Online Puja Services

సకల ఐశ్వర్యాలనూ ప్రసాదించే మార్గశిర లక్ష్మివార వ్రతం.

3.14.70.203

సకల ఐశ్వర్యాలనూ ప్రసాదించే మార్గశిర లక్ష్మివార వ్రతం. 
-సేకరణ 

మార్గశిర మాసంలో వచ్చే గురువారాలు పరమపవిత్రమైనవి. లక్ష్మీదేవి అనుగ్రహాన్ని అందించేవి . గురువారాలని లక్ష్మీవారాలని కూడా పిలుస్తారు . మార్గశిర మాసంలో , లక్ష్మీవారం నాడు చేసే పూజను మార్గశిర లక్ష్మివార వ్రతము అంటారు. సంవత్సరానికి ఒకసారి వచ్చే మార్గశిరమాసం లో ఈ పూజను ఆచరించడము సర్వశ్రేష్టము. ఈ వ్రతము లక్ష్మీదేవికి చాలా ప్రీతికరమైనది అని, లక్ష్మీదేవే స్వయంగా ఈ వ్రతవిధానాన్ని ఉపదేశించిందని , పరాశర మహర్షి నారదుడికి తెలిపారు. మార్గశిర నెలలో లక్ష్మీ పూజ చేసుకొని ఈ వ్రతమును ఆచరించుటవల్ల ఋణ సమస్యలు తొలగి, శ్రేయస్సు, సంపద మరియు ఆరోగ్యం కలుగునని విశ్వాసం. ఆ విధానం ఇక్కడ మీకోసం . 

మార్గశిర లక్ష్మివార వ్రత పూజా విధానం దీపావళి లక్ష్మీపూజ, వరలక్ష్మి పూజ లాగానే  ఉన్నప్పటికి ఈ వ్రతం విధానం ప్రత్యేకంగా ఉండడం విశేషం. నెలమొత్తం కూడా వచ్చే గురువారాలలో నిష్ఠగా ఈ వ్రతాన్ని ఆచరించాలి . 

ఈ నెలలో వచ్చే అన్ని గురువారాలలోనూ ఉదయమునే నిద్రలేచి ఇళ్ళు శుభ్రం చేసి, తలస్నానం చేయాలి . ప్రత్యేకించి పూజ ముగిసే వరకు, తలకు నూనే రాసుకోవడం , దువ్వుకోవడం చేయకూడదు. చక్కగా అలంకరించబడిన లక్ష్మీ అమ్మవారి చిత్రపటం కానీ,  చిన్న విగ్రహంను కానీ పూజకు సిద్ధం చేసుకోవాలి . శుచిశుభ్రతలు , చక్కని అలంకారాలు , మంచి సంప్రదాయం ఉన్నచోట మాత్రమే ఆ అమ్మ నిలుస్తుందని గుర్తుంచుకోవాలి . ఈ విషయాలు మనకి మరింతవివరంగా వ్రతకథకూడా వివరిస్తుంది. 

మార్గశిర లక్ష్మివార వ్రత విధానం:

'ఆదౌ పూజ్యో గణాధిపః' అని మొట్టమొదట గణపతికి ప్రథమ పూజ చేయవలెను. గణపతి పూజ అనంతరం, లక్ష్మీ అమ్మవారికి అధాంగ, షోడశోపచార మరియు అష్టోత్తర పూజను చేయాలి. నెల రోజులు ప్రతి గురువారం ప్రత్యేక నైవేద్యం సమర్పించాలి. మార్గశిర లక్ష్మీ పూజ, కథ చదువుకొని అక్షతలను శిరస్సున ధరించాలి. లక్ష్మీ పూజ మార్గశిర నెలలో అన్ని గురవారం చేస్తారు. కేవలం నాలుగు గురువారాలు మాత్రమే మార్గశిర మాసంలో లో వుంటాయి కానీ ఈ లక్ష్మి పూజ పుష్య మాసంలో వచ్చే మొదటి గురువారం నాడు కూడా చేయాలి అదే ఇక్కడ విశేషం.

