Online Puja Services

బంధాలపై తరగని ప్రేమ

18.188.20.56

స్వయంకల్పిత బంధం

ఒకప్పుడు ఒక ఊళ్ళో మిఠాయి వ్యాపారి ఒకడు ఉండేవాడు. అతడు దయామయుడేగాక దైవభక్తి గలవాడు కూడా. ఆ ఊళ్ళో అతడిదే పెద్ద మిఠాయి దుకాణం. సాధువులు, బైరాగులు ఎవరు అతడి కంటపడ్డా, వారిని ఆహ్వానించి సాదరంగా భోజనాదులు వారికి ఏర్పాటు చేసి, ఆనందపడేవాడు. 

అదొక మధ్యాహ్నం వేళ. ఎండ తీవ్రంగా కాస్తోంది. ఆ మండుటెండలో ఒక సన్న్యాసి కాలినడకన వస్తూ ఆ మిఠాయి దుకాణం ముందు కాస్సేపు సేదతీర్చుకోవడానికి నిలబడ్డాడు. దాహం వేస్తుండటంవల్ల కాసిని మంచినీళ్ళు ఇమ్మని ఆ వ్యాపారిని అడిగాడు. వెంటనే వ్యాపారి కొన్ని మిఠాయిలను, చల్లని పానీయాన్ని ఆ సాధువుకు ఇచ్చాడు. ఆ సాధువు తృప్తిగా ఆ మిఠాయిలను ఆరగించి, పానీయాన్ని త్రాగాడు.

ఆ తరువాత వ్యాపారి సాధువుతో, “స్వామీ! తమకేదైనా సహాయం అవసరమైతే నిస్సంకోచంగా అడగండి. నాకు చేతనైనంతగా సహాయపడగలను,” అన్నాడు. అప్పుడు ఆ సాధువు, "నాయనా! ఈ వస్త్రాన్ని చూడు. అనేకచోట్ల చిరిగి ఉండటంతో రాత్రుళ్ళు దోమల బాధతో నిద్రపట్టడం లేదు. నువ్వు ఈ వస్త్రాన్ని బాగుచేయించి ఇస్తే నా కదే పదివేలు” అన్నాడు. మహద్భాగ్యం అంటూ ఆ వ్యాపారి ఆ వస్త్రాన్ని
తీసుకొని జాప్యం చేయక దాన్ని బాగుచేయించి ఇచ్చేశాడు. సాధువు ఆనాటి రాత్రి ప్రశాంతంగా నిద్రపోగలిగాడు.

మర్నాడు సాధువు మిఠాయి వర్తకుణ్ణి సమీపించి, ఇలా అన్నాడు: “నాయనా! నీ సహాయంతో దోమల బాధ తప్పి ప్రశాంతంగా నిద్రించగలిగాను. అందుకు మారుగా నీకొక సహాయం చేయగలను. నీకు ధనధాన్యాలు ప్రసాదించే స్థితిలో నేను లేను. వాటి నెప్పుడో నేను త్యజించి వేయడమే అందుకు కారణం. కాని నా తపోబలంతో నిన్ను వైకుంఠానికి పంపగలను. యోగులు, సిద్ధులు, జ్ఞానులు మొదలైనవారు అహోరాత్రాలు కఠోర సాధనలు గావించి ఏ గమ్యాన్ని చేరతారో, అలాంటి పరమగమ్యమైన వైకుంఠానికి నిన్ను నేను కొనిపోగలను. అక్కడికి కనుక వెళితే నువ్వు ఈ జనన మరణ చక్రంనుంచి విముక్తి పొందుతావు. ముక్తిని బడయగలవు.”

