Online Puja Services

దేవేంద్రుడే ఇక్కడి పూజకి స్వయంగా దిగివస్తారు !!

3.144.238.20

దేవేంద్రుడే ఇక్కడి ప్రదోషకాల పూజకి స్వయంగా దిగివస్తారు !!
-కంచర్ల లక్ష్మీ రమణ 

ఆసియాలోనే అతిపెద్ద రథం , అంతులేని సంపద ఉన్న పుత్రవరదుడుగా  ఈ శివుడు ప్రపంచ ప్రఖ్యాతిని పొందారు. దేవేంద్రుడే స్వయంగా ఇక్కడి ప్రదోషకాల పూజకి విచ్చేస్తాడని ఐతిహ్యం .  సంతాన ప్రాప్తికి తిరువారూర్ సోమాస్కంద దర్శనం సర్వోత్తమం . సోమస్కందుడు అంటేనే , స్కందునితో కూడియున్న శివుడు అనేకదా అర్థం . మరకత లింగంగా ఉన్న ఇక్కడి మూలమూర్తి బోళాశంకరుడు . శరణంటే  చాలు, కాపాడి దరిచేర్చుకొనే అనుగ్రహ వరదుడు . ఈయన్ని ‘పుత్రిదానకొండార్’ అని పిలుస్తారు తమిళులు . 30 ఎకరాలలో విస్తరించివున్న ఈ బృహదాలయం త్యాగరాజస్వామి ఆలయంగా ప్రసిద్ధినిపొందింది . ఇక్కడి ఉమాదేవిని దేవిని స్థానికులు కొండి అనే పేర అర్చిస్తారు . యోగులు యోగప్రదాయనిగా ఇక్కడి దేవిని అర్చిస్తారు. సంప్రదాయానికి మారుపేరయిన దక్షిణభారతంలో ఉన్న ఈ మహిమాన్వితమైన , పురాతనమైన, చారిత్రికవైభవంతో అలరారే  త్యాగరాజాలయదర్శనం చేద్దాం పదండి . 

ఆలయం లోని ప్రధాన దైవాలు : 
తమిళనాడు లోని అత్యంత పురాతన ఆలయాలలో త్యాగరాజస్వామి ఆలయం ఒకటి. ఇది తమిళనాడులోని కుంభకోణానికి సమీపంలో ఉన్న సుప్రసిద్ద పుణ్యక్షేత్రం. ఈ ఆలయాన్ని కమలాపురం అనికూడా పిలుస్తారు. ఇక్కడ ప్రధాన దైవం త్యాగరాజేశ్వరుడు. సప్తవిడంగ స్థలములలో ఒకటిగా ఈ దేవాలయం ప్రసిద్ధిని పొందింది . విస్తారమైన స్థలంలో ఉన్న ఈ ఆలయంలో ఇతర ముఖ్యమైన దైవ స్వరూపాలుగా వల్మీకేశ్వరుడు, సోమాస్కంద మూర్తి, కమలాంబికలు కొలువై ఉన్నారు . ఆలయంలో మరకత లింగ అభిషేకం నేత్రానందం కలిగించేది ఉంటుంది. ఆరు కాలాలలో ఇక్కడి శివుడికి ఆరాధన జరుగుతుంది.

స్థల పురాణం : 
ఇక్కడ శివుడు సోమస్కంద మూర్తిగా నెలకొన్నవైనం అద్భుతంగా ఉంటుంది . స్వయంగా విష్ణువు పుత్రునికోసం తపస్సు చేయగా, శివుడు అనుగ్రహించి కాముణ్ణి పుత్రునిగా అనుగ్రహించారట . అయితే అప్పుడు ఆయన ఉమాదేవి సహితంగా స్వామిని అర్చించలేదట . దాంతో కోపించిన ఉమాదేవి, కామదహనానికి కారణమయ్యింది చెబుతారు. ఆ తర్వాత తన తప్పు  విష్ణుమూర్తి పరమేశ్వరుని ఉమా , కార్తికేయ సహితంగా అర్చించారని ఆయనే ఈ సోమస్కందమూర్తని చెబుతారు .  