మార్గశిర లక్ష్మివార వ్రతం సమయంలో అమ్మవారికి సమర్పించవలసిన నైవేద్యములు:

1 వ గురువారం - పులగం
2 వ గురువారం - అట్లు, తిమ్మనం
3 వ గురువారం - అప్పాలు, పరమాన్నము
4 వ గురువారం - చిత్రాన్నం,గారెలు
5 వ గురువారం - పూర్ణం బూరెలు

మార్గశిర లక్ష్మివార వ్రత కధ:

పూర్వం కళింగ దేశములో ఒక బ్రాహ్మణుడు ఉండేవాడు . అతని కూతురు పేరు సుశీల. చిన్నతనంలోనే తల్లి చనిపోయింది. దాంతో సవతి తల్లి, తన  పిల్లను ఎత్తుకొమ్మని చెప్పి, ఆ పిల్లకి  కొంచెం బెల్లం యిచ్చేది.

ఆ సుశీల సవతి పిల్లలను ఆడిస్తూ,  ఆటలో భాగంగానే, ఇతరులు మార్గశిర మాసంలో లక్ష్మీ దేవిని పూజించడం చూసి, తానుకూడా  మట్టితో మహా లక్ష్మి చేసి జిల్లేడు పూలతోను, ఆకులతోను పూజచేసి, ఆడుకోమని ఇచ్చిన బెల్లం నేవైధ్యం పెడుతూ ఆడుకునేది. ఇలాకొన్నాళ్ళు గడిచాక, సుశీలకు వివాహం అయ్యింది. అత్తవారింటికి వెళుతూ,  తాను తయారుచేసి, పూజించిన లక్ష్మి దేవి మట్టి బొమ్మను తీసుకు వెళ్ళింది. 

ఆ  వెంటనే కన్నవారు నిరుపేదలు అయినారు. మెట్టినింటివారు భాగ్యవతులై  మహదైశ్వైర్యం అనుభవిస్తున్నారు. పుట్టింటివారు కటిక దరిద్రులు అయిన సంగతి తెలిసికొని సుశీల చాలా బాధపడుతుంది. తల్లి దరిద్రమును భరించలేక కొడుకును పిలచి ‘నాయనా! నీ అక్క ఇంటికి వెళ్లి ఏమైనా డబ్బు తీసుకురమ్మని’ చెప్పి పంపిస్తుంది . సుశీల ఇంటికి తమ్ముడు వెళ్లి వారి పరిస్థితిని గురించి చెప్పాడు. పుట్టింటికి దాపురించిన గతిలేని పరిస్థితికి  తెలుసుకున్న సుశీల ఒకకర్రను తొలిపింఛి దానినిండా వరహాలు పోసి తమ్మునికి ఇచ్చింది.

ఆచిన్నవాడు కర్రను పట్టుకొని వెళుతుండగా దారిలో కర్రమర్చిపోయాడు . దానిని  ఎవరో తీసుకొని పోయారు. ఇంటికి వెళ్ళిన కొడుకుని తల్లి ‘ఏమితెచ్చావు’ అని అడిగింది .  జరిగిందంతా చెప్పాడు కొడుకు. మనదరిద్రం అని సరిపెట్టుకున్నారు. 

కొంతకాలం తరువాత సుశీల తమ్ముని పరిస్థితిని అడిగి తెలుసుకున్నది. వారి పరిస్థితిలో లో ఎటువంటి మార్పురాలేదని తెలిసి. ఒక చెప్పులు జత తెప్పించి వాటిలో వరహాలు పోసి కుట్టించి వాటికి గుడ్డ చుట్టి తమ్మునికి ఇచ్చింది.  అది తీసుకుని వెళ్లి తండ్రికి ఇమ్మని చెప్పింది . సరే అని తీసుకునివెళ్లి మార్గమద్యలో దాహంవేసి ఒక చేరువుగట్టును చెప్పులు మూట పెట్టి నీరుతాగి వచ్చేసరికి ఎవరో వాటిని తీసుకునిపోయారు. 

మరలా కొన్నాళ్ళకు సుశీల ఒకగుమ్మడి పండు తెప్పించి తొలచి దాని నిండా వరహాలు నింపి ఆ పండు అమ్మకి ఇమ్మని చెప్పింది. సరే అని తీసుకువస్తుండగా సాయం సమయంలో ఒక చెరువు వద్దకు వచ్చి, దానిని గట్టుమీద వుంచి సంధ్యావందనం చేస్తూవున్నాడు. ఇంతలో ఒకబాటసారి పండుబాగుందని పట్టుకుని వెళ్ళిపోయెను. ఆకుర్రవాడు గట్టుమీదకు వచ్చి వెతికితే,  పండులేదు. చేసేదిఏమి లేక ఇంటికి వెళ్ళాడు. 

