Online Puja Services

ద్రౌపది లాగా బహు భర్తలు కలిగిన స్త్రీలు

18.226.222.12

ద్రౌపది లాగా బహు భర్తలు కలిగిన స్త్రీలు పురాణాలలో ఇంకా ఉన్నారా ?
- లక్ష్మి రమణ 

ద్రౌపది ద్వాపర యుగానికి చెందిన సాధ్వి. ఇక్కడ యుగ ధర్మాన్ని కూడా మనం దృష్టిలో ఉంచుకోవాలి. మన పురాణాలలో  ద్రౌపది కాకుండా ఇంకా కొందరు స్త్రీలు ఒకరికంటే ఎక్కువమంది భర్తలని కలిగి ఉన్నట్టు చెబుతున్నాయి. అవన్నీ భగవంతుని లీలావిలాసాలు . కేవలం పైకి కనిపించే కథని మాత్రమే చదివి దాని పైన కువిమర్శలు చేయకూడదు . మత్స్య పురాణంలోనూ, దేవీ భాగవతంలోనూ ఇటువంటి ఉదంతాలు మనకి కనిపిస్తున్నాయి. అటువంటి వారిలో కొందరిని గురించి ఇక్కడ చెప్పుకుందాం . 

కీర్తిమతి : 

వేదవ్యాసుని కుమారుడు, శుక మహర్షి . ఆయన భార్య పీవరి. ఈ దంపతులకి  భూరిశ్రవుడు, గౌరప్రభుడు,  కృష్ణుడు, శంభుడు, దేవ శ్రవుడు అనే ఐదుగురు కొడుకులున్నారు .  ఈ ఐదుగురు  సోదరులో కలిసి కీర్తిమతి అనే ఆవిడని వివాహం చేసుకున్నారు. ఈ వృత్తాంతం మత్స్యపురాణంలోనూ, దేవీ భాగవతంలోనూ చెప్పబడింది.  

శుకయోగి తొలిత బ్రహ్మచారిగా ఉన్నప్పటికీ గృహస్థాశ్రమమే ముక్తిదాయకమని జనక రాజర్షి అతనికి బోధించడం వల్ల పీవరిని వివాహం చేసుకున్నట్లు ఇందులో ఉంది. 

అజిత : 

వ్యాస భారతంలో ఔశీనరపతి  కుమార్తె అయిన అజిత వృత్తాంతం ఉంది . ఈమెని స్వయంవరంలో సాల్వేయుడు, సూరసేనుడు, శృతసేనుడు, బిందుసారుడు, అతిసారుడు అనే ఐదుగురు అన్నదమ్ములు వివాహం చేసుకున్నారు.  వాళ్లు నితంతుడు అనే రాజర్షి సంతానం. 

మారిష:

విష్ణు పురాణంలోనూ, మత్స్య పురాణంలోనూ ఇటువంటిదే మరో వృత్తాంతం కనిపిస్తుంది.   ప్రాచీనబర్హి  కుమారులు ప్రచేతసులు. వీళ్ళు మొత్తం  11 మంది.  వీళ్ళందరూ కలిసి మారిష అనే ఆవిడని వివాహం చేసుకున్నారు. ఈ ఏకాదశ ప్రచేతసులకీ మారిష మూలంగా కలిగిన ఒకే ఒక పుత్రుడే దక్షప్రజాపతి. 

జటిల : 

వ్యాస మహాభారతంలోని  మరొక కథలో కూడా ఇటువంటి ఉదంతం ఇంకొకటి ఉంది .  గౌతమ మహర్షి వంశస్థుడైన జటిలుడు అనే మహర్షి కూతురు జటిల. ఈవిడని ఏడుగురు ఋషులు పెళ్లాడారట . 

ఈ వృత్తాంతాలలో దేవీ దేవతలా విభూతులూ , మార్మికమైన రహస్యాలు దాగున్నాయి.  వీటి కేవలం పైకి కనిపించే కథా రూపంగా చూసి, అపార్థం చేసుకోకూడదు. ధార్మిక చింతన, ఆధ్యాత్మిక భావం లేనివారికి ఈ వేదిక కూడా సరైనది కాదు . 

శుభం .    

#droupadi #bharatam 

Quote of the day

From the solemn gloom of the temple children run out to sit in the dust, God watches them play and forgets the priest.…

__________Rabindranath Tagore