Online Puja Services

వినాయకుడి ఒడిలో కృష్ణుడు ఉన్న దేవాలయం.

18.222.104.196

వినాయకుడి ఒడిలో కృష్ణుడు ఉన్న దేవాలయం.
సేకరణ: లక్ష్మి రమణ  

మహావిష్ణువు పార్వతీ దేవికి సోదరుడని పురాణేతిహాసాలు వర్ణిస్తున్నాయి. పార్వతీ తనయుడు వినాయకుడు. శ్రీ కృష్ణుడు మహావిష్ణువు అవతారం. అంటే కృష్ణుడు వినాయకుని మేనమామ.

అలాటి మేనమామ తన మేనల్లుడి ఒడిలో కూర్చున్న అపూర్వ దర్శనం ఈ ఆలయం ప్రత్యేకత . ఇది  కేరళలోని మళ్ళియూర్ అనే వూరిలో ఉంది .  అక్కడి ఆలయంలో వినాయకుని ఒడిలో బాలకృష్ణుడు ఆశీనుడై భాగవతం వింటున్న అపూర్వ దృశ్యం మనం చూడగలం. ఇటువంటి దృశ్యం మరెక్కడా దర్శించలేము.వైష్ణవ గణపతిగా కొలవబడుతున్న ఈ గణపతికి, ఈ ఆలయానికి గత చరిత్ర చాలానేవుంది. 

కేరళదేశ రాజైన చేరమాన్పెరుమాన్ పాలనాకాలం కంటే ముందుదిగా భావించబడుతున్నది. వేలసంవత్సరాల ప్రాచీనమైన ఆలయం.

ఈ ఆలయంలో వున్న విగ్రహాన్ని ఒక ఉత్తర దేశ బ్రాహ్మణుడు తీసుకుని రాగా ప్రతిష్టించబడినది. బీజ గణపతి రూపంలో వినాయకుడు ఇక్కడ అనుగ్రహిస్తున్నాడు. ఈ ఆలయం ప్రసిద్ది చెందడానికి భాగవత అంశగా ప్రసిద్ది చెందిన శంకరన్ నంబూద్రియే ముఖ్య కారణంగా చెపుతారు. శంకరన్ నంబూద్రి గణపతి విగ్రహం పక్కనే సాలగ్రామమును పెట్టుకుని పూజిస్తూండేవారు. నిత్యమూ భాగవత పారాయణం చేసేవారు. ఒకనాడు ఆయనకు తన పూజలో వినాయకుని విగ్రహంలో బాలకృష్ణుని రూపం స్పష్టంగా గోచరించింది. ఆయన తాను చూసిన దృశ్యాన్ని యదాతధంగా చెక్కిన రూపమే ఈనాడు ఆ ఆలయంలో దర్శనమిచ్చే విగ్రహం. ఈ వినాయకుడు వలంపురి వినాయకుడు.తొండం చివర నిమ్మపండు, హస్తాలలో కొడవలి, అంకుశం, తనకు ప్రీతిపాత్రమైన ఉండ్రాళ్ళు చేత ధరించి తనకుమామ అయిన బాలకృష్ణుని తన ఒడిలో వుంచుకొని దర్శనానుగ్రహాన్ని కలిగిస్తున్నాడు. గర్భగుడిలో ఇతర దైవ విగ్రహాలు ఏవీ వుండవు.

ఉపదేవతలైన భగవతి, అయ్యప్ప, యక్షి, అందిమహాకాళన్ ( ఇక్కడ పూజలు చేసే నంబూద్రీలు ఆరాధించే మూర్తి) విగ్రహాలకి ప్రత్యేక సన్నిధులు వున్నవి.భక్తుల కోరికలను తక్షణమే నెరవేర్చే వరప్రసాది మళ్ళియూరు మహాగణపతి. ఇక్కడ ఇష్టసిధ్ధికై చేసే పూజలను ముక్కుట్రి పుష్పాంజలి అంటారు. దీనికోసం 108 ముక్కుట్రి మొక్కలని వేరుతోసహా తెచ్చి వాటిని ప్రత్యేకంగా తయారు చేసిన తిరుమధురంలో ముంచి సమర్పిస్తారు. ఒక రోజుకి ఐదు పుష్పాంజలులు మాత్రమే జరుగుతాయి. సకల ఐశ్వర్యాలుకలగడానికి ఉదయాస్తమ పూజ జరుగుతున్నది. కష్టాలు తీరడానికి సహస్ర కలశాభిషేకం జరిపించుకుంటారు.

వివాహ అడ్డంకులు లేకుండా వుండడానికీ పళ్ళమాలలు సమర్పిస్తారు. 28 కదళీ ఫలాలతో కట్టే యీ మాలను నక్షత్ర మాల అంటారు. అనారోగ్యాల నివారణకై దడి నివేదన చేస్తారు. బియ్యప్పిండి, చక్కెర , కొబ్బరి కలిపి మోదకంగా తయారు చేసి ఆవిరిలో ఉడికించి నివేదిస్తారు. యిదే దడి నైవేద్యం.

ఈ ఆలయంలో పితృదోష పరిహారాలు జరుపుతారు. చవితినాడు చతుర్ధియూటు అనే పితృదోష పరిహార పూజలు జరుపుతారు. సంతాన భాగ్యం కోసం పాలు పాయసం నివేదించి పూజిస్తారు. తులాభార మొక్కులు కూడా తీర్చుకుంటారు. ఈ ఆలయంలో తొమ్మిది రోజుల ఉత్సవం ఫాల్గుణ మాసంలో ఆరంభమై చైత్రమాసంలో వచ్చే విషూ పండుగతో సంపూర్ణమౌతాయి. వినాయకచవితి పండగను ఘనంగా జరుపుతారు.

చేరుకోవడం ఇలా :

కేరళలోని కోట్టయం ..ఎర్నాకుళం మార్గంలో కురుప్పన్దర అనే చోట దిగితే 2 కి.మీ దూరంలోను, కురుప్పన్దర రైల్వేస్టేషన్ నుండి 1/2 కి.మీ దూరంలో మళ్లియూరు మహాగణపతి ఆలయం వున్నది.

Quote of the day

If you shut the door to all errors, truth will be shut out.…

__________Rabindranath Tagore