Online Puja Services

సంసార కురుక్షేత్రం నుండీ రక్షించే శ్రీహరి నామ మహిమ .

3.149.27.202

సంసార కురుక్షేత్రం నుండీ రక్షించే శ్రీహరి నామ మహిమ . 
- లక్ష్మి రమణ 

నారదుడు అంబరీషుడితో (Ambarisha) ఈ విధంగా చెబుతున్నారు.  శృతి దేవుడు (shruthi devudu) శృత కీర్తితో (srutha keerthi)తర్వాతి వృత్తాంతాన్ని విశాఖ పురాణంలోని 18వ అధ్యాయంగా (18th episode) ఇలా వివరిస్తున్నారు .  “ఆ విధంగా  యముని మాటలు విన్నటువంటి బ్రహ్మదేవుడు “ఓ యమా నువ్వు ఎందుకు విచారిస్తున్నావు? నువ్వు చూసిన దాంట్లో ఆశ్చర్యమేముంది? సజ్జనులకు బాధను కలిగించినట్లయితే, దానివల్ల వచ్చేటటువంటి ఫలితము జీవితాంతం ఉంటుంది.  శ్రీహరి నామాన్ని ఉచ్చరించినంత మాత్రాన చేత విష్ణు లోకాన్ని పొందగలరు.  రాజాజ్ఞ చేత వైశాఖ వ్రతాన్ని చేసి శ్రీహరి లోకాన్ని చేరడంలో ఆశ్చర్యమేముంది? గోవింద నామాన్ని ఒక్కసారి పలికినప్పటికీ, నూరు అశ్వమేధ యాగాలు చేసిన తర్వాత అవబృథ  స్నానం చేస్తే వచ్చేటటువంటి పుణ్యము కలుగుతుంది.  ఎన్ని యజ్ఞాలు  చేసిన వాళ్ళైనా, పుణ్యఫలాన్ని అనుభవించి మళ్లీ జన్మించక తప్పదు.  కానీ శ్రీహరికి నమస్కరించినట్లయితే, పునర్జన్మ ఉండదు.  

శ్రీహరి(Srihari) నామాన్ని పలికినవారు సంసార కురుక్షేత్రానికి పోవలసినటువంటి అవసరం లేదు.  సరస్వతి మొదలైన తీర్థాలలో మునగవలసిన అవసరం లేదు.  చెయ్యరాని పనులు చేసిన వారైనా, ఎంతటి పాపాన్ని చేసినా, మరణ కాలంలో శ్రీమహావిష్ణువుని స్మరించినట్లయితే, శ్రీహరి సన్నిధానాన్ని చేరుకుంటారు.  తినరాని దాన్ని తిన్నవారు, శ్రీహరిని స్మరించినట్లయితే ఆ పాపాన్ని పోగొట్టుకుని, విష్ణు సాన్నిహిత్యాన్ని పొందుతారు.  ఇటువంటి శ్రీమహావిష్ణువుకి ఇష్టమైనటువంటి మాసము వైశాఖము.  ఈ మాస ధర్మాలను విన్నట్లయితే సర్వపాపాలు కూడా హరించుకుపోతాయి. సృష్టించినటువంటి సర్వ జగన్నాథుడు శ్రీమహావిష్ణువువే! అటువంటి మహానుభావుడిని సేవించిన వారు విష్ణు లోకాన్ని చేరడంలో ఆశ్చర్యమేమంటుంది? కీర్తిమంతుడు శ్రీహరి భక్తుడు.  

శ్రీహరికి ఇష్టమైన వైశాఖమాస వ్రతాన్ని చేసినవారి పట్ల శ్రీహరి ప్రీతుడై వారికి సహాయ పడడం సహజమే కదా! కాబట్టి  ఓ యమధర్మ రాజా శ్రీహరి భక్తుడైనటువంటి ఆ రాజుని శిక్షించగలిగే శక్తి నాకు లేదు.  శ్రీహరి భక్తులకు ఎప్పుడూ అశుభమనేది ఉండదు కదా! జన్మ మృత్యు జరా వ్యాధి భయం కూడా ఉండదు. యజమాని చెప్పిన పనిని అధికారి శక్తి కొద్ది ఆచరించడానికి యత్నించినట్లయితే అతడు పనిని పూర్తి చేయకపోయినా నరకానికి పోడు. తన శక్తికి మించినట్లయితే ఆ విషయాన్ని యజమానికి నివేదించిన అధికారి లేదా సేవకుడు పాపాన్ని పొందడు.  అతనికి ఎటువంటి దోషము ఉండదు.  యజమాని చెప్పినటువంటి పని శక్తికి మించినదైనప్పుడు, అది అతని దోషమే కాదు. కాబట్టి ఇందులో  భయపడాల్సింది, బాధపడాల్సిందీ ఏమీ లేదని”  బ్రహ్మ యముణ్ణి  బహు విధాలుగా ఊరడించాడు.  

