Online Puja Services

నవరాత్రులు – పూజావిధి

13.59.100.42

నవరాత్రులు – పూజావిధి 

మామూలు రోజుల మాదిరిగా కాకుండా వసంత, (చైత్రపాడ్యమి మొదలు నవమి వరకు) శరన్నవ రాత్రులలో (ఆశ్వయుజ పాడ్యమి మొదలు నవమి వరకు) ప్రత్యేక నియమాలు పాటిస్తూ పూజావిధి నిర్వర్తించాలి. వాటిలో ముఖ్యమైనది ఉపవాస దీక్ష. చేయగల్గిన వాళ్ళు ఆ తొమ్మిది రోజులు పండ్లు, పాలు మాత్రం సేవించి, పూజావిధి నిర్వర్తించవచ్చును. లేదా ఏకభుక్తం (పగలు పూజానంతరం భుజించడం)గానీ, నక్షం (రాత్రి భుజించడం) గానీ చేయవచ్చును. ‘ఉపవాసేవ నక్తేన చైవ ఏక భుక్తేన వాపునః

పూజాస్థలం

దేవీపూజకి ఇంట్లో ఎక్కడపడితే అక్కడ కాకుండా పూజాగృహంలోగానీ లేక ఇంట్లో తూర్పు దిక్కుగా వుండేట్లు సమప్రదేశం చూసుకుని, అక్కడ కడిగి పసుపునీళ్ళతో శుద్ధిచేసి ఆ భాగాన్ని పూజాస్థలంగా నిర్దేశించుకోవాలి. ఆ ప్రదేశం పదహారు హస్తాల మానము, ఏడు హస్తాల వెడల్పు, తొమ్మిది హస్తాల పొడుగు వుండటం మంచిదని పురాణోక్తి. ఆ ప్రదేశం మధ్యలో ఒక హస్తం వెడల్పు, నాలుగు హస్తాలు పొడుగు వుండేలా వేదికనమర్చి పూలమాలలతో, మామిడాకులతో తోరణాలతో అలంకరించాలి.

దేవి విగ్రహ ప్రతిష్ట

అమావాస్య రాత్రి ఉపవాసం వుండి మరునాడు (పాడ్యమి తిథి) వేద బ్రాహ్మణుల సహాయంతో వేదికపై దేవి ప్రతిమను విద్యుక్తంగా ప్రతిష్టించాలి. ఎక్కువగా అష్టాదశ భుజాలలో వివిధాయుధాలు ధరించి, మహిషాసురుని త్రిశూలం గుచ్చి వధిస్తున్న దేవీమాత ప్రతిమను దేవీ నవరాత్రోత్సవాలలో ప్రతిష్టించి పూజించడం పరిపాటి. నాలుగు భుజాల ప్రతిమను కూడా ప్రతిష్టించవచ్చు. సింహవాహనారూడురాలైన దేవీమాత విగ్రహం నిండుగా, కన్నుల పండుగ చేస్తూ వెలిగిపోతుంది.

ప్రతిమ లేకపోతే దేవీ మంత్రం ‘ఐం హ్రీం క్లీం చాముండాయై విచ్చే’ అనేది రాగి రేకుమీద లిఖించబడినది వుంచి యంత్రాన్ని పూజించవచ్చును.

‘వాగ్భావం (ఐం) శంభువనితా (హ్రీం) కామబీజం (క్లీం) తతః పరం!

చాముండాయై పదం పశ్చాద్విచ్చే ఇత్యక్షర ద్వయం’

దేవీమాతలోనుండి వాగ్దేవి (ఐం), శంభువనిత పార్వతి (హ్రీం) కామబీజం.. లక్ష్మీదేవి (క్లీం) ముగ్గురు దేవేరులు ప్రకటితమై త్రిమూర్తులకు శక్తిప్రదానం చేస్తూ సృష్టిస్థితి లయకారిణులై విలసిల్లుతున్నారు. అందుకే దేవి నవరాత్రోత్సవాలలో అమ్మవారిని రోజుకొక దేవి అలంకరణలో ఉత్సవమూర్తిని పూజించడం జరుగుతుంది దేవీమందిరాలలో, ప్రతిరోజూ దీక్ష గైకొన్న బ్రాహ్మణోత్తములు చండీయాగం నిర్వహిస్తూ ఉంటారు. మూలా నక్షత్రంతో కూడిన ఆరోజు సరస్వతీదేవి అలంకారంలో శ్వేతాంబర ధారిణిగా, వీణాపాణియై నేత్రపర్వం గావిస్తుంది. దేవీమాత, ఆరోజు సరస్వతీ పూజ చేసి ఐం బీజోపాసన గావించడం వాళ్ళ సర్వవిద్యలు కరతలామలకమౌతాయి.

