Online Puja Services

సొంతింటికల నిజమవ్వాలంటే, ఇక్కడ రాళ్లుపేర్చిరండి !

18.119.105.239

సొంతింటికల నిజమవ్వాలంటే, ఇక్కడ రాళ్లుపేర్చిరండి !
-లక్ష్మీరమణ 

ఇల్లుకట్టుకోవాలనే ఆశ లేనిదెవరికి? ఇల్లున్నవారు, అద్దెలతో అగచాట్లు పడుతున్నవారూ  ఒక ఇంటివాళ్ళవ్వాలనే కదా కోరుకుంటారు.  ఆ ఆశలు తీర్చే దేవుడు ఆంధ్రప్రదేశ్లో ఉన్నారు. మనం చేయాల్సిందల్లా  రాయిమీద రాయిపెట్టి , అందమైన ఆలయం ఆ స్వామికి కట్టడమే. చిన్నప్పుడు రాళ్లన్ని ఏరుకొచ్చి ఒకదానిమీదొకటి పేర్చి , దాన్నే గుడని ఆడుకునేవాళ్ళం కదా ! అలాగన్నమాట . మరి ఆ ఆలయవిశేషాలేంటో చూద్దామా !

జయజయ నృసింహ సర్వేశ | భయహర వీర ప్రహ్లాద వరద ||

అంటూ నరసింహస్వామిని స్తుతిస్తారు అన్నమయ్య. తన భక్తుని కాచడంకోసం విచిత్రమైన అవతారంలో , ఒక స్తంభం నుండీ అవతరించడం ఆయన సర్వవ్యాప్తిత్వాన్ని చెబుతూనే ఉంది కదా ! పైగా తెలుగువారి ఇష్టదైవాలలో నరసింహస్వామి ఒకరు. దేశంలో మరే ప్రాంతానికీ తీసిపోని విధంగా తెలుగు నేల మీద అద్భుతమైన నరసింహ క్షేత్రాలు ఉన్నాయి. వాటి గురించి చెప్పుకోవడం ఆరంభిస్తే, ముందుగా సింహాచలమే గుర్తుకువస్తుంది. 

తూర్పు కనుమలలో భాగంగా విశాఖపట్నానికి దగ్గరలో ఉన్న పర్వతమే సింహాచలం. ఆ కొండమీద వెలసిన దైవమే వరాహలక్ష్మీనరసింహస్వామి. ఈ ఆలయంలోని మూలవిరాట్టుని సాక్షాత్తూ ఆ ప్రహ్లాదుడే ప్రత్రిష్టించాడని చెబుతారు. రాక్షస సోదరులైన హిరణ్యాక్షుడు, హిరణ్యకశిపులని చంపిన వరాహ, నరసింహ అవతారాల కలయికగా ఇక్కడి విగ్రహం కనిపిస్తుంది. వరాహ మొఖంతో, మనిషి శరీరంతో, సింహం తోకతో స్వామి ఉంటారు.
 
సింహాచలం స్వామి అంటే తెలుగువారికి, అందునా దక్షిణాది వారికి చాలా నమ్మకం. ఆయనను తల్చుకుంటే చాలు, తమ ఆపదలు తీరిపోతాయని వారి విశ్వాసం. అలా ఆపదలు తీర్చే దైవం కాబట్టే ఆయనను అప్పన్న అని పిల్చుకుంటారట. అప్పడు అంటే తండ్రి అన్న అర్థం కూడా కనిపిస్తుంది. మరి ఆ చల్లని స్వామి మనల్ని తండ్రిలా కాచుకుంటాడు కదా!

అటువంటి భక్తవరదుడైన  అప్పన్న ఆలయ ప్రాంగణంలో రాయి పై రాయి పేర్చి భక్తులు స్వామివారికి మొక్కడం వల్ల, వారి సొంత ఇంటి కల నెరవేరుతుంది అని విశ్వసిస్తారు.ఈ ఆలయ ప్రాంగణంలో ఎటు చూసినా మనకు ఈ విధమైనటువంటి రాళ్లతో కట్టిన ఆలయాలు దర్శనమిస్తాయి. అదేవిధంగా ఈ ఆలయ ప్రాంగణంలో ఉన్న చెట్లకు గుడ్డతో ఉయ్యాలలు కడితే వారికి సంతానం కలుగుతుందని భక్తులు విశ్వసిస్తారు. 

మీకూ ఇల్లుకట్టుకునే ఆలోచన ఉంటె, వెంటనే బయల్దేరండి సింహాచలానికి .  ఇక్కడికి వెళ్లేందుకు, రైలు బస్సు సర్వీసులు అందుబాటులో ఉన్నాయి . 

Quote of the day

Anger and intolerance are the enemies of correct understanding.…

__________Mahatma Gandhi