ఆ మాటలను శ్రద్ధగా విని ఆ వ్యాపారి ఇలా అన్నాడు: “స్వామీ! తమరు నాపై చూపిస్తున్న ఈ అవ్యాజ ప్రేమకు సర్వదా కృతజ్ఞుణ్ణి. సుదీర్ఘకాలం కఠోర సాధనలు చేసికూడ పొందడానికి అతిదుర్లభమైన వైకుంఠ ప్రాప్తినే నాకు కలిగిస్తానంటున్నారు. కాని ఇలాంటి సదవకాశాన్ని వినియోగించుకోలేకపోతున్న నా దురదృష్టాన్ని ఏమని నిందించగలను? నాకు ఇద్దరు కుమారులున్నారు. వయస్సులో ఇద్దరూ చిన్నవారే; వారి జీవితాలకొక దారి చూపవలసిన బాధ్యత నామీద ఉన్నది కదా! అందుచేత అన్యథా భావించక మీరు ఎనిమిది సంవత్సరాల తరువాత వచ్చి నన్ను పిలిస్తే నేను తమతో వైకుంఠయాత్రకు రావడానికి సిద్ధపడి ఉంటాను. ఇలాంటి మహద్భాగ్యాన్ని ప్రసాదించిన తమకు ఎలా ధన్యవాదాలు చెప్పుకోవాలో అర్థం కావడం లేదు.”

తదనంతరం ఆ సాధువు సెలవు పుచ్చుకొని తన దారిన వెళ్ళిపోయాడు.

కాలచక్రంలో ఎనిమిదేళ్ళు గిర్రున తిరిగిపోయాయి. వ్యాపారి సూచించిన ఎనిమిదేళ్ళు పూర్తికావచ్చింది. ఆ సమయంలో మన సాధువు మళ్ళీ వ్యాపారి వద్దకు వచ్చి, “నాయనా! నువ్వు కోరిన ఎనిమిదేళ్ళ గడువు నిన్నటితో తీరిపోయింది. నాతో ఇప్పుడు వైకుంఠానికి బయలుదేరు, అన్నాడు. అందుకు వ్యాపారి తటపటాయిస్తూ ఇలా అన్నాడు. “ నాపట్ల తమకెంత దయ! మిమ్మల్ని ఎలా అభినందించాలో తోచడం లేదు కాని నేను తమకు వాగ్దానం చేసినమేరకు ప్రస్తుతం మీతో రాలేక పోతున్నాను. నా కుమారులిద్దరూ దురదృష్టవశాత్తు చెడుమార్గాలలో పడి త్రాగుబోతులుగాను, జూదరులుగాను అయిపోయారు. కనుక నాకు వారి ఆస్తి పాస్తులను, బాగోగులను చూసుకోవాల్సిన అగత్యం ఏర్పడింది. మరోలా అనుకోక తమరు మరో ఎనిమిది సంవత్సరాల తరువాత వచ్చారంటే తమతో నేను బయలుదేరడానికి తయారుగా ఉంటాను.”

సాధువుకు వ్యాపారిపట్ల సానుభూతి కలిగింది. “ఈ వ్యాపారి స్వతహాగా మంచివాడే కాని భగవంతుడి పాదారవిందాలపై భక్తిని పెంపొందించుకోవడానికి బదులుగా పుత్ర ప్రేమలో చిక్కుకొని మితిలేని బాధలకు గురి అవుతున్నాడు. ఇలాంటి వాణ్ణి బంధవిముక్తుణ్ణి చేయడం ఎలా?” అనే ఆలోచనలో పడిపోయాడు. తరువాత వ్యాపారితో, “నాయనా! నువ్వు చెప్పినట్లే మరో ఎనిమిదేళ్ళ అనంతరం తిరిగి వస్తాను” అంటూ వెళ్ళి పోయాడు.

