Online Puja Services

మహిమాన్వితమైన ఈ సుబ్రహ్మణ్య క్షేత్రాల గురించి విన్నారా ?

3.15.225.173

మహిమాన్వితమైన ఈ సుబ్రహ్మణ్య క్షేత్రాల గురించి విన్నారా ?
- లక్ష్మి రమణ 

పంచారామాల గురించి విన్నాము. అష్టాదశ శక్తిపీఠాలు, ద్వాదశ జ్యోతిర్లింగాలు, పంచభూత స్థాలాలు, 108 వైష్ణవ దివ్యదేశాలు  ఇలా ఒక్కోదేవతకీ విశిష్టంగా ఉన్న క్షేత్రాల గురించి తెలుసుకునే ఉంటాము. అయితే, ఈ విధంగా అమ్మవారికీ, శివునికీ, విష్ణుమూర్తికీ ఉన్నట్లు కుమారస్వామికి కూడా కొన్ని మహిమాన్వితమైన క్షేత్రాలు ఉన్నాయి . వాటిని గురించి ఇక్కడ తెలుసుకొనే ప్రయత్నం చేద్దాం . 

ఆదిదంపతుల కుమారుడు, సార్ధకనామధేయుడు కుమారస్వామి. ఆయన షణ్ముఖుడు.  ఆరుముఖాలతో అలరారే స్వామి. కృత్తికలు ఆరుగురు కలిసి ఆయనకీ తల్లులలై పెంచారు . అందుకనే ఆరు అనే సంఖ్యను ఆ స్వామికి ప్రతీకగా భావిస్తుంటారు. ఆయనకు ఎన్ని క్షేత్రాలు ఉన్నా, అందులో ఆరు క్షేత్రాలను మరింత మహత్యం ఉన్నవిగా పేర్కొంటారు. 15వ శతాబ్దంలో తమిళ భక్తి సాహిత్యంలో ఈ క్షేత్రాలను తొలిసారిగా పేర్కొన్నారట. వీటిని తమిళనాట ‘ఆరు పడై వీడు’ (ఆరు పుణ్యక్షేత్రాలు) అని పిలుస్తారు. అవేమిటంటే…

1.తిరుపరన్కుండ్రం – ఆరు పైడైవీడులో ఇది తొలి క్షేత్రం. మధుర మీనాక్షిని దర్శించుకునేవారు, ఆ ఊరి పొలిమేరలో ఉన్న ఈ తిరుపరన్కుండ్రం ఆలయాన్ని కూడా తప్పక దర్శిస్తారు. ఇంద్రుని కుమార్తె దేవసేనని, కుమారస్వామి వివాహం చేసుకున్నది ఇక్కడే అని భక్తుల నమ్మకం.

2.తిరుచెందూరు – కుమారస్వామి ఆరు ప్రముఖ ఆలయాలలో సముద్రతీరాన ఉన్న ఏకైక ఆలయం తిరుచెందూరు. తిరువన్వేలి, కన్యాకుమారి వంటి ప్రసిద్ధ క్షేత్రాలకు ఈ ఆలయం కాస్త దగ్గరే! ఇక్కడ కుమారస్వామి, శూరపాదుడు  అనే రాక్షసుని మీద విజయం సాధించాడట!

3.పళని – తమిళనాట దిండుగల్ జిల్లాలో ఉన్న పళని కొండ తెలుగువారికి సుపరిచితమే! ఇక్కడ ఓ చిన్ని కొండ మీద ఉండే కుమారస్వామి దండాన్ని చేతపట్టుకుని ఉండాడు. అందుకునే ఆయనను ‘దండాయుధపాణి’ అని పిలుస్తారు. ఇక్కడి స్వామివారి విగ్రహాన్ని తొమ్మిది రకాల లోహాలతో రూపొందించడం మరో విశేషం.

4.స్వామిమలై – తమిళనాడులోని కుంభకోణం అనే ఊరుకి అతిసమీపంలో ఈ ఆలయం ఉంది. ఇక్కడ కుమారస్వామి సాక్షాత్తు తన తండ్రి శివునికే ఓంకారం గురించి తెలియచేశాడట. స్వామిమలై కేవలం కుమారస్వామి ఆలయానికే కాదు, ఇత్తడి విగ్రహాల తయారీకి కూడా ప్రసిద్ధమే!

5.తిరుత్తణి – రాక్షసులతో యుద్ధం ముగిసిన తర్వాత, కుమారస్మామి సేదతీరిన ప్రదేశం ఇది. ఇక్కడే ఆయన వల్లీదేవిని వివాహం చేసుకున్నారు. తిరుపతి లేదా చెన్నైకి వెళ్లినవారు అక్కడికి సమీపంలోనే ఉండే ఈ క్షేత్రాన్ని తప్పక దర్శించి తీరుతారు.

6.పళమూడిర్చోళై – మధురై నగరానికి 20 కిలోమీటర్ల దూరంలో దట్టమైన అడవుల నడుము, ఓ చిన్న కొండ మీద ఉందీ క్షేత్రం. అందమైన ప్రకృతి నడుమ, వల్లీదేవసేన సమేతంగా ఉన్న ఇక్కడి స్వామివారిని చూడటం ఓ దివ్యమైన అనుభూతి అంటారు భక్తులు.

ఈ ఆరు క్షేత్రాలూ దేనికవే ప్రత్యేకమైన దివ్యత్వంతో అలరారుతూ , సుబ్రహ్మణ్యుని అనుగ్రహాన్ని అందించేవి. సంతాన ప్రదాయకము , సంతాన ఆరోగ్య కారకము , మహా మహిమాన్వితమూ అయిన ఈ క్షేత్రాలని తిరుపతి యాత్రలో లేదా తమిళనాడు యాత్రలో భాగంగా దర్శించేలా ప్రణాళిక రూపొందించుకోవచ్చు.  ప్రత్యేకించి ఈ ఆరుక్షేత్రాలకీ కూడా టూరిజం ప్యాకేజీలు అందుబాటులో ఉన్నాయి .  

శుభం !!

Quote of the day

To be idle is a short road to death and to be diligent is a way of life; foolish people are idle, wise people are diligent.…

__________Gautam Buddha