Online Puja Services

శ్రీ గౌరీ దశకము

18.224.63.87

ప్రతిరోజూ ఉదయాన్నే ఎవరు ఈ గౌరీ దశకాన్ని భక్తి శ్రద్ధలతో పఠిస్తారో వారికి తరగని సంపదలనీ , జ్ఞానాన్ని, శుభాలనీ  ఆ గౌరీదేవి అనుగ్రహిస్తుంది స్వయంగా శంకరాచార్యులు చెప్పారు . కాబట్టి   శ్రీ ఆదిశంకరాచార్య విరచిత శ్రీ గౌరీదశకం చక్కని తాత్పర్యంతో ఇక్కడ మీ సౌలభ్యం కోసం పొందుపరుస్తున్నాం .  
   
శ్రీ గౌరీ దశకము


1)లీలారబ్ధస్థాపిత లుప్తాఖిలలోకాం !!

లోకాతీతైర్యోగిభిరన్త శ్చిరమృగ్యామ్ !!

బాలాదిత్య శ్రేణిసమాన ద్యుతిపుంజాం !!

గౌరీమమ్బామమ్బురుహాక్షీమహమీడే !!

*తన లీలచే సమస్తలోకములను సృష్టించి కాపాడి నశింపచేయునదీ, లోకాతీతులైన యోగులచే చిరకాలముగా వెతకబడుచున్నదీ, బాలసూర్య సమూహము వంటి కాంతి మండలము కలదీ, పద్మముల వంటి కన్నులు కలదీ అగు జగదంబయైన గౌరీదేవిని నేను స్తుతించు చున్నాను.


2) ప్రత్యాహార ధ్యానసమాధిస్థితి భాజాం!!

నిత్యం చిత్తే నిర్వృతికాష్టాం కలయంతీమ్!!

సత్య జ్ఞానా నన్దమయీం తాం తనురూపాం!!

గౌరీమమ్బామమ్బురుహాక్షీమహమీడే !!

*ప్రత్యాహారము-ధ్యానము-సమాధి అను యోగముల నాచరించు యోగుల మనస్సు నందు ఎల్లప్పుడు సంతోషమును కలిగించునదీ, సత్యము- జ్ఞానము- ఆనందములు స్వరూపముగా కలదీ, సూక్ష్మ రూపములోనున్నదీ, పద్మముల వంటి కన్నులు కలదీ,అగు జగదంబయైన గౌరీదేవిని నేను స్తుతించుచున్నాను.


3)చన్ద్రాపీడానన్దిత మన్దస్మితవక్త్రాం !!

చన్ద్రాపీడాలంకృత నీలాలక శొభామ్ !!

ఇంద్రోపేంద్రాద్యర్చిత పాదామ్బుజ యుగ్మాం !!

గౌరీమమ్బా మమ్బురుహాక్షీ మహమీడే !!

*చంద్రచూడుడగు శివునిచే ఆనందింప చేయబడిన చిరునవ్వు ముఖము కలదీ, తన నల్లని కురులలో చంద్రుని అలంకరించుకున్నదీ, ఇంద్రుడు- విష్ణువు మొదలగు దేవతలచే పూజింపబడు పాదపద్మములు కలదీ, పద్మముల వంటి కన్నులు కలదీ, అగు జగదంబయైన గౌరీదేవిని నేను స్తుతించుచున్నాను.


4) ఆదిక్షాన్తా మక్షరమూర్త్యా విలసన్తీం!!

భూతేె భూతే భూతకదంబ ప్రసవిత్రీమ్!!

శబ్దబ్రహ్మానంద మయీం తాం తటిదాభాం!!

గౌరీమంబా మంబురుహాక్షీ మహమీడే !!

*’అ’ కారము మొదలు ’క్ష’ కారము వరకు ఉన్న అక్షరములు తన స్వరూపముగా విలసిల్లుచున్నదీ, పంచమహాభూతములలో (భూమి- నీరు- గాలి- అగ్ని- ఆకాశము) ప్రతి దానియందు అనేక ప్రాణులను సృష్టించునదీ, శబ్దబ్రహ్మ స్వరూపిణియైనదీ, ఆనందముతో నిండినదీ మెరుపువలే ప్రకాశించునదీ, పద్మముల వంటి కన్నులు కలదీ, అగు జగదంబయైన గౌరీ దేవిని నేను స్తుతించు చున్నాను.


5)మూలాధారాదుత్థితవీథ్యా విధిరన్ధ్రం !!

సౌరం చాన్ద్రం వ్యాప్య విహారజ్వలితాఙ్గీమ్ !!

యేయం సూక్ష్మాత్సూక్ష్మతనుస్తాం సుఖరూపాం !!

గౌరీమంబామమ్బురుహాక్షీమహమీడే !!

