Online Puja Services

వట సావిత్రి వ్రతం - జ్యేష్ఠ మాస ప్రత్యేకం.

18.224.38.3

స్త్రీలకి తరగని సౌభాగ్యాన్నిచ్చే  వట సావిత్రి వ్రతం - జ్యేష్ఠ మాస ప్రత్యేకం.
- లక్ష్మి రమణ  

స్త్రీలు ఐదవతనాన్ని గొప్పవరంగా భావిస్తారు. ఐదవతనాన్ని కాపాడుకోవడానికి అనేక వ్రతాలు, పూజలు చేస్తారు. మంగళ గౌరీ వ్రతం, వరలక్ష్మీ వ్రతం, వటసావిత్రి వ్రతం వంటివి ఇందులో విశేషమైనవి. వీటిలో వటసావిత్రి వ్రతానికో ప్రత్యేకత ఉంది. ఈ వ్రతాన్ని వటవృక్షాన్ని పూజచేయడం ద్వారా జరుపుకుంటారు. వటవృక్షం అంటే మర్రిచెట్టు. భారతీయుల జాతి వృక్షం. మర్రిచెట్టును త్రిమూర్తుల సంయుక్త స్వరూపంగా భావిస్తారు. మర్రిచెట్టు వేళ్ళు బ్రహ్మకు, కాండం విష్ణువుకు కొమ్మలు శివునికి నివాసస్థలాలు.

సకల సౌభాగ్యాలనూ ప్రసాదించడంతో పాటు వైధవ్యం నుండీ కాపాడే వ్రతం,వట సావిత్రీ వ్రతం.ఈ వ్రతాన్ని జ్యేష్ఠ శుద్ధ పూర్ణిమ నాడు కానీ,  జ్యేష్ఠ బహుళ అమావాస్య నాడు ఆచరించాలి. ఈ వ్రతం వెనుక సావిత్రి, సత్యవంతుల కథ ఉంది. ఈ వ్రతం ఆచరించే సావిత్రీ తన భర్త అయిన సత్యవంతుని మృత్యువు నుండీ కాపాడుకోగలిగింది. ఈ వ్రతాన్ని చేసే వారు ముందురోజు రాత్రి ఉపవాసం ఉండాలి. వ్రతం రోజు తెల్లవారుఝామున నిద్రలేచి తల స్నానం చేసి,దేవుడిని స్మరించుకుంటూ మర్రి చెట్టు వద్దకు వెళ్లి,మర్రి చెట్టు వద్ద అలికి ముగ్గులు వేసి, సావిత్రి ,(Savitri) సత్యవంతుల (Satyavanta) ప్రతిమలు ప్రతిష్టించాలి . వారి చిత్ర పటాలు దొరకకపోతే, పసుపు ముద్దలనే ఆ పుణ్య దంపతులుగా   ప్రతిష్టించుకోవచ్చు. ఆ తర్వాత 

మనువైధవ్యాధి సకల దోష పరిహారార్ధం.
బ్రహ్మ సావిత్రీ ప్రీత్యర్థం
సత్యవత్సావిత్రీ ప్రీత్యర్ధంచ
వట సావిత్రీ వ్రతం కరి ష్యే

అనే శ్లోకాన్ని పఠించాలి.

ఈ విధంగా మర్రిచెట్టును పూజిస్తే, త్రిమూర్తులను పూజించిన ఫలం కలుగుతుంది. పూజానంతరం నమో వైవస్వతాయ అనే మంత్రాన్ని పఠిస్తూ మర్రిచెట్టుకు 108సార్లు ప్రదక్షిణ చేయాలి. ఇలా వటవృక్షం చుట్టూ 108 సార్లు ప్రదక్షిణలు చేసేటప్పుడు ముడిప్రత్తి నుండి వడికి తీసిన దారాన్ని వృక్షం చుట్టూ చుట్టుకుంటూ వెళ్ళాలి . వటవృక్షం యొక్క దీర్ఘాయుర్దాయంతో తమ భర్తల ఆయుష్షును బంధించడమే ఇలా దారం చుట్టడంలోని అంతరార్థంగా కన్పిస్తుంది. జనన మరణాలు కాలం మీద ఆధారపడి వుంటాయి. కాబట్టి కాలాన్ని బంధించే భావనతో ఇలా దారాన్ని చుట్టడం జరుగుతోందని కూడా అనుకోవచ్చు. 

ఆ తర్వాత నైవేద్యం సమర్పించి,బ్రాహ్మణులు,ముత్తైదువలకు దక్షిణ తాంబూలాదులు సమర్పించాలి.  ప్రతి స్త్రీ, ఐదుగురు సుమంగళుల నొసట బొట్టు పెట్టి తాంబూలాన్ని మంగళ ద్రవ్యాలనీ ఇవ్వాలి. ఇలా చేస్తే భర్త దీర్ఘాయుర్దాయం పొందుతాడు. ఇలా చేస్తే స్త్రీలకు ఐదవతనంతో పాటు అష్టైశ్వర్యాలు, సుఖసంతోషాలు చేకూరుతాయని పండితులు చెబుతున్నారు. ఈ వ్రతాన్ని భారతదేశం అంతటా ఇదే రీతిగా చేసుకుంటూ ఉంటారు. అయితే  ఒక్కొక్క ప్రాంతంలో ప్రాంతీయమైన సంప్రదాయాలు, ఆచారాలు కూడా  అనుసరించి విధానంలో మార్పులూ , చేర్పులూ ఉంటాయని గమనించగలరు. 

శుభం !

Vata Savitri Vratam

#vatasavitrivratham #vatasavitrivratam

Quote of the day

Let your life lightly dance on the edges of Time like dew on the tip of a leaf.…

__________Rabindranath Tagore