Online Puja Services

ద్వారక సముద్రంలో నిద్దరోతోంది . కారణాలు ఇవేనా ?

52.14.85.76

ద్వారక సముద్రంలో నిద్దరోతోంది . కారణాలు ఇవేనా ?
-లక్ష్మీ రమణ 

కృష్ణుడు ఏలిన ద్వారకా. కృష్ణుడు నిర్మించిన ద్వారక. సముద్ర గర్భంలో నిద్రపోతోంది . అద్భుతమైన ఆ నిర్మాణం ఆ మురళీలోలుని కధలు పుక్కిటి పురాణాలు కాదని , జరిగిన చరిత్రని చెప్పేందుకు సాక్ష్యంగా నిలుస్తున్నాయి . వేలయేళ్ళనాటి ఆ అద్భుత నగరం సముద్రంలో ఎందుకు మునిగిపోయింది ? భగవానుని నగరాన్ని ముంచెత్తే సాహసం ఆ సముద్రుడు ఎలా చేశాడు ? అరేబియా సముద్రంలో జరిగిన  పరిశోధనల్లో వెలుగు చూసిన అవశేషాలు కృష్ణడు నిర్మించిన ద్వారకవేనా? లేక మరేదైన నగరానివా.? పరిశోధనలు ఏంచెబుతున్నాయి? పరిశోధకులు ఏమంటున్నారు.? సమాధానం  వెదుకుతూ వెళదాం పదండి కడలి గర్భంలోని ద్వారకానగరంలోకి. 

కృష్ణ జననం నాడు, దేవకీదేవి పక్కనున్న పసిగుడ్డుని బుట్టలో పెట్టుకొని గోకులానికి తీసుకెళుతుంటే,  వసుదేవుడికి రెండుగా చీలి దారిచ్చింది యమునానది . ఒక నదిని శాశించిన పసివాడు , రాజై నిర్మించిన ద్వారకని ఆ  సముద్రుడు ఎలా తన గర్భంలోకి లాక్కుపోగలిగాడు ? 

 భగవాన్ శ్రీకృష్ణపరమాత్మ పాలించిన ద్వారకానగరం.. వేల ఏళ్లనాటి ఓ అద్బుత నిర్మాణం. సముద్రంపై ప్రణాళికా బద్దంగా నిర్మితమైన స్వర్గధామం. హిందువులు పవిత్రంగా భావించే చార్ ధామ్ లలో ఒకటి. దేవశిల్పి విశ్వఖర్మ రూపొందించిన విశ్వవిఖ్యాత మహానగరం. స్వర్ణనిర్మిత స్వర్గదామమ్. మహాభారతంలో ద్వారకను ద్వారావతి అని కూడా పిలుస్తారు. ద్వారక గుజరాత్ రాష్ట్రంలోని పశ్చిమ తీరంలో ఉంది. జరాసంధుని దండయాత్రల నుంచి మధురను, యదుకులాన్ని కాపాడుకునేందుకు కృష్ణ బలరాములు సముద్రంలో ద్వారకా నగరాన్ని నిర్మిస్తారు.

సముద్రుడిచ్చిన భూమి :
నిజానికి సముద్రుడే తన గర్భంలో ఈ నగరానికి భూమినిచ్చాడు. కృష్ణపరమాత్మ సాగరంలో నగరం నిర్మంచుకునేందుకు సముద్రున్ని భూమిని అడుగుతాడు. గోమతి నది సముద్రంలో సంగమించే పరిసర తీరంలో, సముద్రంలో నుంచి భూమి ఉబికివచ్చి కృష్ణుడు నగరం నిర్మించుకునేందుకు అనుకూలంగా కొన్ని ద్వీపాలు ఏర్పడ్డాయని మనకు పురాణాల ద్వారా తెలుస్తుంది.

నిర్మాణ శైలి :
గోమతీ నదీ తీరంలో ప్రణాళికాబద్ధంగా ద్వారకా నగరాన్ని నిర్మించారు. నిర్వహణా సౌలభ్యం కోసం నగరాన్ని ఆరు విభాగాలుగా విభజించారు. వెడల్పైన రాజమార్గాలు, పొడవైన రహదారులు,  నివాస ప్రదేశాలు, వ్యాపార సముదాయాలు, వాణిజ్య కూడళ్లు, సంతలు , గురుకులాలు, రాజభవనాలు, ఉద్యానవనాలు, స్నాన కొలనులు, శత్రుదుర్భేద్యమైన కోటలు, ఇంకెన్నో ప్రజా ఉపయోగకర ప్రదేశాలతో ద్వారకా నగరం నిర్మించబడింది.  క్రీస్తుకు వేల ఏళ్ల పూర్వమే ద్వారకను అధునాతన శాస్త్రసాంకేతిక పరిజ్ఞానంతో నిర్మించారు. నేటి నగర నాగరికత నాటి విశ్వకర్మ నిర్మితము , శ్రీకృష్ణుని రాజ్యమైన ద్వారకలో కనిపించడం ఆశ్చర్యమే !! ఆ రోజుల్లోనే ద్వారకలో పది లక్షల మంది జనాభా ఉండేవారు. అప్పుడున్న ప్రపంచ జనాభా ప్రకారం ద్వారక విశ్వనగరంగా అభివృద్ధి చెందిందని చెప్పుకోవచ్చు. 