అప్పుడు యముడు బ్రహ్మ మాటలు విని, యముడు “ ఓ స్వామి! నీ ఆజ్ఞను పాటించి నేను కృతార్థుడనయ్యాను. అంతే చాలు .  కానీ నేను మళ్ళీ నా పూర్వపు ఉద్యోగంలో కైతే వెళ్లలేను.  కీర్తిమంతుడు ఈ విధంగా పరాక్రమముతో వైశాఖ వ్రతములతో భూమిని పరిపాలిస్తూ ఉండగా, నేను నా అధికారాన్ని నిర్వహించలేను. ఆ రాజు వైశాఖ వ్రతాన్ని మానే విధంగా చేయగలిగినట్లయితే , నేను తండ్రికి గయాశ్రార్ధము చేసినటువంటి కొడుకు లాగా సంతృప్తిని పడతాను.  ఓ కృపాకరా ! నా ఈ కోరిక తీరేటటువంటి ఉపాయాన్ని చెప్పు.  అప్పుడు నేను మళ్ళీ నా కర్తవ్యాన్ని నిర్వహించగలను” అని ప్రార్థించాడు.  

అప్పుడు బ్రహ్మ “ఓ యమధర్మ రాజా! విష్ణు భక్తుడైనటువంటి అతనితో నువ్వు విరోధాన్ని పెట్టుకోవడం మంచిది కాదు.  నీకు కీర్తిమంతుడిపై కోపం ఉన్నట్లయితే, మనము శ్రీహరి దగ్గరకే వెళ్దాము.  జరిగిందంతా కూడా శ్రీమన్నారాయణునికి చెప్పి ఆయన చెప్పిన విధంగా చేద్దాము.  సర్వలోకాలకు కర్త అయినటువంటి, ఆ శ్రీమన్నారాయణడే ధర్మ పరిపాలకుడు.  మనల్ని శిక్షించేవాడు.  దండ ధరుడు.  మనలని ఆజ్ఞాపించే నియామకుడు. ఆయన ఎలా చెబితే అలా నడుచుకుందాము.” అని యమధర్మరాజును వెంటబెట్టుకుని క్షీరసముద్రం దగ్గరికి వెళ్లారు. బ్రహ్మదేవుడు జ్ఞాన స్వరూపుడు, నిర్గుణుడు, సాంఖ్యా యోగముల చేత కూడినటువంటి వాడు, పురుషోత్తముడు అయినటువంటి శ్రీహరిని స్తుతించాడు.  అప్పుడు శ్రీహరి వారికి ప్రత్యక్షమయ్యారు.

 బ్రహ్మ యమధర్మరాజు ఇద్దరూ కూడా ఆయనకు నమస్కారం చేశారు.  శ్రీహరి వారిద్దరిని చూసి “మీరిద్దరూ ఎందుకు ఇక్కడికి వచ్చారు? రాక్షసుల వల్ల మీకు ఏమైనా బాధ కలిగిందా? యముని ముఖము ఆ విధంగా ఎందుకు వాడిపోయింది? అతడు తలవంచుకుని ఎందుకున్నాడు? బ్రహ్మ ఈ విషయాన్ని నాకు తెలియజేయమని” అడిగారు.  అప్పుడు బ్రహ్మ  మీ భక్తుడైనటువంటి కీర్తిమంతుని పాలనలో ప్రజలందరూ కూడా వైశాఖ వ్రతాన్ని పాటించి, విష్ణు లోకాన్ని చేరుకుంటున్నారు.  అందువల్ల యమలోకము శూన్యమై ఉన్నది.  దానికే యముడు ఈ విధంగా దుఃఖపడుతున్నాడు.  ఆ దుఃఖాన్ని ఆపుకోలేక కర్తవ్య పరాయణుడైనటువంటి యముడు, కీర్తిమంతుని పైకి దండెత్తి వెళ్ళాడు.  చివరికి యమ దండాన్ని కూడా ప్రయోగించాడు.  అయినప్పటికీ కీర్తిమంతుడి రక్షించడానికి వచ్చినటువంటి మీ చక్రాయుధము చేత పరాభవాన్ని పొంది, ఏం చేయాలో తెలియక నా దగ్గరకు వచ్చాడు.  నేను కూడా ఈ విషయంలో ఏమీ చేయలేను.  ఓ స్వామి! నీ భక్తులను శిక్షించడానికి మేము ఎవరము? అందువల్ల మేము మీ శరణ కోరి వచ్చాము.  దయచేసి నీ భక్తుణ్ణి  శిక్షించి, ఆత్మీయుడైన యమున్నీ కాపాడమని బ్రహ్మ వేడుకున్నాడు. 