సన్న్యాసి తాను చేసిన వాగ్దానం మేరకు మళ్ళీ ఎనిమిదేళ్ళ పిమ్మట వ్యాపారిని కలుసుకోవడానికి వచ్చాడు. కాని సన్న్యాసికి అప్పుడు గతంలో తాను చూసిన మిఠాయి దుకాణమో, వ్యాపారి ఇల్లో కనబడలేదు. అతడి ఇల్లు ఉండిన చోట ఒక పాడుపడ్డ ఇల్లు మాత్రం కనిపించింది.
దాన్లో ఆ వ్యాపారి పెద్దకొడుకు నామమాత్రంగా ఒక చిన్నదుకాణాన్ని నడుపుతున్నాడు. అక్కడ దారిద్ర్యం తాండవించడం సాధువుకి కనిపించింది.
సాధువు దుకాణంలో ఉంటున్న పెద్ద కుమారుడి వద్దకెళ్ళి వ్యాపారిని గురించి వాకబు చేస్తూ, తనూ అతడూ చేసుకొన్న ఒప్పందం గురించి చెప్పాడు. అప్పుడు ఆ వ్యాపారి పెద్ద కుమారుడు సాధువుతో ఇలా అన్నాడు: “స్వామీజీ! మా తండ్రి మమ్మల్ని నానా కష్టాలపాలు చేసి వెళ్ళిపోయాడు. ఏదో విధంగా నేను ఈ చిన్నదుకాణాన్ని నడుపుకొంటూ చాలీచాలని సంపాదనతో పొట్టపోసుకొంటున్నాను. నా తమ్ముడు అదిగో కనిపిస్తున్నదే, ఆ జానెడు పొలాన్ని సాగుచేసుకొంటూ కాలం వెళ్ళదీస్తున్నాడు.”

అంతా ప్రశాంతంగా వింటూ ఉన్న ఆ సాధువు తన తపోబలంచేత జరిగిపోయిన విషయాలన్నిటినీ తెలుసుకోగలిగాడు. మరణించిన ఆ వ్యాపారి తన పుత్రులమీద మమకార వ్యామోహంతో ఇంట్లోనే పొలాన్ని దున్నే ఎద్దుగా జన్మించి ఉన్నాడని సాధువు దివ్యదృష్టితో గ్రహించి, రెండవ కుమారుడి పొలం సాగుచేస్తూన్న ఎద్దు ఆ వ్యాపారే అని ఎరిగి, దానివద్దకు వెళ్ళాడు.

రెండవ కుమారుడు మధ్యాహ్న భోజనానికి వెళ్ళినప్పుడు సాధువు ఆ ఎద్దును సమీపించి తన కమండలంలోని పవిత్రజలాన్ని దానిమీద చల్లాడు. ఆయన తపోమహిమతో ఆ ఎద్దుకు పూర్వజన్మ స్మృతి వచ్చింది. అప్పుడు ఆ సాధువు వ్యాపారి అయిన ఎద్దుతో, “నాయనా! గతంలో నీకు వాగ్దానం చేసినట్లు నిన్ను వైకుంఠానికి తీసుకుపోవడానికి వచ్చాను. నిన్నటితో నువ్వు పెట్టిన ఎనిమిదేళ్ళ గడువు తీరిపోయింది. నువ్విప్పుడు నాతో రావడానికి సిద్ధమే కదా!” అని అడిగాడు. 

పూర్వజన్మ స్మృతి రాగానే ఆ వ్యాపారి దుఃఖిస్తూ ఇలా అన్నాడు: “స్వామీ! నేను కోరినట్లే ఎనిమిదేళ్ళ తరువాత మీరు రావడం సంతోషమే. కాని వెన్నాడివస్తూన్న నా దురదృష్టాన్ని ఏమని చెప్పను? నా కుమారుల దీనస్థితిని మీరే చూస్తున్నారు కదా! ఈ స్థితి ఇలాగే కొనసాగితే రెండేళ్ళలోపునే వీళ్ళు ఆకలి బాధతో అలమటించి చావాల్సిందే! కనుక నాపట్ల దయ ఉంచి కొన్ని సంవత్సరాల పిదప వచ్చి నాకు ముక్తి ప్రసాదించండి.”

ఇలా ఆ ఎద్దు-(వ్యాపారి) చెప్పిన మాటలు విన్న ఆ సాధువుకు అతడిపై అలవిగాని జాలి కలిగింది. స్వయంకల్పిత ఈ బంధాలను ఛేదించుకొని బయటపడలేక మోహాంధకారంలో బంధింపబడ్డ ఆ జీవుడికి ఎలాగైనా ముక్తి కలిగించాలన్న పట్టుదలతో ఆ సాధువు కొన్ని సంవత్సరాల తరువాత తిరిగి తప్పక వస్తానని చెప్పి, వెళ్ళిపోయాడు.

