Online Puja Services

శాకంబరీ ఆరాధన

18.218.70.93

జ్యేష్ఠ , ఆషాఢ మాసాల్లో శ్రేష్ఠమైన తరిగిపోని అన్నపాన అమృత ఫలాలను అనుగ్రహించే శాకంబరీ ఆరాధన . 
- లక్ష్మి రమణ 

భూమి జగత్తులోని జీవరాశికి పదార్ధమైన స్వరూపము. చూడండి , విత్తు ముందా , చెట్టు ముందా అనేదానికి సమాధానం చెప్పగలమా ? కానీ ఆ పుడమి గర్భంలోనుండీ పుట్టిన విత్తే చెట్టై , అనేక జీవులకి ఆహారమై, ఔషధమై , తిరిగి ఆ జీవుల పునరుత్పత్తికి బీజమై ఈ భువుమీద సృష్టి కొనసాగడానికి కారణం అవుతోంది కదా ! అటువంటి పరమాత్మిక పరమ ప్రక్రుతి స్వరూపిణి శాకంబరీ దేవి. సస్యములని సంవృద్ధిగా అనుగ్రహించి ఆదుకొనే ఈ చల్లని తల్లిని పంటని పెట్టే తొలినాళ్ళయిన ఆషాఢంలో ఆరాధించడం మన సంప్రదాయం.  దీనివల్ల పంటలు సమృధ్దిగా పండుతాయనీ, పాడిపంటలకు లోటు ఉండదనీ విశ్వాసం. అసలు శాకాంబరీ దేవి కథ వింటే చాలు ఎటువంటి కష్టాలైనా ఒలగిపోయి అమ్మ బిడ్డని కాపాడినట్టు ఆ దేవదేవి భక్తులని వున్నంటి రక్షిస్తుందని వేదవ్యాసుడు జనమేజయునికి వివరించినట్టు పురాణాలు చెబుతున్నాయి. 

పూర్వం హిరణ్యాక్షుని వంశంలో దుర్గముడనే రాక్షసుడు పుట్టాడు. దేవతలకు వేదమే బలమని గుర్తించిన అతడు, వేదాలను తుదముట్టించి దేవతలను నాశనం చేయవచ్చునని ఆలోచించాడు. ఒక పథకం ప్రకారం వేయి సంవత్సరాలు బ్రహ్మను గురింతి తీవ్రమైన తపస్సు చేశాడు. కేవలం వాయి భక్షణతోనే జీవయాత్ర సాగిస్తూ, అతడు తపస్సును కొసాగించాడు. అతని కఠోర తపశ్చర్యకు లోకం అల్లకల్లోలమైంది. బ్రహ్మా అతనికి ప్రత్యక్షమయ్యాడు వేదాలను తనకు అనుగ్రహించ వలసిందిగా, దేవతలను జయించ గల శక్తిని తనకు ప్రసాదించ వలసిందిగాను వరం కోరుకున్నాడు దుర్గముడు. బ్రహ్మదేవుడు "తథాస్తు" అని మాయమయ్యాడు.

బ్రహ్మ (Brahma) యిచ్చిన వరప్రభావం వల్ల రాక్షసుడైన దుర్గమునికి వేదాలన్నీ స్వాధీనమయ్యాయి. ఆ నాటి నుండి విప్రులు వేదాలను మరచిపోయారు. భూలోకంలో వేదధర్మాచరణ  క్షీణించింది. స్నానసంధ్యాదులు, జపహోమాదులు, యజ్ఞ యాగాదులు అన్ని అంతరించాయి. వేదవాఙ్మయ విజ్ఞానం తమకు దూరమై పోవడంతో బ్రాహ్మణులకు యజ్ఞనిర్వహణ అసాధ్యమైపోయింది. యజ్ఞాలు లేకపోవడం వల్ల, హవిస్సులు లేని  దేవతలు నిర్వీర్యులయ్యారు. రాక్షస గణం దేవలోకాన్ని అక్రమించింది. ఇంద్రుడు స్వర్గాన్ని విడిచి, కొండల్లో, కొనల్లో అజ్ఞాతవాసం చేస్తూ పరాశక్తిని ప్రార్థించ సాగాడు. బ్రాహ్మణులందఱూ హిమాలయాలకు వెళ్ళి భవానీ మాతను ప్రార్థించి, తమ అపరాధాలను క్షమించి, దయచూడ వలసిందిగా వేడుకున్నారు. తెలియక చేసిన తప్పులను మన్నించి, కనికరించ వలసిందిగా ప్రాధేయ పడ్డారు.

