Online Puja Services

సర్వదేవతా నిలయం బిల్వవృక్షం

13.58.150.59

సర్వదేవతా నిలయం బిల్వవృక్షం

లక్ష్మీదేవి తపోఫలం బిల్వవృక్షం:

ఒక పురాణకథనం ప్రకారం, లక్ష్మిదేవి తపోఫలంగా ఆమె కుడిహస్తం నుండి బిల్వవృక్షం ఆవిర్భవిస్తే, దానిని దేవతలందరూ తీసుకువెళ్లి నందనవనంలో నాటినట్టు, అక్కడినుండి భూలోకంలోకి వచ్చినట్టూ చెప్తారు. అందుకే లక్ష్మీదేవిని బిల్వనిలయ అంటారు.
స్కాందపురాణంలోని కథనం ప్రకారం లక్ష్మీదేవి ఒకసారి పరమేశ్వరుని గూర్చి ఘోరమైన తపస్సు మొదలుపెట్టింది. లక్ష సువర్ణ పుష్పాలతో శివుణ్ణి పూజించాలని సంకల్పించిన లక్ష్మీదేవి పుష్పాలను సమకూర్చుకుని శివారాధన ప్రారంభించింది. అయితే ఆమె భక్తిని పరిక్షించదలచిన శివుని సంకల్పానుసారం ఒక పుష్పం తగ్గింది. దాంతో ఏం చెయ్యాలో అర్థంకాక ఆమె తన వక్షోజాన్ని కోసి పుష్పంగా సమర్పించిందట. ఆమె భక్తికి మెచ్చి ఆ తపః ఫలితంగా మారేడు వృక్షాన్ని ఉద్భవింపచేసినట్టు ఆ దళాలతో తనను పూజిస్తే తాను అనుగ్రహిస్తానని చెప్పినట్టు ఓ చోట కనిపిస్తోంది.

సర్వదేవతామయం బిల్వవృక్షం :

బిల్వవృక్షం లో సర్వదేవతలు కొలువుంటారని చెప్తారు. ఈ వృక్షం యొక్క ముళ్ళు అమ్మవారిని, కొమ్మలు వేదాలను, వేళ్ళు శివుడిని సూచిస్తాయి.
బిల్వపత్రంలో ఉండే మూడుదళాలు శివుడి త్రినేత్రాలను సూచిస్తాయి. అందుకనే బిల్వదళాలతో శివుణ్ణి పూజించేటప్పుడు మూడు ఆకులున్న దళాలను మాత్రమే ఉపయోగించాలి. మూడురేకులలో ఎడమవైపు బ్రహ్మ, కుడివైపు విష్ణువు, మధ్యలో శివుడు, ముందు భాగంలో అమృతం, వెనుక భాగంలో యక్షులు ఉన్నారు.

బిల్వవృక్ష విశిష్టత :

బిల్వదళాలు ఒక్క శివునికే కాదు త్రిమూర్తులకు అత్యంత ప్రీతికరమైనవే. ప్రసిద్ధమైన పుణ్యతీర్థాలన్నిటిలో కూడా మారేడు చెట్టు మొదట్లోనే ఉంటాయి.అందుకనే మారేడుచెట్టు మొదట్లో స్నానం చేస్తే సర్వ తీర్థాల్లో స్నానం చేసిన ఫలితం లభిస్తుంది. మారేడుచెట్టును గంధపుష్పాక్షతలతో పూజిస్తే సర్వపాపాలనుండి విముక్తులవడమే కాకుండా శివసాయుజ్యం పొందుతారు. ఈ చెట్టు క్రింద అన్నదానం చేస్తే మరే జన్మలోనూ దారిద్ర్యాన్ని అనుభవించకుండా ఉంటారని కూడా చెప్తారు. దీని నీడన ఒక్కరికి అన్నదానం చేసినంత మాత్రానే అద్భుతమైన ఫలితం లభిస్తుంది. మారేడుచెట్టు ఇంత మహిమాన్వితమైనది కాబట్టే దేవతలు కూడా దీనికి పూజలు చేస్తారు.

బిల్వదళాలు ఎప్పుడు కోయాలి :

సూర్యాస్తమయం తరువాత, సోమ, మంగళవారాల్లోనూ, ఆరుద్రా నక్షత్రం ఉన్నప్పుడు, సంధ్యాసమయంలోను, రాత్రులందు, పౌర్ణమి, సంక్రమణ దినాల్లో కోయకూడదు. కాబట్టి ముందుగానే కోసి పెట్టుకోవాలి. ఒకసారి కోసిన దళాలు పదిహేను రోజుల వరకు ఉపయోగించుకోవచ్చని శాస్త్రాలు చెప్తున్నట్టు పెద్దలు చెప్తారు.

ఎక్కడ నాటాలి :

ఈ వృక్షాలను శివాలయాలలో ఎక్కువగా పెంచుతారు. ఇంటి ఆవరణలోనైతే ఈశన్యంలో పెంచుకుంటే ఆపదలు తొలగి ఐశ్వర్యము లభిస్తుందని, తూర్పున సుఖం, పడమర యమబాధల నుండి విముక్తి లభిస్తుందని వాస్తు శాస్త్రజ్ఞులు చెప్తారు.

ఆయుర్వేద వైద్యంలో మారేడు:

మహిమాన్వితమైన మారేడు ఆయుర్వేద మందులలో కూడా ఎక్కువగానే ఉపయోగిస్తారు. మారేడుపళ్ళు, పుష్పాలు, పత్రాలు అన్నీ ప్రయోజనకరమైనవే. ఆ పళ్ళ రసం అతిసారవ్యాధికి, ఆకుల రసం చక్కెరవ్యాధికి మందుగా ఉపయోగిస్తారు. మారేడుకాయతో చేసిన షర్బత్ కలరా, విరేచనాలు తగ్గిస్తుందని వైద్యులు చెప్తారు. మారేడు ఆకలి కలిగించడానికి కూడా ఉపయోగపడుతుందని చెప్తారు.
బిల్వదళాలు నీటిని, గాలిని కూడా శుద్ధి చేయడంలో తమ పాత్ర నిర్వహిస్తాయి.

Quote of the day

Facts are many, but the truth is one.…

__________Rabindranath Tagore