కాలగమనంలో మరికొన్ని సంవత్సరాలు గడచిపోయాయి. సాధువుకు వృద్ధాప్యం వచ్చింది. కాని తన వాగ్దానం ఎలాగైనా చెల్లించుకోవాలన్న దృఢనిశ్చయంతో యథాప్రకారం ఆయన మళ్ళీ ఆ వ్యాపారి ఇంటికి వచ్చాడు. ఆ ఇంటి ముందు ఆకలిబాధతో అలమటించిపోతూన్న ఒక కుక్కను సాధువు చూశాడు. ఆ సాధువును చూడగానే ఆ కుక్క మొరగడం ప్రారంభించింది. అది విన్న వ్యాపారి పెద్ద కుమారుడు బయటికి వచ్చి సాధువును చూశాడు. సాధువు అతడితో పొలం దున్నుతూండిన ఎద్దును గురించి అడిగాడు. అందుకు వ్యాపారి పెద్దకుమారుడు ఇలా అన్నాడు: “స్వామీజీ! ఆ ఎద్దు ఒక ఏడాది క్రితము చనిపోయింది. ఆ ఎద్దు మాకెంత సహాయకారిగా ఉన్నదో చెప్పలేను. ఎంతో తక్కువ ఆహారం తిని, నిర్విరామంగా పనిచేస్తుండేది. అలాంటి ఎద్దు ఇకమీదట మాకు దొరకదు.”

తనను చూడగానే మొరగసాగిన ఆ శునకమే మరణించిన వ్యాపారి అనీ, ఎద్దుగా జన్మించాక, తిరిగి పుత్రులమీద తాను కల్పించుకొన్న బంధపాశాల పర్యవసానంగా ప్రస్తుతం శునకంగా జన్మించి, తన కుమారులకు అండగా ఉంటూ, వారి ఆస్తిని ఎవరూ తస్కరించకుండా కాపలాగా ఉంటూందని సాధువు తపశ్శక్తితో తెలుసుకొన్నాడు.

తన తపశ్శక్తితో ఆ శునకానికి పూర్వజన్మ స్మృతి కలిగించగా ఆ శునకం సంజాయిషీ పూర్వకంగా, "స్వామీ! నా కొడుకుల దయనీయ స్థితిని చూస్తూనే వున్నారుగదా! ఇంతటి కష్టంలో ఉండేవారిని వదిలివేసి తమతో నేను ఎలా రాగలను? కాబట్టి అన్యథా భావించక మరికొంత కాలం గడిచాక తమరు వచ్చారంటే నేను తమతో వచ్చేస్తాను” అన్నది.

“ఆహా! ఏం విచిత్రం! మహామాయ క్రమ్మి సచ్చిదానందస్వరూపుడైన జీవుడు సంసార బంధాలలో చిక్కి శల్యమై ఎనలేని బాధలకు గురౌతున్నాడు. ఇంతకాలం గడిచాకకూడ ఇతడు భార్యాపుత్రుల బంధాలను తెంచుకోలేకపోతున్నాడే! ముక్తిని గురించి చింతించలేకపోతున్నాడే!' అలా అనుకొన్న ఆ సాధువు హృదయం అవ్యాజ కరుణతో ద్రవించిపోయింది.

మళ్ళీ కొంతకాలం గడిచిపోయాక ఆ సాధువు, వ్యాపారి ఇంటికి వెళ్ళడం జరిగింది. ఆయన్ను చూడగానే ఆ వ్యాపారి కొడుకులిద్దరికీ చాలా కోపం వచ్చింది. 'ఈ సాధువు మనల్ని చూసి వెళ్తున్న ప్రతిసారీ మనం మరింత దరిద్రులంగా మారిపోతున్నాం. బహుశ ఇతడు దురదృష్టాన్ని వెంటబెట్టుకొని వస్తున్నాడేమో!' అనుకొని ఆ సాధువును దుర్భాషలాడ సాగారు.

