Online Puja Services

గర్భిణీ స్త్రీల కోసం

3.129.69.151

ॐ ఒక ముఖ్యమైన సందేశం

మాతృమూర్తులగు స్త్రీలకు లలితా సహస్ర నామం నందు వరుసగా 98 వ శ్లోకం నుండి 110 వ శ్లోకం వరకు ఎటువంటి ఆహరం తీసుకోవాలో చక్కగా తెలపబడింది. వాటిని ఓసారి పరిశీలిద్దాం.

విశుద్ధి చక్రనిలయా,‌ రక్తవర్ణా, త్రిలోచనా |
ఖట్వాంగాది ప్రహరణా, వదనైక సమన్వితా || 98 ||
పాయసాన్నప్రియా, త్వక్‍స్థా, పశులోక భయంకరీ |
అమృతాది మహాశక్తి సంవృతా, డాకినీశ్వరీ || 99 ||
అనాహతాబ్జ నిలయా, శ్యామాభా, వదనద్వయా |
దంష్ట్రోజ్జ్వలా,‌உక్షమాలాధిధరా, రుధిర సంస్థితా || 100 ||
కాళరాత్ర్యాది శక్త్యోఘవృతా, స్నిగ్ధౌదనప్రియా |
మహావీరేంద్ర వరదా, రాకిన్యంబా స్వరూపిణీ || 101 ||
మణిపూరాబ్జ నిలయా, వదనత్రయ సంయుతా |
వజ్రాధికాయుధోపేతా, డామర్యాదిభి రావృతా || 102 ||
రక్తవర్ణా, మాంసనిష్ఠా, గుడాన్న ప్రీతమానసా |
సమస్త భక్తసుఖదా, లాకిన్యంబా స్వరూపిణీ || 103 ||
స్వాధిష్ఠానాంబు జగతా, చతుర్వక్త్ర మనోహరా |
శూలాద్యాయుధ సంపన్నా, పీతవర్ణా,‌உతిగర్వితా || 104 ||
మేదోనిష్ఠా, మధుప్రీతా, బందిన్యాది సమన్వితా |
దధ్యన్నాసక్త హృదయా, కాకినీ రూపధారిణీ || 105 ||
మూలా ధారాంబుజారూఢా, పంచవక్త్రా,‌உస్థిసంస్థితా |
అంకుశాది ప్రహరణా, వరదాది నిషేవితా || 106 ||
ముద్గౌదనాసక్త చిత్తా, సాకిన్యంబాస్వరూపిణీ |
ఆఙ్ఞా చక్రాబ్జనిలయా, శుక్లవర్ణా, షడాననా || 107 ||
మజ్జాసంస్థా, హంసవతీ ముఖ్యశక్తి సమన్వితా |
హరిద్రాన్నైక రసికా, హాకినీ రూపధారిణీ || 108 ||

సహస్రదళ పద్మస్థా, సర్వవర్ణోప శోభితా |
సర్వాయుధధరా, శుక్ల సంస్థితా, సర్వతోముఖీ || 109 ||
సర్వౌదన ప్రీతచిత్తా, యాకిన్యంబా స్వరూపిణీ |
స్వాహా, స్వధా,‌உమతి, ర్మేధా, శ్రుతిః, స్మృతి, రనుత్తమా || 110 ||

పై శ్లోకాలను అదే వరుసక్రమంలో పరిశీలిస్తే మాతృమూర్తులగు గర్భిణీ స్త్రీల ఆహార నియమావళి అవగతమౌతుంది

మొదటినెల -
విశుద్ధి చక్రంలో శ్రీ లలితా పరాదేవతయే డాకినీ దేవతగా కొలువై వుంది. ఈ దేవత ఎర్రని ఛాయతో త్రినేత్రాలు కలిగి వుంటుంది. ఈమె ఖట్వాంగాన్ని, ఖడ్గాన్ని, త్రిశూలాన్ని ఆయుధాలుగా ధరించి, మొదటినెలలో గర్బస్థ శిశువునకు ఏ విధమైన ఆటంకాలు లేకుండా పిండవృద్ధి జరిగేలా సంరక్షిస్తుంది. ఈమె త్వక్ స్థ. ఈమె చర్మమనే ధాతువునకు అధిదేవత. ఏ విధమైన చర్మరోగాలు సోకకుండా తేజోవంతమైన చర్మాన్ని శిశువునకు అనుగ్రహిస్తుంది. ఈమెకు పాయసాన్నం ప్రీతి. బియ్యంను పాలల్లో ఉడికించి, బెల్లం జోడించి, తదుపరి ఆవునెయ్యిని కలిపిన పాయసాన్నప్రసాదమును లలితా సహస్ర నామ పారాయణం చేసిన పిమ్మట నివేదనను చేసి, దానిని పవిత్రభావనతో గర్భిణీ స్త్రీ మొదటినెలలో స్వీకరిస్తే, చక్కగా పిండాభివృద్ధి జరుగుతుంది.

రెండవ నెల -
అనాహత చక్రంలో శ్రీ లలితా పరాదేవత రాకిని దేవతగా కొలువై వుంది. ఈమె శ్యామ వర్ణంలో రెండు ముఖాలతో, అక్షమాల, శూలం, డమరుకం, చక్రాలను ధరించి యుంటుంది. ఈమె రుధిర సంస్థిత. రక్తం అనే ధాతువుకు అధిదేవత. ఈమెకు స్నిగ్ధానం అంటే నేతి అన్నం ప్రీతి. ఆవునెయ్యితో కలిపిన అన్నప్రసాదంను భక్తిశ్రద్ధలతో లలితా పారాయణం చేసిన పిమ్మట అమ్మవారికి నివేదన చేసి, సద్భావనతో గర్భిణీ స్త్రీ రెండవనెలలో స్వీకరిస్తే, శిశువు చక్కగా రక్తపుష్టితో వృద్ధి చెందుతుంది.