అయితే ఈ ప్రదేశానికి విష్ణుమూర్తి అర్చించిన సోమసుందరుడు రావడానికి కూడా ఒక ప్రత్యేకమైన కథనం ఉంది . దాని ప్రకారం ఒక సారి రాక్షసులకు ,ఇంద్రునికి మధ్య యుద్దం సంభవించింది. ఆ సమయంలో ఇంద్రునికి, ముచికుందుడు సహాయం చేశాడట. అందుకు ప్రతి ఫలంగా ముచికుందుడు ఇంద్రుడు పూజించే సోమస్కందమూర్తి తనకి కావాలని కోరారట. ముందరే చెప్పుకున్నట్టు ఆ సోమస్కందమూర్తిని మొదట విష్ణువు కొంతకాలం పూజించి తర్వాత దాన్ని ఇంద్రునికి ఇస్తాడు. మహిమాన్వితమైన ఆ విగ్రహాన్ని ముచికుందునికి ఇవ్వడానికి ఇష్టపడని ఇంద్రుడు, రాత్రికి రాత్రి దేవశిల్పి విశ్వకర్మను పిలిపించి ఆ మూర్తిని అచ్చంగా పోలి ఉండే మరో ఆరు మూర్తులను తయారు చేయిస్తాడు. అయితే ముచికుందుడు  శివుని అనుగ్రహంతో అసలు మూర్తిని గుర్తించడంతో, ఇంద్రుడు ఆ సోమాస్కందమూర్తిని ముచికుందకు ఇవ్వక తప్పలేదు. అలా ఇంద్రునినుండీ గ్రహించి, పూజించిన సోమాస్కందమూర్తినే ముచికుందుడు తిరువారూర్ లో ప్రతిష్టించాడు. ఈ మూర్తినే ‘వీధి విడంగర్’ అని పిలుస్తుంటారు.

సప్తవిడంగాలయాలు : 
దేహంలోని సప్తచక్రాల స్వరూపాలే ఈ సప్తవిడంగ శివాలయాలుగా పండితులు అభివర్ణిస్తుంటారు . సప్తవిడంగ స్థలములలో సోమస్కందమూర్తి ఒకరు కాగా ,  మిగిలిన ఆరు తిరునల్లార్ లోని ‘నాగర్ విడంగర్’, నాగపట్టణంలో ‘సుందర విడంగర్’, తిరుకువలమైలో ‘అవని విడంగర్’, తిరువాయిమూర్ లో ‘నీల విడంగర్’, వేదారణ్యంలో ‘భువని విడంగర్’, తిరుకరవసల్ లో ‘ఆది విడంగర్’ పేరుతో త్యాగరాజస్వామి పూజలు అందుకుంటున్నారు. ఈ ఆలయం క్రీశ 7 వ శతాబ్ద౦లోని శైవ నాయన్మార్ల ‘తేవర శ్లోకాల’ ద్వారా ప్రసిద్ధిచెందింది.

పంచభూతాలలో పృథ్వీ స్థానం:
పంచభూతాలలో పృథ్వీ స్థానం పొందిన ఈ క్షేత్రంలో జన్మించిన వారికి మోక్షం లభిస్తుందని ప్రగాఢ విశ్వాసం. శివ భూతగణాలే ఈ ప్రాంతంలో జన్మని పొందగలరని విశ్వసిస్తారు. సుందరార్ తన తేవారంలో ‘తిరువారూర్'లో జన్మించిన వారందరికీ నేను బానిసను అని పేర్కొనడాన్ని బట్టి ఈ స్థల ప్రాశస్త్యాన్ని తెలుసుకోవచ్చు . 

