Online Puja Services

చెరపకురా చెడేవు

3.145.178.157

"చెరపకురా చెడేవు "

పూర్వం ఒక రాజు ఉండేవాడు...పరమక్రూరంగా , దయ లేకుండా అందరినీ బాధపెట్టేవాడు..
అలాంటి రాజు ఒకరోజు అందరినీ ఆశ్చర్యపరుస్తూ తన మంత్రులు అధికారులు ప్రజలు అందరినీ సమావేశపరిచి ఒక ప్రమాణం చేసాడు "నేను ఈ రోజు నుంచి ఎవ్వరినీ బాధపెట్టను , అందరితో మంచిగా ఉంటాను , దయగా ప్రవర్తిస్తాను" అని...మాట ఇచ్చినట్టే , మాటకు కట్టుబడి అతను మంచిగానే ఉన్నాడు..కొంతకాలానికి అందరూ అతన్ని దయగలమారాజు అనుకుంటున్నారు...

మంత్రుల్లో ఒకరు ఈ మార్పు ఎలా సాధ్యం , తెలుసుకోకపోతే ఎలా అని చాలా కుతూహలంగా రాజు దగ్గరికి వెళ్ళి మీలో ఎందుకు ఉన్నట్టుండి అంత మార్పు వచ్చింది , కారణం చెప్తారా అని అడిగాడు...

రాజు సమాధానం చెప్తున్నాడు..
నేను ఒకరోజు గుర్రం మీద అడవిలో తిరుగుతుంటే ఒక వేటకుక్క నక్కని వెంటాడుతోంది...నక్క కష్టపడి తన గుహలోకి వెళ్ళేలోపే వేటకుక్క నక్క కాలు కరిచింది...నక్క కుంటిది అయిపోయింది...

ఆ రోజు కాసేపటికి పక్కనే ఉన్న ఊరికి వెళ్ళాను..అక్కడ అదే వేటకుక్క ఉంది...
ఒక మనిషి ఒక పెద్ద రాయి తీసుకుని వేటకుక్క మీదకి విసిరాడు ...ఆ రాయి కుక్కకాలుకి తగిలి వేటకుక్క కాలు విరిగింది....

అతను కొంచెం దూరం వెళ్ళాడో లేదో ఒక గుర్రం అతన్ని బలంగా తన్నింది...అతను కిందపడి కాలు విరగ్గొట్టుకున్నాడు...
ఆ గుర్రం పరిగెత్తుకుంటూ వెళ్ళబోయింది...ఒక గుంటలో పడి దాని కాలూ విరిగిపోయింది...

వరుసగా జరిగిన ఈ సంఘటనలకు నాకు ఒక ఆలోచన తోచింది... 
నక్క కాలు కుక్క కరిస్తే , 
కుక్క కాలు మనిషి రాయి వల్ల విరిగింది , 
మనిషి కాలు గుర్రం తన్నినందువల్ల విరిగితే..
గుర్రం ఒక గుంటలో పడి కాలు పోగొట్టుకుంది...

ఒకరికి చెడు చేస్తే అదే చెడు వేరే ఏ కారణంతో అయినా మనకీ జరుగుతుంది అని బాగా తెలిసొచ్చింది...

అప్పుడు నా వల్ల ఎందరు బాధపడ్డారో..వారందరి వల్ల నేనూ బాధపడాల్సి వస్తే ఆ పరిస్థితి ఊహించుకుంటేనే వంట్లో వణుకు పుట్టింది...ఆ క్షణంలోనే నిజాయితీగా నిర్ణయించుకున్నాను...ఎవ్వరినీ ఇంక కష్టపెట్టకూడదు అని అందరితో దయగా ఉండాలి అనుకున్నాను అని రాజు వివరించాడు...

ఇదంతా విన్న మంత్రి ఈ రాజుకి చాదస్తం ఎక్కువయినట్టుంది...రాజుని ఈ పరిస్థితుల్లో సింహాసనం నుంచి తప్పించి..కిరీటం నేను దక్కించుకోవచ్చు అని పన్నాగం పన్నుకుంటూ ఆలోచనల్లో పడి ముందున్న మెట్లు చూసుకోలేదు..మెట్ల మీద జారి పడి మంత్రి మెడ విరిగి లేవలేని స్థితికి చేరుకున్నాడు...రాజు పదవి కాదు కదా మనిషిగా కూడా ఒకరిమీద ఆధారపడేలా అయ్యాడు..ఒకరికి చెడు చేస్తే ఏదో ఒకసారి మనకీ అదే చెడు జరుగుతుంది అన్న మంచి విషయం ఈ కధ సారాంశం..

సర్వే జనా సుఖినోభవంతు

Quote of the day

Just as a candle cannot burn without fire, men cannot live without a spiritual life.…

__________Gautam Buddha