 శ్రీమహావిష్ణువు బ్రహ్మదేవుని మాటలు విని, నవ్వి యముని బ్రహ్మను చూసి ఈ విధంగా అన్నారు. “ నేనైనా, లక్ష్మీదేవి అయినా, ప్రాణాలు, దేహము, శ్రీవత్సము, కౌస్తుభము, వైజయంతి మాల, శ్వేత ద్వీపము, వైకుంఠము, క్షీరసాగరము, శేషుడు, గరుత్మంతుడు ఇలా నా కిష్టమైన  వీటిల్లో దేనినైనా కూడా విడిచి పెడతాము.  కానీ నా భక్తున్ని మాత్రము మేము విడవలేము.  సమస్త భోగాలను, జీవితాలను విడిచి నా మీదే ఆధారపడి ఉన్న ఉత్తమ భక్తుణ్ణి నేనే విధంగా విడిచిపెడతాను?” అని పలికాడు. 

ఇంకా ఇలా చెప్పసాగారు . “కానీ, ఓ యమధర్మ రాజా నీ దుఃఖాన్ని పోగొట్టడానికి , నీకు ఉపశమనం కలిగించడానికి ఒక ఉపాయాన్ని మాత్రం చేస్తాను. నేను కీర్తిమంత మహారాజుకు సంతుష్టుడనై పదివేల సంవత్సరాల ఆయుర్దాయాన్ని ఇచ్చాను. దానిలో ఇప్పటికే ఎనిమిది వేల సంవత్సరాలు గడిచిపోయాయి.  ఆ తరువాత వేనుడనే దుర్మార్గుడు రాజు అవుతాడు.  అతడు నాకిష్టమైనటువంటి వేదోకములైన సదాచారాలను నశింపజేస్తాడు.  అనేక దురాచారాలను ఆచరణలో పెడతాడు.  అప్పుడు వైశాఖమాస ధర్మాలను ఆచరించేవారు లేక లోపం జరుగుతుంది.  ఆ వేనుడు తాను చేసిన పాప బలంతో నశిస్తాడు.  ఆ తరువాత నేను పృధ్వి అనే పేరున జన్మించి, ధర్మసంస్థాపన చేస్తాను.  అప్పుడు మళ్లీ వైశాఖ మాస ధర్మాలు ధర్మాలు లోకంలో ప్రవర్తింప చేస్తాను.  అప్పుడు నాకు భక్తుడైన వారు నన్ను ప్రాణాల కంటే మిన్నగా నమ్మి వ్యామోహాన్ని విడిచి వైశాఖ ధర్మాన్ని తప్పక పాటిస్తారు.  కానీ అటువంటివాడు వెయ్యి మందిలో ఒక్కడు మాత్రమే ఉంటాడు. కోటానుకోట్లమంది జనులలో కొద్ది మంది మాత్రమే, నా ఈ వైశాక ధర్మాలను తెలుసుకొని పాటిస్తారు.  మిగిలిన వారు ఆ విధంగా చేయకుండా, కామావస్థులై ఉంటారు. 

ఓ యమధర్మ రాజా! అప్పుడు నీకు వలసినంత పని ఉంటుంది,  విచారించకు. అదేవిధంగా  వైశాఖమాస వ్రతంలో నీకు కూడా భాగాన్ని ఇస్తాను.  యుద్ధంలో నిన్ను గెలిచి నీకియ్యవలసిన భాగాన్ని రాకుండా చేసిన కీర్తిమంతుని నుండి కూడా నీకు భాగము వచ్చే విధంగా చేస్తాను.  నీకు రావలసిన భాగము కొంతైనా వచ్చినట్లయితే మీకు కూడా విచారము ఉండదు కదా!

