Online Puja Services

ఈ సుబ్రహ్మణ్యుని సన్నిధిలో వివాహం చేసుకుంటే,

18.117.70.132

ఈ సుబ్రహ్మణ్యుని సన్నిధిలో వివాహం చేసుకుంటే, మంచి ప్రవర్తన గల పిల్లలు పుడతారు . 
-సేకరణ 

తమిళనాడు రాష్ట్రంలో మురగన్ గాసుబ్రహ్మణ్యుణ్ణి విశేషంగా ఆరాధిస్తారు. అక్కడ షణ్ముఖునికి ఆరు ప్రధాన దేవాలయాలు కూడా ఉన్నాయి . అటువంటి ఆలయాల్లో కుంభకోణం సమీపంలో ‘స్వామిమలై’ ప్రసిద్ది చెందిన దేవాలయం. ’స్వామి మలై’ అంటే దేవుని పర్వతం అని అర్థం. ఇక్కడున్న సుబ్రహ్మణ్యేశ్వరుడు, వినాయకుడు , పరమేశ్వరుడు అందరూ మహిమాన్వితులే ! ఈ సుబ్రహ్మణ్యుని సన్నిధిలో వివాహం చేసుకుంటే, మంచి ప్రవర్తన గల పిల్లలు పుడతారు . వేయిబాహువులున్న కార్తవీర్యార్జనుడు కట్టించిన స్వామిమలై ఆలయాన్ని దర్శిద్దాం రండి.  

పిల్లాడికి నమస్కరించేదేమిటని అహంకరించిన బ్రహ్మదేవుని అహంకారానికి సరైన గుణపాఠం చెప్పాలనుకున్నాడు బాల స్కందుడు. పిలిచి ప్రణవ శబ్దం ‘ఓం’ కార శబ్దానికి అర్థం చెప్పమన్నారు.  ఆయన చెప్పలేకపోవడంతో, బ్రహ్మగారిని చెరసాలలో వేశారు . తిరిగి పరమేశ్వరుని అనుగ్రహంతో విడిచి పెట్టారు . ఆ తర్వాత ఆ ప్రణవనాదానికి అర్థాన్ని కుమారుణ్ణే వివరించాల్సిందిగా ఈశ్వరుడు అభ్యర్ధించారు . అది బహిరంగంగా చెప్పతాగినది కాదని, దానిని ఉపదేశిస్తానంటూ కుమారస్వామి పరమేశ్వరులం, బ్రహ్మాది దేవతలనూ వెంటబెట్టుకొని స్వామిమలై చేరుకున్నారు . అక్కడ తానె గురుస్వరూపమై స్వయంగా ఆ దక్షిణామూర్తికి ప్రవనాదాన్ని ఉపదేశించారు . ఆ విధంగా పరమేశ్వరుడు కుమారుని జ్ఞానానికి , తెలివితేటలకు మురిసిపోయి పుత్రోత్సాహం పొందిన స్థలం స్వామిమలై. 

ఆ పరమేశ్వరుడు ఈ జగత్తుకే స్వామి. ఆ స్వామికి స్వామియై, నాథుడై, ఆయనకే మంత్రోపదేశం చేశారు కుమారుడు .  కనుక ఇక్కడ కుమార స్వామికి ‘స్వామి నాథుడ’నే పేరు వచ్చింది. ఈ స్థలానికి ‘స్వామిమలై’ అనే పేరు వచ్చింది.

