Online Puja Services

సమస్యలు తొలగించే లక్ష్మీ నారసింహ ఆలయం !

13.58.247.31

వివాహ , ఉద్యోగ సమస్యలు తొలగించే లక్ష్మీ నారసింహ ఆలయం !
- లక్ష్మిరమణ 

సర్వలోక రక్షకుడైన విష్ణుమూర్తి ధరించిన 21 ముఖ్య అవతారాలను ఏకవింశతి అవతారములు అంటారు. వానిలో అతిముఖ్యమైన 10 అవతారాలను దశావతారాలు అంటారు. దశావతారాలలో తొలి నాలుగు అవతారాలు సంకల్ప మాత్రాన అవతరించినవి. అంటే జననీజనకులు లేకుండా ధరించిన  "సద్యోజాత రూపాలు". వీటిల్లో అత్యంత ప్రముఖమైనది శ్రీ నారసింహ అవతారం. దుష్ట సంహరునిగా, భక్త వరదునిగా, అపమృత్యు భయాన్ని తొలిగించేవానిగా, కోరిన కోర్కెలు కురిపించే కల్పతరువుగా ఈ స్వామి ప్రసిద్దుడు. మహాలక్ష్మిని సంబోధించే "శ్రీ" పదాన్ని చేర్చి శ్రీనారసింహుడని ఈ అవతార మూర్తిని స్మరిస్తారు. ఇక్కడ చెప్పుకోబోయే నారసింహ ఆలయంలోని రాజ్యలక్ష్మీ  దేవిని దర్శించుకుంటే వివాహ, ఉద్యోగ సమస్యలు తొలగిపోతాయని ప్రతీతి .   

నారసింహుని అవతార విశేషం గురించి ధర్మరాజుకి వివరిస్తూ నారద మహర్షి ఇలా చెప్పారు . 

శ్రీ రమణీయమైన నరసింహ విహారము నింద్రశత్రు సం
హారము బుణ్య భాగవతుడైన నిశాచరనాధ పుత్ర సం
చారము నెవ్వడైన సువిచారత విన్న పఠించినన్ శుభా
కారము తోడ నే భయము గల్గని లోకము జెందు భూవరా!

   
నరసింహుని చరిత్రని చదివి, ఆయనని శరణు వేడితే, భయము అనేది పూర్ణముగా నశింపజేస్తారు నారసింహుడు . జీవితంలో భయం లేదు అంటే, మనం సాధించాలి అనుకునే లక్ష్యాలన్నీ విజయవంతంగా సాధించినట్టే కదా ! ఆ ధుర్యాన్ని స్వామీ అనుగ్రహిస్తారు . మహా మహిమాన్వితమైన శ్రీ నరసింహునికి మన రాష్ట్రంలో చాలా ప్రసిద్ద ఆలయాలున్నాయి. నవ నరసింహాలయాలుగా నారసింహ క్షేత్రాలు ప్రసిద్ధిని పొందాయి .  అయితే ఆంధ్రప్రదేశ్ రాష్టంలోని గుంటూరులో ఉన్న ఒక నారసింహ ఆలయానికి  చరిత్రలో సముచిత స్థానం ఉన్నా, స్థానికంగా మాత్రమే గుర్తింపు ఉంది . మహిమాన్వితమైన ఆ ఆలయ విశేషాలు ఇక్కడ చెప్పుకుందాం . 

స్థలపురాణం  :
నారసింహునికి స్వప్న దర్శనం ఇవ్వడం ఇష్టమేమో మరి ! మల్లూరు లో స్వామి స్వప్నసాక్షాత్కారం ద్వారా ప్రకటితమైన దైవమే . కొన్ని నారసింహ ఆలయాలలో స్వామి స్వప్నసాక్షాత్కారమిచ్చి ఆరోగ్యాన్ని కుదుటపరచడం ఇప్పటికీ సత్యంగా కనిపిస్తూ ఉంటుంది . ఇక గుంటూరులోని ఈ నారసింహుని కథ ఆరువందల యాభై సంవత్సరాల క్రిందటిది! స్థానిక భక్తునికి స్వప్న దర్శనమిచ్చిన స్వామి "తానొక చెట్టు తొర్రలో ఉన్నాను" అని తెలిపారట. అతడు అప్పటికి ఆ  ప్రాంత పాలకులైన కొండవీటి రెడ్డి రాజుకు విషయం విన్నవించుకొన్నారు. రాజాదేశం మేరకు ఆ భక్తుని స్వప్నవృత్తాంతం మేరకు అన్వేషణ సాగించారు. అలా  శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి విగ్రహం ఒక వట వృక్షం తొర్రలో లభించినది. తమ అదృష్టానికి సంతసించిన రాజు ఇక్కడ చక్కని ఆలయాన్ని నిర్మించి, నిర్వహణ నిమిత్తం అనేక భూరి విరాళాలను ఇచ్చారు. ఈ విషయం తెలిపే శాసనం ఒకటి ఈ నారసింహుని ఆలయంలోని  ప్రాంగణంలో ఉన్న  ఉత్సవ మండప స్థంభం మీద చెక్కబడి ఉన్నది.  