కాబట్టి ఇక నుండీ వైశాఖ ధర్మాన్ని ఆచరించేవారు, యమునికి కూడా భాగాన్ని సమర్పించవలసి ఉంటుంది .  వైశాక వ్రతాన్ని ఆచరించేవారు ప్రతిరోజు కూడా స్నానము చేసి, నీకు అర్ఘ్యాన్ని అర్పిస్తారు.  వైశాఖ వ్రతం చివరినాడు జల పూర్ణమైనటువంటి కలశాన్ని, పెరుగన్నాన్ని నీకు సమర్పిస్తారు.  ఆ విధంగా చేయని వారికి వైశాఖమాసంలో చేసినటువంటి కర్మలన్నీ కూడా వ్యర్థములే అవుతాయి.  కాబట్టి ఓ యమధర్మ రాజా! నీకు ఈ విధంగా భాగాన్ని ఇచ్చేటటువంటి కీర్తిమంతుని పైన కోపాన్ని విడిచిపెట్టు.  ప్రతిరోజు కూడా స్నానాన్ని, అర్ద్యాన్ని, చివరి రోజున జల పూర్ణ కలశాన్ని, పెరుగన్నాన్ని నీ భాగముగా గ్రహించు.  ఈ విధంగా చేయనివారి వైశాఖమాస కర్మలు వ్యర్థమై వారు చేసినటువంటి పాపపుణ్యాలను అనుసరించి నీ లోకానికి చేరుకుంటారు.  ధర్మాధర్మాలను నిర్ణయించే నిన్ను విడిచి, నన్ను మాత్రమే సేవించే నా భక్తులను నా ఆజ్ఞనుసారము శిక్షించు.  వైశాఖ వ్రత సమయంలో నీకు అర్థం ఇయ్యని వారికి విఘ్నాలని కలిగించి శిక్షించు. 

 కీర్తిమంతుడు నీకు భాగం ఇచ్చే విధంగా చేసేందుకు సునందుని అతని దగ్గరికి పంపిస్తున్నాను. సునందుడు నా మాటగా కీర్తిమంతుడికి చెప్పి నీకు రావలసిన భాగాన్ని ఇప్పిస్తాడు” అని పలికి శ్రీహరి యమధర్మరాజు అక్కడ ఉండగానే, కీర్తిమంతుని దగ్గరకు పంపించాడు.  సునందుడు కీర్తిమంతుడి దగ్గరికి వెళ్లి, శ్రీహరి సందేశాన్ని చెప్పి, కీర్తిమంతుడి అంగీకారాన్ని తీసుకుని శ్రీహరి దగ్గరికి వచ్చి విషయాన్ని చెప్పాడు.  శ్రీహరి ఈ విధంగా యమధర్మరాజును ఊరడించి అంతర్ధానమయ్యారు. బ్రహ్మ కూడా యమునికి చెప్పవలసిన మాటలు చెప్పి, జరిగిన దానికి విస్మయ పడుతూ తన వారితో కలిసి తన లోకానికి వెళ్లిపోయాడు.  యముడు కూడా కొద్దిపాటి సంతోషముతో తన లోకానికి తిరిగి వెళ్ళాడు.  శ్రీమహావిష్ణువు పంపిన సునందుడి మాటను పాటించి కీర్తిమంతుడు తన ఏలుబడిలోని ప్రజలందరూ కూడా వైశాఖ వ్రతాన్ని ఆచరించే విధంగా , యమునికి కూడా తగిన భాగాన్ని శ్రీహరి అనుగ్రహించిన విధంగా సమర్పించేటట్లు చర్యలు తీసుకున్నాడు. ఆ విధంగా వైశాఖ వ్రతాన్ని ఆరంభించే ప్రతి వారు ప్రతి రోజు కూడా స్నానం చేసే సమయంలో యమునికి అర్ఘ్యం ఇవ్వాలి.  వైశాక పౌర్ణమి నాడు జలకలశాన్ని దానం చేసి, జల కలిశాన్ని పెరుగన్నాన్ని ముందుగా యమునికి సమర్పించి తరువాత శ్రీమహావిష్ణువుకి అర్పించాలి. అటు తర్వాత పితృదేవతలను, గురువును పూజించాలి. ఆ తర్వాత శ్రీమహావిష్ణువును ఉద్దేశించి, చల్లటి నీరు పెరుగు కలిపిన అన్నాన్ని, దక్షిణ గల తాంబూలాన్ని, ఫలాలను ఉంచినటువంటి కంచు పాత్రను సద్బ్రాహ్మణుడు లేదా పేదవాడైనటువంటి వానికి ఇవ్వాలి.  బ్రాహ్మణున్ని తన శక్తికి తగినట్టుగా గౌరవించినట్లయితే శ్రీహరి సంతోషించి మరిన్ని వరాలను అనుగ్రహిస్తారు. వైశాఖ వ్రతాన్ని ఆచరించేటటువంటి వారిలో భక్తి పూర్ణత ముఖ్యమైనటువంటిది.  వ్రత ధర్మాలను పాటించేటప్పుడు యధాశక్తిగా ఆచరించడము మరింత ముఖ్యము.  ఈ విధంగా వైశాఖ వ్రతాన్ని ఆచరించిన వారు జీవించినంత కాలము అభీష్ట భోగాలను అనుభవిస్తూ, పుత్రుడు, పుత్రికలు, మనుమలు, మనుమరాలు మొదలైన వారితో సుఖముగా ఉండి శుభ లాభాలతో జీవించగలరు.  మరణించిన తరువాత సకుటుంబంగా శ్రీహరి లోకాన్ని చేరగలరు.  కీర్తిమంతుడు కూడా యధాశక్తిగా వైశాఖ వ్రతాన్ని, దానధర్మాలను ఆచరించి సకల భోగభాగ్యాలను సర్వసంపదలను అనుభవించి తన వారితో కూడా కలిసి శ్రీహరి సాన్నిద్యాన్ని పొందాడు. 

