Online Puja Services

నాతొ వస్తావా - మోక్షమార్గం చూపిస్తాను

18.222.118.14

నాతొ వస్తావా - మోక్షమార్గం చూపిస్తాను  !!
-సేకరణ : లక్ష్మి రమణ 

ఒక సాధువు నడిచి వెళుతూ అలసటగా ఉంటే ఒక చెట్టు కింద కూర్చున్నాడు.
ఎదురుగా వున్న ఇంట్లోని గృహస్థుడు ఆయన్ని చూసి తమ ఇంట్లోకి వచ్చి కొంచెం సేపు విశ్రాంతి తీసుకోమని కోరాడు.సాధువుకి మంచి భోజనం పెట్టి, చీకటి పడింది కదా ఈ పూటకి ఇక్కడే వుండమని కోరాడు .

యజమాని.. మాటల్లో తన కష్టసుఖాలు ముచ్చటిస్తూ, 
" ఏమిటో నండీ ! సంసారంలో సుఖం లేదండీ..మీజీవితమే హాయి !! అన్నాడు. వెంటనే ఆ సాధువు " అయితే నా వెంట రా ! నీకు మోక్ష మార్గం చూపిస్తాను " అన్నాడు.

యజమాని కంగారుపడుతూ. " అలా ఎలా కుదురుతుంది ??
పిల్లలు చిన్నవాళ్ళు.. వాళ్ళను పెంచి పెద్ద చేయాలి కదా !!" అన్నాడు. సాధువు మాట్లాడలేదు. 

కొన్ని సంవత్సరాలు గడిచాయి. ఆ సాధువు మరల అదే మార్గంలో వస్తూ ఆ ఇంటిని చూ‌సి ఆగాడు. ఆయన్ని చూసి యజమాని సాదరంగా ఆహ్వానించి, అతిథి మర్యాదలు చేశాడు. మాటలలో సాధువు అన్నాడు, " పిల్లలు పెద్దవాళ్లు అయ్యారు కదా నా వెంట రా! నీకు మోక్ష మార్గం చూపిస్తాను " 

యజమాని తడబడుతూ " ఇప్పుడే కాదు స్వామీ ! పిల్లలు స్థిరపడాలి,వాళ్ళ పెళ్ళిళ్ళు చేయాలి ....." అన్నాడు.

ఇంకా కొన్ని సంవత్సరాలు గడిచాయి. సాధువు మళ్లీ అదే.... యజమాని ఆతిథ్యం... సాధువు అదే మాట ..... యజమాని జవాబు కొంచెం విసుగ్గా.." పిల్లలకి డబ్బు విలువ తెలియదు.. అందుకని నేను దాచినంతా ఆ చెట్టు కింద పాతిపెట్టాను..వీలు చూసుకుని చెబుతాను. ఒక పెద్ద ఇల్లు కట్టాలి.. మీలాగా నాకు ఎలా కుదురుతుంది " అన్నాడు.

ఇంకా కొన్ని సంవత్సరాలు గడిచాయి. 
సాధువు మళ్లీ అదే మార్గంలో వస్తూ ఆ ఇంటి వంక చూడకుండా వెళ్ళి పోతుండగా ఆ యజమాని కొడుకు గమనించి ఆహ్వానించాడు . అతను తమ తండ్రి మరణించాడని చెప్పాడు.. సాధువు కి కొంచెం బాధనిపించింది.

ఆతిథ్యం స్వీకరించి బయటికి వచ్చాడు..

 చెట్టు కింద ఒక కుక్క కూర్చుని వుంది యజమాని అనుమానంగా దాని వంక చూశాడు. సందేహంలేదు యజమాని కుక్కగా పుట్టాడనుకొని  సాధువు మంత్రజలం దాని మీద జల్లి ..  " ఏమిటి నీ పిచ్చి మోహం ??? కుక్క గా పుట్టి ఇంటికి కాపలా కాస్తున్నావా ?? నా వెంట రా.. నీకు మోక్ష మార్గం చూపిస్తాను " అన్నాడు. 

యజమాని..  '' లేదు స్వామి నేను రాలేను ,  ఎందుకంటే నేను డబ్బు ఇక్కడ దాచిన సంగతి పిల్లలకి చెప్పలేదు ఎవరూ దోచుకోకుండా చూడాల్సిన బాధ్యత నాదే కదా " అన్నాడు.

మళ్ళీ కొన్నాళ్ళకి సాధువు ఆ దారిన వస్తూ ఆ ఇంటి వైపు చూశాడు . కుక్క కనపడలేదు పక్కవారిని అడిగితే అది పోయిందని చెప్పారు. అయినా సాధువు అనుమానంగా చుట్టూ చూస్తుంటే చెట్టు కింద ఒక పాము కనిపించింది. పరీక్షగా చూసాడు ఖచ్చితంగా ఆ యజమాని మళ్ళీ పాములాగా వచ్చాడని తెలుసుకొని , మంత్రజలం చల్లి, " ఇంకా ఈ ఇంటిని వదిలి వెళ్ళవా ??? అని ఎప్పటి లాగానే నా వెంట రా.. నీకు మోక్ష మార్గం చూపిస్తాను" అన్నాడు.

ఆ ఒక్క మాట మాత్రం అనకండి. నా సొమ్ము పిల్లలకి కాకుండా ఇతరులకి దక్కనీయకుండా చూడాలి కదా అన్నాడు దీనంగా.

సాధువు వెంటనే అతని ఇంట్లోకి వెళ్లి , అతని కొడుకులతో " మీ నాన్న ఆ చెట్టు కింద సొమ్ము  దాచిపెట్టాడు. కానీ జాగ్రత్త! అక్కడ పాము ఉంది " అన్నాడు. అనగానే   కొడుకులు ఎగిరి గంతేసి.. కర్రలు తీసుకుని బయలుదేరారు. తన కొడుకులే తనను కర్రలతో చావగొడుతుంటే అతను దీనంగా సాధువు వంక చూశాడు. కానీ అప్పటికే చాలా ఆలస్యమైంది. అన్నమాచార్యులు వాపోయినట్టు బంధాల బలం ఎంతుంటుందో ఈ కథ మనకి చెప్తుంది .  అయితే, గృహస్థాశ్రమం లో బాధ్యతలు స్వీకరించాలి కానీ ఆధ్యాత్మిక చింతనతో మెలగాలి. అవసరమైనఅంతవరకే , బంధాన్ని పరిమితం చేసుకోవాలి . 

శరీరం  యొక్క అంతిమ ప్రయోజనం మోక్ష సాధనమే అనే సత్యాన్ని ఎల్లప్పుడూ గుర్తెరిగి మసలుకోవాలి .  

మనలోని స్వార్ధం,గర్వం మంచుబిందువులా కరిగిపోవాలే తప్ప...   అగ్నిలా మనల్ని దహించివేయకూడదు.

      మనలోని మంచితనం, ప్రేమగుణం పువ్వులా ప్రతిరోజు వికాశించాలే కానీ..  ఎడారిలా మనల్ని ఒంటరి చేసేస్తే ఎలా ?

Quote of the day

As a single withered tree, if set aflame, causes a whole forest to burn, so does a rascal son destroy a whole family.…

__________Chanakya