*సుషుమ్నానాడీ మార్గము ద్వారా మూలాధారచక్రము నుండి బ్రహ్మరంధ్రము వరకు సూర్య చంద్రస్థానములైన ’ఇడా’ ’పింగళా' నాడుల యందు విహారించునదీ, తేజోమూర్తి యైనదీ, సూక్ష్మమైన పదార్థము కంటే సూక్ష్మమైనదీ, సుఖస్వరూపిణియైనదీ, పద్మముల వంటి కన్నుల కలదీ, అగు జగదంబయైన గౌరీదేవిని స్తుతించు చున్నాను.


6)నిత్యః శుద్ధో నిష్కల ఎకో జగదీశః !!

సాక్షీ యస్యాః సర్గవిధౌ సంహరణే చ !!

విశ్వత్రాణక్రీడన లోలాం శివపత్నీం !!

గౌరీమమ్బామమ్బురుహాక్షీమహమీడే !!

*నిత్యుడు- శుద్దుడు- పరిపూర్ణుడు- ఒక్కడు- జగదీశుడు అగు పరమేశ్వరుడు గౌరీదేవిని చేయు సృష్టి స్థితిలయలకు సాక్షి,ప్రపంచ రక్షణము అను క్రీడయందు ఇష్టము కలదీ, శివుని భార్య యైనదీ,పద్మములవంటి కన్నులు కలదీ, అగు జగదంబయైన గౌరీదేవిని నేను స్తుతించు చున్నాను.


7) యస్యాః కుక్షౌ లీనమఖణ్డం జగదణ్డం !!

భూయోభూయః ప్రాదురభూదుత్థితమేవ !!

పత్యా సార్ధం తాం రజతాద్రౌ విహరన్తీం !!

గౌరీమమ్బామమ్బురుహాక్షీమహమీడే !!

*గౌరీదేవి గర్భము నందున్న సమస్త లోకములు మరల మరల పుట్టు చుండును. లీనమగు చుండును. భర్తతో కలిసి వెండి కొండపై విహరించునదీ,పద్మములవంటి కన్నులు కలదీ, అగు జగదంబ యైన గౌరీదేవిని నేను స్తుతించుచున్నాను.


8)యస్యామోతం ప్రోతమశేషం మణిమాలా !!

సూత్రే యద్వత్ క్వాపి చరం చాప్యచరం చ !!

తామధ్యాత్మజ్ఞానపదవ్యా గమనీయాం !!

గౌరీమమ్బామమ్బురుహాక్షీమహమీడే !!

*చరాచర రూపమైన ఈ ప్రపంచమంతయు,దారము నందు మణులవలే గౌరీ దేవియందు  అల్లుకుని ఉన్నది. అధ్యాత్మజ్ఞాన మార్గముచే తెలుసుకొనదగినదీ,పద్మములవంటి కన్నులు కలదీ. అగు జగదంబయైన గౌరీదేవిని నేను స్తుతించుచున్నాను.


9)నానాకారైః శక్తికదమ్బైర్భువనాని !!

వాప్య స్వైరం క్రీడతి యేయం స్వయమేకా !!

కల్యాణీం తాం కల్పలతామానతిభాజాం !!

గౌరీమమ్బామమ్బురుహాక్షీమహమీడే !!

*గౌరీదేవి తాను ఒక్కతేగానే ఉండి శక్తివంతములైన నానారూపములతో లోకములనన్నిటినీ వ్యాపించి స్వేచ్చగా క్రీడించు చున్నది. కళ్యాణస్వరూపిణి, భక్తుల పాలిట కల్పలత, పద్మముల వంటి కన్నులు కలదీ. అగు జగదంబయైన గౌరీదేవిని నేను స్తుతించుచున్నాను.


10)ఆశాపాశక్లేశవినాశం విదధానాం !!

పాదామ్భోజధ్యానపరాణాం పురుషాణామ్!!

ఈశామీశార్ధాఙ్గహరాం తామభి రామాం!!

గౌరీమమ్బామమ్బురుహాక్షీమహమీడే !!

*తన పద్మములను ధ్యానించు మనుషులకు ఆశాపాశముల వలన కలుగు బాధలను నశింప చేయునదీ, పరమశివుని అర్ధాంగి, పరమేశ్వరీ, పద్మములవంటి కన్నులు కలదీ అగు జగదంబయైన గౌరీదేవిని నేను స్తుతించుచున్నాను.


11)ప్రాతఃకాలే భావవిశుద్ధః ప్రణిధానా- !!

ద్భక్త్యా నిత్యం జల్పతి గౌరీదశకం యః !!

వాచాం సిద్ధిం సంపదమగ్ర్యాం శివభక్తిం !!

తశ్యావశ్యం పర్వతపుత్రీ విదధాతి !!

*ఎవరైతే శుద్ధమైన హృదయమును కలవారై భక్తితో ప్రాతః కాలము నందు ఈ గౌరీ దశకమును స్తోత్రమును పఠించునో అతనికి వాక్సిద్దినీ, ఉన్నతమైన సంపదను, శివభక్తినీ గౌరీదేవి తప్పక ప్రసాదించును.

!!జయ జయ శంకర !! హర హర శంకర !!

Quote of the day

To be idle is a short road to death and to be diligent is a way of life; foolish people are idle, wise people are diligent.…

__________Gautam Buddha