Online Puja Services

జపం చేసేటప్పుడు మనస్సుని లగ్నం చేసే విధానం

3.139.97.157

జపం చేసేటప్పుడు మనస్సుని లగ్నం చేసే విధానం

మనస్సును ఒక చోట నిలపడం అంత సామాన్యమైన విషయం కాదు. మనసు స్వభావమే చంచలత్వం. అది ఎప్పుడు స్థిరత్వానికి లోనవుతుందో ఎప్పుడు సమాధి స్థితికి మీరు వెళ్లినట్లే. కానీ అది కొందరికి తాత్కాలికం. కొద్ది పాటి అనుభవం కలిగి మరల చంచలమౌతుంది. ఎంతో సాధన తరువాత చాలా కొద్దిమంది యోగులకు (యుగపురుషులకు) మాత్రమే నిరంతరం మనసు ఆ భగవంతుని యందులగ్నమై ఉంటుంది. మనసు ఎప్పుడు నిశ్చలమౌతుంది? ఎప్పుడు చంచలమౌతుంది? అనేది ఎంతో సాధన ద్వారా మాత్రమే తెలుసుకోగలిగే విషయం. ఎవరికి వారు మాత్రమే తెలుసుకోవలసిన విషయం. అలా "మననాత్ త్రాయతే ఇతి మంత్రః "   పదే పదే పఠించడం (మననం చేయడం) వలన రక్షణ కలిగించునది  మంత్రము అన్నారు.  గాయత్రీ లేదా మరో దేవతా  జపము అనేది మంత్ర ప్రథానమైనది. అందు మంత్రమును స్పష్టంగా ఉఛ్చరించుట ప్రధానము.  ప్రస్తుతానికి జపం చెయ్యడంలోని వివిధ స్థితుల గురించి చూద్దాం.

1. పెదాలతో శబ్దం బయటకు వచ్చేటట్టు జపం చెయ్యడం ప్రాథమికం

ఇది మొదటి మెట్టు. ప్రాథమికం అన్నారు కదా అని దీనికి ఏ శక్తీ కలగదు, ఏకోరికా సిద్ధించదు అనుకుంటే పొరపాటు పడినట్లే. కేవలం బ్రాహ్మణుడు వేదాన్ని చదివినంత మాత్రముచేతనే జన్మరాహిత్య స్థితిని పొందుతాడు అని ఆర్యోక్తి. (ఇక కోరిన కోరికలు తీరడంలో ఎటువంటి సందేహమూ లేదు. అయితే ఫలితాలను ఇవ్వడంలో ఒకదానికంటే మరొకటి ఉత్తమం అని తెలుసుకోవడానికే ఈ సూచన చేశారు పెద్దలు) ప్రాధమికం అనే దృష్టితో  ఒకేసారి ఉత్తమ జపం చెయ్యాడానికి ప్రయత్నించి బోర్లా పడిపోతారు చాలామంది సాధకులు.

2.  పెదాలు కదుపుతూ శబ్దం బయటకు రాకుండా తనకు మాత్రమే వినపడేటట్లు మంత్రం చదవడం ద్వితీయ స్థితి.

ఇది సాధనలో రెండవమెట్టు. ఈ స్థితిలో మంత్రం మీకు (జపం చేసేవారికి ) మాత్రమే వినపడాలి. స్వరాలను పదేపదే గుర్తు చేసుకుంటూ సాధన చెయ్యాలి. అలా కొన్ని రోజుల సాధన (మంత్రం బాగా నడుస్తున్నది అన్నది నమ్మకంగా అనిపించిన) తరువాత మూడవమెట్టుకి వెళ్లాలి.

3. మనసుతో పదే పదే స్ఫురణకు తెచ్చుకోవడం (మననం చెయ్యడం) మధ్యమం.

పైరెండు స్థితులకంటే ఈ మూడవ స్థితి ( మెట్టు ) చాలా కష్టమైనది. దీనిని అధిగమించడానికి కొన్ని నెలలు పట్టవచ్చు. కొన్ని సంవత్సరాలు పట్టవచ్చు. కొన్ని జన్మలు పట్టవచ్చు. ఈ స్థితిలోనే మనసు వేరే విషయాలపైకి వెళ్లడం ఎక్కువగా ఇబ్బందిపెడుతూ ఉంటుంది. మనసులో జపం చేయడం అంటే స్ఫురణకు తెచ్చుకోవడం అనేవిషయం గుర్తుంచుకోవాలి.

