Online Puja Services

మనీషా పంచకం గురించి విన్నారా ?

18.117.196.184

శంకర భగవత్పాదులు చెప్పిన మనీషా పంచకం గురించి విన్నారా ? 
-సేకరణ: లక్ష్మి రమణ  

మనీషా పంచకం ఆదిశంకర విరచితం. శంకరులు వారి అద్వైతం – సర్వ మానవ సౌభ్రాతృత్వం గురించి చెప్పుకునేందుకు వీలు కలిగేలా కొన్ని శాస్త్ర విషయ అనుబంధం లేని రచనలు చేసారు. వాటిలో ఈ మనీషా పంచకం ఒకటి.

అద్వైతం అనగా భగవంతుడు-భక్తుడు ఒకటే అని నమ్మే సిద్ధాంతం. అహం బ్రహ్మాస్మి తత్త్వం. అద్వైతానికి కుల, మత, స్త్రీ/పురుష, చిన్నా/పెద్దా, తేడాలు లేవు. ఎందుకంటే ఒకే పరబ్రహ్మ యొక్క వివిధ స్వరూపాలమే  కదా అందరమూ .

ఈ శ్లోకాల వెనుక సన్నివేశం కాశీ (వారాణసి) లో జరిగినది.

స్నాన-సంధ్యాదులు ముగించుకుని శంకరులు శిష్యగణంతో గుడి వైపుకు వస్తూ ఉంటారు. దారిలో ఎదురుపడి ఒక చండాలుడు ( కాటికాపరి ) వస్తూ ఉంటాడు. అతన్ని చూసి దూరం జరిగి దారికి పక్కగా పొమ్మని శంకరుడు అంటాడు. 

అలా శంకరులు అన్న మాటలకు చండాలుడు (ఆ రూపంలో ఉన్న శివుడు) ఇలా అంటాడు :

‘అన్నమయాదన్నమయం హ్యథవా చైతన్యమేవ చైతన్యాత్,
ద్విజవర దూరీకర్తుం వాంఛసి కిం బ్రూహి గచ్ఛ గచ్చేతి॥’

ఓ మహానుభావా! చెప్పు. నన్ను దారికి పక్కగా తొలిగిపొమ్మని నువ్వన్నది, నేను తక్కువ జాతికి చెందినవాడననా? అన్నంతో రూపొదిన ఒక శరీరం, అన్నంతోనే రూపొందిన మరో శరీరాన్ని పక్కకు తొలగమంటుందా లేక

ఒక శరీరంలో ఉన్న ఆత్మ, మరో శరీరంలోని ఆత్మను పక్కకి తొలగిపొమ్మని చెబుతుందా? ఈ రెండిటిలో ఏది పక్కకి తప్పుకొని దూరంగా ఉండాలి? చెప్పు మహానుభావా, చెప్పు!

‘ప్రత్యగ్వస్తుని నిస్తరంగసహజానందావబోధాంబుధౌ
విప్రోఽయం శ్వపచోఽయమిత్యపి మహాన్ కో యం విభేదభ్రమః॥

కిం గంగాంబుని బింబితేఽంబరమణౌ చాండాలవీథీపయః
పూరే వాఽంతరమస్తి కాంచనఘటీమృత్కుంభయోర్వాఽంబరే॥’

నాకు జవాబు చెప్పు, ఓ మహానుభావా! నీటి ఉమ్మతో సహా అన్ని చోట్లా నీటిలో మెరిసే సూర్యుడి ప్రతిబింబం లాగానే ఆ పరమాత్మ అయిన పరబ్రహ్మ ప్రతి జీవిలోనూ ప్రతిబింబిస్తాడు. మరి ఈ విభేదాలెందుకు? ఈ ఎక్కువ తక్కువలెందుకు? ఒకడు బ్రాహ్మణుడా, చండాలుడా అనెందుకు చూడాలి? ఎవరిద్దరిలో గొప్ప? గంగలో కనిపించే సూర్యుడి ప్రతిబింబానికీ, చండాలుడి వీధులలో కనిపించే నీటిపై పడే సూర్యుడి ప్రతిబింబానికీ తేడా ఉందా? నీటి పాత్ర బంగారందో లేదా మట్టిదో అయితే అందులోని నీరు కూడా మారిపోతుందా?

(ఈ స్పందన వచ్చిన వెంటనే శంకరులకు ఎదుటున్నది సాక్షాత్ పరమశివుడే అన్న బోధ కలుగుతుంది. ఆ పరవశంలో శంకరులు ఈ కింది ఐదు శ్లోకాలను మనీషా పంచకంగా మలిచి అందించారు!)

‘జాగ్రత్స్వప్నసుషుప్తిషు స్ఫుటతరా యా సంవిదుజ్జృంభతే
యా బ్రహ్మాదిపిపీలికాంతతనుషు ప్రోతా జగత్సాక్షిణీ,
సైవాహం న చ దృశ్యవస్త్వితి దృఢ ప్రజ్ఞా పి యస్యాస్తిచే-
చ్చండాలోఽస్తు స తు ద్విజోఽస్తు గురురిత్యేషా మనీషా మమ’

ఒక వ్యక్తి పూర్తి స్థాయిలో- మెలకువగా, నిద్రపోతూ, కలలో విహరిస్తూ – అన్ని సందర్భాలలో కనిపించే ఆత్మను తానేనని గుర్తిస్తాడో, విధియయిన బ్రహ్మ మొదలు అతి చిన్నదయిన చీమ వరకూ అన్ని జీవాలలో, అన్ని వస్తువులలో ఉన్న పరమాత్మనే తానని అర్ధం చేసుకుంటాడో. అన్నిఁటా ప్రతిధ్వనించే, కనపడని, అందరినీ గమనించే ఆ పరమాత్మను తానుగా భావించి – తనను అన్నిటిలో చూసుకొనే వ్యక్తిని – అతడు ద్విజుడయిన బ్రాహ్మణుడే కానీ, చండాలుడే కానీ – నా పరమ గురువుగా అతడిని నేను నమ్ముతాను.