వాల్మికినాతార్ మందిరం:
తిరువారూర్ లోని ఈ ఆలయ ప్రధాన దేవతను రెండుగా విభజించారు, ఒకటి వాల్మీకినాదార్ రూపంలో పూజించబడే శివుడు, మరొకటి త్యాగరాజ విగ్రహం. పుట్టలో ఉన్న స్వామిని అర్చించే మందిరం వాల్మికినాతార్ మందిరం.  ఇది త్యాగరాజస్వామి మందిరం కన్నా పెద్దది . వల్మికినతార్ ఆలయంలో శివలింగం స్థానంలో ఒక "పుత్రు" లేదా పుట్ట ఉంటుంది. దేవతల ప్రార్థననుసరించి ఇలా ప్రత్యక్షమైన ఈ స్వామికి ఏ విధమైన అభిషేకాలు ఉండవు. అనంతీశ్వరుడు, నీలోత్పలాంబ, అసలేశ్వరుడు, అడగేశ్వరుడు, వరుణేశ్వరుడు, అన్నామలేశ్వరుడు మొదలైన ఉపాలయాలు కూడా ఇక్కడ ఉన్నాయి .
పుట్టలో ఉండేది నాగస్వరూపం. మూలాధారంలో చుట్టలు చుట్టుకొని ఉండే నాగస్వరూపం - శక్తి కుండలిని . ఈ శక్తి, శివుల ఆరాధన,  శక్తి జాగృతి ఇందులోని ఆంతర్యం అంటారు యోగులు.  

కమలాంబికా అమ్మవారు (ఉమాదేవి ) :
ఈ ఆలయంలో శక్తిమాత, అమ్మవారు కమలాంబికగా దర్శనమిస్తారు . స్వాధిష్టాన కమలంలో కోర్కెలను జయించేందుకు ఈ అమ్మ అనుగ్రహం అవసరమంటారు యోగులు . ఇక్కడ దేవి కూర్చున్న భంగిమ మరో విశేషంగా చెప్పుకోవాలి . మారె ఆలయంలో కనిపించని విధంగా, ఈ ఆలయంలో కమలాంబికా దేవి కాలుపై కాలు వేసుకుని ఠీవిగా దర్శనమిస్తారు . కామంపై సాధించిన విజయానికి చిహ్నంగా ఈ స్థితిలో కూర్చున్న అమ్మ నిదర్శనం అని భక్తులు విశ్వసిస్తారు. స్వాధిష్టానం నుండీ బయల్దేరే కుండలినీశక్తికి  చిహ్నంగా యోగులు ఈ దేవిని విశదీకరిస్తారు . 

కమలాలయం : 
ఈ ఆలయంలో ఉన్న కొలనునే కమలాలయం అని పిలుస్తారు. మహాలక్ష్మీ దేవి విష్ణువును వివాహమాడాలని ఇక్కడి మూలస్థానేశ్వరుని ఉద్దేశించి తపస్సు చేసింది. అందుకే ఇక్కడి కోనేరుకు కమలాలయం అని పేరు వచ్చింది. ఈ కోనేరు అత్యంత విశాలంగా ముప్పై మూడు ఎకరాలలో విస్తరించి ఉంటుంది. దేశంలోనే అతి పెద్ద కోనేరుగా ప్రసిద్ది చెందినది. కొలను మధ్యలో కొలను మధ్యలో నాదువననాథుని ఆలయం కూడా ఉంటుంది. ఇక్కడి ప్రదోష అభిషేకం చాలా విశేషంగా ఉంటుంది.

అరవై నాలుగు తీర్థాలు: 
మొత్తం ఇక్కడ అరవై నాలుగు తీర్థాలున్నాయి.  ఒక్కొక్కటీ ఒక్కొక్క ప్రశస్తిని కలిగిఉంది పడమటి గోపురానికి ఎదురుగా ఉన్న దేవనీర్థ కట్టం అన్నింటిలోకి విశేషమైనదని ప్రశస్తి.

నంది:
శివాలయాలలో నంది స్వామికి అభిముఖంగా ఆశీనుడై ఉంటారు . కానీ ఇక్కడి నంది చలనగతిలో ఉన్నట్టు, ఆయన  ఉన్నట్టు లేచి నిలబడి ఉంటారు . 

త్యాగరాజస్వామి ఆలయం: 
శ్రీ త్యాగరాజస్వామి ఆలయం తొమ్మిది రాజగోపురాలు ,అనేక విమానములు, పదమూడు మంటపాలు, పదిహేను పవిత్ర బావులు, మూడు పూలతోటలు, మూడు పెద్ద ప్రాకారాలు, వెయ్యికి పైగా ఉపాలయాలతో విశాల ప్రాంగణంలో కొలువుదీరి ఉంటుంది.

