Online Puja Services

కాలంతోపాటు మారే కాలస్వరూపిణి ధారీదేవి

18.222.104.196

కాలంతోపాటు మారే కాలస్వరూపిణి ధారీదేవి . 
-లక్ష్మీ రమణ 

కాలం నిత్యం మారుతూ ఉంటుంది . పరిగెడుతూ ఉంటుంది . దాని ప్రభావం జీవులమీద కనిపిస్తూ ఉంటుంది . పూవు కాయై పండై రాలిపోయినట్టు , జీవులు పుట్టి , జీవించి, వృద్ధులై మరణిస్తాయి .కానీ కాలమే తానుగా ఉన్న పరమేశ్వరి , తానె కాలాన్ని అని చెప్పే ఒక దివ్యమైన ఆలయం ఉత్తరాఖండ్ లోని గర్వాల్ శ్రీనగర్ ప్రాంతంలో అలకనందా నది ఒడ్డున ఉంది . ఇక్కడ అమ్మవారు ధారీ దేవిగా పూజలందుకుంటోంది .  ధారి అంటే ధరించునది అని అర్థం . ఈ ఆలయంలో ఆమె కాలాన్ని ధరించింది . దానికి నిదర్శనంగానే ఆమె విగ్రహ రూపం మారిపోతూ ఉంటుంది . ఉదయం బాలికగా, మధ్యాహ్నం యువతిగా సాయంత్రం వృద్ధ స్త్రీగా రూపాంతరం చెందుతుంది .  

ఒక సైన్స్ కి అందని అద్భుతం . 

ఒక శిల ఉలి దెబ్బలకి లోనై  శిల్పంగా మారినప్పుడు , అది దాని రూపాన్ని కోల్పోయి తిరిగి శిలారూపంలోకి మారగలదా ? కానీ ఇక్కడ ఆలయంలోని శిల్పం , శిలా రూపంలోకి కాదు ఏకంగా శిల్పస్వరూపాన్నే మార్చేస్తుంది .  జీవన చక్రంలోని వివిధ దశలని సూచిస్తూ దేవీ స్వరూపంగా రూపాంతరం  చెందడం అనేది నిజంగా ఒక అద్భుతం . ప్రాణప్రతిష్ట అనే పదానికి నిదర్శనంగా సజీవశిల్పంగా ఈ ఆదిశక్తి స్వరూపం భక్తుల నీరాజనాలందుకుంటోంది . 

భారతదేశంలో ఇలా సైన్స్ కి అందని అద్భుతాలు చాలానే ఉన్నాయి .  శిలారూపంలో ఉన్న మల్లూరు నారసింహునికి రక్తం చెమరుస్తుంది .  శ్రీశైలం దగ్గరిలోఉన్న ఇష్టకామేశ్వరి ఆలయంలో అమ్మని ముట్టుకుంటే మనిషిని ముట్టుకున్నట్టు అనిపిస్తుంది .  పూరీ జగన్నాథుడి ధ్వజం గాలికి వ్యతిరేకదిశలో ఎగురుతుంది .  ఇలా ఎన్నో ఎన్నెన్నో .. ఆ పరమాత్ముని లీలా విలాసాలు భారతావనిలో అడుగడుగునా కనిపిస్తాయి . అవే , ఈ నాటికీ ప్రజల విశ్వాసాలకి అద్దం పడుతూ సనాతనధర్మాన్ని శ్రీరామరక్షగా నిలబడుతున్నాయి . 

 దేవభూమిగా పేరొందిన  ఉత్తరాఖండ్ సంరక్షక దేవతగా ధారీ దేవిని కొలుస్తారు ఇక్కడి ప్రజలు .  చార్ ధామ్  యాత్రలకు వెళ్లేవారు తప్పనిసరిగా ఈ దేవి దర్శనాన్ని చేసుకుంటూ ఉంటారు . ఈమె ఆ యాత్రికులను రక్షిస్తుందని నమ్మకం . ఆలయం పైకప్పు లేకపోవడం ఇక్కడి మరో విశేషం .  అలా ఉండడమే ధారీదేవికి ప్రీతిపాత్రమని చెబుతారు .  అయితే, ఈ అమ్మ కాలస్వరూపము అనడానికి ఇదొక నిదర్శనంగా మనకి ఇక్కడ తెలుస్తూ ఉంది .  కాలాన్ని బంధించి  ఉంచడం ఎవరికి సాధ్యం చెప్పండి.   