అతి పురాతనమైన ఈ ఆలయాన్ని  ‘కార్త వీర్యార్జునుడు’ కట్టించాడు. గర్భగుడి బయట మనం ఆయన విగ్రహాన్ని దర్శించవచ్చు. ఈ చిన్న కొండపైకి ఎక్కాలంటే విశాలమైన 60 రాతి మెట్లు ఎక్కాలి. ఈ అరవై మెట్లు అరవై తమిళ సంవత్సరాలకి ప్రతీకలని, ఆ సంవత్సరాధిదేవతలు ఈ రూపంగా స్వామిని సేవిస్తున్నారనీ అంటారు. ప్రతి మెట్టు దగ్గర గోడపై ఆ సంవత్సరం పేరు తమిళంలో వ్రాసి ఉంటుంది.  ఈ మెట్లు ఎక్కే నడక దారిలో 32 మెట్లు ఎక్కగానే కుడివైపుకు చూస్తే అక్కడ కుమారస్వామి తన తండ్రికి ఉపదేశం ఇస్తున్న అద్భుత శిల్పం కనబడుతుంది. అలాగే ఈ గుడికి క్రింది భాగంలో శివపార్వతులు మంటపాలున్నాయి.

పాండ్య రాజైన వరగుణుడు ఒకసారి మధుర నుండి పుణ్యక్షేత్రమైన తిరువిదైమరుదూర్ కు వెళ్తూ ఈ ఆలయంలో ఒక రాత్రి గడిపాడు. ఆయన కులదైవమైన మీనాక్షిమాత, సుందరేశ్వరుని ఆరాధించడానికి ఈ మంటపాలని ఏర్పరచాడు.

 ఈ ఆలయంలో ద్వజ స్థంభం వద్ద ఉన్న వినాయకుడి ఆలయం కూడా చాలా మహిమ కలది. ఇక్కడ కుమారతరై, నేత్ర పుష్కరిణి అనే రెండు పుష్కరిణులు ఉన్నాయి. కొంగు ప్రాంతం నుండి వచ్చిన పుట్టుగుడ్డి అయిన ఒక భక్తుడు ఈ రెండు పుష్కరిణులలో స్నానం చేసి స్వామి సన్నిధానానికి వస్తుంటే ఈ వినాయకుడి గుడి దగ్గరకు వచ్చే సరికి ఆయనికి కన్నులు కనిపించడం వల్ల ఈ వినాయకున్ని నేత్ర వినాయగర్ అని పిలుస్తారు.

పురాణ కథనం ప్రకారం ఈ దేవుని సన్నిధికి వచ్చి నిశ్చల భక్తితో పూజించే వారి పాపాలన్నీ సూర్యుని ముందు పొగమంచులాగా కరిగిపోతాయి. 

ఈ దేవాలయంలో వివాహం చేసుకున్న వారికి సత్ప్రవర్తన, సత్సంతానం కలుగుతాయంటారు. ఈ స్వామి దర్శనార్థం అనేక మంది భక్తులు సందర్శిస్తుంటారు. దేశ, విదేశాల నుండి కూడా భక్తులు ఆ ఆలయానికి వస్తుంటారు. భక్తులు కోర్కెలు తీరిన తర్వాత స్వామి వారికి పాలకావడి, పూల కావడి వంటి ముడుపులు చెల్లిస్తుంటారు.

 సాయంత్రం సమయంలో కుమారుని దర్శనం నేత్ర పర్వంగా ఉంటుంది .  ఆ సమయంలో స్వామికి అభిషేకం చేస్తారు. పసుపు అభిషేకం చేసిన తర్వాత స్వామి కన్నులు, ముక్కు, నోరు, తుడుస్తారు. అప్పుడు స్వామి వారి సౌందర్యం చూడటానికి రెండు కళ్ళు సరిపోవు, ఆ అపురూప సౌందర్యం వర్ణించడానికి మాటలు చాలవు.

60అడుగుల ఎత్తులో ఉన్న ఈ ఆలయం ప్రకృతి సౌందర్యం మధ్య కనువిందు చేస్తూ వుంటుంది. తమిళనాడు యాత్రలో ఖచ్చితంగా ఈ ఆలయ దర్శనం చేసుకోవడం మర్చిపోకండి . 

శుభం !!

 

Quote of the day

To be idle is a short road to death and to be diligent is a way of life; foolish people are idle, wise people are diligent.…

__________Gautam Buddha