Online Puja Services

నిమిషంలోనే కోర్కెలు తీర్చే నిమిషాదేవి

18.191.102.112

నిమిషంలోనే కోర్కెలు తీర్చేనిమిషాదేవి!
-సేకరణ : లక్ష్మి రమణ 

దక్షిణాదిన కృష్ణా, గోదావరి, తుంగభద్రలతో సరిసమానమైన ప్రాభవం కలిగిన నది – కావేర. ఆ కావేరీ నదీ తీరాన ఎన్నో రాజ్యాలు వెలిశాయి, ఎన్నో సంస్కృతులు విరిశాయి. ఇప్పటికీ కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాలలో తాగునీటికీ, సాగునీటికీ ముఖ్య ఆధారం కావేరి. లౌకిక జీవనంలో దాహార్తిని తీర్చే కావేరి, ఆధ్యాత్మిక ఆర్తిని కూడా తీరుస్తుంది. అందుకే వైష్ణవులకు ఆరాధ్యమైన శ్రీరంగక్షేత్రం, శైవులకు ఇష్టమైన తంజావూర్ ఈ నదీ తీరంలోనే ఉన్నాయి. ఇక ఆ కోవలో పార్వతీదేవి అవతారమైన నిమిషాంబ ఆలయం గురించి కూడా ఓ మాట చెప్పుకోవాల్సిందే!

కర్ణాటకలోని శ్రీరంగపట్నానికి కేవలం రెండు కిలోమీటర్ల దూరంలో గంజాం అనే చిన్న పల్లెటూరు ఉంది. అక్కడ ఉన్నదే ఈ నిమిషాదేవి ఆలయం. పూర్వం ముక్తకుడు అనే రుషి ఉండేవాడట. ఆయన సాక్షాత్తూ శివుని అంశ. ఆ ముక్తక రుషి లోకకళ్యానార్థం ఒక గొప్ప యాగాన్ని తలపెట్టాడు. ఆ యాగం జరిగితే రాక్షసులకు ఎక్కడ మూడుతుందో అన్న భయం అసురులకు పట్టుకుంది. దాంతో యాగాన్ని చెడగొట్టేందుకు వారు సకల ప్రయత్నాలను మొదలెపెట్టారు. యాగాన్ని చెడగొట్టేందుకు ప్రయత్నిస్తున్న రాక్షసులను అడ్డుకోవడం ముక్తక రుషి వల్ల కాలేదు. దాంతో స్వయంగా పార్వతీదేవే యజ్ఞకుండంలో నుంచి ఉద్భవించి, రాక్షస సంహారాన్ని కావించిందట. అలా అవతరించిన పార్వతీదేవిని నిమిషాదేవిగా కొలుస్తారు. ఇప్పటి గంజాం ప్రాంతంలోనే ఆనాటి సంఘటన జరిగిందని నమ్ముతారు. అందుకే ఇక్కడ నిమిషాదేవికి ఆలయాన్ని నిర్మించారు.

ఒకప్పుడు శ్రీరంగపట్నం కర్ణాటక రాజ్యానికి రాజధానిగా ఉండేది. ఒడియార్లనే రాజులు ఈ రాజధాని కేంద్రంగానే తమ పాలన సాగించేవారు. అలా 400 ఏళ్ల క్రితం కృష్ణరాజ ఒడియార్‌ అనే రాజు ఈ ఆలయాన్ని నిర్మించినట్లు తెలుస్తోంది. ఇక్కడి అమ్మవారి విగ్రహంతో పాటుగా శ్రీచక్రాన్ని కూడా ఆరాధించడం విశేషం. అమ్మవారి ఆలయం పక్కనే శివునికి ఉపాలయం కూడా ఉంది. ఇక్కడి ఈశ్వరుని మౌక్తికేశ్వరునిగా పిలుస్తారు.
 
భక్తులు నిమిషాంబ దేవికి గాజులు, దుస్తులను, నిమ్మకాయల దండలను నివేదిస్తుంటారు. ఇక్కడి అమ్మవారి మెడలో వేసిన నిమ్మకాయను తీసుకువెళ్లి పూజాగదిలో ఉంచుకుంటూ సర్వశుభాలూ జరుగుతాయని నమ్ముతారు. ఇక్కడి ఆలయంలో కనిపించే మరో విశేషం- బలిభోజనం. రోజూ ఇక్కడ కాకులకు ఆహారాన్ని అందిస్తారు. అందుకోసం పూజారి ముందుగా బలిపీఠం మీద ఆహారాన్ని ఉంచి, ఆలయంలోని గంటను మోగించగానే, ఎక్కడెక్కడి నుంచో కాకులు వచ్చి ఆహారాన్ని స్వీకరించి వెళ్లిపోతాయి.
 
నిమిషాంబ దేవి అవతరించింది గంజాం ప్రదేశంలోనే అయినా... ఆమెకు దేశవ్యాప్తంగా చాలా చోట్ల ఆలయాలు ఉన్నాయి. తెలుగు రాష్ట్రాల్లోనూ నిమిషాంబకు ప్రత్యేకమైన ఆలయాలు ఉన్నాయి. వాటిలో బోడుప్పల్‌లోని ఆలయం ప్రముఖమైనది.

మాతకీ పేరు రావడం వెనుక ఆమె మహాత్యమే దాగిఉంది . భక్తులు తమ కోరికలను తీర్చమంటూ ఆ తల్లిని వేడుకుంటే, ఒకే ఒక్క నిమిషంలోనే ఫలితం కనిపిస్తుందట. మరింకెందుకాలస్యం , బయల్దేరండి నిమిషాంబ యాత్రకి .

Quote of the day

You can't cross the sea merely by standing and staring at the water.…

__________Rabindranath Tagore