గర్భాలయంలో అమ్మవారి మూలమూర్తి పూర్తిరూపంగా కనిపించదు .  దేవి సగభాగంమాత్రమే దర్శనమిస్తుంటుంది. ఈ సగభాగమే రూపాన్ని వయస్సులవారీగా మారుస్తూ ఉంటుంది .  అమ్మవారి స్వరూపాన్ని దగ్గరగా పరిశీలిస్తే, ఉగ్రరూపిణిగా దర్శనమిస్తారు . నోటిలో కోరలు , దంతాలు ప్రస్ఫుటంగా కనిపిస్తూ ఉంటాయి . ఇక కన్నులు తీక్షణమైన దృక్కులతో భక్తులని పీడించే బాధలపాలిట శరాఘాతాల్లా తోస్తాయి . ఈ దేవి దుష్ట శిక్షణ , శిష్ఠరక్షణ తెలిసిన వరదాయనిగా చెబుతారు . 

అమ్మవారి  మిగిలిన సగం (  విగ్రహం క్రింది భాగం ) కాళీమఠ్ లో దర్శించుకోవచ్చు. కాళీమఠ్‌లో నిజానికి అమ్మవారి మిగతా శరీర భాగం ఉండదు. ఆ స్థానంలో  యంత్రాన్ని పూజిస్తారు. ఆదిశంకరాచార్యులు స్థాపించిన ఈ  యంత్రం అమ్మవారి యోనికి ప్రతిరూపంగా భావిస్తారు. 

చారిత్రిక ప్రాశస్త్యం 

ధారీదేవి ఆలయం దాదాపు 8 దశాబ్దాల నుండి వున్నట్లుగా చాలామంది భావిస్తున్నారు.నిజానికి ఆ ఆలయం కొన్ని వేల సంవత్సరాల నుండి ఉనికిలో వుందని తెలుస్తోంది. ఈ ఆలయం ప్రస్తావన మహాభారతంలోనూ ఉంది. సిద్ధపీఠం పేరుతో భాగవతంలోనూ పేర్కొన్నారు. 108 శక్తి పీఠాల్లో ధారీదేవి ఆలయం కూడా ఒకటని దేవీ భాగవతంలో తెలిపారు.ఈ ప్రదేశంలో మహాకాళి యొక్క అవతారమైన ధారీదేవి వెలసిందని ఆ కారణం వలన ఈ ప్రాంతానికి అమోఘమైన మహత్యం ఏర్పడిందని మహాభాగవతంలో పేర్కొనబడినది.  ధారీదేవి ఆదిశక్తి యొక్క ఉగ్రఅంశం అని చెబుతారు. 

క్రీ.శ 1882లో కేదారీనాథ్ ప్రాంతాన్ని ఓ ముస్లిం రాజు పడగొట్టి మసీదు నిర్మించాలని ప్రయత్నించాడు.ఆ రాజు చేసిన అపచారంతో కొండ చరియలు విరిగిపడి కేదారనాథ్ ప్రాంతం నేలమట్టమైపోయింది. ఆ ప్రకృతి విపత్తు వేలాది మందిని బలితీసుకుంది. దేవి మహత్మ్యాన్ని ప్రత్యక్షంగా చూసిన ఆ ఇస్లాం రాజు తన ప్రయత్నాన్ని విరమించుకుని తోకముడిచాడు. అప్పటి నుంచి ఈ ఆలయం జోలికి ఎవరైనా వెళితే ధారీదేవి ఆగ్రహం చవిచూడక తప్పదనే బలమైన విశ్వాసం ఈ ప్రాంతంలో స్థిరపడింది. 

