Online Puja Services

రామానుజాచార్యులు గారి మహిమ

18.221.187.121

ఆత్మబలం

యాదవ ప్రకాశాచార్యులు జ్ఞానోపదేశం చేయడంలో సమర్థులుగా పేరుగాంచారు. విశిష్టాద్వైత సంప్రదాయానికి మూలపురుషుడైన శ్రీ రామానుజాచార్యులు ఆయన వద్ద చదువుకొనే రోజుల్లో ఒక సంఘటన జరిగింది.

శిష్యుడైన రామానుజాచార్యులవారి తేజస్సును, బుద్ధికుశలతను చూసి గురువు యాదవ ప్రకాశాచార్యులు లోలోపల అసూయ చెందేవారు.

ఆ రోజుల్లో కాంచీపురాధీశ్వరుడి కుమార్తెను ఒక పిశాచం ఆవహించింది. అందుచేత ఆప్తులందరికీ మనస్తాపం కలిగింది. దేశదేశాల నుంచి మాంత్రికులు రప్పించబడ్డారు. రాజకుమార్తెను ఆవహించిన పిశాచాన్ని వదలించడానికి వారంతా శాయశక్తులా ప్రయత్నించారు కాని ఫలితం శూన్యమే అయింది. 

సదాచారసంపన్నులు, జ్ఞానమూర్తులు, మంత్రసిద్ధులు అయిన యాదవ ప్రకాశాచార్యులు తపోమహిమాన్వితులు కనుక వారిని కూడ రప్పించమని రాజుకు కొందరు సూచించారు.

తక్షణమే బయలుదేరి రమ్మని యాదవ ప్రకాశాచార్యులవారికి రాజునుంచి ఆహ్వానం వచ్చింది. వెంటనే ఆయన తన శిష్యులతో బయలుదేరాడు. రాజాస్థానం చేరుకొని రాజకుమార్తెను చూసి మంత్రపఠనం ప్రారంభించారు. 

అప్పటివరకు ఒక మూల కూర్చుని శూన్యంలోనికి చూస్తున్న రాజకుమారి భయంకరరూపం దాల్చి గంభీరంగా ఇలా అన్నది: “ఓయి మాంత్రికా ! ఆజన్మాంతం మంత్రాలు వల్లిస్తున్నప్పటికీ నన్ను నువ్వేమీ చేయలేవు. నన్ను తరిమివేయడం నీ తరంకాదు. నేను తలచుకొంటే ఇక్కణ్ణుంచి నిన్ను క్షణంలో తరిమివేయగలను. నేను సామాన్య పిశాచాన్ని కాను, బ్రహ్మరాక్షసిని.”

ఆ మాటలకు యాదవ ప్రకాశాచార్యులు భయపడి అక్కడనుంచి దూరంగా వెళ్ళి కూర్చున్నాడు.

అప్పుడు రామానుజాచార్యులు రాజకుమార్తె ముందుకు వెళ్ళి ఆ పిశాచాన్ని ఉద్దేశించి, "అయ్యా! దయనీయమైన ఈ దుర్దశ మీకెందుకు ప్రాప్తించింది? కారణం ఏమిటో చెప్పగలరా” అంటూ సౌమ్యంగా అడిగాడు.

అందుకు రాజకుమార్తెను ఆవహించిన బ్రహ్మరాక్షసి దుఃఖపూరిత స్వరంతో, ప్రార్థనాపూర్వకంగా ఇలా అన్నది: “నాయనా! నేను వేద వేదాంగాలలో ఆరితేరిన పండితుణ్ణి. నా విద్యను ఇతరులకు ఉపయోగ పడకుండా దాచేసుకొన్నాను; ఎవ్వరికీ విద్యాదానం చేయలేదు. దాని ఫలితమే నాకీ దుర్దశ. నువ్వు బాలుడవైనా తేజోవంతుడవు; నన్ను కనుగొనగలిగావు. నువ్వు పుణ్యమూర్తివి. పావనమైన నీ చేతిని నా తలమీద ఉంచితే ఈ దుర్గశనుంచి నాకు విముక్తి లభిస్తుంది.”

భగవదంశగల రామానుజాచార్యులు ఆ రాక్షసి కోరినట్లుగా రాజకుమార్తె తలమీద తన చేతిని ఉంచి ధ్యానించడం ప్రారంభించిన మరుక్షణమే ఆ బ్రహ్మరాక్షసికి విముక్తి కలిగి, రాజకుమార్తెను వదలి వెళ్ళి పోయింది.

అక్కడ చేరిన వారందరూ రామానుజాచార్యుల మహిమను, ఆత్మా బలాన్ని వేనోళ్ళ ప్రశంసించారు. ఈ వార్త అన్ని రాజ్యాలలోను ప్రచారమై నాటినుంచి రామానుజాచార్యులను దైవస్వరూపంగా భావించి పూజించసాగారు.

Quote of the day

Even if a snake is not poisonous, it should pretend to be venomous…

__________Chanakya