ద్వారకలో రాజ్యసభ నిర్వహించే మంటపం పేరు సుధర్మ సభ.  ఇక్కడే రాజు ప్రజలతో సమావేశం జరిపేవారు. ఇక్కడి నుంచే సుపరిపాలన అందించేవారు. నగరం అందమైన కట్టడాలతోనే కాకండా, ప్రకృతి సోయగాలతోనూ  స్వర్గాన్ని తలపించేది. అందుకే ఆ రోజుల్లో ద్వారకను భూలోక స్వర్గంగా పిలిచేవారు. 

వెంటాడిన శతృవులు :
కురుక్షేత్ర యుద్ధం జరిగిన 36 సంవత్సరాల తర్వాత సముద్రంలో కలిసి పోయిందని వ్యాస మహర్షి రాసిన మహాభారతం ద్వారా తెలుస్తోంది. జరాసందుని బారినుంచి తనవారిని కాపాడుకునేందుకు కృష్ణుడు భూమండలానికి దూరంగా సముద్రంలో నగరాన్ని నిర్మించుకుని భీమునితో జరాసంధున్ని అంతంచేయించాడు. కానీ కానీ శత్రుపరంపర శ్రీకృష్ణున్ని వెంటాడడం మాత్రం ఆగలేదు. శివుపాలుడు ద్వారకపై దండెత్తాడు. అతన్ని కృష్ణుడు సంహరించాడు. ఆ మరణానికి బదులు చెప్పేందుకు సాళ్వుడు కంకణం కట్టుకున్నాడు . 

సాళ్వుడు శిశుపాలుని సోదరుడని కొందరు, మిత్రుడని మరికొందరు చెప్తారు. సాళ్వుడు గ్రహాంతరవాసులతో సంబంధాలు కలిగి, వారి సాంకేతిక సహాయంలో విమానాల ద్వారా , ఆకాశమార్గంలో ద్వారకపై యుద్ధం చేశాడని పురాణాలు చెబుతున్నాయి.  ఇప్పటికి అంతుచిక్కని ఆధునిక టెక్నాల్జీ కలిగిన విమానాలను, క్షిపణులను సాళ్వుడు ఉపయోగించినట్టు చెప్పుకుంటారు. కృష్ణుడు సాళ్వున్ని సంహరించాక, ద్వారకకు శత్రుపీడ విరగడయ్యిందని సంతోషించే లోపే శాపాలు, పాపాల రూపంలో ద్వారక వినాశనం చుట్టుముట్టింది .

గాంధారి శాపం :
 గాంధారి శ్రీకృష్ణుడికి శాపం పెడుతుంది. ఆమె శాపం కారణంగానే ద్వారక మునిగిపోయిందని కొందరు నమ్ముతారు. కురుక్షేత్ర యుద్ధం ముగిసాక దృతరాష్ట్రున్ని, గాంధారిని పరామర్శించేందుకు వెళతాడు కృష్ణుడు. అఫ్పుడు గాంధారి కృష్ణునితో, ‘కృష్ణా!యుద్ధం ఆపగలిగే శక్తి సామర్య్ధాలు ఉండి ఎందుకు యుద్ధాన్ని ఆపలేదు? నువ్వు యుద్ధాన్ని ఆపితే నా నూరుగురు కుమారులు బ్రతికేవారు కదా! నాకు పుత్రశోకం తప్పేది’ అంటుంది. దానికి సమాధానంగా ‘దృతరాష్ట్రుడు గత జన్మలో వంద హంస పిల్లలను సంహరించాడు. అప్పుడు తల్లి హంస దృతరాష్ట్రుడికి శాపమిచ్చింది . రానున్న జన్మలో అంధుడిగా పుట్టి ,దుర్మార్గులైన వందమంది కుమారులను కంటావు. నీ కళ్లముందే వారిని కోల్పోతావు అని శపించింది. దాని ఫలితమే ఇది ‘ అని చెబుతారు కృష్ణ పరమాత్మ . 

