లో మరణించారు. వాళ్ళకో కూతురు. ఆమె పెళ్ళి బాధ్యత నేనే తీసుకొన్నాను. అపుడు నాకు 15 ఏళ్ళక్రితం ఈగదిలో నేను చూసిన మీ అమ్మాయి గుర్తుకొచ్చింది. ఆమె కూడా ఇపుడు పెళ్ళి వయసుకు వచ్చివుంటుంది. ఆమె పెళ్ళికి అయ్యే ఖర్చు మొత్తం మేమే భరిస్తాం. మాకు ఆ అవకాశం ఇవ్వండి. ఈనెల 24 న మా అక్క కూతురి  పెళ్ళి . మీ అమ్మాయి పెళ్ళికి ఎంత ఖర్చు అవుతుందో నాకు తెలిసిన పద్దతిలో లెక్కవేసి ఈడబ్బు తెచ్చాను.మీరు డబ్బు కోసం ఎవరిదగ్గరా అప్పు చేయకండి. నేనున్నాను.ఇది మీరు తీసుకోవాలి '' అంటూ ఒక కవరులో పెద్ద మొత్తం డబ్బును టేబిల్ మీద పెట్టాడు.  
 
అపుడు డాక్టరు తన జేబులోంచి ఈ రోజు కుటుంబానికి ఏమి కావాలో తన భార్య ఆరోజు ఉదయం వ్రాసి ఇచ్చిన అవసరాల లిస్టు ను అతనికి చూపించాడు. అందులో చివరన ఇలా వ్రాసివుంది : ' ఈనెల 22 న మన అమ్మాయి పెళ్ళి. మన దగ్గర వంద రూపాయలు కూడా లేవు. ఆలోచించండి.' 
 
అనన్యాశ్చింతయోమా....యోగక్షేమం వహామ్యహం
(ఈ కథ చదివిన తర్వాత ఒకరిద్దరికైనా కన్నీరు వస్తుంది కదా.) 
 
- రామ్‌దయాళ్ రెబ్బ, 9441529779
- సేకరణ 

Quote of the day

There is a magnet in your heart that will attract true friends. That magnet is unselfishness, thinking of others first; when you learn to live for others, they will live for you.…

__________Paramahansa Yogananda