వారి ప్రార్థనలు విని జగన్మాత (jaganmatha) ప్రత్యక్ష మయింది. నిలువెల్లా కన్నులతో దివ్య కాంతులతో ప్రత్యక్షమయింది. తన బిడ్డలైన ప్రాణికోటి కష్టాలను చూడలేత శతనేత్రాలతో తొమ్మిది రోజుల పాటు ధారాపాతంగా కన్నీరు కారుస్తూ రోదించింది. తన బిడ్డల బాధ చూడలేక కన్నీరు మున్నీరుగా ఆమె విలపించగా, ఆమె కన్నీటి దారల చేత చెట్లన్నీ చిగురించి, పుష్పించి, ఫలించి , ఆర్తులకు మధుర ఫలాలను అందించాయి. అంతట జగన్మాత స్వయంగా తన చేతులతో వివిధ ఫలాలను, రకరకాల శాకాలను ఆర్తుల నోటికి అందించి, వారి ఆకలిని తీర్చింది. ఆనాటి నుండి ఆ దేవిని "శతాక్షి" (Sathakshi) అని, "శాకంభరి " (Shakambhari) అని పిలుస్తూ, దేవతలందఱు ఆమెను పూజింపసాగారు.

ఈ వృత్తాంతం విన్న దుర్గముడు రాక్షస సమూహాలను వెంటబెట్టుకొని వెళ్లి దేవతలను, బ్రాహ్మణులను చుట్టుముట్టి, పరిపరి విధాలుగా వేధిస్తూ, వారిని భయ భ్రాంతులను చేయసాగాడు. దేవతలు, బ్రాహ్మణులు ఆర్తితో శతాక్షీదేవిని ప్రార్థించారు.

వారి మొఱలు ఆలకించి, జగన్మాత తేజోరాశి అయిన చక్రాన్ని సృష్టించి రాక్షసులతో యుద్ధం ప్రారంభించింది. దేవ దానవ సంగ్రామం భయంకరమైన , వారు పరస్పరమూ ప్రయోగించుకొనే శరపరంపరలతో సూర్య మండలం మూసుకు పోయింది. అగ్నిజ్వాలలు ఆకాశాన్ని అంటుకున్నాయి. రాక్షసులు మరింతగా విజృంభించారు. అపుడు దేవి కనుబొమలు ముడిచి, హుంకారం చేసింది. ఆమె దివ్యదేహం నుండి అజేయమైన శక్తులు అనేకం ఆవిర్భవించాయి.అలా ముప్ఫయి రెండు శక్తులు ఆవిర్భవించి, రాక్షసులను చీల్చి చెండాడాయి. పదిరోజులు యుద్ధం సాగిన తర్వాత దానవ సైన్యం అంతా నశించింది. దుర్గముడు ఒక్కడే మిగిలాడు. దుర్గముడు అతి కోపంతో దేవి పైకి విజృంభించాడు. అపుడు శతాక్షీదేవి తీక్షణమైన చూపులను ప్రసరింపచేసి, దుర్గమునిపై బాణవర్షం కురిపించింది. దుర్గముని రథాశ్వాలను, సారధిని వధించింది. ఆ పై మరో ఐదు బాణాలు ప్రయోగించి దుర్గముణ్ణి సంహరించిది. అప్పుడు దేవతలు, త్రిమూర్తులు ఆ దేవిని నను శాకంభరీ దేవి! నమస్తే శతలోచనే!

"సర్వోపనిషదుద్ఘషే! దుర్గమాసుర నాశిని!"

అని సంస్తుతించారు.

అంతట ఆ దేవి వానితో " దేవతలారా ! వేద విప్రులారా ! మీరిప్పుడు చూస్తున్న ఈ నా రూపం చాలా పవిత్రమైనది. ఈ రూపాన్ని చూడనందు వల్లనే ఇంత కాలమూ మీరు ఇన్ని కష్టాలు పడ్డారు. దుర్గమాసురుణ్ణి చంపిన నన్ను 'దుర్గ' అనే పేరుతో పూజిస్తూ, మీ కష్టాలను దూరం చేసుకొని సుఖంగా ప్రశాంతంగా జీవించండి" అని అభయమిచ్చి, అంతర్ధానం మైంది.

ఆ నాటి నుండి దేవతలు, వేదవిప్రులు యథావిధిగా తమ తమ ధర్మాలను నిర్వర్తిస్తూ, ప్రశాంతంగా జీవయాత్ర సాగిస్తూ, ఆ దేవిని దుర్గగా, శతాక్షీ దేవిగా, శాకంభరిగా వ్యవహరిస్తూ, ఆమెను ఆరాధించి, ఆమె అనుగ్రహంతో తమ జీవితాలను చరితార్ధం చేసుకున్నారు.

ఈ కథ విశేషాన్ని వినిపించి, వ్యాసమహర్షి ఇలా అన్నాడు-"జనమేజయ మహారాజా !

పవిత్రమైన ఈ శతాక్షీ మహిమా వృత్తాంతం విన్న వారికి దేవీ భక్తి కలుగుతుంది.కష్టాలు తొలిగిపోతాయి. ఆమె అనుగ్రహం పొందితే, సర్వమూ సిద్ధించినట్లే. నీవు కూడా ఆమెను పూజించి, కృతార్ధతను పొందు." అని . ఇది మన అందరికీ వర్తిస్తుంది. 