మూడవ నెల -
మణిపూర చక్రంలో శ్రీ లలితా పరాదేవత లాకిని దేవతగా కొలువై వుంది. ఈమె రక్తవర్ణంలో మూడు శిరస్సులతో వజ్రం, శక్తి, దండం, అభయముద్రలను ధరించి యుంటుంది. ఈమె మాంస నిష్ఠ. మాంసం అనే ధాతువునకు అధిదేవత. ఈమెకు గుడాన్నం అంటే బెల్లపు పొంగలి ప్రీతి. అన్నం, బెల్లం, ఆవునెయ్యిలతో తయారుచేసిన పొంగలి ప్రసాదంను లలితా పారాయణమనంతరం అమ్మవారికి నివేదన చేసి, భక్తితో గర్భిణీ స్త్రీ మూడవనెలలో స్వీకరిస్తే, శిశువు దేహంలో మాంసవృద్ధి గావిస్తుంది.

నాల్గవ నెల -
స్వాదిష్టాన చక్రంలో శ్రీ లలితా పరాదేవత కాకిని దేవతగా కొలువై వుంది. ఈమె బంగారు ఛాయలో నాలుగు ముఖాలతో, శూలం, పాశం, కపాలం, అభయముద్రలు ధరించి యుంటుంది. ఈమె మేధో నిష్ఠ. మేధ అనే ధాతువుకు అధిదేవత. ఈమెకు దద్ధ్యన్నం అంటే పెరుగన్నం ప్రీతి. అన్నంలో ఆవుపాల పెరుగుతో కలిపిన ప్రసాదంను లలితా పారాయణం పిమ్మట అమ్మవారికి ప్రీతిగా నివేదన చేసి, సద్భావనతో గర్భిణీ స్త్రీ నాల్గవ నెలలో స్వీకరిస్తే, శిశువునకు మేధావృద్ధి కలుగుతుంది.

ఐదవ నెల -
మూలాధార చక్రంలో శ్రీ లలితా పరాదేవత సాకిని దేవతగా కొలువై వుంది. ఈమె ఐదు ముఖాలతో, అంకుశం, కమలం, పుస్తకం, జ్ఞానముద్రలను కలిగి యుంటుంది. ఈమె ఆస్థి సంస్థిత. ఎముకలు అనే ధాతువునకు అధిదేవత. ఈమెకు ముద్గౌదన అంటే కట్టుపొంగలి ప్రీతి. పెసరపప్పు, మిరియాలు, జీలకర్ర, ఆవునెయ్యితో కలిపిన అన్నప్రసాదాన్ని లలితా పారాయణం పిమ్మట అమ్మవారికి నివేదన చేసి, భక్తితో గర్భిణీ స్త్రీ ఐదవ నెలలో స్వీకరిస్తే, శిశువునకు దృఢమైన ఎముకలు వృద్ధి చెందుతాయి.

ఆరవ నెల -
ఆజ్ఞా చక్రంలో శ్రీ లలితా పరాదేవత హాకిని దేవతగా కొలువై యుంటుంది. ఈమె శుక్రవర్ణంలో ఆరు ముఖాలుతో శోభిల్లుతుంది. ఈమె మజ్జా సంస్థ. మజ్జ అంటే ఎముకల లోపలున్న గుజ్జు. ఈమె మజ్జా దాతువునకు అధిదేవత. ఈమెకు హరిద్రాన్నం అంటే పులిహారం ప్రీతి. ఈ పులిహార ప్రసాదంను లలితా పారాయణం పిమ్మట అమ్మవారికి నివేదన చేసి, భక్తి విశ్వాసంలతో గర్భిణీ స్త్రీ ఆరవనెలలో స్వీకరిస్తే, శిశువు ఎముకలలో మజ్జాధాతువు వృద్ధి చెంది పరిపుష్టి పొందుతుంది.

ఏడవ నెల -
సహస్రార చక్రంలో శ్రీ లలితా పరాదేవత యాకిని దేవతగా కొలువై యుంటుంది. ఈమె సర్వ వర్ణాలతో, సర్వాయుధాలను ధరించి యుంటుంది. ఈమె శుక్ల సంస్థిత. జీవశక్తికి అధిష్టాన దేవత. ఈమెకు సర్వోదన అంటే పాయసాన్నం, నేతి అన్నం, గుడాన్నం, దద్ధ్యన్నం, కట్టుపొంగలిహరిద్రాన్న ప్రసాదంలు ప్రీతి. ఈ ప్రసాదాలను వరుసక్రమంలో ఆరురోజులు లలితా పారాయణమనంతరం అమ్మవారికి నివేదన చేసి, సద్భావనతో అమ్మను స్మరిస్తూ గర్భిణీ స్త్రీ ఏడవ నెలలో స్వీకరిస్తే, శిశువు సంపూర్ణమైన దేహాకృతిని దాల్చి, పరిపూర్ణంగా వృద్ధి చెందుతుంది.

ఇక ఎనిమిదో నెల నుండి శిశు జననం వరకు -
సంపూర్ణ భక్తి విశ్వాసాలతో శ్రీ లలితా అమ్మవారిని ఆరాధిస్తూ, క్షీరాన్నాన్ని నివేదన చేస్తూ, స్వీకరిస్తే,చక్కటి ఆయురారోగ్యాలతో ప్రజ్ఞావంతులైన తేజోమయ సంతానం కలగడం తధ్యం.

Quote of the day

Just as a candle cannot burn without fire, men cannot live without a spiritual life.…

__________Gautam Buddha