గుప్తనిధులున్నట్లు శిలాఫలకాలు: 
ఆది విడంగర్- త్యాగరాజస్వామి ఆలయంలో రెండు రహస్యగదులలో గుప్తనిధులున్నట్లు శిలాఫలకాలు వెల్లడిస్తున్నాయి. చారిత్రాత్మిక త్యాగరాజస్వామి ఆలయంలో వున్న రథం ఆసియా ఖండంలోనే అతిపెద్ద రెండవ రథం. దీనిని రూ.2.17 కోట్ల వ్యయంతో రూపొందించించారు.

రథానికి సంబంధించి స్థానికులు ఒక కధనాన్ని వినిపిస్తారు : 
తిరువారూర్ ప్రాంతాన్ని అనునీతి చోళుడు అనే రాజు కొంతకాలం పరిపాలించాడు. అనతి కుమారుడు రథంలో వస్తుండగా ఒక దూడ అతని రథానికి అడ్డు పడి మరణిస్తుంది. రాజు వద్దకు వెళ్ళి ఆ ఆవు న్యాయం కోరుతుంది .  ఆవుకు అభయం ఇచ్చిన రాజు దూడ ప్రాణాలు తీసిన పాపానికి సొంత కుమారుడని చూడకుండా, ఆ రాజకుమారుని కూడా రథచక్రాల క్రింద త్రోసి చంపవలసిందిగా శిక్షను ఖరారు చేసి, అమలు పరుస్తాడు. ఆ రాజు ధర్మనిరతికి న్యాయ పరిపాలనకి  ప్రీతి నందిన యముడు తన స్వస్వరూపంతో ప్రత్యక్షమై రాజును అనుగ్రహిస్తాడు .  దీనికి గుర్తుగా ఇప్పటికీ రాతి రథంపై ఈ గాథ అంతా కళ్ళకు కట్టినట్లు చెక్కి ఉండటం గమనించవచ్చు. ఈ ఆలయంలో ఉన్న రథం తమిళనాడులోనే ఎంతో ప్రఖ్యాతమైనది, అందమైనది.

ఈ ఆలయంలో సాయంత్రంలో జరిగే ప్రదోష పూజ చాలా విశేషమైనది ఈ ఆలయంలో సాయంత్రంలో జరిగే ప్రదోష పూజ చాలా విశేషమైనది. సాక్షాత్తుగా దేవేంద్రుడే ఆ సమయంలో ఇక్కడకు వచ్చి స్వామిని పూజిస్తాడని, మొత్తం దేవగణమంతా అందులో పాల్గొంటారని భక్తుల ప్రగాఢ విశ్వాసం.

యమచండికేశ్వరుడు:
లయకారుడైన ఈశ్వరాలయలో యముడు అనుచరుడై, సదా ఆయన అనుజ్ఞకు బద్ధుడై చరిస్తుంటాడు . కానీ ముందరి కథలో చెప్పుకున్నట్టు , ధర్మం సత్యం నాలుగు పాదాలమీద చరించే ఈ పుణ్య ప్రదేశంలో , తనకిక పనిలేదని , వెళ్లిపోతానని సర్వేశ్వరుని కోరగా , ఆ స్వామీ తనతోపాటు యముడు ఉండేవిధంగా అనుగ్రహించారట . అలా ఈ  ఆలయంలో చండికేశ్వరునితో పాటు యముడు కూడా లింగరూపమై పూజలందుకుంటున్నాడు . అందుకే ఈయనని యమచండికేశ్వరుడు అనే పేరుతో కొలుస్తుంటారు .

ఎలా వెళ్ళాలి:
చెన్నైకి 300 కిలోమీటర్ల దూరంలో ఉన్న కుంభకోణానికి చాల బస్సుల ఉంటాయి. అక్కడినుండి గంట ప్రయాణం చేస్తే కమలాపురం చేరుకోవచ్చు.

 

Quote of the day

Let your life lightly dance on the edges of Time like dew on the tip of a leaf.…

__________Rabindranath Tagore