ఇందుచేతనే  నవరాత్రులలో ఒక రోజు అమ్మవారిని అనేక రకాల కాయగూరలతో, ఫలాలతో, శాస్త్ర ప్రకారం అలంకరించి శాకాంబరీ అవతారం గా కొలిచి దేవాలయాల్లో అర్చనలు జరుపుతుంటారు. అయితే శాకాంబరీ దేవిని ఆషాఢంలో పూజించడం  మరింత విశేషం.  ఏరువాక పూర్ణిమ అంటే భూమిని దున్నటం ప్రారంభించేరోజు. పూర్వం ఈరోజును పండగలా చేసుకునేవారు. ఇప్పటికి కొన్ని గ్రామాలలో ఈ పండగను జరుపుకుంటూనే ఉన్నారు. ఈ పండుగ జ్యేష్ఠ మాసంలో శుక్లపక్ష పూర్ణిమనాడు వస్తుంది. ఈ సమయానికి ఋతుపవనాలు ప్రవేశించి తొలకరిజల్లులు కురుస్తాయి. దీనితో వ్యవసాయ పనులు ప్రారంభమవుతాయి. జ్యేష్ఠ మాసం తరువాత వచ్చే ఆషాఢ మాసంలో జగన్మాతను శాకంబరీదేవిగా పూజించడం ఆచారం.

మార్కడేయ (Markandeya) పురాణంలోని చండీసప్తశతితో పాటు దేవీ భాగవతంలో శాకాంబరీ దేవి గురించిన ప్రస్తావన ఉంది. ‘నీటి చుక్క కూడా లేకుండా వందేళ్ల కాలం వరకు ఒక సమయంలో అనావృష్టి సంభవించగలదు… అప్పుడు ఈ భూలోకంలోని మునీశ్వరులు నన్ను స్తుతిస్తారు… వారి కోరిక మేరకు నేను అయోనిజనై అవతరిస్తాను.. నా శత నయనాలతో చూస్తూ లోకాలను కాపాడుతాను.. అప్పుడు ప్రజలందరూ నన్ను శతాక్షీదేవిగా కీర్తిస్తారు. ఆ తర్వాత నా దేహం నుండి శాకములను పుట్టించి, మళ్లీ వర్షాలు పడేంత వరకు ప్రజల ఆకలి తీర్చి, ప్రాణాలను రక్షిస్తాను. అందువల్లనే నేను శాకాంబరీదేవిగా ప్రసిద్ధి పొందుతానని’ అమ్మవారు చెప్పినట్టుగా పురాణాల్లో ఉంది.

అలా అవతరించిన శాకాంబరీ (Sakambari) దేవి నీలవర్ణంలో సుందరంగా దర్శనమిస్తుంది.  దేవి కమలాసనంపై కూర్చుని ఉంటుంది. తన పిడికిలి నిండా వరి మొలకలను పట్టుకొని ఉంటుంది. మిగిలిన చేతులతో పుష్పాలు, ఫలాలు, చిగురుటాకులు, దుంపగడ్డలు మొదలైన కూరగాయల సముదాయాన్ని ధరించి ఉంటుంది.  ఈ శాకాల సముదాయం అంతులేని కోర్కెలను తీర్చే రసాలు కలిగి ఉంటాయి. జీవులకు కలిగే ఆకలి దప్పి, మృత్యువు, ముసలితనం, జ్వరం మొదలైనవి పోగొడతాయి. కాంతులను ప్రసరించే ధనుస్సును ధరించే పరమేశ్వరిని శాకాంబరీ, శతాక్షి, దుర్గ (Durga) అనే పేర్లతో కీర్తింపబడుతుంది. 

ఈ దేవి శోకాలను దూరం చేసి, దుష్టులను శిక్షించి శాంతిని కలుగజేయడమే కాదు పాపాలను పోగొడుతుంది. ఉమాగౌరీ Uma, Gowri,) సతీ చండీ కాళికా పార్వతి (Sathi, Chandi, Kalika, Parvathi) అనే పేర్లతో కూడా ఈ దేవి ప్రసిద్ధి పొందింది. ఈ శాకాంబరీ దేవిని భక్తితో స్తోత్రం చేసేవారు, ధ్యానించేవారు. నమస్కరించేవారు, జపించేవారు, పూజించేవారు తరిగిపోని అన్నపాన అమృత ఫలాలను అతి శీఘ్రంగా పొందుతారు.

Sakambari Aradhana, Jyesta, Jyeshta, Jyeshtha, Jyestha, Ashada, Ashadha

#sakambari

Quote of the day

Let your life lightly dance on the edges of Time like dew on the tip of a leaf.…

__________Rabindranath Tagore