Online Puja Services

శ్రీకృష్ణుడి పాంచజన్యం ఇప్పుడు ఎక్కడుందో తెలుసా ?

3.14.83.223

శ్రీకృష్ణుడు పూరించిన పాంచజన్యం ఇప్పుడు ఎక్కడుందో తెలుసా ?

 

ఆ శంఖారావం శతృవుల గుండెను చీల్చే శరాఘాతం. దానిని పూరించగలిగినవాడు ఈ సృష్టినే శాశించగలడు . మృత్యువునైనా ధిక్కరించగలడు . అదే పాంచజన్యం . శ్రీ కృష్ణుడు ధరించే శంఖం. భారత కురుక్షేత్రసంగ్రామంలో శ్రీకృష్ణుడు పూరించిన శంఖం పాంచజన్యమే . 

విశిష్టత: 

పాంచజన్యం చాలా విశిష్టమైన శంఖం .  ఇది దక్షిణావర్త శంఖం. ఈ శంఖంలో మరో నాలుగు శంఖాలు ఒదిగి వుంటాయి. సాధారణంగా వేయి శంఖాలలో ఒకటి మాత్రమే దక్షిణావర్త శంఖం ఉద్భవిస్తుంది. వాటిలో ఒక శంఖం గోమడి శంఖం. నూరు లక్షల గోమడి శంఖాలలో ఒక శంఖం పాంచజన్య శంఖంగా ఆవిర్భవిస్తుంది. అటువంటి పవిత్రమైన శంఖాన్ని దర్శించడమే
పరమపవిత్రమని పురాణాలు తెలుపుతున్నాయి. అది కూడా శ్రీకృష్ణుని పెదవులనిముద్దాడి , ఆయన విజయానికి సంకేతమై , విష్టమైన పంచాయుధాలలో ఒకటిగా ప్రఖ్యాతినిగాంచిన పాంచజన్యాన్ని ఈ నేలపైన చూడగలభాగ్యం దొరికితే, అంతకన్నా జన్మ సార్థకత మరొకటి ఉండదు కదా !

ఆవిర్భావం :

ద్వాపర యుగంలో, అన్నగారైన బలరామునీతో కలిసి కృష్ణుడు సాందీప ముని వద్ద విద్యాభ్యాసం చేశారు. ఆ సమయంలో  ఒకసారి సాందీప ముని కుమారుడు సముద్రంలో స్నానం చేయదానికి వెళ్ళాడు .  కెరటాల ఉధృతి చాలా ఎక్కువగా ఉండడంతో సముద్రము లోకి కొట్టుకు పోయాడు . ఆతడిని పంచజనుడు అను రాక్షసుడు మింగివేసాడు. గురు పుత్రుడు ఆ రాక్షసుని శరీరములో ఉన్న శంఖములోకి ప్రవేశించాడు.

బలరామ,కృష్ణులు విద్యాభ్యాసం ముగించి గురువుగారిని గురుదక్షిణగా ఏమికావాలో శెలవీయండని వేడుకున్నారు . ఆయన కోరమన్నది సాక్షాత్తూ విష్ణువేఅని తెలిసినవాడు . మహాజ్ఞాని . దాంతో నా కుమారుణ్ణి తెచ్చివ్వమని జరిగిన సంఘటనని వివరించారు .  

అన్నదమ్ములు సముద్ర తీరానికి వెళ్లి సముద్రుడిని గురుపుత్రుడేడని ప్రశ్నించారు .  దానవుడైన పంచజనుడు మిగేశాడని తన గర్భంలోకి దారిచూపాడు సముద్రుడు .  అప్పుడు వారు పంచజనుడిని వెతికి, అతడిని చంపి అతడి శరీరమును చీల్చగా గురుపుత్రునికి మారుగా శంఖము దొరికింది.

 అప్పుడు శ్రీ కృష్ణుడు ఆ శంఖమును తీసుకుని యమపురికి వెళ్లి అక్కడ ఆ శంఖమును పూరించాడు. ఆ శబ్దమునకు యమపురి యావత్తూ అదిరిపోయింది.  యముడు హుటాహుటిన తరలివచ్చి , వాసుదేవుడు వచ్చిన కారణాన్ని ఆరాతీశాడు . అనుజ్ఞ అయినవెంటనే , గురు పుత్రుడిని శ్రీ కృష్ణుడికి అప్పగించాడు. ఆ విధంగా శ్రీ కృష్ణుడు తన గురుదక్షిణను భద్రంగా సాందీపునికి అందజేశాడు. 

ఇప్పుడెక్కడ ?

అయితే, పంచజన్యుడి శరీరంలో దొరికిన శంఖమును ఆ నాటి నుండి తాను ధరించారు వాసుదేవుడు . ఈ పాంచజన్యం కృష్ణుని ఆనవాలుగా మిగిలిన ద్వారకానగరంలో లేదు . మరి ఎక్కడుందీ అంటే, శ్రీలంకలో అని సమాధానం వినవస్తోంది .  ప్రస్తుతం శ్రీలంకలోని కొలంబో నేషనల్ మ్యూజియంలో ఉన్న శంఖాన్ని శ్రీకృష్ణుని పాంచజన్యంగా చెబుతున్నారు. ఇది అదేనా కాదా అనేది చరిత్రకారులు, పురాతత్వ శాస్త్రవేత్తలు, పరిశోధకులూ  నిర్థారించాల్సిన విషయం . అయితే, భారతదేశంలో ఇంత చరిత్ర కలిగిన శంఖం శ్రీలంక మ్యూజియం కు ఎలా వెళ్ళిందనేది అర్థం కానీ ప్రశ్న .  

మైసూరులో ఉన్న మరో శంఖం :

ఈ రకమైన మహిమాన్వితమైన దక్షణావృత శంఖం మైసూరు లోని చాముండేశ్వరి దేవి ఆలయంలో ఒకటి వున్నది. ఈ శంఖాన్ని మైసూరు సంస్ధానాధీశులు చాముండేశ్వరీదేవికి కానుకగా సమర్పించారు. అమ్మవారి ఆరాధనోత్సవాలలో యీ విశేష శంఖాన్ని ఉపయోగిస్తారు.

- లక్ష్మి రమణ 

Quote of the day

Let your life lightly dance on the edges of Time like dew on the tip of a leaf.…

__________Rabindranath Tagore