పూజా విధానం

పాడ్యమినాడు వేదోక్తంగా ప్రతిష్టించిన ప్రతిమ ముందు కలశంపై కొబ్బరికాయ వుంచి, నూతన వస్త్రం కప్పి దేవీమాతను దానిపై ఆవాహన చేసి షోపశోపచార పూజా విధులతో విద్యుక్తంగా వేద బ్రాహ్మణుల సహాయంతో పూజ నిర్వర్తించాలి. దేవీ సహస్రనామపారాయణ అష్టోత్తర శత నామావళి, త్రిశతి మొదలైనవి చదువుతూ పుష్పాలతో పూజించడం పరిపాటి. బంతి, చేమంతి, జాజి, కనకాంబరం, అన్ని రకాల పుష్పాలు దేవీమాతకు ప్రీతికరమైనవే!

పూజానంతరం నైవేద్యంగా పులగం, పొంగలి, పాయసం, చిత్రాన్నం, గారెలు మొదలైన వివిధ భక్ష్యాలు శక్త్యానుసారం సమర్పించాలి.

పశుబలి నిషిద్దం, బియ్యప్పిండి, నెయ్యి వంటి వాటితో చేసిన సాత్వికాహారమే సమర్పించడం ప్రీతికరం.

అసుర నాశనానికై ఆవిర్భవించిన కాళీమాత (చండముండులు, శంభనిశుంభ మర్థిని) ఉగ్రమూర్తిని శాంతపరచడానికి పశుబలి కావించడం సముచితమే నన్న అభిప్రాయం కొందరిదైనా సాత్విక యజ్ఞమే భుక్తిముక్తి ప్రదమైనది, సర్వులూ ఆచరించదగినది. పూజావిధి సమాప్తమైన తరువాత నవరాత్రులలో నృత్య గీతాలలో సాంస్కృతిక కార్యకలాపాలు నిర్వర్తించడం కూడా ఆరాధనలో బాగమే. ఇక నవరాత్రుల దీక్షాకాలంలో భూమిమీద శయనించడం, బ్రహ్మచర్యం పాటించడం తప్పకుండా ఆచరించాలి. విజయదశమి నవరాత్రుల్లో దేవిని విద్యుక్తంగా పూజించాలి. దశమినాడు శ్రీరాముడు రావణవధ కావించడం వల్ల ఆరోజు విజయదశమి పర్వదినంగా ప్రసిద్ధిచెందింది. ఈ విజయాన్ని పురస్కరించుకుని ఉత్తరాదిన రామలీలగా రావణ, కుంభకర్ణ, మేఘనాధుల విగ్రహాలను దహనం చేసి, బాణాసంచా వేడుకల మధ్య ఆనందోత్సవాలతో తిలకించడం పరిపాటి.

ఇక ద్వాపరయుగంలో ఉత్తర గోగ్రహణ సందర్భంగా జమీవృక్షం మీద దాచిన దివ్యాస్త్రాలను పూజించి వాటితో కౌరవులను పరాజితులను చేస్తాడు అర్జునుడు. ఆ విజయాన్ని పురస్కరించుకుని దశమిరోజు జమీవృక్షాన్ని పూజించడం, ఆ చెట్టు ఆకులు బంధుమిత్రులను కలుసుకుని పంచడం ఆనవాయితీగా మారాయి.

ఆయుధ పూజ

దేవీమాత వివిధ హస్తాలతో దివ్యాయుధాలు ధరించి దుష్టసంహారం కావించింది. ఆయుధాలను పూజించడం వల్ల విజయం ప్రాప్తిస్తుందన్న విశ్వాసం అనాదినుండి వస్తున్నదే. అందుకే అష్టమి నవమి దశమిలలో ఒకరోజు వృత్తిపరంగా వాడే ఆయుధాలను, వాహనాలను పూజించడం జరుగుతున్నది.

మహిమాన్వితమైన దేవీ నవరాత్రులలో భక్తిశ్రద్ధలతో కావించే పూజావిధులే గాక దశమి విజయదశమిగానూ, దసరాగానూనూ పిలువబడుతూ పండగ ఉత్సాహం అంతటా వెల్లివిరుస్తుంది. అంతటా భక్త్యావేశమే కానవస్తుంది.

మహిషాసురమర్దిని కథ 

‘యాదేవి సర్వభూతేషు మాతృరూపేణ సంస్థితా!

నమస్తస్త్యై నమస్తస్త్యై నమస్తస్త్యై నమోనమః

ఇంద్రాది దేవతలు, త్రిమూర్తులు, నారదాది మునులు, ఊర్ద్యలోకవాసులు తమ ప్రార్థనలకు ప్రసన్నురాలై ఎదుట సాక్షాత్కరించిన దేవీమాతకు ప్రణామాలు అర్పించారు.