అప్పుడు ‘గత జన్మలో దృతరాష్ట్రుడు తప్పుచేశాడు. శిక్షకు అర్హుడు. ఏ తప్పు చేయని నేనెందుకు శిక్ష అనుభవించాలి కృష్ణా! ఉద్దేశ్యపూర్వకంగానే కరుక్షేత్రాన్ని ఆపకుండా నాకు పుత్ర శోకం పెట్టావు. నువ్వు చూస్తుండగానే నీ యాదవ కులం సర్వనాశనం అవుతుందని’ శపిస్తుంది గాంధారి. గాంధారి దుష్టులకు తల్లి కావచ్చు. కానీ ఆమె మహాసాధ్వీమణి. ఆమె శాపం నెరవేరి తీరుతుందని కృష్ణుడికి తెలుసు. 

ముసలం - యాదవకుల నాశనం :
ఇదీకాక మరో శాపం ద్వారకను వెంటాడిందని మనకు భారతం ద్వారా తెలుస్తొంది. నారదుడు, కణ్వుడు, విశ్వామిత్రుడు ఇంకా కొంత మంది ఋషులు  ఒకసారి కృష్ణున్ని చూడడానికి ద్వారకకు వస్తారు. ఆ మహర్షులను యాదవులు ఆటపట్టించారు. మగవాడికి ఆడవేషం వేసి తీసుకొచ్చి. ఈవిడకు కూతురు పుడుతుందా, కొడుకు పుడుతాడా అని హేళనగా అడుగుతారు. మునులన్న గౌరవ మర్యాదలు లేకుండా అవమానించాలన్న ఉద్దేశ్యంతో ప్రవర్తించినందుకు ఆవేశానికి లోనైతారు రుషులు. వీడికి ముసలం పుడుతుందని కోపంగా చెప్పి, కృష్ణుడిని కలువకుండానే వెనుతిరిగి వెళ్లిపోతారు.

ఇలా  పగలు, పంతాలు, శాపాలు, పాపాలు, కోపాలు అన్నీ ఏకకాలంలో ద్వారపై దాడి చేశాయి. ఇవి చాలవన్నట్టు సముద్రుడు ద్వారకను ముంచి వేస్తున్నట్టు ఆకాశవాణి హెచ్చరికలు వినిపించాయి. భగవంతుడైనా , కర్మకి అతీతుడు కాదని ఈ సంఘటనలు తెలియజేస్తున్నాయి . 

కృష్ణ నిర్యాణం :
  తన కళ్లముందే యాదవులు తన్నుకుని చంపుకోవడం చూసి తట్టుకోలేక పోయాడు కృష్ణుడు. అర్జునుడిని ద్వారకు పిలిపించి యాదవుల బరువు, బాధ్యతలు అప్పగించి అడవులకు వెళ్లిపోయాడు. బలరాముడు యోగనిద్రలోకి చేరుని, ఆ తరువాత తనువు చాలించి స్వర్గం చేరుకున్నాడు. కృష్ణుడు అడవిలో ఏకాంతంగా కూర్చుని ఉండగా బోయవాని బాణం వేటుతో జన్మ చాలించాడు . రామాయణం కాలంలో రాముని చేతిలో చనిపోయిన వాలి మహాభారతం కాలంలో బోయవాడిగా పుడుతాడు. బోయవాడుగా పుట్టిన వాలి తనను చంపినందుకు కృష్ణుడుగా పుట్టిన రామున్ని సంహరించి, చెల్లుకి చెల్లు చేశాడని పురాణాల ద్వారా తెలుస్తుంది.
 అర్జునుడు బలరామ కృష్ణులకు అంత్యక్రయలు జరిపి, మరణించగా మిగిలిన యాదవ స్త్రీలను, వృద్ధులను, పిల్లలను తీసుకుని అస్థినాపురానికి వెళ్లాడు. 

అర్జునుడు చూస్తుండగానే ఆకాశం గర్జించింది. పిడుగులు, తోకచుక్కలు ద్వారకపై కురిశాయి. సముద్రం ఘోషిస్తూ ఉగ్రరూపం దాల్చి ఉప్పెనగా మారిపోయి.. ద్వారకను తనలో కలుపుకుంది. సముద్రుడు ఉవ్వెత్తున ఎగసిపడి ద్వారకని తనలో కలిపేసుకున్నాడని , తానది స్వయంగా చూశానని అర్జనుడు భారతంలో చెబుతాడు . 
అలా ఒక  అపురూప నిర్మాణం, విశ్వవిఖ్యాత నగరం కడలి కడుపులో కలిసిపోయి, ఈ భువిపై నుండీ  కనుమరుగైంది. ఈ సమాచారం అంతా భారతం, భాగవతం తదితర  పురాణాల్లో వివిధ సంధర్భల్లో చెప్పబడి ఉంది.