ఆలయ విశేషాలు : 
తూర్పు ముఖంగా ఉండే ప్రధాన ద్వారానికి అయిదు అంతస్తుల సుందర శిల్పాలతో కూడిన రాజ గోపురం తో ఈ ఆలయం చాలా అందంగా ఉంటుంది. దాని మీద భాగవత, రామాయణ ఘట్టాలను చక్కగా మలచారు. ద్వజస్థంభం దగ్గర సాధారణంగా గరుత్మంతుడు కొలువై ఉంటాడు. కానీ ఈ ఆలయంలో రామదాసుడు ఆంజనేయుడు, విష్ణు సేవకుడు వైనతేయుడు ఇద్దరూ కొలువై ఉండడం విశేషం . ఇక ఆస్థాన మండపం లోని ఏకశిల స్థంభాలు ఆలయ కాలాన్ని చెప్పకనే చెబుతాయి. 

నారసింహ దర్శనం :
గర్భాలయంలో వామాంకం మీద శ్రీ లక్ష్మీ అమ్మవారితో కలిసి ఉపస్థిత భంగిమలో రమణీయ పుష్ప అలంకారంలో శ్రీ నారసింహ స్వామి ప్రసన్న రూపంలో దర్శనమిస్తారు. పక్కనే ఉన్న ఉపాలయంలొ శ్రీ రాజ్య లక్ష్మి అమ్మవారు కొలువై ఉంటారు. వివాహ మరియు ఉద్యోగ  సంబంధిత ఆటంకాలను తొలగించే దైవంగా ఈ అమ్మ ప్రసిద్ధిని పొందారు .  మరో ఉపాలయంలో శ్రీ ఆండాళ్ కొలువై ఉంటారు. ధనుర్మాసంలో ఇక్కడ  విశేష పూజలు నిర్వహిస్తారు.

పూజావిశేషాలు :
నిత్య పూజలు, కైంకర్యలను స్వామికి జరుగుతుంటాయి. చైత్ర మాసంలో బ్రహోత్సవాలు, శ్రావణం లో పవిత్రోత్సవాలు, వైశాఖ సుద్ద చతుర్ధశి నాడు స్వామి జన్మ దిన వేడుకలను ఘనంగా నిర్వహిస్తారు. ప్రతి నెలా స్వాతి నక్షత్రం నాడు ప్రత్యేక పూజలు అలంకరణ చేస్తారు. ప్రతి శుక్రవారం మూల విరాట్టుకు పంచామృతాభిషేకం జరుగుతుంది. ధనుర్మాసంలో తిరుప్పావై గానం చేస్తారు, వైకుంఠ ఏకాదశి నాడు ఉత్తర ద్వార దర్శనం.భోగినాడు గోదా కల్యాణంజరుపుతారు.   అన్ని పర్వదినాలలో విశేష పూజలు నిర్వహిస్తారు. 

ఇలా వెళ్ళాలి : 
ఈ శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి ఆలయం, గుంటూరు పట్టణంలో ఆర్ అగ్రహారంగా పేరొందిన రామచంద్ర అగ్రహారంలో ఉన్నది. బస్టాండు నుండి రైల్వే స్టేషన్ నుండి సులభంగా ఇక్కడికి చేరుకోవచ్చు. గుంటూరు పట్టణంలోని దర్శనీయ క్షేత్రాలలో ఈ ఆలయం ఒకటి. ఈ సారి గుంటూరు వెళ్ళినప్పుడు తప్పక దర్శించుకోండి .  

శుభం .  

#lakshminarasimhatemple #guntur

Tags: lakshmi narasimha, nrusimha, swamy, guntur

Quote of the day

Anger and intolerance are the enemies of correct understanding.…

__________Mahatma Gandhi