Online Puja Services

అష్టలక్ష్ములూ తిష్టవేసుకొని ఉండిపోతారట

18.118.184.237

ఈ అర్హతలు ఉన్నవారింట అష్టలక్ష్ములూ తిష్టవేసుకొని ఉండిపోతారట .  ఇంతకీ ఏమిటా అర్హతలు ?
- లక్ష్మి రమణ 

 లక్ష్మీదేవి అనుగ్రహం కోసం అర్రులు చాచని వారెవరు ? సామాన్య మానవుని నుండీ మహర్షి వరకూ అందరికీ ఆ లక్ష్మీ కరుణా కటాక్షాలు అవసరమే మరి ! ధనముని ఆశించేవారికి లక్షీ కటాక్షం అవసరము కానీ, మహర్షులకి ఎందుకండీ !! అంటారేమో ! అందుకే ఆమె ఘానలక్ష్మీ రూపంలోనూ విరాజిల్లుతూ ఉంది . ఆ మహర్షులకి ఉండే తృష్ణ అదొక్కటే కదా ! అందువల్ల వారికి కూడా లక్ష్మీ కటాక్షం అవసరమే మరి ! అయితే, ఎల్లరకూ లక్ష్యమైన లక్ష్మీ కటాక్షాన్ని పొందేందుకు మనకి కూడా కొన్ని అర్హతలు ఉండాలిట ! అవున్నచోట అష్టలక్ష్ములూ తిష్టవేసుకొని ఉండిపోతారట .  ఇంతకీ ఏమిటా అర్హతలు ? తెలుసుకుందాం రండి. 

లక్ష్మీ దేవి అష్ట స్వరూపాలనీ ఒక్క సారి అష్టలక్ష్మీ స్తోత్రంలో చదువుకోండి . ఆవిడే ఆదిలక్ష్మిగా సర్వ శక్తి ప్రదాయనిగా సాక్షాత్కరిస్తుంది . ధాన్యం, ధనం, ధైర్యం , విజ్ఞానం, సద్భుద్ది , సంతానం, ఆరోగ్యం ఇలా అష్ట సంపదలూ ఆ చల్లని తల్లి అనుగ్రహాలే .  ఇవన్నీ సౌభాగ్యాలే, సంపదలే ! వీటిల్లో ఏ ఒక్కటి లభించినా, ఏ కొన్ని లభించినా మనపై ఆ చల్లని తల్లి కృపా కటాక్షాలు నిలిచినట్టే !!  అన్నిటినీ మించి "నాకు భగవంతుడు అన్నీ ఇచ్చాడు. నేను సుఖమైన, సౌకర్యవంతమైన జీవితాన్ని గడుపుతున్నాను, అందుకు భగవంతుడికి సర్వదా నేను కృతజ్ఞుడను." అని ఎవరు సంతృప్తిగా ఉంటారో వారికి లక్ష్మీ కటాక్షం మిక్కిలిగా లభించినట్టు భావించాలి . 

ఎక్కడైతే, మనుషులు ఇటువంటి ఆత్మతృప్తితో ఉంటారో అటువంటి చోటును లక్ష్మీదేవి వదిలిపోదుట. ఆ విధంగా ఆమే అనుగ్రహం ఎల్లప్పుడూ మనకి నిత్యమై ఉండాలంటే  కొన్ని అర్హతలు సంపాదించవలసి ఉంటుంది. అవేమిటి అంటే, 

ఎప్పుడూ ఇతరులని నొప్పించకుండా, ఇతరులకి ప్రియాన్ని కలిగించేలా మాట్లాడాలి . 
కుటుంబ సభ్యులు అన్యోన్యతతో, ప్రేమ, అభిమానం , వాత్సల్యాన్ని కలిగి ఉండాలి . 
అతిథి దెవొ భవ అనే ఆర్యోక్తిని గుర్తెరిగి , ఆచరిస్తూ ఉండాలి . 
 భోజనాన్ని లేదా ఆహారాన్ని  మితంగా , అవసరమైనంతవరకే స్వీకరించాలి. 
అతిగా నిద్రపోకూడదు . 

గట్టి గట్టిగా ఒకరిపై ఒకరు అరచుకోవడం, కలహాలు పెట్టుకోవడం , పరనింద, ఆత్మస్తుతి ,  ఇతరులను చులకనగా చూడడం, ఇవన్ని మనని లక్ష్మీ కటాక్షానికి దూరం చేస్తాయి . లక్ష్మీ దేవికి తాహతుకు మించిన పూజలూ , పునస్కారాలూ చేయక పోయినా , పైన చెప్పబడిన లక్షణాలని ఒంటబట్టించుకొని , ఆ విధంగా నడుచుకోనే ప్రయత్నం చేస్తే, లక్ష్మీ దేవి తానంతట తానుగా వచ్చి మన ఇంట వశిస్తుంది . అదే ఆమెకు పూజగా స్వీకరిస్తుందని పెద్దలు చెబుతారు . ఈ విధంగా లక్ష్మీ కటాక్షాన్ని పొందవచ్చు .

గృహమే కదా స్వర్గసీమ అన్నట్టు , గృహాన్ని నందనవనంగా మార్చేసే ఇటువంటి  గొప్ప లక్షణాలు అమ్మ అనుగ్రహాన్ని అందించడమే కాకుండా, ఇంటిని నిజంగానే ఒక స్వర్గంగా మార్చేస్తాయి . కాదంటారా ! 

లక్ష్మీ కటాక్ష సిద్ధిరస్తు !! శుభం !!

Quote of the day

The Vedanta recognizes no sin it only recognizes error. And the greatest error, says the Vedanta is to say that you are weak, that you are a sinner, a miserable creature, and that you have no power and you cannot do this and that.…

__________Swamy Vivekananda