Online Puja Services

అయ్యప్పవాహనం ఖచ్చితంగా పులే

3.15.229.113

అయ్యప్పవాహనం ఖచ్చితంగా పులే !
లక్ష్మీరమణ 

అయ్యప్ప వాహనంగా ఆయన దేవాలయం అయిన శబరిమల కొండపైన వాజి దర్శనమిస్తుంది . వాజి అంటే గుర్రం. ఈ గుర్రంను శివుని  త్రినేత్రంగానూ చెబుతారు. ఈ గుర్రం మీదనే అయ్యప్ప తన సవతి తల్లి కోరికమీద పులిపాలు తీసుకురావడానికి బయల్దేరతారు .  అయితే, అయ్యప్ప వాహనం పులెనని చెప్పడంలోని ఆంతర్యం ఏమిటి ?

మహిషాసురుడిని అంతమొందించింది మహాకాళి దుర్గమ్మ . అయినా ఆ అసుర వారసత్వం అంతంకాలేదు . మహిషాసురుడు చెల్లెలు మహిషి ఆ అసురీవారసత్వాన్ని కొనసాగించింది. పైగా తపస్సుచేసి, హరి , హరులకి పుట్టిన బిడ్డ చేతనే తనకి మరణం కావాలని కోరింది . అలా వరగర్వం చేత, అడవిలో సంచరిస్తోన్న మహిషిని నారదుడు కలిసి నీ మృత్యువు సమీపిస్తోంది , సిద్ధంగా ఉండమని హెచ్చరించాడు . మహిషి ఒక మహిషం (గేదె) రూపంలో, పులిపాలకోసం అన్వేషిస్తున్న అయ్యప్పను చంపడానికి వెళుతుంది. వీరి ఇద్దరి మధ్య జరిగే యుద్ధాన్ని వీక్షించడానికి ముక్కోటి దేవతలు అక్కడకు చేరుకుంటారు . 
 
ఈ సమయంలో అయ్యప్ప ఒక కొండపైకి ఎక్కి తాండవం చేస్తూ మహిషిని ఢీకొంటారు . ఇరువురి మధ్య జరిగిన భీకర యుద్ధంలో మహిషిని నేలపై విసిరికొడతాడు. ఆ దెబ్బకి గేదె రూపంలో ఉన్న మహిషి మరణిస్తుంది. దేవతలంతా ఆయనను స్తుతిస్తూ ఆదేవుని ముందుకు వస్తారు. అప్పుడు అయ్యప్ప ఇంద్రుడితో దేవేంద్రా! నేను పులి పాలు తెచ్చే నెపంతో ఇలా వచ్చాను. కాబట్టి మీరందరూ చిరుతలై నాకు తోడ్పడండి అని అడుగుతాడు. ఆయన కోరికపై అందరు పులులుగా మారిపోయారు. ఇంద్రుడు స్వయంగా చిరుతగా మారి అయ్యప్పకు వాహనమయ్యాడు. పులి వాహనంపై అయ్యప్ప తన రాజ్యం చేరుతారు .
 
అయ్యప్పకు పట్టాభిషేకం చేయాలని రాజు భావిస్తే, తనకు రాజ్యం వద్దన్న మణికంఠుడు ఒక ఆలయం నిర్మించి ఇవ్వమని కోరాడు. తానొక బాణం వదులుతానని, ఆ బాణం ఎక్కడ పడితే అక్కడ తనకు ఆలయం నిర్మించాలని నియమం పెట్టాడు. అలా అయ్యప్ప వేసిన బాణం శబరిమలలో పడటంతో అక్కడే ఆలయం నిర్మించారు. అక్కడే స్వామివారు స్థిరనివాసం ఏర్పరచుకొని తన భక్తులతో పూజలందుకొంటున్నాడని భక్తుల విశ్వాసం. అయ్యప్ప స్వామి ధర్మప్రవర్తన, ధర్మనిష్ఠ లోకానికి ఆశ్చర్యాన్ని కలిగించింది. తన భక్తులు ఏయే ధర్మాలని పాటించాలో, ఏ నియమనిష్ఠలతో వుండాలో కొన్ని మార్గదర్శక సూత్రాలను ప్రతిపాదించారు. అప్పటి నుండి ఆయన 'ధర్మశాస్త'గా ప్రజల అభిమానాన్ని చూరగొన్నాడు. అందుకే ఆయనకి 'ధర్మశాస్త' అనే పేరు కూడా వుంది.

ఇంతకీ ఆయానికి పూలె ఎందుకు వాహనం అంటే, ఆ పులి ఇంద్రుడు కాబట్టి . ఇంద్రియములకు అధిపతి ఇంద్రుడు . అందుకే మహాతపస్సు చేస్తున్న భక్తులని కూడా ఆయన తన ప్రభావానికి లోబడతారా అని పరీక్షిస్తుంటారు. విశ్వామిత్రుడు - మేనకల ఉదంతం అందరికీ తెలిసిందే కదా !  అటువంటి ఇంద్రియములపైనా స్వారీ చేయగల సమర్థులు ఆ అయ్యప్ప అని చెప్పేదాం ఇందులోని అంతరార్థం.  ఇక పులి అహంకారానికి ప్రతీక. మానవుని సహజమైన అహంకారాన్ని జయిస్తేనే పరమాత్మ ప్రకాశం అనేది దర్శనమిస్తుంది మరి . ఇక , పదునెట్టాంపడి కూడా ఇలా ఇంద్రియముల వాసనని అధిగమించి, అయ్యప్పని చేరుకుంటే, నీకూ ఆయ్యప్పకీ భేదం లేని స్థితిని పొందగలవు అనే కదా చెబుతుంది .  అదన్నమాట సంగతి . అందువల్ల ఆయన అసలు వాహనం వాజి అయినప్పటికీ అసలు సిసలైన  వాహనం మాత్రం పులి అన్నమాట.   

Quote of the day

May He who is the Brahman of the Hindus, the Ahura-Mazda of the Zoroastrians, the Buddha of the Buddhists, the Jehovah of the Jews, the Father in Heaven of the Christians give strength to you to carry out your noble idea.…

__________Swamy Vivekananda