ఈసారి సవతితల్లే , పిల్లలను ఇంటిదగ్గర వుంచి కూతురు దగ్గరకు వెళ్ళింది .
తల్లిని చూసి సుశీల వారిదరిద్రమును తెలుసుకొని చింతించి, మార్గశిర లక్ష్మివారం నోము చేస్తే, వారికీ  ఐశ్వర్యం వచ్చునని తలపోసింది . 

అమ్మా ఈ రోజు మార్గశిర లక్ష్మివారం నోటిలో ఏమివేసుకోకు మనం వ్రతం చేసుకుందాం అని చెప్పింది . కానీ, పిల్లలకు చల్ది అన్నం పెడుతూ ,నోటిలో ఒకముద్ద వేసుకున్నది. అది కూడని పని కావడంతో ,ఆవారం కూతురుమాత్రమే చేసుకున్నది. 

రెండవ వారం పిల్లలకు తలకి నూనె రాస్తూ,తల్లి  తాను కూడా  రాసుకున్నది. ఆవారం కూడా వ్రతం చేయడం వీలుకాలేదు.

మరుసటి వారం అమ్మా ఈసారైనా జాగ్రత్తగావుండమని చెప్పినది. పిల్లలకు తలదువ్వుతూ ఆమె తలదువ్వుకొని వ్రతం చేయలేకపోయినది. కూతురుమాత్రమే చేసుకున్నది. 

నాలగవ వారం ఈసారి అయినా చాలజాగ్రత్త  గావుండమని చెప్పి సుశీల , తల్లి జాగ్రత్తగా ఉండేందుకై ఆలోచించి , ఒకగోతి లో కూర్చోబెట్టినది. పని అయినతరువాత అమ్మను పిలుచుకువచ్చి, స్నానం చేస్తే పూజచేసుకుందాం అన్నది. ‘పిల్లలు అరటిపండు తిని నేను కూర్చున్న చోట అరటి తోలు వేసారు.  నేను తోచక అది తిన్నా’ అని చెప్పింది ఆవిడ . అయ్యో అని తలచి కూతురు పూజచేసుకుంది . 

ఇక  ఐదవ వారం మార్గశిర లక్ష్మివారం వ్రతం ఆఖరి వారం . అప్పుడు సుశీల తల్లిని తనకొంగుకు కట్టుకొని పని పూర్తి చేసుకొని తల్లిచే స్నానం చేయించి, వ్రతం చేయించింది.  పూర్నకుడుములు తల్లిచే నైవేద్యం పెట్టించింది. కానీ మహాలక్ష్మి దూరంగా వెళ్లిపోయినది. ఏమి అమ్మ అలా వెళ్ళిపోతున్నావు అని అడిగింది సుశీల . నీ చిన్నతనం లో నీవు బొమ్మలు తో ఆడుకుంటుంటే మీ అమ్మ చీపురుతో కొట్టింది అందుకే అని చెప్పింది. అప్పుడు తన తల్లి - చేసినదానికి క్షమించమని ప్రార్ధించింది. మళ్ళీ నీ తల్లిచే వ్రతం చేయించమని అదృశ్యము అయ్యినది మహాలక్ష్మి, సరే అని మరుసటి ఏడాది, మొదటివారం పులగం, రెండవ వారం అట్లు, తిమ్మనం, మూడవ వారం అప్పాలు, పరమాన్నము, నాల్గవ వారం చిత్రాన్నం, గారెలు, పుష్యమాసం లో మొదటి వారం లో పూర్ణపుకుడుములు వడ్డించి తల్లిచే నోము చేయించింది. ఇద్దరూ కధా అక్షింతలు తలమీద వేసుకున్నారు. అప్పటినుండి ఆమెకు సకలసంపదలు కలిగి అంత్యమందున విష్ణులోకమునకు పొందారు . 

అని స్వయంగా లక్షీదేవి ఈ వ్రతాన్ని ఆచరించవలసిన విధానం చెప్పింది కాబట్టి సౌభాగ్యవతులందరూ చక్కగా ఈ వ్రతాన్ని ఆచరించి, అష్టైశ్వర్యములూ పొందెదరుగాక ! శుభం. 

#margarsiralakshmivaravratam #margarsiram #lakshmivaram #vratam #vratham

Tags: margasira, masam, lakshmi, varam, vratham, vratam, laxmi, 

Quote of the day

The Vedanta recognizes no sin it only recognizes error. And the greatest error, says the Vedanta is to say that you are weak, that you are a sinner, a miserable creature, and that you have no power and you cannot do this and that.…

__________Swamy Vivekananda