Online Puja Services

యముని చూపు మనపై పడకుండా \'నిఘా\', వేసే దివ్య శక్తి .

18.227.0.192

యముని చూపు మనపై పడకుండా  'నిఘా', వేసే దివ్య శక్తి .
- లక్ష్మి రమణ 

.బ్రహ్మదేవుడు తన సృష్టిని ప్రారంభించినప్పుడు మొదట సనక, సనందన, సనత్సుజాత, సనత్కుమారులను సృష్టించాడు. వారిని తన సృష్టిని కొనసాగించమని ఆదేశించారు . కాని వారికి అది ఇష్టం లేదు . “తండ్రీ  మేము బ్రహ్మజ్ఞానం పొందాలి.  అందువలన మేము మీకు సాయపడలేము”.  అని విరక్తులై బ్రహ్మజ్ఞానాన్ని ఉపదేశించ గలిగిన గురువును వెదుకుతూ బయలుదేరారు. “కానీ బ్రహ్మ కి మించిన గురువెవరు ? మీరు బ్రహ్మగారినే అడగవలసింది కదా “ అని నారదమహర్షి చెప్పడంతో ఆలోచనలో పడి తిరిగి బ్రహ్మగారి దగ్గరకి వచ్చారు.  బ్రహ్మగారి  ప్రక్కన సరస్వతీదేవిని చూసి " ఈయనే పెళ్ళి చేసుకొని సంసారంలో ఉన్నాడు. ఇక ఈయన మనకు బ్రహ్మజ్ఞానం ఉపదేశించగలరా ?" అని అనుకొని బ్రహ్మను అడుగలేదు. అలాగే మహావిష్ణువునూ, పరమశివుడినీ కూడా అడుగుదామని వెళ్ళి వారి ప్రక్కన లక్ష్మీదేవినీ, పార్వతీదేవినీ చూసి వారిని కూడా అడుగలేదు.

పరమశివుడు ఈ నలుగురి అజ్ఞానాన్ని చూసి బాధపడి వారికి బ్రహ్మజ్ఞానాన్ని ఉపదేశించాలనుకొని అనుకొన్నారు. వారు వెళ్ళే దారిలో ఒక మర్రిచెట్టు క్రింద దక్షిణామూర్తి స్వరూపం దాల్చి కూర్చున్నారు.  వీరు నలుగురూ ఆ మూర్తిని చూసి, ఆయన తేజస్సుని చూసి ఆశ్చర్య చకితులై  తేజస్సుకు ఆకర్షితులై, ఆయన చుట్టూ చేరి కూర్చున్నారు. దక్షిణామూర్తి స్వామి తమ మౌనంతోనే వారందరినీ బ్రహ్మజ్ఞానం పొందే విధంగా అనుగ్రహించారు .  అలా మౌనముగా ఎందుకు బోధించారంటే బ్రహ్మము లేక పరమాత్మ రూప, గుణ, రసాది లక్షణాలకి అతీతమైనవారు. సద్గురువు బోధించడానికి మాటలు అవసరం లేదు . తాబేలు కేవలం తన చూపు తోటే పిల్లలని పెంచిన తీరుగా చూపుతోనే బ్రహ్మజ్ఞానాన్ని అనుగ్రహించగలిగిన సమర్థులు.  

అటువంటి గురుమూర్తి , సద్గురువు, ఆదిగురువు అయిన దక్షిణామూర్తి స్వరూపం నిత్యమూ ఒక చిత్తరువుగా చూస్తూ ఉన్నా కూడా పిల్లలకీ , పెద్దలకీ కూడా జ్ఞాన వృద్ధి జరుగుతుంది. అంతే కాకుండా ఈయన ఆరాధన వలన యముని చూపు మనమీద పడకుండా స్వామి రక్షిస్తూ ఉంటారు. దక్షిణామూర్తి కేవలం పరమేశ్వరుడు మాత్రమే కాదు, పరమేశ్వరి రూపం కూడా ! 