దేవీమాత మణిద్వీపవాసిని వాళ్ళవైపు ప్రసన్నంగా చూసింది.

‘హే జగన్మాతా! రంభాసురుని పుత్రుడు మహిషాసురుడు బ్రహ్మవల్ల స్త్రీచేత తప్ప ఇతరులెవరివల్లా మరణం రాకుండా వరంపొంది, ఆ వరప్రభావంతో మూడు లోకాలను తన వశం చేసుకుని నిరంకుశంగా సాధుహింస చేస్తూ పాలన సాగిస్తున్నాడు. అతడిని వధించి లోకాలకు శాంతి చేకూర్చు మాతా!’ అంటూ ప్రార్ధించారు.

‘దేవతలారా! విచారించకండి. ఆ మహిషాసురుని దురాత్ములైన అతని అనుచరులను హతమార్చి, అధర్మం అంతరించేలా చేస్తాను’ అంటూ కరుణా  వీక్షణాలతో వాళ్ళకు ధైర్యం చెప్పి, అందరూ సంభ్రమాశ్చర్యాలతో చూస్తుండగా అష్టాదశ భుజాలతో (పదునెనిమిది) సింహవాహనారూఢురాలై గగనతలాన నిలిచింది. 

ఆ దేవిలో సకల దేవతల దివ్య శక్తులు, తేజం విలీనమైనాయి.

శంకరుని తేజం దేవి ముఖ పంకజాన్ని చేరింది. శ్వేత పద్మంలా ప్రకాశించింది. ముఖమండలం, నల్లనైన కేశపాశంలో యముని తేజం నిక్షిప్తమై యమపాశంలా గోచరించింది.  అగ్ని తేజంతో ఆమె మూడు నేత్రాలు అగ్ని జ్వాలలు విరజిమ్ముతున్నాయి., వాయువు తేజం శ్రవణాలలో, సంధ్యా తేజం కనుబొమలలో ఒదిగాయి. నాసికలో కుబేరుని తేజం విలసిల్లగా, సూర్యుని తేజంతో అధరం విప్పారింది. ప్రజాపతి తేజం దంతపంక్తిలో, మహావిష్ణువు తేజం బాహువులలో, పశువుల తేజం అంగుళంలో కేంద్రీకృతమయ్యాయి. చంద్రుని తేజం వక్షస్థలంలో, ఇంద్రుని తేజం నడుములో, పృద్వితేజం నితంబాలలో నిక్షిప్తమయ్యయి.

ఆయా దివ్య తేజస్సులు దేవీమాత అవయవాలను చేరడంతో కోటి విద్యుల్లతల కాంతితో ఆమె దేహం ప్రకాశించింది.

సర్వాభరణ భూషితయై నిలిచిన ఆమె బాహువులలో వరుసగా మహావిష్ణువు చక్రం, శంకరుని త్రిశూలం, వరుణుని శంఖం, అగ్ని శతఘ్ని సంకాశమనే శక్తి ,వాయుదేవుని అక్షయ తూణీరాలు, ధనువు, ఇంద్రుని వజ్రాయుధం, యముని దండం, విశ్వకర్మ పరశువు, ఖడ్గం, ముసలం, గద, పరిఘ, భుశుండి, శిరము, పాశం, చాపం,అంకుశం మొదలైన ఆయుధాలు ధరించి, సింహ వాహినియై మహిషాసురుని రాజ్యం యొక్క బయట  నిలిచి భయంకరంగా శంఖం పూరించింది. ఆ నాదానికి దిక్కులు పిక్కటిల్లాయి, భూమి కంపించింది. పర్వతాలు గడగడలాడాయి, సముద్రంలో తరంగాలు ఉవ్వెత్తున ఎగిరిపడసాగాయి. ప్రళయ వాయువులు భీకరంగా వీచసాగాయి.

దేవీమాత శంఖ నాదానికి అదిరిపడి ఆశ్చర్యంతో కారణం తెలుసుకురమ్మని పంపాడు మహిషాసురుడు తన అనుచరులను.  వాళ్ళు తెచ్చిన వార్త అతడిని  మరింత ఆశ్చర్య చకితుడిని చేసింది . 

‘ఎవరో దివ్యాంగన, అష్టాదశభుజాలలో వివిధాయుధాలు ధరించి సింహంపై ఆసీనురాలై తనతో యుద్ధభిక్ష కొరుతున్నదట. ఈ మహిషాసురుడు మాయా యుద్ధ ప్రవీణుడని, త్రిమూర్తులు, దేవతలు కూడా తన ధాటికి తాళలేకపోయారని తెలియక అంతటి సాహసం చేసి వుంటుంది. ఆమె బలశౌర్యాలేపాటివో తెలుసుకోవలసిందే’ అనుకుంటూ ముందుగా తన సేనాధిపతులైన బష్కల దుర్ముఖులను ఆమెను జయించి తీసుకురావసిందిగా ఆజ్ఞ ఇచ్చి పంపాడు మహిషాసురుడు.

