Online Puja Services

అంతులేని విశేషాల‌కు నిల‌యం - బిరాజ‌దేవి ఆల‌యం

3.21.76.0

అంతులేని విశేషాల‌కు నిల‌యం - బిరాజ‌దేవి ఆల‌యం (మధ్యగయ) !
లక్ష్మీ రమణ 
 
అష్టాద‌శ శ‌క్తిపీఠాల వెన‌క ఉన్న క‌థ అంద‌రికీ తెలిసిందే! ద‌క్షుని య‌జ్ఞంలో జ‌రిగిన అవ‌మానానికిగాను యోగాగ్నిలో దహించుకున్న, స‌తీదేవి ప్రాణం లేని శ‌రీరాన్ని చేప‌ట్టి, శివుడు తాండవం చేయసాగాడు . తన విధిని వదిలి ఉన్మాదిగా మారిన శివుని నుండీ  ఆ శ‌రీరాన్ని విడ‌దీసి, లయకారుణ్ణి  సాధార‌ణ‌స్థితికి తెచ్చేందుకు విష్ణుమూర్తి త‌న సుద‌ర్శ‌న చ‌క్రాన్ని ప్ర‌యోగించాడు. ఆ సుద‌ర్శ‌న చక్రం స‌తీదేవి శ‌రీరాన్ని చిన్నాభిన్నం చేసింది. ఆ శ‌రీర‌భాగాలు ప‌డిన ప్రాంతాల‌ను మ‌నం అష్టాద‌శ పీఠాలుగా కొలుస్తున్నాము. వాటిలో ఒక‌టి ఒడిషా రాష్ట్రంలో ఉన్న బిరాజ‌దేవి. ఈమెనే గిరిజాదేవిగా కూడా పిలుస్తారు. ఈ క్షేత్రంలో ఇంకా ఎన్నో విశేషాలూ వింతలూ ఉన్నాయి . ఆ విశేషాలు తెలుసుకుందాం . 

శ్లో: ఓఢ్యాణే గిరిజాదేవీ పిత్రర్చన ఫలప్రదా
బిరజా పర పర్యాయా స్థితా వైతరణీతటే
త్రిశక్తీనాం స్వరూపా చ లోకత్రాణ పరాయణా
నిత్యం భవతు సా దేవీ వరదా కులవర్థినీ!

ఓఢ్యాణం అంటే, ఓఢ్రదేశం. నేటి ఒడిశా. కటక్‌కి దగ్గర్లోని వైతరణీ నదీతీరంలో ఉన్న ఒక గ్రామం పేరు కూడా వైతరణే. జాజ్‌పూర్‌ రోడ్డుకు సుమారు 20 కి.మీ. దూరంలో ఉంది పదకొండో శక్తిపీఠం. అదే గిరిజాదేవి ఆలయం. మహాలక్ష్మి, మహాకాళి, మహాసరస్వతి అంశలతో కూడిన శక్తిపీఠంగా ఇక్కడి గిరిజాదేవిని మహర్షులు గుర్తించారు. 

అష్టాదశ శక్తి పీఠాలలో ఈ గిరిజాదేవి శక్తిపీఠం ఒకటి అనేది తెలిసిన విషయమే . సతీదేవి 'నాభి' పడిన ప్రదేశం కావడం వలన, 'నాభి క్షేత్రం' అని భక్తులు పిలుస్తుంటారు. 'పార్వతీ క్షేత్రం'గా .. 'వైష్ణవీ క్షేత్రంగా' కూడా ఈ క్షేత్రం ప్రసిద్ధి చెందింది. ఇక్క‌డ గిరిజాదేవి అమ్మ‌వారు మ‌హిషాసుర‌మ‌ర్దిని రూపంలో క‌నిపిస్తుంది. అయితే అమ్మ‌వారి అలంకారం త‌ర్వాత కేవ‌లం, ఆమె మోము మాత్ర‌మే క‌నిపిస్తుంది.

ఇక్కడి అమ్మవారు (గిరిజ) సింహాన్ని వాహనంగా కలిగి, ఒక చేత్తో ఖడ్గం, మరో చేతితో మహిషాసురుని తోక పుచ్చుకున్నట్లుగా దర్శనం ఇస్తుంది. స్థానికులు ఇక్కడి శక్తి పీఠాన్ని బిరజాదేవి అనీ వ్యవహరిస్తున్నారు. వైతరణి లేదా విరజా నదీ తీరంలో వెలసినందున వంగ/ఒరియా భాషల్లో విరజ, బిరజగా మార్పుచెంది, స్థానికుల నోట బిరజగా రూపాంతరం చెంది ఉండొచ్చు. త్రిశక్తి రూపిణిగా పూజలందుకొంటూ ఉన్న ఇక్కడి అమ్మవారికి తలనీలాలు అర్పించడం అనేది ఒక విశేషమే!