A)  మరో ఆలోచనలో పడడం:

ఒకసారి స్మరించడం తేలిక. వందసార్లు గుర్తుకు తెచ్చుకోవడం పెద్ద కష్టం కాదు. కానీ వేలసార్లు జపించాలి అని సంకల్పించినప్పుడు ఈ సమస్యలు స్పష్టంగా కనిపిస్తాయి. ఒకేసారి వేలసంఖ్యలో జపం చెయ్యాలని సంకల్పించినప్పుడు. సమయం ఎక్కువ పడుతుంది. అంత సమయం మనసు స్థిరంగా ఉండడానికి ఒకేసారి అంగీకరించదు. వ్యతిరెకిస్తుంది. జాగ్రత్తగా ఉండక పోతే విపరీతాలు జరిగే ప్రమాదమూ ఉంది. (కనుక ఈ స్థితిలో ఎప్పటికప్పుడు గురువులను, అనుభవఙ్ఞులను సంప్రదిస్తూ ఉండాలి)  ఎక్కువసేపు మనసు నిలిచి ఉండదు. కానీ మంత్రాన్ని పదే పదే గుర్తుకు తెచ్చుకోవడం అనే ప్రక్రియని దానికి సాధన ద్వారా అలవాటు చెయ్యాలి. మొదటిలో కష్టం గా ఉన్నా రానురాను సానుకూల పడుతుంది. అందువలన మొదట ఓ వందసార్లు జపం చెయ్యడంతో మొదలుపెట్టి క్రమక్రమంగా జపసంఖ్యను పెంచుకుంటూ పోవాలి.

ఒక వందసార్లు జపం సరిగానే చేస్తున్నాము కదా అని సంఖ్య ఒకేసారి పెంచి రోజూ ఓ వెయ్యిసార్లు జపం చేస్తాను అని దీక్షపూనినప్పుడు మరో సమస్యవలన మంత్రం తప్పులు దొర్లడం కనిపిస్తుంది.

B)  మనసు తొందర పడడం 

నేను రోజుకు వెయ్యిసార్లు నలభైఒక్క రోజులు చేస్తాను అని సంకల్పం చేసుకున్నారు. కానీ ఆ సంఖ్య మీ మనసుకు భారీగా ఉండి ఉండవచ్చు, లేదా ఏదో ఒక రోజు ఆఫీసుకు లేటవుతుండవచ్చు. అందువలన మనసు తొందర పెడుతుంది. త్వరగా పూర్తి చెయ్యాలి అని అనిపిస్తుంది. ఆ తొందరలో మంత్రాన్ని ఏదో ఒకలా పలకడం, పరధ్యానంగా చెయ్యడం మొదలవుతుంది. మనసు పెట్టే తొందరను బట్టి అక్షరాలు, పదాలు  లేదా వాక్యాలే దాటవేయడం జరుగుతుంది. అలా జపిస్తే మంత్రం ఫలితానివ్వడం అటుంచి అపకారం కలిగే ప్రమాదముంది. కనుక మనసు సిద్దపడక పోయినా, సమయం లేక పోయినా నేను వెయ్యిచయ్యాలని సంకల్పించాను అది పూర్తిచెయ్యవలసినదే అని మంకు పట్టు పట్టి కూర్చోకూడదు. చెయ్యగలిగిన జప సంఖ్యమాత్రమే పూర్తి చెయ్యాలి. ముఖ్యమైన విషయం ఏమిటంటే "మనసు ఎక్కువ సమయం జపంలో ఉండడానికి సిద్ధపడాలంటే కూడా మన మొండి పట్టుదలే కారణం".  అది ఎలాగ అన్నది ఎవరికి వారే తెలుసుకోవాలి. అన్ని విషయాలు మాటలతో చెప్పలేము.  పైరెండు స్థితులలో మంత్రం తప్పులు పోవడానికి  త్వరగా లక్షల జపాన్ని పూర్తిచెయ్యాలి అన్న సంకల్పమే కారణం.

- ఆధ్యాత్మిక సాధన చైతన్య వేదిక 

Quote of the day

A coward is incapable of exhibiting love; it is the prerogative of the brave.…

__________Mahatma Gandhi