శివశక్తుల సమైక్య స్వరూపమే పరమేశ్వరుని దక్షిణామూర్తి స్వరూపం . ఏ స్వరూపంలో అయితే పక్కన శక్తి (బ్రహ్మ , సరస్వతి; విష్ణువు , లక్ష్మీ ; శివుడు , పార్వతి ) ఉండడాన్ని చూసి సనకసనందాదులు తమకి ఆ రూపంలోని పరమాత్మ తమకి బ్రహ్మజ్ఞానం అనుగ్రహించలేరని అనుకున్నారో, ఆ పరమాత్మ స్వరూపంలో శక్తిని ఐక్యం చేసుకొని శివశక్తుల ఐక్య స్వరూపంగా దర్శనమిస్తారు దక్షిణామూర్తి . 

దక్షిణామూర్తి స్వరూపాన్ని జాగ్రత్తగా పరిశీలిస్తే స్వామి కుడిచెవికి మకరకుండలం, ఎడమ చెవికి తాటంకం అలంకారాలుగా కనిపిస్తాయి. వీటిలో మకరకుండలం పురుషుల శ్రవణాలంకారం కాగా తాటంకం స్త్రీల అలంకృతి. ‘తాటంక యుగళీ భూత తపనోడుప మండలా’ అని లలితా సహస్రంలో ఒక నామము . సమస్త నక్షత్ర మండలము ఆ లలితా దేవికి తాటంకములుగా ఉన్నాయి . సూర్యుడు , చంద్రుడూ ఆమెకి చెవి దిద్దులయ్యారట.  అటువంటి విశ్వస్వరూపిణి అమ్మ. ఆ అమ్మే పురుషుడైతే  ఈశ్వరుడు.  వీరిద్దరి సమైక్య స్వరూపం దక్షిణామూర్తి . గురువుగా ఉండడం కోసమే ఒక రూపాన్ని తీసుకున్న దివ్యస్వరూపం . ఈ విషయాన్నే "లలితాసహస్రం"లో దక్షిణామూర్తి రూపిణీ సనకాది సమారాధ్యా శివజ్ఞాన ప్రదాయినీ"  అని వివరిస్తోంది.

స్వామి ఉత్తరాభిముఖులై ఉంటారు. ఉత్తరం జ్ఞానదశ.... ఆ దిశలో కూర్చున్న స్వామిని చూస్తూ ఉన్నవారికి....

దక్షిణామూర్తి దక్షిణాభిముఖులై ఉంటారు .  ఆయనకీ నమస్కారం చేసేవారు ఉత్తరాభిముఖంగా నమస్కారం చేసుకుంటారు . ఉత్తరం జ్ఞాన దిశ. కాగా ఇలా నమస్కరించుకొనేవారి  వారి వెనుక భాగాన ( పృష్ట భాగాన ) దక్షిణ దిశ.  ఇది యమ (మృత్యు) దిశ. ఎవరైతే , జ్ఞానసముపార్జన కోసం ఆ గురుమూర్తికి నమస్కారం చేస్తారో వారు మృత్యు భయాన్ని పొందరు. ఆ విధంగా యముని చూపు మనపై పడకుండా స్వామి చూపు 'నిఘా', వేస్తుందన్నమాట. 

శ్లో|| ఈశాన స్సర్వవిద్యాన మీశ్వర సర్వ భూతానాం|
         బ్రహ్మాధిపతి బ్రహ్మణాధిపతి బ్రహ్మశివోమే అస్తు సదాశివోం||

సర్వ విద్యలకు అధిపతి ఈశానుడు. సర్వ భూతాలకూ / ప్రాణులకూ అధిపతి  ఈశ్వరుడు.  బ్రహ్మము అంటే బ్రహ్మగారికి  ప్రభువు , భ్రాహ్మణములకు  అంటే వేదములకు అధిపథి అయిన, ఆ పరబ్రహ్మే శివుడు. అటువంటి సదాశివుడు నాకు శుభములను ఒసగుగాక! అని ఈ శ్లోకానికి అర్థం . ఇది వేదము చెప్పిన మాట ! 

అటువంటి దక్షిణామూర్తి అనుగ్రహం ఎల్లరకూ సిద్ధించాలని కోరుకుంటూ స్వస్తి !! 

శుభం.  

Quote of the day

To be idle is a short road to death and to be diligent is a way of life; foolish people are idle, wise people are diligent.…

__________Gautam Buddha