 కీర్తిమంతుని తరువాత శ్రీహరి చెప్పినట్లుగా దుర్మార్గుడు నీచుడు అయినటువంటి వేనుడు రాజు అయ్యాడు.  అతడు సర్వ ధర్మాలను నశింపజేశాడు. వైశాఖమాస వ్రతాదులు లోపించాయి. దాంతో మోక్ష సాధనము, సర్వసులభము అయినటువంటి వైశాక ధర్మము ఎవ్వరికీ తెలియని స్థితిలో పడిపోయింది.  పూర్వజన్మ పుణ్యమున్న వారికి మాత్రమే వైశాఖ ధర్మముల పట్ల ఆసక్తి, నిశ్చలమైన దీక్ష, శ్రీహరి పట్ల భక్తి ఉంటాయి. అటువంటి వారికి ముక్తి, ఇహలోక సుఖాలు,శుభ లాభములు  కాగలవు. కానీ పురాకృత సుకృతముల వల్ల మాత్రమే ఇది సాధ్యము సుమా !” అని శృతదేవుడు శృతకీర్తి మహారాజుకు వివరించాడు. 

 అప్పుడు శ్రుతకీర్తి మహారాజు విశుకతా శ్రవణం పట్ల అనురక్తుడై ఇలా ప్రశ్నించాడు. “ఓ శృతదేవ మహాముని! పూర్వపు మన్మంతరములలో  ఉన్నటువంటి వీరుడు, దుర్మార్గుడని మీరు చెబుతున్న ఇక్ష్వాకు వంశానికి చెందిన వేనుని గురించి విన్నాను.  మీ మాటల వల్ల కీర్తిమంతుడి తరువాత వేణుడు రాజవుతాడు అని చెప్పారు. అతను చెడ్డవాడని, అధర్ముడని చెబుతున్నారు. ఈ రెండు విషయాలూ ఒకటితో మరొకటి విభేదిస్తూ ఉన్నాయి. ఈ రెండిటికి ఉన్నటువంటి తేడాను తెలుసుకోవాలనుకుంటున్నాను.” దీనిని వివరంగా వివరించండి.  అని అడిగాడు.  అప్పుడు శృతదేవుడు “ఓ రాజా! యుగములను బట్టి, కల్పములను బట్టి కథలు, అందులో ఉన్నటువంటి వారి స్వభావాలు వేరుగా చెప్పబడి ఉండొచ్చు.  ఆ కథలే ప్రమాణములుగా మార్కండేయుడు తదితర మహామునులు చెప్పి ఉన్నారు. నేను చెప్పిన వేనుడు మరోకల్పానికి చెందినటువంటి వాడు.  మంచి చెడు కలవారి చరిత్రలని మనము మంచి చెడులకు గుర్తుగా చెప్పుకుంటాము.  అదేవిధంగా కీర్తిమంతుని మంచితనము, గొప్పతనము తరువాత వేనుని చెడ్డతనము దుష్టత మనము గమనించవలసినటువంటి విషయాలు సుమా !” అని వివరించారని  నారదుడు అంబరీషునికి తెలియజేశారు.

వైశాఖ పురాణం 18వ అధ్యాయం సంపూర్ణం !!

సర్వం శ్రీహరి పాదారవిందార్పణమస్తు !! 

Vaisakha Puranam, 

#vaisakhapuranam #vaisakha #puranam 

Quote of the day

The Vedanta recognizes no sin it only recognizes error. And the greatest error, says the Vedanta is to say that you are weak, that you are a sinner, a miserable creature, and that you have no power and you cannot do this and that.…

__________Swamy Vivekananda