Online Puja Services

ఆవుపాలతో అభిషేకం చేస్తే నీలివర్ణంలోకి మారతాయి .

3.139.86.56

ఈ సుబ్రహ్మణ్యుడికి ఆవుపాలతో అభిషేకం చేస్తే నీలివర్ణంలోకి మారతాయి . 
సేకరణ: లక్ష్మి రమణ

దేవాలయ విశేషాలు:
రామాపురం కడప జిల్లాలో ఒక చిన్న పల్లెటూరు. రామాపురంలో పురాతన శివాలయం ఒకటుండేది. కొంతకాలం కిందట ఆ ఆలయానికి సమీపంలో ఉన్న ఓ గదిలో అలనాటి అపురూప విగ్రహాలు బయటపడ్డాయి. వీటిలో ద్వికంఠ షణ్ముఖ సుబ్రహ్మణ్యస్వామి, మోక్ష నారాయణ స్వామి, సంజీవని మూలికాసహిత హనుమ, కౌలినీ మాత, ఉగ్రభైరవ మూర్తులు ఉన్నాయి. ఈ విగ్రహాలు పదిహేను వందల సంవత్సరాల పూర్వం నాటివని పురాతత్వశాస్త్ర నిపుణులు పేర్కొంటున్నారు. అత్యంత విలువైన ఈ విగ్రహాలకు అనేక ప్రత్యేకతలున్నాయి. 

ద్వికంఠ షణ్ముఖ సుబ్రమణ్య స్వామి: 
ఈ గ్రామంలో ఉన్న ద్వికంఠ షణ్ముఖ సుబ్రమణ్య స్వామి విగ్రహం ప్రపంచంలో మరెక్కడా కనిపించదు. దాదాపు పదిహేను వందల ఏళ్ల క్రితం నాటి ఈ విగ్రహానికి మళ్లీ పునర్వైభవం తీసుకువచ్చారు ఆ గ్రామస్థులు. ఇక్కడి ద్వికంఠ షణ్ముకుడు ప్రపంచంలో మరెక్కడా కనిపించడు. శ్రీవల్లీ, దేవసేన సమేతంగా షణ్ముఖుడి విగ్రహముంటుంది. అంతే కాదు, ఈ విగ్రహానికి అభిషేకం చేసే సమయంలో,ఆవు పాలు నీలివర్ణంలో కనిపిస్తాయి. ఇదొక భగవంతుని లీలా విశేషమని చెప్పాలి. 

మోక్ష నారాయణ స్వామి:
ఇక్కడి మరో విశేషం మోక్ష నారాయణుడి విగ్రహం. మహావిష్ణువు మోక్ష నారాయణ స్వామిగా వెలగొందుతున్న ఏకైక క్షేత్రం కూడా ఇదేనని గ్రామస్థులు పేర్కొంటున్నారు. ఈ విగ్రహం వామహస్తంలోని శంఖువు కాస్త కిందికి ఉంటుంది. మోక్షానికి మార్గంగా దక్షిణ హస్తం చూపుడు వేలు పైకి చూపుతున్నట్టు ఉండే నారాయణుడి మూర్తి దివ్య తేజస్సుతో కనిపిస్తుంది. ప్రతి మాసం శుక్ల పక్షం ఏకాదశి రోజున నారాయణుడు ఉత్తర ద్వారం నుంచి దర్శనమిస్తారు. ఈ సందర్భంగా సామూహిక సత్యనారాయణ స్వామి వ్రతాలు చేస్తారు. సాయంత్రం స్వామివారికి కల్యాణం నిర్వహిస్తారు. ఇక ఆంజనేయ విగ్రహానికి మరో ప్రత్యేకతుంది. ఈ విగ్రహంలో ఆంజనేయుడు సంజీవని పర్వతంతో పాటు సంజీవని మూలికను కూడా చేతిలో పట్టుకుని వస్తున్నట్టుగా దర్శనమిస్తాడు.

కౌలినీ మాత:
వీటితో పాటుగా లలితాంబికా రూపమైన కౌలినీ మాత ఇక్కడ కొలువై ఉంది. లలితా సహస్రనామావళిలో కౌలినీ మాత ప్రస్తావన ఉంది. ఈ అమ్మవారికి ఉజ్జయినిలో ఒక ఆలయం ఉండేదని, అయితే ప్రస్తుతం అది శిథిలమైందని చరిత్రకారులు చెబుతున్నారు. అలాంటి దేవాలయం ప్రస్తుతం మరెక్కడా లేదు. 

బకుట్‌ భైరవ:
రుద్రాంశగా భావించే భైరవుడు ఇక్కడ క్షేత్రపాలకుడుగా వెలిశాడు. అరుదుగా కనిపించే బకుట్‌ భైరవ రూపంలో భక్తులకు దర్శనమిస్తున్నాడు. ఉగ్రభైరవుడికి తోడుగా భైరవి మాత, కాలభైరవుడి విగ్రహాలను ప్రత్యేకంగా ప్రతిష్ఠించారు.

ఎలా వెళ్లాలి:
 రామాపురం , కడప నుంచి 18 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది.అక్కడివరకూ రోడ్డు / రైలు మార్గాల ద్వారా ప్రయాణించవచ్చు .  కమలాపురం- ఎర్రగుంట్ల దారిలో జాతీయరహదారిపై ఒక కిలోమీటర్‌ దూరం వెళ్తే రామాపురం వెళ్లే దారి వస్తుంది.

Quote of the day

Let your life lightly dance on the edges of Time like dew on the tip of a leaf.…

__________Rabindranath Tagore