దసరా పర్వదినాల్లో అమ్మవారికి రథయాత్రను జరుపుతారు. ఒడిశాలోని మరో పుణ్యక్షేత్రం పూరీలో కూడా రథయాత్రకు ప్రాముఖ్యం ఉంది. అదే తరహాలో ఈ దేవతకు కూడా రథయాత్ర నిర్వహించడం ఇక్కడ ప్రత్యేకత. ఇక్కడ నదిలోని ఒక దీవిలో శ్వేతవరాహరూపుడైన విష్ణుమూర్తి ఆలయం నిర్మించారు. ఇక్కడ శ్వేతవరాహ రూపంలో ఉన్న శ్రీహరి, గిరిజాదేవి పాదాలను దూరం నుంచే అర్చిస్తూంటాడు. ఇక్కడి వైతరణీ నదీ తీరంలో జగన్నాథ స్వామి ఆలయం వుంది. పూరి జగన్నాథస్వామి ఆలయానికంటే ఇక్కడి ఆలయం ప్రాచీనమైనదనే మాట స్థానికుల నుంచి వినిపిస్తూ ఉంటుంది.

ఈ అమ్మ‌వారిని పూజించేందుకు ఏడాది పొడ‌వునా ఏదో ఒక ప్ర‌త్యేక సంద‌ర్భాలు ఉంటూనే క‌నిపిస్తాయి. ముఖ్యంగా ఇక్క‌డ అమ్మ‌వారు మాఘ అమావాస్యకి అవ‌త‌రించార‌ని అంటారు. అందుకే ఆరోజున త్రివేణీ అమావాస్య పేరుతో ఘ‌నంగా ఉత్స‌వాలు నిర్వ‌హిస్తారు. ఇక ద‌స‌రా స‌మ‌యంలో అయితే చెప్ప‌నే అక్క‌ర్లేదు. ఏకంగా ప‌ద‌హారు రోజుల పాటు ఇక్క‌డ ద‌స‌రా మ‌హోత్స‌వాల‌ను నిర్వ‌హిస్తారు. అమ్మ‌వారిని 16 క‌ళ‌ల‌కు అధినేత్రిగా పేర్కొంటారు క‌దా! బ‌హుశా అందుక‌నే ఇలా 16 రోజుల పండుగ‌ను నిర్వ‌హిస్తారేమో. ఆ స‌మ‌యంలో సింహ‌ధ్వ‌జం మీద అమ్మ‌వారిని ఊరేగించే వేడుక‌ను చూసేందుకు ల‌క్ష‌లాది మంది జ‌నం త‌ర‌లివ‌స్తారు.

 జీవి శరీరం వదిలాక ముందుగా ఆ జీవిని స్వర్గానికి పంపాలా? నరకానికి పంపాలా? అనే విషయాన్ని వైతరణీ నది తేల్చేస్తుంది. యమలోక ప్రయాణపు దారిలో వచ్చే ఈ నది, న్యాయనిర్ణేత అన్నమాట. జాజ్‌పూర్‌ రోడ్డు చేరువలో ఉన్న ఈ వైతరణి, ఆ నదీ అంశతో జన్మించింది కాబట్టి, పితృదేవతలకు – పిండ ప్రదానాలకు ఇది ప్రశస్తమైందని పురాణాలు వర్ణించాయి. అందుకే ఇక్కడ అంతా పిండ ప్రధానం చేస్తారు. 

పురాణాల్లో మనకి కనిపించే 'వైతరణీ నది' ఇక్కడ ప్రవహిస్తూ వుంటుంది. గిరిజాదేవి శక్తిపీఠానికి సమీపంలో కనిపించే ఈ వైతరణీ నదిని దాటితే స్వర్గ ప్రాప్తి కలుగుతుందని స్థలపురాణం చెబుతోంది. పూర్వం పాండవులు ఈ వైతరణీ నదిలో స్నానం చేసి .. పితృ దేవతలకి పిండ ప్రదానం చేశారట. ఇక రావణాసురుడు కూడా ఇక్కడి వైతరణీ నదిలో స్నానం చేసి, పిండప్రదానం చేసినట్టు చెబుతారు. ఈ కారణంగానే పితృదేవతలకు పిండ ప్రదానం చేయడానికి ఎక్కడెక్కడి నుంచో భక్తులు వస్తుంటారు. 

ఇక గ‌యాసురుడు అనే విష్ణుభక్తుడైన రాక్ష‌సుని త్రిమూర్తులు  సంహ‌రించిన‌ప్పుడు,  ఆయ‌న త‌ల గ‌య‌లోనూ, పాదాలు పిఠాపురంలోనూ, నాభి ఇక్క‌డి జైపూర్‌లోనూ ప‌డ్డాయ‌ని ఐతిహ్యం. అందుకే పిఠాపురాన్ని పాద‌గ‌య‌గానూ, జైపూర్ క్షేత్రాన్ని నాభిగ‌య‌గానూ పేర్కొంటారు.

ఇక ఈ క్షేత్రానికి మరో ప్రత్యేకత వుంది. మ‌హాభార‌త యుద్ధానంత‌రం ఇక్క‌డ భీముని గ‌ద ఉండిపోయింద‌ట‌. అందుకే దీనిని గ‌దాక్షేత్రంగా పిలుస్తారు.

ఒడిశా రాజధాని భువనేశ్వర్‌ నుంచి కోల్‌కతా వెళ్లే రైలు మార్గంలో, కటక్‌ నుంచి మూడు గంటల బస్సు ప్రయాణంతో ఇక్కడికి చేరుకోవచ్చు.

Quote of the day

From the solemn gloom of the temple children run out to sit in the dust, God watches them play and forgets the priest.…

__________Rabindranath Tagore