Online Puja Services

సంపదలు అనుగ్రహించే సంపత్కరీదేవి

3.137.185.180

ఎంత పేదవారికైనా ఆధ్యాత్మిక , ఆధిభౌతిక సంపదలు అనుగ్రహించే సంపత్కరీదేవి!!
- లక్ష్మి రమణ 

అమ్మవారికి అనంతమైన నామాలు. అనంతమైన రూపాలు. అవి అన్నీ అమ్మ స్వరూపాలే అయినప్పటికీ, ఒకే పరమాత్మ , అనేక కార్యాలు చేయడానికి అనేక రూపాల్లో ప్రభవించినట్లు, ఆ దేవదేవికూడా అనేకానేక  రూపాల్లో ప్రభవించి ఆయా రూపాల్లో తన భక్తులని అనుగ్రహిస్తూ, తదనుగుణమైన కార్యాలలో సానుకూలతని అనుగ్రహిస్తూ ఉంటుంది.  అటువంటి అమ్మవారి రూపాలలో ఆధ్యాత్మిక , ఆధిభౌతిక సంపదలు అనుగ్రహించే సంపత్కరీ దేవి ఒకరు.  

శ్రీ లలితాదేవి (Lalita Devi) యొక్క గజ దళానికి సంపత్కరీ దేవి (Sampatkari Devi)అధికారిణి. ఈ దేవి అనుగ్రహం లభించినవారికి నవ నిధులు సంప్రాప్తిస్తాయి. కోట్లాది గజ , తురగ , రధములు కలిగిన సంపత్కరీ దేవి, తనను నమ్మి వచ్చిన భక్తులందరికి సకల సంపదలను అనుగ్రహిస్తుంది. ఎంత పేదరికం లో వున్నవారికైనా ఈ దేవి అనుగ్రహం తో సకలసౌఖ్యాలు లభిస్తాయి.

లలితా సహస్రనామములలో "సంపత్కరీ సమారూఢ సింధూర వ్రజ సేవితా " అనే నామము ఈ దేవిని కీర్తిస్తున్నది.  ఒక కోటి ఏనుగులు వెంటరాగా, సకలాస్త్రశస్త్రములు దేవికి రక్షణ కాగా , రణకోలాహలమనే ఏనుగు మీద అధిరోహించి అమ్మవారు దర్శనమిస్తుంది. (Lalitha Sahasra Namavali)

దేవి అధిరోహించిన ఏనుగు యొక్క ఒక్కొక్క అడుగు లోను తామరపద్మాలు
దర్శనమిస్తాయి.

అమ్మవారి ఉపాసనా మార్గాన్ని బోధించిన వారు కణ్వ మహర్షి. గురు స్వరూపిణి, మహామాయ అయినా సంపత్కరీ దేవి  అమ్మవారి మంత్రోపాసన కూడా చేయవచ్చు. కానీ, దానిని గురుముఖతా మాత్రమే గ్రహించి అనుష్టించాలి. కనుక ఈ క్రింది ప్రార్థనని నిత్యమూ చేసుకుంటే, చక్కగా అమ్మవారి అనుగ్రహం కలుగుతుంది. 

అనేక కోటి మాతంగ తురంగ అథ పట్టిభిః ।
సేవితం-అరుణాకారం వందే సంపత్-సరస్వతి ॥

అనేక కోటి మాతంగ తురంగ అథ పట్టిభిః ।
సేవాతామరుణాకారాం వన్దే సమ్పత్సరస్వతీం ॥

 అర్థం:-    ఏనుగులు, గుర్రాలు మరియు పదాతిదళాలతో కూడిన భారీ అసంఖ్యాక సైన్యానికి నాయకత్వం వహించే దివ్య మాత శ్రీ సంపత్కరీ స్వరూపిణి అయినా సరస్వతీ  దేవిని మేము ధ్యానిస్తున్నాము. ఆమె ఎర్రటి వర్ణంలో  దర్శనమిచ్చే దివ్యస్వరూపిణి.  తెలివైనది. ఆమె దివ్య జ్ఞానాన్ని అనుగ్రహించి, అన్ని రకాల సంపదలను వెంటనే ప్రసాదిస్తుంది.

సంపత్కరీ దేవి వెంట ఉండే అసంఖ్యాకమైన ఏనుగులు, గుర్రాలు, పదాతిదళాలు నిరంతరం మనల్ని ముంచెత్తే వివిధ భౌతిక, ఆధ్యాత్మిక అడ్డంకులు, ఆలోచనలను సూచిస్తాయి. అవరోధాలను అధిగమించి భౌతిక , ఆధ్యాత్మిక సంపదలు రెండింటినీ త్వరగా పొందేందుకు అంకుశాన్ని పట్టుకొని వాటిని అధిరోహించి, అదిలించి సహాయం చేయడానికి శ్రీ మహాషోడశీ లలితా దేవి సంపత్కరీగా దర్శనం ఇస్తారు.  అటువంటి దివ్య మాత సంపత్కరికి మనసా నమస్కారం చేసుకుందాము. 

తనను భక్తితో ఉపాసించేవారికి అడగకనే కటాక్షించే కరుణామయి సంపత్కరీదేవి. ఎవరైతే ఈ దేవదేవిని భక్తి శ్రధ్ధలతో ధ్యానిస్తారో , 

వారు సకలదేవతలను, భూపాలకులను, శతృవులను సహితం తమ వశం చేసుకొనే శక్తిని పొందగలరని చెప్తారు. అటువంటి లలితా పరాభట్టారిక  అంకుశము యొక్క  అంశయే ఈ సంపత్కరీ దేవి. ఏనుగుని మదమణిచేందుకు అంకుశం ఉపయోగ పడినట్లు, మానవులలోని అహంకారాన్ని సంపత్కరీ దేవి అణిచి వేస్తుంది.

అహంకారం , మోహం అణగారి తనను శరణాగతితో పూజించే
భక్తుల జీవితాలలో శుభములను కలిగించి సకలసౌభాగ్యములను
కటాక్షిస్తుంది. 

సంపత్కరీ దేవికి నమ్మినవారిని విడువక రక్షించే దేవతగా పేరుంది. పేదలని ఆదుకొనే అమ్మగా, మనసుని అదుపు చేసి ఐహిక , ఆధ్యాత్మిక సంపదల్ని అనుగ్రహించే దేవతగా ప్రఖ్యాతి ఉంది. కనుక ఆ అమ్మవారిని ప్రతిరోజూ పైన చెప్పుకున్నట్టుగా ధ్యానిద్దాం . 

శుభం . 

Sampatkari Devi, Lalitha, Lalita, Tripura Sundari, Gaja Dalam

#sampatkaridevi #sampatkari

Quote of the day

From the solemn gloom of the temple children run out to sit in the dust, God watches them play and forgets the priest.…

__________Rabindranath Tagore