బాష్కల దుర్ముఖులు, ఆపైన అసిలోమ బిడలాఖ్యులు, చిక్షుతతామ్రాక్షుల వంటి ఉగ్రదానవులందరూ ఆమెను జయించవచ్చి, ఆమె చేతుల్లో చిత్తుగా ఓడి మరణించారు. ఆఖరుకు మహిషాసురుడు కదనానికి కదలక తప్పలేదు.

అతని కన్నులకు దేవీమాత, విశ్వమోహన రూపంతో కానవచ్చింది. ఆ సౌందర్యాన్ని చూస్తూ వివశుడై తనను వివాహం చేసుకుని, అసుర సామ్రాజ్యరాణివై సుఖించమని వేడుకుంటాడు.

అతని మాటలకు ఫక్కున నవ్వి ‘దానవుడా! రూపం లేని నేను నీకోసం ఈ రూపు దాల్చి రావడం దేవతలను రక్షించడానికే సుమా! నీకు ప్రాణాలమీద ఆశవుంటే దేవ, మర్త్యలోకాలను విడిచి పాతాళానికి వెళ్ళి సుఖించు. కాని పక్షంలో యుద్ధానికి సిద్ధపడు మూర్ఖప్రలాపాలు మానుకో ’  అని హెచ్చరిస్తూ శంఖం పూరించింది దేవీమాత.

మహిషాసురుడు మాయను ఆశ్రయించి, జంతు రూపాలు ధరిస్తూ యుద్ధం సాగించాడు.  కొంతసేపు లీలగా అతనితో పోరాడి సూటిగా త్రిశూలంతో వక్షస్థలాన్ని చీల్చి యమసదనానికి పంపివేసినది దేవీమాత.

మహిషాసురుడు మరణంతో లోకాలు శాంతించాయి. దేవతలు ఆనందంతో పుష్ప వృష్టి కురిపించి ‘మహిషాసురమర్ధినికి జయము జయము’ అంటూ జయ జయ ధ్వానాలు చేసారు.

వాళ్ళవైపు ప్రసన్నంగా చూస్తూ అంతర్ధానం చెందింది మహిషాసురమర్ధిని. ఈ  మహిషాసుర విజయ చరతం శరన్నవరాత్రులలో పఠించడంవల్ల దేవీమాత అనుగ్రహం సంపూర్ణంగా సిద్ధిస్తుంది. రోజూ వీలుకాకపోయినా శరన్నవరాత్రుల పర్వదినాలలో దేవీ మహత్యాన్ని వివరించే దేవీ భాగవత పారాయణం అనంతమైన పుణ్యాన్ని ప్రసాదిస్తుంది.

నవ అంటే నూతనమైన, రాత్రులంటే జ్ఞానాన్ని ప్రసాదించేవి కనుక ఆశ్వయుజ మాసం శుక్ల పాడ్యమి మొదలు తొమ్మిది రోజులు దేవీమాతను విశేష పూజలతో అర్చించడంవల్ల ఒక్క సంవత్సరకాలంలో చేసే పూజాఫలం లభిస్తుందని పురాణాలు తెలుపుతున్నాయి. ఆ తొమ్మిది రోజులలో అష్టమినాడు మహిషాసురుని వధించడమే గాక, శంభనిశంభులు, చందముండులు, రక్తభీజుడు, దుర్గమాసురుడు మొదలైన ఉగ్రదానవులెందరినో వధించి లోకాలలో శాంతిభద్రతలు, ధర్మం సుస్థిరం కావించింది దేవీమాత. 

అందుకే ఆ జగదంబ అనుగ్రహం సిద్ధించడానికి, ఈతిబాధలు, అతివృష్టి అనావృష్టి వంటి ప్రకృతి వైపరీత్యాలకు గురికాకుండా వుండటానికి, యమదంష్ట్రికులైన (అంటే మరణాలు ముఖ్యంగా రోగాల వల్ల) శరధ్వంత ఋతువుల్లో ప్రజలు అకాలమృత్యువు వాతపడకుండా వుండటానికి భూలోకంలో అనాదికాలం నుండి నేటివరకు దేవీనవరాత్రోత్సవాలు ఎంతో భక్తిశ్రద్ధలతో నిర్వహించబడుతున్నాయి.

- లక్ష్మి రమణ 

Quote of the day

The Vedanta recognizes no sin it only recognizes error. And the greatest error, says the Vedanta is to say that you are weak, that you are a sinner, a miserable creature, and that you have no power and you cannot do this and that.…

__________Swamy Vivekananda