Online Puja Services

కర్ణుడా- కృష్ణుడా ఎవరి కష్టాలు పెద్దవి ?

3.129.45.92

కర్ణుడా- కృష్ణుడా ఎవరి కష్టాలు పెద్దవి ?
లక్ష్మీ రమణ 

కుంతి నిరాదరణతో గంగపాలై , అతిరథుడి చేతిలో పడి, కర్ణుడు రాధేయుడిగా సూత పుత్రుడిగా పెరిగాడు .  పరశురాముని శాపం,  బ్రాహ్మణ శాపాల వల్ల కురుక్షేత్ర యుద్ధంలో కర్ణుడు దారుణమైన మరణాన్ని పొందాడు . వీటితోపాటు మరిన్ని అవమానాలు అడుగడుగునా కర్ణుడిని వేదించాయి . సూర్య పుత్రుడై ఉండి కూడా బాధల కొలిమిలో అనుక్షణం కాలిపోతాడు కర్ణుడు . అందుకే కర్ణుడి మరణానికి సవాలక్ష కారణాలనే నానుడి కూడా వచ్చిది. అయితే, కృష్ణుడు అంతకుమించిన కష్టాలని ఎదుర్కొన్నానని చెప్పడం విశేషం . 

కర్ణుడికి కురుక్షేత్ర సంగ్రామానికి ముందు చేసిన హిత బోధతో కృష్ణతత్వం వెల్లడవుతుంది. కర్ణుడు కురుక్షేత్రానికి ముందు తన  ఆవేదనని కృష్ణుడితో వెళ్లబోసుకుంటాడు . 

“నేను పుట్టిన క్షణంలోనే నా తల్లి నన్ను విడిచిపెట్టింది.  నేను క్షత్రియేతరుడిగా పరిగణించబడినందున  ద్రోణాచార్యుడు నాకు విద్య నేర్పలేదు. పరాశరాముడి దగ్గర నేర్చుకున్న విద్యకు సార్థకత లేకుండా పోయింది. ద్రౌపది స్వయంవరంలో నన్ను అవమానించారు. కుంతి కూడా చివరకు తన కుమారులను కాపాడటానికి మాత్రమే నాకు నిజం చెప్పింది. నేను అందుకున్నది కేవలం దుర్యోధనుడి ప్రేమాభిమానాలు మాత్రమే. ఆయన వల్లే నేను రాజు నయ్యాను. నేను కౌరవ పక్షంలో చేరడంలో ఎలాంటి తప్పు చేయలేదు.” అంటూ తాను పడ్డ కష్టాలు ఏకరువు పెట్టి కురుక్షేత్రంలో తానూ కౌరవపక్షానే నిలుస్తానని తేల్చి చెబుతాడు రాధేయుడు . 

 దానికి శ్రీకృష్ణుడు సమాధానమిస్తూ, “కర్ణా నేను చెరసాలలో పుట్టాను. నా పుట్టుకకు ముందే మరణం నా కోసం వేచి ఉంది. నేను పుట్టిన రాత్రే నా తల్లిదండ్రులకు దూరమయ్యాను. చిన్నతనం నుండి, మీరు కత్తులు, రథాలు, గుర్రాలు, విల్లు మరియు బాణాల శబ్దం విని పెరిగారు. నేను నడవడానికి ముందే నా జీవితం ఆవుల మందలకి , పేడ దుర్వాసనాలకి అంకితమయ్యింది . సైన్యం లేదు, విద్య లేదు. సమస్యలన్నింటికీ నేనే  కారణమని ప్రజలు చెప్పడం నేను స్వయంగా విన్నాను. యశోదమ్మ కు తలవంపులు తెచ్చాను.

మీ గురువులచే నువ్వు అందరి ప్రశంసలు అందుకున్నప్పుడు నేను ఏ విద్యను కూడా నేర్వలేదు. నేను 16 ఏళ్ళ వయసులో మాత్రమే  సాందీపుని గురుకులంలో చేరాను. మీకు నచ్చిన అమ్మాయిని మీరు వివాహం చేసుకున్నారు. నేను ప్రేమించిన అమ్మాయిలను ఘర్షణ ద్వారా పొందగలిగాను. నన్ను కోరుకున్న వారిని యుద్ధాలు చేసి భార్యలుగా స్వీకరించాను.

జరాసంధుడి నుండి నా రాజ్య ప్రజలను కాపాడడానికి,  నా మొత్తం సమాజాన్ని యమునా ఒడ్డు నుండి సముద్ర తీరానికి తరలించాల్సి వచ్చింది.  అలా వెళుతున్నప్పుడు  నన్ను పిరికివాడని సంబోధించారు. 

దుర్యోధనుడు యుద్ధంలో గెలిస్తే మీరు గొప్ప రాజుగా చలామణి అయ్యేవారు. ధర్మరాజు యుద్ధంలో గెలిస్తే నాకు ఏమి లభిస్తుంది?  కురుక్షేత్ర యుద్ధానికి కౌరవ పాండవులు నాపై ఎన్నో నిందలు వేశారు. ఒక విషయం గుర్తుంచుకో కర్ణా ప్రతి ఒక్కరికీ జీవితంలో సవాళ్లు ఉంటాయి. అవి ఎదిరించి నిలబడ్డప్పుడే మానవ జీవితానికి సార్ధకత అంటాడు కృష్ణుడు. 

ప్రతి మనిషి జీవితం ముళ్లబాటే. దాన్ని పూల బాటగా మార్చుకునే శక్తి మనలోనే ఉంటుంది. వేరే వాళ్ళ మీద నింద వేసే ముందు నీ మార్గం లో నువ్వు నిందలు రాకుండా చూసుకో ఇదే కృష్ణ తత్వం. 

Quote of the day

Anger and intolerance are the enemies of correct understanding.…

__________Mahatma Gandhi