‘బ్రహ్మైవాహమిదం జగచ్చ సకలం చిన్మాత్రవిస్తారితం
సర్వం చైతదవిద్యయా త్రిగుణయా శేషం మాయా కల్పితం,
ఇత్థం యస్య దృఢామతిస్సుఖతరే నిత్యే పరే నిర్మలే
చండాలో స్తు స తు ద్విజో స్తు గురురిత్యేషా మనీషా మమ’

ఈ జగత్తంతా ఆ పరమాత్మ పరబ్రహ్మ యొక్క స్వరూపమే. అజ్ఞానం వలనో, త్రిగుణాల‌(సత్త్వరజస్తమో  గుణాలు) ప్రభావం వలనో ఈ ప్రపంచమంతా వివిధ వస్తువుల చేత రూపొందించబడిందని అనిపిస్తుంది – ఆ ప్రభావంతో పరబ్రహ్మ స్వరూపాన్ని చూడలేము. వీటికి అతీతంగా ఎవ్వరయితే తనని తాను నిర్మలమయిన, అనంతమయిన పరమాత్మ పరబ్రహ్మగా గుర్తిస్తాడో, అతడు ద్విజుడయిన బ్రాహ్మణుడే కానీ, చండాలుడే కానీ – నా పరమ గురువుగా అతడిని నేను నమ్ముతాను.

‘శశ్వన్నశ్వరమేవ విశ్వమఖిలం నిశ్చిత్య వాచా గురో-
ర్నిత్యం బ్రహ్మ నిరంతరం విమృశతా నిర్వ్యాజశాంతాత్మనా,
భూతం భాతి చ దుష్కృతం ప్రదహతా సంవిన్మయే పావకే
ప్రారబ్ధాయ సమర్పితం స్వవపురిత్యేషా మనీషా మమ’

ఈ లోకం మాయతో రూపొందించబడింది. ఇది అశాశ్వతము, నశించిపోతుంది. ఈ శరీరము ఆ పరమాత్మను శాంతముతో, పూర్తి నమ్మకంతో (ఎలాంటి అనుమానాలు లేకుండా) ధ్యానంలో దర్శించి, కర్మఫలము ద్వారా సంపాదించుకున్న ఫలాలను (అవి పాపాలే గానీ, పుణ్యాలే గానీ) పరమాత్మ యొక్క పవిత్రమయిన అగ్నియందు కాల్చివేస్తారు. ఈ విషయాలు చెప్పిన పరమగురువుల బోధనలను నేను నమ్ముతాను.

‘యా తిర్యజ్ఞరదేవతాభిరహమిత్యంతః స్ఫుటా గృహ్యతే
యద్భాసా హృదయాక్షదేహవిషయా భాంతి స్వతో చేతనాః
తాం భాస్యైః పిహితార్క మండలనిభాం స్ఫూర్తిం సదా భావయన్
యోగీ నిర్వృతమానసో హి గురురిత్యేషా మనీషా మమ’

ఏ విధంగా అయితే మేఘాలు సూర్యుడిని కనిపించకుండా కప్పేస్తాయో, అదే విధంగా అజ్ఞానం పరమాత్మను జీవాత్మకు కనిపించకుండా చేస్తుంది. ఈ ప్రపంచంలో జరిగే ప్రతీదీ ఆ పరమాత్మ పరబ్రహ్మ వలనే అవుతుంది. ఈ సత్యాన్ని తెలుసుకున్న యోగులు ఉత్తములని నేను నమ్ముతాను.

‘యత్సౌఖ్యాంబుధిలేళలేశత ఇమే శక్రాదయో నిర్వృతా
యచ్ఛిత్తే నితరాం ప్రశాంతకలనే లబ్ధ్వా మునిర్నిర్వృతః
యస్మిన్నిత్యసుఖాంబుధౌ గళితధీర్ బ్రహ్మైవ న బ్రహ్మావి
ద్యః కశ్చిత్స సురేంద్రవందితపదో నూనం మనీషా మమ’

ఇంద్రాది దేవతలచే పూజించబడే పరబ్రహ్మముతో నిరంతర ధ్యానములో ఉండేవాడు, పరిపూర్ణ శాంతుడై ఉంటాడు. అతను ఆ పరబ్రహ్మమును తెలిసికున్నాడని, అతనే ఆ పరబ్రహ్మ అని నా పూర్తి నమ్మకం . 

సర్వం ఖల్విదం బ్రహ్మ - సకలము బ్రహ్మమే అనే ఉపనిషిత్ సూక్తం శంకరుని అద్వైతానికి మూలాధారం . ఛండాలుని తొలగమనడం బ్రాహ్మణి తొలగమనడమే అవుతుంది .  తన దోషాన్ని గ్రహించిన శంకరులు ఆ చండాలుని ఆలింగనం చేసుకొని , తనకి గురువుగా భావించి చండాలాష్టకాన్ని చెప్పారు . అదే ఈ మానీషాష్టకం .  

Quote of the day

A coward is incapable of exhibiting love; it is the prerogative of the brave.…

__________Mahatma Gandhi