శాంతంగా వారి దుర్భాషలన్నీ విని ఆ సాధువు ఇలా అన్నాడు: “నాయనలారా! మీకు కావలసింది ధనమే కదా! మీ తండ్రి రోజూ నిద్రించే చోట త్రవ్వి చూడండి. ఒక జాడి నిండుగా బంగారు నాణేలు మీకు లభిస్తాయి.”

వెంటనే ఆ వ్యాపారి కొడుకులిద్దరూ గునపాలు పుచ్చుకొని సాధువు సూచించిన చోట త్రవ్వసాగారు. కొంతసేపు త్రవ్వగానే ఆ గోతిలో నుంచి ఒక పాము బుసలుకొడుతూ బయటికి వచ్చింది. త్రవ్వడం ఆపి కాస్త వెనక్కితగ్గి ఆ ఇద్దరూ సాధువు వద్దకు కోపంగా వెళ్ళారు. అసలు సంగతి గ్రహించిన సాధువు “నేను అసత్యం పలుకుతున్నాననుకోకండి. అదిగో ఆ జాడీ పైభాగం కొంచెంగా కనిపిస్తోంది. ఆ పామును తకణమే చంపి జాడీని బయటికి తీయండి” అన్నాడు.

వ్యాపారి కొడుకులిద్దరూ నిశితంగా పరీక్షించి చూస్తే, జాడీ మూతలాంటిది సర్పం క్రింద కనిపించింది. వెంటనే వాళ్ళు గునపాలతో ఆ పామును చంపి,
జాడీని బయటికి తీశారు. సాధువు చెప్పినట్టు బంగారు నాణేలు దాని నిండా ఉన్నాయి. ఆ ఇద్దరికీ పట్టరాని ఆనందం కలిగింది.

కాని సాధువు మాత్రం వెంటనే చనిపోయిన ఆ సర్పం వద్దకెళ్ళి దాని మీద మంత్రజలం ప్రోక్షించాడు. ఎద్దుగాను, పిదప శునకంగాను పుత్రుల పట్ల తీరని వ్యామోహంతో పునర్జన్మలు ఎత్తి వారి ఇంట్లోనే జన్మించిన ఆ మిఠాయి వ్యాపారే ఇప్పుడు సర్ప జన్మనెత్తాడు. ఏ పుత్రులకై మమకారం పెంచుకొని, బంధపాశాలను అధికరించుకొని ఇన్ని నిమ్నజన్మలు ఎత్తాడో, అలాంటి పుత్రులే ఇప్పుడు నిర్దాక్షిణ్యంగా ఆ పామును (తనను) కొట్టి చంపడంచేతా, ఆ సాధువు అనుగ్రహ మహిమవల్లా కాస్తకాస్తగా అతణ్ణి ఆవరించి ఉన్న మాయామోహ బంధపాశాలు సడలసాగాయి. చివరికి ఆ సాధువుతో వైకుంఠానికి వెళ్ళడానికి పరమసంతోషంగా వ్యాపారి అంగీకరించాడు.

ఈ కథలోని మిఠాయి వర్తకుడు అవివేకంతో స్వయంగా కల్పించు కొన్న సంసారబంధాలవల్ల, మానవ జీవిత పరమావధి అయిన మోక్షాన్ని పొందలేక జననమరణ చక్రంలో పడి అపరిమిత దుఃఖాలను అనుభవించాడు.

కాబట్టి మనం మన నిర్దిష్ట కర్మలను నిర్లిప్తతతో కర్మయోగంగా ఆచరిస్తూ తామరాకుమీది నీటి బిందువులా సంసారంలో చిక్కుకోకుండా జాగ్రత్తగా మసలుకోవాలి. ఇలాంటి మనోభావాన్ని ప్రసాదించమని భగవంతుణ్ణి ప్రార్థిద్దాం గాక!

శ్రీరామకృష్ణ పరమహంస శిష్యులలో ఒకరైన స్వామి రామకృష్ణానంద 'The message of Eternal Wisdom' అనే పుస్తకంలో ఈ కథను ఉదహరించి ఉన్నారు.

Quote of the day

Facts are many, but the truth is one.…

__________Rabindranath Tagore