పరిశోధనలు :
      1983 నుంచి ద్వారకపై పరిశోధనలు ప్రారంభమయ్యాయి.  1983 నుంచి 86 వరకు గుజరాత్ సముద్రతీరంలో జరిగిన పరిశోధనలో ఆసక్తికర విషయాలు బయటపడ్డాయి. పశ్చిమ తీరంలో గోమతి నది అరేబియా సముద్రంలో కలిసే చోట సముద్ర గర్భంలో ఒక మహానగర అవశేషాలను కనుగొన్నారు. సముద్రంలో బయల్పడిన నగరమే ద్వరాకా నగరమని చరిత్రకారులు, పరిశోధకులు భావించారు.  దీనికి సంబంధించి గుజరాత్‌లోని జామ్‌నగర్‌ సముద్రతీరంలో అనేక ఆనవాళ్లు లభించాయి.
అరేబియా సంముద్రంలో కనుగొన్న ద్వారక, పురాణాల్లో వినిపించిన ద్వారక ఒకేలా ఉన్నాయి. హిందువులు పరమ పవిత్రంగా పూజించే ద్వారక సముద్రంలో బయటపడిందని తెలియగానే యావత్ ప్రపంచంలోని హిందువులు సంతోషంతో పొంగిపోయారు. ద్వారకా నగరిపై పూర్తి స్థాయిలో పరిశోధనలు జరిపి జాతి ఘనకీర్తికి ప్రతీకలను వెలికి తీయాలని కోరుకున్నారు.
          
  ద్వారకా నగరం క్రీ.పూ. 1443లో సముద్రంలో మునిపోయినట్లు చరిత్రకారలు చెబుతున్నారు. అయితే ప్రముఖ ఆర్కియాలజిస్టు డాక్టర్ ఎస్.ఆర్. రావు ఆధ్వర్యంలో జరిగిన పరిశోధనల ప్రకారం, ద్వారకా నగరం క్రీ.పూ. 3150 ఏళ్ల కిందటిదని నిర్ధారించారు. ద్వాపర యుగంలో కృష్ణుడు విశ్వకర్మ సాయంతో నిర్మించిన ద్వారకగా భావించారు. గుజరాత్ తీరం నుంచి 20 కి.మీ. దూరంలో సముద్ర గర్భంలో 40 మీ. లోతులో సుమారు 9 చ.కి.మీ. వైశాల్యంలో ఈ చారిత్రక నగరం విస్తరిం చి ఉన్నట్టుగా పరిశోధకులు అబిప్రాయ పడుతున్నారు. పరిశోధనల్లో బయటపడిన, క్రమబద్ధమైన నిర్మాణాలకు సంబంధించిన రాతి కట్టడాల ఫొటోలను ప్రపంచానికి చూపించారు. 2001 నుంచి 2004 వరకు జరిగిన పరిశోధనల్లో మరెన్నో ఆసక్తికరమైన ద్వారకనగర అవశేశాలు, ఆనవాళ్లు, నమ్మశక్యంకాని  ఆధారాలు దొరికాయి.  దీనిపై మరింతగా పరిశోధనలు కొనసాగాల్సి ఉంది . 


ఆలయాలు :
     ఇక్కడున్న ద్వారకాధీశుడి ఆలయాన్ని ‘జగత్‌మందిరం’ అని పిలుస్తారు. ఈ ఆలయ ప్రధాన దైవం శ్రీకృష్ణుడు. జ్యోతిర్లింగాల్లో ఒకటైన నాగేశ్వర లింగం ద్వారకాపురి సమీపంలోనే ఉంది. ద్వారకలో శంకరాచార్యుడు ద్వారకా పీఠాన్ని స్థాపించారు. కాలగతిలో సముద్రగర్భంలో నిలిచిపోయిన ద్వారకా ఉన్నతిని, కీర్తిని పెంచడానికి యావత్ జాతి నిరంతరం కృషి చేస్తూనే ఉంది. మళ్ళి ఆ నగరాన్ని చూడాలని ఉవ్విల్లూరుతోంది .  

 

Quote of the day

What matters is to live in the present, live now, for every moment is now. It is your thoughts and acts of the moment that create your future. The outline of your future path already exists, for you created its pattern by your past.…

__________Sai Baba