అలకనందని నియంత్రించే శక్తి  

అలకనందా నది పరవళ్ళ నడుమ ఈ అద్భుతమైన  ప్రాచీన కాలం నాటి ధారీదేవి ఆలయదర్శనం అలౌకిక ఆధ్యాత్మిక ఆనందాన్నిసంప్రాప్తిపజేస్తుంది. ఈ దేవి అలకనందా నది ప్రవాహాన్ని నియంత్రిస్తుందని ఇక్కడి ప్రజల విశ్వాసం . అందుకు నిదర్శనంగా 2013లో జరిగిన ఒక దుర్ఘటన గురించి చెబుతూంటారు .  విద్యుత్ ఉత్పాదనకు అడ్డంగా వున్న ధారీదేవి విగ్రహాన్ని అక్కడి నుండి తొలిగించి ఆ విగ్రహాన్ని అక్కడికి పై ప్రదేశంలో వున్న ఒక పీఠం మీద ప్రతిష్టించారు .  అప్పుడు  కాళీ మఠ క్షేత్రవిగ్రహానికి మరియు ధారీదేవి విగ్రహానికి మధ్య వున్న దిక్కులకు సంబంధం మారిపోయింది . అందువలనే ధారీదేవి తన శాంతాన్ని కోల్పోయి ఆగ్రహాన్ని ప్రదర్శించిందని , భారీ జలప్రళయం సంభవించిందని అక్కడి పెద్దలు అభిప్రాయపడుతుంటారు . అక్కడ జరిగిన సంఘటనని విశ్లేషిస్తే, అది నిజమేనేమో అనిపించకమానదు . ధారీదేవి మూలమూర్తికి స్థలమార్పు చేసిన కొద్ది గంటలలోపే కేదారనాథ్ ప్రాంతంలో దట్టమైన కారుమబ్బులు కమ్ముకుని ఇప్పటివరకు ఆ ప్రాంతంలో కనీవినీ ఎరుగని కుంభవృష్టి ప్రారంభమైంది. ఆ తర్వాత 2 గంల పాటు ఆ మహావర్షం కొనసాగింది. ఆకస్మిక వరదలు ఉత్తరాఖండ్ ని ముంచెత్తాయి.ఈ వరదల కారణంగా దాదాపు 5000మంది మానవులు అకారమరణం పొందారు. ఇటు గుడిని పడగొట్టడానికి అటు కుంభవృష్టి కారణంగా అలకనంద వరదకు గురిఅవటం కేవలం కాకతాళీయం అని భావించటం బుద్ధిహీనత అని ఉత్తరాఖండ్ కి చెందిన కృష్ణాజీ అనే ఒక సాధువు పేర్కొనడం విశేషం . 
 
ఇప్పటికైనా ఆ దేవి విగ్రాన్ని స్వష్టలానికి చేర్చాలని స్థానికులు ప్రభుత్వాన్ని కోరుతున్నారు. ఓ వైపు సైన్స్, మరోవైపు స్తానికుల నమ్మకాలు ఏది నిజమో ఆ కాలస్వరూపానికే తెలియాలి .

ఇలా  చేరుకోవాలి 

ధారి దేవి ఆలయం శ్రీనగర్ నుండి రుద్రప్రయాగ్ వెళ్లే మార్గంలో వస్తుంది.ఈపీఠానికి ఉత్తరదిశలో కేథారనాథ్ జ్యోతిర్లింగం ఉంది.   కాబట్టి మీరు కేదార్‌నాథ్ లేదా బద్రీనాథ్ వెళ్ళినప్పుడల్లా ఈ ఆలయాన్ని చూడవచ్చు. శ్రీనగర్ నుండి దాని దూరం పదిహేను కిలోమీటర్లు, రుద్రప్రయాగ్ నుండి ఇరవై కిలోమీటర్లు. ఈ స్థలం పేరు కలిసౌర్.

Quote of the day

If you shut the door to all errors, truth will be shut out.…

__________Rabindranath Tagore