Online Puja Services

ప్రతి అష్టమి నాడూ అమ్మవారిని ఇలా ఆరాధిస్తే,

3.145.93.210

ప్రతి అష్టమి నాడూ అమ్మవారిని ఇలా ఆరాధిస్తే, తీరని కోరికలే ఉండవు . 
- లక్ష్మి రమణ 

అమ్మవారి  ఆరాధన చాలా శక్తివంతమైనది . ఇహ పరాలకి సంబంధించిన ఏ కామ్యమునైనా అనుగ్రహించేది . మోక్షసాధనకి అమ్మ ఆరాధనకు మించిన మారే ఉపాసనా లేదంటే, అతిశయోక్తి కాదు . సులువుగా అమ్మని ఉపాసించడానికి ఉన్న అత్యంత శక్తివంతమైన విధానాలలో ఇక్క చెప్పుకోబోతున్న ఉపాసన కూడా ఒకటి . సిద్ధ కుంజికా స్తోత్రం ఒకటి . స్యయంగా పరమేశ్వరుడే ఈ  విధానాన్ని పరమ శక్తి స్వరూపిణి అయిన పార్వతీ  దేవికి చెప్పారని రుద్రయామల తంత్రం చెబుతోంది .  రహస్యమైన ఈ గొప్ప స్తోత్రం దేవీ సప్తశతిని పారాయణ చేసిన పుణ్యాన్ని అనుగ్రహిస్తుంది . దుష్టత్వంతో మనపైన ప్రయోగించిన మంత్ర , తంత్ర ప్రయోగాలని నిర్వీర్యం చేస్తుంది . వ్యాపారాలలో నష్టాలు, జీవితంలో కష్టాలు తొలగించి జీవన సాఫల్యాన్ని అనుగ్రహించే దేవీ స్తుతి ఇది . 

 కుంజికా అంటే  దాగి ఉన్నది అని అర్థం . సిద్ధ అంటే అనుగ్రహించింది లేదా పరిపూర్ణమైనది . మనలో దాగిన పరమాత్మికా శక్తి అయిన కుండలిని పరిపూర్ణ అనుగ్రహం సిద్ధ కుంజికా మాత అనుగ్రహంగా చెప్పుకోవచ్చు .  కుంజిక అంటే తాళంచెవి అని కూడా అర్థం ఉన్నది . జ్ఞానం అనే దారికి అడ్డంగా ఉన్న కుండలిని ఊర్ధ్వగామిగా మారి,  జ్ఞాన మార్గాన్ని సిద్ధింప చేసే తాళంచెవి ఈ సిద్ధకుంజిక. బ్రహ్మ విష్ణు రుద్ర గ్రంధుల విభేదానానికి ఈ తాళంచెవి చాలా అవసరం . ఇంతటి యోగ విజ్ఞాన రహస్యం సిద్ధ కుంజికా మాత అనుగ్రహంలో  దాగి ఉంది . 

సంపూర్ణమైన భక్తితో  పరమేశ్వరుడు పార్వతీ దేవికి ఉపదేశించిన సిద్ధకుంజికా స్తోత్రాన్ని పఠించిన వారికి తీరని కోరికలు అనేవి ఉండవు . ప్రత్యేకించి మంత్రం తంత్ర ప్రయోగాల నుండీ రక్షిస్తుంది . దేవీ అనుగ్రహంతో ఆ ఇంట్లో దరిద్రం అనేది ఉండదు. విశేషించి  గ్రహణ సమయంలో ఈ సిద్ధ  కుంజికా స్తోత్రాన్ని పటించడం వలన గొప్ప మేలు జరుగుతుంది. ఈ స్తోత్రాన్ని పటించడం వలన పితృ దోషం కూడా పోతుంది.

విశ్వ సంక్షేమం కోసం పరమేశ్వరుడు ఈ సర్వ శక్తిసమన్వితమైన కుంజికా స్తోత్రాన్ని గురించి పార్వతీదేవికి వివరిస్తారు. చండీ సప్తశతి లేదా దుర్గా సప్తశతి పారాయణాలు చేసే ముందఱ ఈ కుంజికా స్తోత్రాన్ని చేయడం ప్రభావవంతమైన ఫలితాన్నిస్తుంది .  అసలు ఈ స్తోత్రాన్ని చేయకుండా చేసే ఈ రెండు దేవీ పారాయణాలూ ఫలితాన్నివ్వవు అని కూడా చెబుతూంటారు .   పరమేశ్వరుడు బంధించిన దుర్గా శప్తశతి యొక్క శక్తిని ప్రేరేపించే లేదా తెరిచే  తాళం చెవి కుంజికా స్తోత్రం .   

దుర్గా నవరాత్రుల్లో , (ఏడాదిలో వచ్చే నాలుగు నవరాత్రుల్లో కూడా - వారాహీ నవరాత్రులు, మాతంగీ నవరాత్రులు, వసంత నవరాత్రులు, దసరా నవరాత్రుల్లో) ఈ కుంజికా స్తోత్ర పారాయణ చేయడం గొప్ప ఫలితాలని అనుగ్రహిస్తుంది . ఈ పర్వాలలోనే కాకుండా , ప్రతి అష్టమినాడూ ఆచరించడం అమ్మ అనుగ్రహాన్ని అందిస్తుంది . సిద్ధకుంజికా స్తోత్రం మన హితోక్తి సైట్ లోనే అందుబాటులో ఉంది. ఇక నుండీ చక్కగా ప్రతి అష్టమినాడూ అమ్మని ఈ మహిమాన్విత స్తోత్రంతో ఆరాధించి అమ్మ కృపకి పాత్రులు కాగలరని ఆశిస్తూ .. 

సర్వేజనా సుఖినోభవంతు !!

Quote of the day

A coward is incapable of exhibiting love; it is the prerogative of the brave.…

__________Mahatma Gandhi